నేడు తారీఖు జూన్ 13
క్రీ.శ 1513 జూన్ 13 నాటి శ్రీకృష్ణ దేవరాయల కాళహస్తి శాసనంలో కాళహస్తీశ్వరస్వామికి శ్రీకృష్ణ దేవరాయలు “ప్రభావళి “తో పాటు అనేక అమూల్యమైన ఆభరణాలను, కన్నప్ప దేవర తిరుణాళ్ళ వంటి ఉత్సవాలకు, మహాభిషేకాలకు, అమృతపడికి, నిత్యనైవేద్యాలకు, పులియూరు, సింగలి, తుంమ్మూరు, ఆతూరు గ్రామాలనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.XVI నెం 50].
1551 జూన్ 13 నాటి కాశీపురం (ప్రకాశంజిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో జిల్లెల్ల రంగప్ప దేవమహారాజులు పొదిలి సీమ పాలకుడుగా నుండగా పాములపాడు పాలకుడైన మొలకరాచి రాజయ్య దేవమహారాజులు పాములపాడు గ్రామంలో మదనగోపాలస్వామి విగ్రహ ప్రతిష్ట చేసి, ఆలయనిర్మాణం చేసి దేవర అంగరంగ వైభవాలకి రెండు కుచ్చెల్ల భూమిని విభిన్నప్రాంతాలలో యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు III Po 24].
అట్లే క్రీ.శ 1562 జూన్ 13 నాటి వినుకొండ శాసనంలో సదాశివరాయలు పాలన చేస్తుండగా మహామండలేశ్వర కొండ్రాజయ్య దేవమహారాజుల కార్యకర్తలైన దళువాయి వోబులేశునింగారు వినుకొండలో మూడు కుంచాల భూమిని అందెలనాగుంగయ్య,సంకావీరయ్యసెట్టికి యిచ్చినట్లుగా చెప్పబడ్డది.[ద.భా.దే.శా XVI నెం.255.].
క్రీ.శ 1581 జూన్ 13 నాటి మిడుతూరు (కర్నూలు జిల్లా) శాసనంలో శ్రీరంగరాయల పాలనలో మహామండలేశ్వర రంగపరాజయ్య దేవమహారాజులు మిడుతూరు చెన్నదేవరాయదేవునికి భూములను ధారవోసి యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.XVI. నెం.291].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.