Editorial

Sunday, November 24, 2024
హెరిటేజ్మానవుడా... పురా మానవుడా.... అరవింద్ సమేత ఆనవాలు

మానవుడా… పురా మానవుడా…. అరవింద్ సమేత ఆనవాలు

చంద్రుని మీద పాదం మోపి, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా క్షణాల్లో 4G  వేగంతో సమాచార మార్పిడి జరుగుతున్న ఈ రోజుల్లో పాతరాతి యుగం నాటి విశేషాలు చాలా విచిత్రంగానే అనిపిస్తాయి. వాటి గురించి వివరంగా తెలుసుకోవడమే కాదు, మరింత లోతైన పరిశోధన చేయడం తప్పనిసరి.

అరవింద్ పకిడె

Aravind Pakideగోదావరి నది పరివాహక ప్రాంతాన వెలుగులోకి వచ్చిన ప్రాచీన మానవుని సమాధులు నాటి మానవుని ఉనికిని తెలియజేయడమే కాకుండా మన ప్రాంతంలోని మానవ జాతుల పరిణామ క్రమాన్ని తెలియజెబుతున్నాయి.

వరంగల్ నుండి సరిగ్గా 106 కిలోమీటర్ల దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శ్రీ మేడారం సమ్మక్క – సారక్క తాడ్వాయి మండలం లోని దామరవాయి గ్రామ పరిధిలో గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న దట్టమైన అడవిలో స్థానిక కోయ జాతి ఆదివాసీ తెగలు తమ ఆరాధ్య దైవంగా భావించే సురగొండయ్య గుట్ట పై స్థానికులు రాక్షస గూళ్ళు గా పిలిచే ఈ సమాధులు సుమారు 145 పైగా ఉండటం విశేషం.

ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వ, పురావస్తు శాఖల నిర్లక్షానికి , చరిత్ర కారుల నిరాదరణకు గురి అయిన ఈ మానవ నిర్మిత సమాధులు గోదావరి నది పరివాహక ప్రాంతంలో పాతరాతి యుగం నాటి మానవ జాతులకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, వృత్తి, ప్రవత్తులను, సాంఘిక కట్టుబాట్లను, జీవన విధానాన్ని గూర్చి తెలుసుకోవడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తున్నాయి.

వీటిని స్థానికులు రాకాసి బండలు, రాక్షస గూళ్ళు, రాకాసి గుహలు అని వివిధ పేర్లతో పిలుస్తారు.
పురాతన కాలంలో రాక్షసులకు సంబంధించిన సమాధులుగా భావించడంతో స్థానిక ప్రజలు వీటి గురించి మాట్లాడటానికి అంతగా ఇష్టపడరు. అయినా ఒకరిద్దరిని మాట్లాడిస్తే “మా తాత, ముత్తాతల కాలం నుండి ఇవి ఇక్కడ ఉన్నాయి. రాక్షసుల శవాలను వీటిలో పాతి పెట్టారని మా పూర్వికులు చెప్పారు. ఎప్పటికైనా చనిపోయిన ఆ రాక్షసులు మళ్ళీ బతికి బయటకు వస్తారనే నమ్మకంతో సమాధిలోపల ఒక నీటి తొట్టిని , బయటకు రావడానికి చిన్న దారిని వదిలి వేశారని“ చెప్పారు.

తెలంగాణ లో మొత్తం 12 రకాల అదిమానవుని సమాధులు ఉన్నాయని, అయితే అందులో ఈ రకమైన సమాధులు కేవలం గోదావరి పరివాహక ప్రాంతాలలో మాత్రమే ఉన్నట్లు శ్రీ ఖాజా అహ్మద్ పేర్కొన్నారు.

కాగా, ఈ సమాదులు కాలక్రమేణా కొన్ని శిథిలం కాగా, మరికొన్ని గుహలకు సంబంధించిన బండ రాళ్లను స్థానికులు తమ గృహ నిర్మాణ అవసరాలకు తరలించారు. సమాధుల లోపల ఉన్న తొట్లను తమ పశువులకు నీటి కోసం తీసుకుని వెళ్ళారు. మొత్తంగా ఎవరూ పట్టించుకోక పోవడంతో నాటి మానవుని స్మారక ప్రదేశం నేడు అటవీ ప్రాంతంలా మారి క్రూర మృగాలకు ఆవాసంగా మారిందనే చెప్పాలి.

ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో దామరవాయి తో పాటు జగ్గారం, గంగారాం, రంగాపురం, బిరెల్లి, భూపతిపురం, అంకుపల్లి, మంగ పేట మండలంలోని మల్లూరు గుట్ట, కొమురారం, చెట్టుపల్లి, మాణిక్యారం, కాంచనపల్లి, గలభ, దొంగతోగూ, గుండాల తదితర ప్రాంతాల్లో ఈ రకమైన సమాధులు వందలు కాదు, వేల సంఖ్య లో ఉండటం విశేషం.

సూర గొండయ్య గుట్టపై ఉన్న సమాధుల నిర్మాణంలో నాటి మానవులు అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సుమారు నాలుగు మీటర్ల పొడవు , మూడు మీటర్ల వెడల్పు విస్తీర్ణం లో కరకుగా చెక్కిన ఇసుక రాళ్లతో ఈ గుహాలని నిర్మించారు. సమాధి చుట్టూ నాలుగు పెద్ద బండరాళ్లను పెట్టి, వాటికి పైకప్పు గా మరో అతి పెద్ద బండరాయిని పెట్టారు. ప్రతి సమాధిలోను ఒక చిన్న నీటి తొట్టి లాంటి రాతి కట్టడాన్ని నిర్మించి ఉంచారు. సమాధి చివర మూలలో 4 అడుగుల ఖాళీ వదిలారు. ఈ గుహ నిర్మాణానికి వర్తులాకారంలో సుమారు పది అడుగుల వ్యాసార్థం తో చుట్టూ బండరాళ్లను పేర్చి ప్రహరీ గోడని నిర్మాణం చేశారు. ఒక్కో సమాధి మధ్య సుమారు 100 అడుగుల దూరం ఉంది. విశేషం ఏమిటంటే, ఇవి ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కుచెదరలేదు. ఇకముందు చెదరవుకూడా. అలాంటి దిట్టమైన నిర్మాణాలు అవి.

ఈ నిర్మాణాలను చుస్తే ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేసి నిర్మాణం చేసిన నగరంలా అనిపించక మానదు. అంత ప్రణాళిక బద్దంగా, నైపుణ్యంతో నిర్మాణం జరిపారు. అన్ని సమాధులకు పైన కప్పుగా వాడిన cap stone ఒక్కో రాయి కచ్చితంగా 10 నుండి 20 టన్నుల బరువు ఉంటుంది. అంత బరువు ఉన్న రాయిని నాటి మానవులు ఎలా అమర్చారు అనే విషయం మాత్రం చరిత్రకారులకు కూడా అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

ఈ సమాధులు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉన్న దామెరవాయి గ్రామ సరిహద్దులో ఉన్న సురగొండయ్య గుట్ట మీద ఉన్నాయి. వరంగల్ నుండి బస్ ద్వారా తాడ్వాయి వెళ్లి అక్కడ నుండి 17 కిలోమీటర్ల దూరంలో దామెరవాయి గ్రామం ఉంటుంది. ఆటోల ద్వారా చేరుకోవచ్చు. అక్కడ నుండి సురగొండయ్య గుట్ట కిలోమీటర్ దూరంలో ఉంటుంది.

సమాధుల ముఖ ద్వారాలు ఉత్తర, దక్షిణ దిక్కులకు మాత్రమే ఏర్పాటు చేయడం బట్టి వారు వాస్తు సంప్రదాయం ఏమైనా పాటించి ఉంటారనే వాదన ఉంది. కాగా, ఈ గుహలు మానవులు నివాసం ఉండడానికి ఏ మాత్రం అనుకూలంగా లేవు కాబట్టి ఇవి పాత రాతి యుగం నాటి మానవుల సమాధులు అనడానికి బలం చేకూర్చే అంశంగా చెప్పవచ్చు.

సూరగొండయ్యగుట్టకు కుడి చేతి దిక్కు దూరంగా ఓ వాగు, ఎడమవైపున గౌరారం వాగు ప్రవహిస్తోంది. ఈ వాగు కొండల నుండి నిరంతరం ప్రవహిస్తుంటుంది. ఆ ప్రాంతం అంతా కీకారణ్యం. ఆనాడు అది ఇంకా భయంకరమైన అడవి అయ్యుండాలి. ఆ గుట్టలపై సమాధులు కట్టుకున్నారు కాబట్టి ఆప్రాంతం ఆవాసయోగ్యం కాదు. మరి ఆనాటి మానవులు ఎక్కడ నివసించి ఉంటారన్నది అంతుపట్టని విషయం.

మైసూరు విశ్వ విద్యాలయంలో పురావస్తు ప్రొఫెసర్ గా పని చేసిన గురు రాజారావు గారు  1877లో ఈ సమాధులని కనుగొన్నట్లు రాశారు.

ఈజిప్టులోని పిరమిడ్ల లాగా మనిషి మరణం తరువాత మళ్ళీ పునర్జన్మ ఉంటుంది అనే బలమైన విశ్వాసం తోనే ఆనాటి మానవులు వీటి నిర్మాణం చేసి ఉంటారంటారు. నాటి మానవుడు చనిపోయిన రోజుల తరువాత మానవ శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. దానితో పాటు వారికి వృత్తులు ఏమి లేకపోవడం వల్ల శవాలను పూడ్చి పెట్టి సమాధులను నిర్మాణం చేసేందుకు ఎక్కువ కాలం ఉపయోగించే వారని దక్షిణ భారతదేశంలో ఇటువంటి సమాధులపై పరిశోధనలు చేసిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త శ్రీ గురు రాజారావు గారు పేర్కొన్నారు.

మైసూరు విశ్వ విద్యాలయంలో పురావస్తు ప్రొఫెసర్ గా పని చేసిన గురు రాజారావు గారు Megalithic culture in South India అనే పరిశోధనా గ్రంధంలో డాక్టర్ విలియం కింగ్, మూలహారన్ అనే జియాలజిస్టులు వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలోని అటవీ ప్రాంతంలో 1877 వ సంవత్సరం లో ఈ సమాధులని కనుగొన్నట్లు రాశారు. అన్నట్టు, ఇదే విలియం కింగ్ – గోదావరి తీరంలో బొగ్గు నిక్షేపాలని కనుగొన్నాడు.

 

 

 

 

 

 

 

 

నిజాం ప్రభుత్వ పరిపాలనా కాలంలో రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ గా పని చేసిన శ్రీ ఖాజా అహ్మద్ నాటి వరంగల్ జిల్లా, దామరవాయి పరిసర ప్రాంతాల్లో జరిపిన పరిశోధనలు చేసి వెలువరించిన నివేదికలో 1918 వ సంవత్సరం లో వేక్ ఫీల్డ్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు రాశారు.
దామెరవాయి ప్రాంతంలోని రాకాసి గుహలుగా పిలుస్తున్న ఈ నిర్మాణాలను బృహత్ శిలా యుగం నాటి సమాధులు (డోల్మన్స్ ) గా అయన తన నివేదికలో పేర్కొన్నారు. ఈ నిర్మాణాల నిర్మాణం లో నాటి మానవులు రాతి శిలలకి సంబందించిన పనిముట్లను వాడారని  అందువల్ల వీటి నిర్మాణం కేవలం మూడు నుండి ఐదు వేల సంవత్సరాల మధ్య కాలంలో జరిగి ఉంటుందని కూడా ఆయన అంచనా వేశారు.
తెలంగాణ లో మొత్తం 12 రకాల అదిమానవుని సమాధులు ఉన్నాయని, అయితే అందులో ఈ రకమైన సమాధులు కేవలం గోదావరి పరివాహక ప్రాంతాలలో మాత్రమే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

అరవింద్ పకిడె పాత్రికేయడు, ఫోటోగ్రాఫర్. చరిత్ర, సంస్కృతి గురించి నిరంతరం తపనలు పోతూ అందంగా రికార్దు చేసే క్షేత్రస్థాయి అడుగు, కన్ను.

తన ఫేస్ బుక్ అకౌంట్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article