Editorial

Tuesday, December 3, 2024
కథనాలుపత్రికలు- వ్యాపారం- తెలంగాణ ఉద్యమం : దుర్గం రవీందర్

పత్రికలు- వ్యాపారం- తెలంగాణ ఉద్యమం : దుర్గం రవీందర్

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) తెచ్చిన ‘తెలంగాణ, మే 31 2001’ పుస్తకంలోని ఆరో వ్యాసం ఇది. సీనియర్ జర్నలిస్ట్, బహుజన సామాజిక విశ్లేషకులు దుర్గం రవీందర్ గారు రాశారిది. మనం చూడ నిరాకరించిన వాస్తవ స్థితిని ఇందులో నిశితంగా విశ్లేషణ చేయడం విశేషం. అప్పట్లో ప్రాంతం గురించి మాట్లాడటం ఎంత సాహసమో కుల వాస్తవికతను స్పృహతో, చైతన్యంతో ఎత్తి చూపడం అంతకంటే సాహసం. ఆ కర్తవ్యంలో నాటి నుంచి నేటి వరకు ముందు వరుసలో ఉండే దుర్గ రవీందర్ గారు కోస్తా ఆధిపత్యానికు తోడుగా వేళ్ళూనుకున్న కుల సంకుచితత్వాన్ని బలంగా ప్రస్తావిస్తూ పత్రికారంగం నుంచి తెలంగాణ వాదానికి అండ లభించడం ఎంత కష్టమో  వివరించారు. అదే సమయంలో పత్రికల స్థాపన ఫక్తు వ్యాపారమయం కావడాన్ని గుర్తించాల్సిన  మరో ముఖ్య కారణంగా వారు ఎత్తి చూపారు. ఇలాంటి అననుకూల వాతావరణంలో తెలంగాణా ఉద్యమకారులు తిరిగి తిరిగి నష్ట పోకుండా తమ గమ్యం చేరుకోవడం ఎంత కష్టమన్నది వారు  ఆవేదనతో పంచుకోవడం ఈ వ్యాసంలోని మరో ప్రత్యేకత.
అన్నట్టు చారిత్రాత్మక ఈ పుస్తకం రావడంలో దుర్గం రవీందర్ గారు ముఖ్యులు. హైదరాబాద్ లోని విద్యానగర్ లో ఉండే వారి  కార్యాలయంలోనే ఈ పుస్తకం డిటిపి, ప్రూఫ్ రీడింగ్ జరిగిందని మరచిపోరాదు.

తెలంగాణా నుండి పెద్ద పత్రికలో సంపాదకుడి స్థాయికి ఎదిగిన‌వారు క‌నిపించరు. అలాగే బ్రాహ్మ‌ణేత‌రులు ఎక్కువగా క‌నిపించ‌రు. బహుణేతరుల్లో చెప్పుకోదగిన వారిలో నార్ల వెంకటేశ్వ‌ర‌రావు, ఎబికే ప్ర‌సాద్‌లు ముఖ్యులు. వీరిద్దరు ఒకే కులానికి చెందినవారు.

బ్రాహ్మ‌ణేత‌రుడు బిసి కులానికి చెందిన మొట్ట మొదటి వ్యక్తి ఆంధ్ర‌ప్ర‌భ‌కు నియమితులయ్యారు. అతన్ని ఏడాది తిరక్కుండానే ఇంటికి పంపించారు. ఇలా సంపాదకుల స్థాయికి ఎదిగిన బిసి నాయకులు, తెలంగాణ వారు ఒకరిద్దరు తప్ప కనిపించరు. ఇలాంటి పరిస్థితుల్లో వీరికి తెలంగాణ పట్ల‌ సదవగాహన సానుభూతి ఉంటుందని అనుకోవడం అత్యాశ‌ అవుతుంది.

‘తెలంగాణ, మే 31, 2001’ పుస్తకంలోని వ్యాసాలను ‘తెలుపు’ ధారావాహికంగా  ప్రచురిస్తోందని మీకు తెలుసు. ఇప్పటిదాకా అచ్చైన వ్యాసాలను ఆయా శీర్షికలను క్లిక్ చేసి చదువుకోగలరు. తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక సంపాద‌కీయం . మన ప్రతాపరెడ్డికి వందనాలు- కె. శ్రీనివాస్ వ్యాసం. ‘తెలంగాణ’ కార్టునిస్టుల ఖజానా –టి. ఏడుకొండలు.   ఒక ఆత్మ హత్య /ఒక హత్య/ ఒక సామూహిక ఖననం – అంబటి సురేంద్రరాజు.  తెలంగాణ ఒక నిషిద్ధ ఆలోచన – ఎస్.రామకృష్ణ

ఇప్పుడున్నట్లే 1969లో ఊపందుకున్న తెలంగాణ ఉద్యమంపట్ల వీరు ఎవరూ కూడా సానుకూలంగా స్పందించలేదు. పైగా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు దుమ్మెత్తిపోసే ప్రయత్నాలు యధాశక్తి చేపట్టారు.

నీల్లు రాకముందే గనుమ కట్టినట్లు సబ్ ఎడిట‌ర్‌గానో, జూనియర్ రిపోర్టర్ గానో తీసుకొనే టప్పుడు తెలంగాణ వారిని, బీసీలను ఫిల్టర్ చేసి పారేస్తారు. ఎవడైనా తప్పించుకుని జారి పైకి వెలితే వానికి భాష రాదని, నుడికారం తెలియదని, ప్రపంచ జ్ఞానం తక్కువని ఇలా రక రకాలుగా వంకలు పెట్టి, వాడు సంస్థను లేదా వృత్తిని వదిలేలా చేస్తారు. ఇది ఆంధ్ర ప్రతికల్లో జరుగుతున్న సర్వసాధారణ తంతు. ఇలాంటి వారు హైదరాబాద్ లో వందలాది మంది ఉన్నారు.

కిరాణ దుకాణం, మందుల కంపెనీ, సినిమా సంస్థలాగే న్యూస్ పేపర్ సంస్థలు ఆంధ్ర పెట్టుబడి దారులు స్థాపిస్తారు. వారికి కావల్సింది పత్రికను అడ్డం పెట్టుకొని పనులు చేసుకోవడం,
లాభాలు ఆర్జించడం, కానీ ప‌త్రిక‌ను యధార్థంగా పత్రిక లాగ నడపడం కానే కాదు.

ఆంధ్రప్రభలో బ్రాహ్మణేతరులకు ప్రోత్సాహం తక్కువ. ఆంధ్రభూమి రెడ్డిది. అయినప్పటికి ఎడిటర్ శాస్త్రి కాబట్టి బ్రహ్మణులకు ఇక్కడ బాగుంటుంది. ఈనాడులో కమ్మ వారు చక చక మెట్టు ఎక్కిపోవచ్చు. కమ్మేతరుడికి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ముఖ్య పదవులతో పాటు రిపోర్టింగ్ లాంటి పోస్టులు సాధారణంగా రావు. దక్కన్ క్రానికల్ లో తెలుగు వారే ఉండరు. ది హిందూ లాంటి పేపర్ విప్పితే తమిళవాసన గుభాళిస్తుంది.

ఇండియన్ ఎక్స్ప్రెస్ మార్వాడి జంధ్యాలతో ఉరి వేసుకుని పార్థివదేహాన్ని అమ్ముకోడానికి సిద్ధం అవుతున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడింకా తప్పటడుగులు వేస్తున్నది. విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి (ఎర్ర రంగు వెలసిపోయిన) పత్రికలు యూనియన్ రాజకీయాలకు, ప్రకటనల సేకరణ, ఆంధ్ర పెత్తందారి తనానికి, ప్రచురణ వ్యాపారానికి నిలయమయ్యాయి. వెరసి వీటన్నింటిలో తెలంగాణా వారు అతి తక్కువగా ఉంటారు. బీసీ కులాల వారు, మైనారిటీలు దళితులు అతి తక్కువగా ఉంటారు.

ఇలాంటి వాతావరణం ఉన్న పేపర్లలో తెలంగాణా లాంటి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు సానుకూల స్పందన ఉండాలంటే ఎలా సాధ్యం అవుతుంది?

కిరాణ దుకాణం, మందుల కంపెనీ, సినిమా సంస్థలాగే న్యూస్ పేపర్ సంస్థలు ఆంధ్ర పెట్టుబడి దారులు స్థాపిస్తారు. వారికి కావల్సింది పత్రికను అడ్డం పెట్టుకొని పనులు చేసుకోవడం,
లాభాలు ఆర్జించడం, కానీ ప‌త్రిక‌ను యధార్థంగా పత్రిక లాగ నడపడం కానే కాదు. ఆంధ్ర దేశంలో పత్రికాధిపతులు పత్రికలను పెట్టకముందు వారి ఆస్తి పెట్టిన తర్వాత ఆస్థి వివరాలను పరిశీలిస్తే ఈ విషయం సులువుగా అర్థం అవుతుంది. అది ఏ పేపర్ అయినా కావచ్చు. లాభాలు ముందు ఆ తర్వాతే సమాచార సేకరణ, ప్రచురణ లాంటి అంశాలు చోటు చేసుకుంటాయి.

మనం చేస్తున్న పని ఎదుటి వాడికి కావల్సిందేనా అని ఎప్పటికప్పుడు యోచించుకుంటూ, దెబ్బలు తగలకుండా ప్రాణాలు పోగొట్టుకోకుండా, పావులం కాకుండా స్వచ్ఛందంగా ఏదయినా చేయగలిగిన స్థితిలో మనం ఎవరమైనా ఉన్నమా అన్న సందేహం నాకుగా తరచుగా కలుగుతుంటుంది.

ఎడిటర్‌తో సహా పత్రికలో అందరు ప్రకటనలు తెప్పించాల్సిందే! పత్రికకు ఆధాయం పెంచాల్సిందే అనే పరిస్థితి నేడు నెలకొన్నది. చేతకాని వాడిని యజమానులు సులభంగా తొలిగిస్తున్నారు. ఇది అంది ఎరిగిన విషయమే. అందుకే లాభార్జనతో ఏర్పడిన పత్రికా సంస్థలో లాభాలు మినహా ఇతర అంశాలన్ని అప్రధానమైనవే అవుతాయి.

ఒక పత్రిక ఈ వార్తలను పనిగట్టుకొని వేస్తున్నది. అంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో పరమార్థం ఉంటుంది. ఉద్యమంపట్ల ఈ గడ్డ పట్ల (ప్రేమతో మాత్రం కాదనే విషయాన్ని గమనించాలి. ఈ పరిస్థితిలో పత్రికా రంగం ‘మూడు ఎడిషన్లు ఆరు లక్షలు’ లాభాలతో నడుస్తున్నడు, నడవాలని అనుకున్నప్పుడు.. ఈ విషయంలో మనకు సందేహాలే లేనప్పుడు నిజంగా ఇతర విషయాలను గురించి చర్చించాల్సిన అవసరం ఉంటుందా?

ఒక పత్రిక‌ కాంగ్రెస్ ఎందుకు తిడుతున్నది, సారా ఉద్యమాన్ని ఎందుకు బలపరిచింది, ఇంకొ పత్రిక తుఫానులు వస్తే శవాల బొమ్మలు వేసి పాఠకుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఎలా తినేసింది? అలాంటి డబ్బులతో ఇంకో పత్రిక ఒక ప్రాంతం వారికి లాభాలు కలిగేలా ఎలా వినియోగించింది ఇత్యాది విషయాలను, లోతుగా విశ్లేషించి చూస్తేగాని అర్థం కాదు.

వేర్పాటు ఉద్యమాలు, రాజకీయాలు, విద్య, వైద్యం, పరిశ్రమలు, యుద్ధాలు, తెహల్కాలు, మహానాడులు, సింహాగర్జనలు ఇలాంటి వాటన్నింటి వెనక ఆర్థికాంశమే ప్రధాన ఏక సూత్రమై పోతున్నప్పుడు పైపై అంశాల గురించి చర్చించుకుంటే జుట్టు పిక్కుంటే, అంగీలు చింపుకుంటే ఏమయినా ఫలితం ఉంటుందో లేదో మరి. ఎదుటి వాడికి కావల్సిందే మనం చేస్తున్నప్పుడు వాడికి ఇంకా కావల్సింది ఏముంటుంది? మనం చేస్తున్న పని ఎదుటి వాడికి కావల్సిందేనా అని ఎప్పటికప్పుడు యోచించుకుంటూ, దెబ్బలు తగలకుండా ప్రాణాలు పోగొట్టుకోకుండా, పావులం కాకుండా స్వచ్ఛందంగా ఏదయినా చేయగలిగిన స్థితిలో మనం ఎవరమైనా ఉన్నమా అన్న సందేహం నాకుగా తరచుగా కలుగుతుంటుంది.

తెలంగాణ ఉద్యమంలో జర్నలిజం అనే అంశం ప్రక్కదారి పడున్నట్లుంది.. తెలంగాణ ఉద్యమం పట్ల ఇప్పుడున్న ఆంధ్రవారి పత్రికలు, అందులో పనిచేస్తున్న ఆంధ్రపాత్రికేయులు ఎవరు సద్భావనతో లేరు. ఉండరు. ఉండాలని అనుకోవడం తెలంగాణా వారికి అత్యాశ అవుతుంది. సద్భావనతో ఉండకపోతే పోయారు. ద్రోహం చేయడం, చులకన చేయడటంలాంటి పనులు చేయక పోతేనయినా బాగుంటుంది. కాని వారికి అంత బుద్ధిగా ఉండాల్సిన అవసరం ఏముంటుంది? ఉండదు గాక ఉండదు. ఉండనప్పుడు మైనారిటిలయిన తెలంగాణ జర్నలిస్టులు.. ఒక్కటంటే ఒక్క సక్కటి పేపర్ లేని తెలంగాణ వారు ఏంచేయాలో యోచించాలి.

సుదూర గతం బాగుందని అంటారు. సమీప గతమంతా గతుకుల మయమే. వర్తమానమూ ఎలాగు లేదు. తెలంగాణ వాడికి కనీసం భవష్యత్ అయినా ఉంటుందా?

(ఆనాటి తెలంగాణా ఉద్యమానికి కరపత్రాలు రాసి మనసావాచా ప్రోత్సహించిన స్వర్గీయ జి. కృష్ణ లాంటి జర్నలిస్టులకు క్షమాపణలతో)

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article