దాతవ్యమితి యద్ధానం దీయతే నుపకారిణే
దేశేకాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతమ్
దాన గుణాన్ని గురించి భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు గొప్ప గుణంగా కీర్తించాయి. దానగుణంతో చిరకీర్తిని సంపాదించుకొని తమ కీర్తిని పెంచుకొని నేటికీ స్మరింపబడుతున్న రంతిదేవుడు, శిభి చక్రవర్తి, కర్ణుడు, బలి మొదలైన మహామహుల కథలు మనకు గొప్ప మార్గాన్ని దర్శింపజేస్తున్నాయి.
అయితే ఈ దానాన్ని చేసే సందర్భాల్లో ఇది నా కర్తవ్యమనీ, ఉచితస్థానంలో నుండి, ఉచితమైన సమయంలో, ఉచితమైన వ్యక్తితో, మనలో ఏ అహంకారానికి చోటివ్వకుండా నిస్వార్థ భావంతో చేసే దానమే ఉత్తమ దానమని భగవద్గీత స్పష్టంగా చెప్పింది. అంటే దేశకాల పాత్రములను బట్టి దానం చెయ్యాలన్నదే తాత్పర్యము. తాను దానం చేసిన వ్యక్తి నుండి ఏదైనా ఉపకారం ఆశించి కాని, తానే ఈ దానాన్ని చేయగలుగుతున్నానన్న అహంకారం కాని దగ్గరకు రానివ్వక పోవడమే నిజమైన దాతలక్షణం. అటువంటి దాతలే చిరకాలం కీర్తికాయంతో నిలబడిపోతారు. భౌతికంగా వారు మననుండి దూరమై ఉండవచ్చు, కాని ఎల్లకాలం వారి దాతృత్వగుణం వల్ల వారి కీర్తి చంద్రికలు నలుదిక్కులా ప్రకాశిస్తాయి.
దాన గుణమే సర్వశ్రేష్ఠము. మానవత్వానికి అది మొదటిమెట్టు. మానవ సేవ ద్వారా మాధవసేవ చేసుకునే సదవకాశం దానం వల్ల లభిస్తుంది. తద్వారా మానసిక పురోగతి లభించడమే గాక మీ కీర్తి చంద్రికలు నలుదిక్కులా ప్రకాశిస్తాయి.
దానమనే గుణం మానవత్వానికి మొదటిమెట్టు. మానవ సేవ ద్వారా మాధవసేవ చేసుకునే సదవకాశం దానం వల్ల లభిస్తుంది. అట్లని మనకున్న సర్వస్వాన్ని దానం చేయాల్సిన అవసరం లేదు. మన శక్తిమేరకు అవసరమైన వ్యక్తులను దానం ద్వారా ఆదుకోవడమంటే భగవంతుణ్ణి అందుకోవడమే నన్నది భారతీయుల భావన. దానికి కూడా మన శాస్త్ర గ్రంథాలు, ఉపనిషత్తులు కొన్ని నియమాలను ఏర్పరచాయి. తైత్తరీయోపనిషత్తు నదత్వాపరికీర్తయేత్ (ఎవరికి ఏదైన ఇచ్చినప్పుడు దాన్ని ప్రచారం కొరకు చెప్పుకోరాదు), శ్రద్ధయాదేయమ్, అశ్రద్ధయా అదేయమ్ (శ్రద్ధతోనే దానం చెయ్యాలి అశ్రద్ధగా అసలు చేయరాదు), హ్రియాదేయమ్, భియాదేయమ్ (నేనేమీ ఇవ్వగలను అన్న బావంతో ఇవ్వాలి, దానం చెయ్యడం నా బాధ్యత అనే భయంతో ఇవ్వాలి) అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. దానం చెయ్యడంతో గర్వించడం గాని, ప్రచారం కొరకు వెంపర్లాడటం గాని, శ్రద్ధ లేకుండా దానం చెయ్యడం గాని పనికిరాదు- అన్నమాటను ఇంత స్పష్టంగా ఉపనిషత్తులు చెప్పాయి. దానికి కారణమేమంటే దానం భగవద్భావన. దాంట్లో త్యాగగుణం ఉంది అందుకే అది ఉత్తమ గుణం. మానసికోన్నతిని కలిగించి దాతను భగవంతుని సరసన నిలబెడుతుంది.
పైగా దాతకూడా దాన ధర్మం, నిషేవేత నిత్యమైష్టిక పౌర్తికమ్…
పరితుష్టేన భావేన పాత్రమాసాద్య శక్తితః -అని స్మృతులు ఘోషించాయి.
పూర్వులు ప్రజలకు ఉపయోగపడాలన్న తలంపుతో, చెఱువులు, బావులు, కుంటలు తమ యోగ్యతానుసారం తవ్వించి సహకరించారు.
అవసరమున్న శ్రేష్ఠుడైన వ్యక్తి మనవద్దకు వచ్చినప్పుడు మన శక్తిని అనుసరించి అతనికి సంతోష పూర్వకంగా దానం చెయ్యాలి తప్ప అతిగా ప్రవర్తించరాదు. అందుకే పూర్వులు ప్రజలకు ఉపయోగపడాలన్న తలంపుతో, చెఱువులు, బావులు, కుంటలు తమ యోగ్యతానుసారం తవ్వించి సహకరించారు. తోటలు పెంచడం, సాంస్కృతిక కేంద్రాలుగా దేవాలయాలను కట్టించడం వంటి ఎన్నో పనులు చేసి దానగుణంలోని ఉన్నత విలువలను కాపాడటానికి కృషి చేసేవారు.
మానవత్వం దానగుణానికి పునాది. మానవత్వం కొంచెం కూడాలేని కఠిన హృదయులలో జాలి అనే మాట ఉండదు, కనుక దయామయ స్వభావాన్ని పెంచుకున్న వారే భగవంతునికి దగ్గరివారు. ఆయన దయామయుడు, కరుణామయుడు అని స్తుతింపబడేవాడు, ఆయన కటాక్షానికి పాత్రులు కావడమనేది ఆధ్యాత్మికతలో ప్రధానం. దానికి సరైన మార్గం దానమే. అందుకే శుక్రనీతిలో కూడా …యాచకాద్ద్యెః ప్రార్థితః సన్ నతీక్షం చోత్తరం వచేత్ …తత్కార్యం తు సమర్థశ్చేత్ కుర్యాద్వా కారయీ తవ…అని చెప్పబడింది.
వ్యక్తియైనా మన దగ్గరికి దానం కోరి వచ్చినప్పడు వారికి కఠినమైన మాటలతో బదులు చెప్పరాదు.
వ్యక్తియైనా మన దగ్గరికి దానం కోరి వచ్చినప్పడు వారికి కఠినమైన మాటలతో బదులు చెప్పరాదు. ఒకవేళ తనకు దానం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు ఆ వచ్చిన వ్యక్తి కోరికను మన్నించి అతనిని సంతుష్టుణ్ణి చెయ్యాలి. ఒక్కోసారి తాను ఏమీ ఇవ్వలేని అశక్తుడైనప్పుడు, ఇవ్వగలిగిన వానిని చూపించి సహకరించాలి తప్ప మాటల కాఠిన్యం చూపరాదని ఖచ్చితంగా చెప్పింది.
దాన శ్రేష్ఠత గొప్ప దైవ భావనను కలిగి ఉన్న గుణం. ప్రతి వ్యక్తిలో పరమాత్ముని దర్శించుకోగలిగిన వానికే ఈ దానగుణం అబ్బుతుంది. అతని మానసిక ఉన్నతికి, అతని ఆధ్యాత్మిక ఉన్నతికి మిక్కిలి ఉపయుక్తం అవుతుంది.
ప్రపంచ పురోగతిలో దానగుణానికి పెద్దపీట వేశారు భారతీయ ఋషులు. ఇది భగవన్మార్గంలో సుఖంగా సాగిపోవడానికి ప్రశస్తమైన గుణం.