నేడు జూన్ 22 వ తారీఖు
క్రీ.శ 1301 జూన్ 22 నాటి ఎల్గేడ్ (కరీంనగర్ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో రాజుగారి దేవేరి లక్కాదేవమ్మంగారు తమ తండ్రి పల్దేవ నాయనింగారికి పుణ్యంగా రామనాథదేవర వ్రిత్తికి వెన్నుపన్ను, కానికి,కట్నం,పుల్లరి మున్నగు పన్నులు లేవని చెప్పబడ్డది.[కరీంనగర్ జిల్లా శాసనాలు. నెం.37].
అట్లే క్రీ.శ 1534 జూన్ 22 నాటి రాయచోటి (కడప జిల్లా) శాసనంలో మహానాయంకరాచార్య కొమార వెంకటాద్రినాయనింగారు ప్రథమేకాదశి పుణ్యకాలమందు రాచవీటి వీరేశ్వర దేవర అంగరంగ వైభవాలకు అఖండ దీపానికి వీరేశ్వర దేవరకు చెల్లే గ్రామాల కావలిని యిచ్చినట్లుగా చెప్పబడ్డది.శాసన శిల శిధిలమైనందున పూర్తి అర్థం తెలియరావడం లేదు. [ద.భా.దే.శా.XVIనెం.108]
అట్లే 1572 జూన్ 22 నాటి వల్లూరు (గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా) శాసనంలో శ్రీరంగరాయదేవమహారాయలవారి పాలనలో కొండవీటిదుర్గం రామేశ్వరం స్తళానకు చెల్లే వల్లూరు గ్రామన ఆత్రేయ గోత్ర భాగవతుల రంగమకిచ్చిన రెండుపుట్ల రాయసం (పత్రం?) దొంగలెత్తుకుపోయారని శ్రీ రంగదేవ మహారాజుల కార్యకర్తలైన అడప నాగప్పంగారికి విన్నవించగా, తిరిగి మూడు నెలల్లో ఆ భూమిని కొలిపించి, శిలాశాసనం రాయించి, వేయించినట్లు దీనికి స్థల కరణాలు రాచకరణాలు సాక్షులని చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI.నెం. 280].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.