నేటి తేదీ జూన్ 21
తిథి జేష్ఠ శుద్ధ ఏకాదశి. నేటి తారీఖు మీద ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు గానీ…
శక 1175 ప్రమాది సంవత్సరం జేష్ఠ శుద్ధ ఏకాదశి (క్రీ.శ 1253) నాటి చిట్యాల (నల్లగొండ జిల్లా)శాసనంలో కాకతీయ గణపతిదేవుని సేనాని కాయస్థ గంగయసాహిణి ద్వారకా శ్రీకృష్ణుడికి చిట్టాల గ్రామాన్ని దానంచేసినట్లుగా చెప్పబడ్డది. శాసనంలో పురుసుబల్లి (?)గ్రామం పేరు పేర్కొనబడ్డది.[నల్లగొండ జిల్లా శాసనాలు II నెం.71].
2.అట్లే శక 1191 (క్రీ.శ 1269)శుక్ల సంవత్సర జేష్ఠ శుద్ధ ఏకాదశి నాటి దుర్గి (గుంటూరుజిల్లా) శాసనంలో కాకతీయ రుద్రమ దేవి కాలంలో కాయస్థ జన్నిగదేవుడి పాలనలోగల పల్లినాడులోని దుర్గి పట్టణంలో ప్రభు ముఖ్యుడు నందావుర అగ్రహార కరణమైన సవదరం నామయ శ్రీ గోపీనాథ దేవరను ప్రతిష్ఠించి దేవర అంగరంగ భోగాలకు యితర నివేదనలకు అనేక భూములు దానమిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా. X నెం 422].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.