Editorial

Saturday, November 23, 2024
కాల‌మ్‌మధురానుభూతి - మారసాని విజయ్ బాబు తెలుపు

మధురానుభూతి – మారసాని విజయ్ బాబు తెలుపు

 

జీవితంలో ఆపాదమస్తకం కుదిపేసే అపురూప ఆనంద క్షణాల గురించిన అనుభవగాథా సంపుటిలో ఇది మూడో కథనం.

 

 

శాంతికుంజ్. హరిద్వార్, రిషికేష్ కు మధ్య గంగానది తీరాన వున్న వో ఆశ్రమం పేరు యిది. ఆ ఆశ్రమంలో రెండ్రోజులు గడపాలన్నది నా మిత్రుడి చిరకాల వాంఛ. ఆయన పేరు రామబ్రహ్మం. హైదరాబాద్ యెస్సార్ నగర్లోని గౌతమి అకాడమీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆయన. కాలేజీకి సెలవులు రాగానే ఆయనతో పాటు నన్నూ తీసుకెళ్లాడు.

ఆ ఆశ్రమంలోని ప్రశాంతతకు మేం ముగ్ధులయ్యాం. నా మిత్రుడయితే మరింత సంబరపడ్డాడు. ముఖ్యంగా గదుల్లో దుప్పట్లు, దిండ్లు యెంతో శుభ్రంగా వున్నాయి. మల్లెపువ్వు లాంటి తెల్లటి డిండులో నేను తలదూర్చుకుని కొంతసేపు సేదతీరాను… యెంతో హాయిగా…

ఆ తర్వాత మొత్తం ఆశ్రమంతా చూసేశాం. మధ్యాహ్నం అక్కడే భోజనానికి కూర్చున్నాం.
అక్కడికి యెంత మంది వచ్చినా భోజనానికి లోటుండదని మా పక్కనే కూర్చున్న వో పెద్దాయన చెప్పాడు. వేలాది మంది వస్తుంటారు. ఆశ్రమంలో దేనికీ డబ్బులు కట్టాల్సిన పనిలేదు. వుండటానికి గది మొదలు అన్నీ వుచితమేనని అన్నాడు.

భోజనం చేసిన తర్వాత ప్లేటు కడగడానికి వెళ్లాను. అక్కడ వో పన్నెండేళ్ల అమ్మాయి, సరిగా ప్లేటును కడగని తన చెల్లెలతో… నువ్వు బాగా కడక్కపోతే, తర్వాత వచ్చేవాళ్లు సరిగా భోజనం చేయలేరు అని అంది.

ఆ అమ్మాయి వైపు నవ్వుతూ మెచ్చుకోలుగా చూశాను. నా చూపులు ఆ చిన్నారికి అర్థమైనట్టు నవ్వింది.
ప్లేటు కడగడానికి నావంతు రాగానే మరింత స్పృహతో కడిగాను. తర్వాత నా మిత్రుడికి యీ విషయం అంతా చెప్పాను. అందుకే నాలుగుచోట్లకు వెళితే మనలోని లోపాలు బయటపడుతాయన్నాడు రామబ్రహ్మం.

భోజనం పూర్తయిన తర్వాత ఇద్దరం గదిలోకి వచ్చాం. కొంతసేపు తర్వాత నా మిత్రుడు మంచంపై నడుం వాల్చాడు. నాకు పడుకోవాలనిపించలేదు. నేనలా కాసేపు తిరిగొస్తానని మిత్రుడికి చెప్పి ఆశ్రమం నుంచి బయలుదేరాను.

marasani vijay babu
Illustration Beera Srinivas

కాసేపు ఆ సమ్మోహనంలో ఉండిపోయాను. ఎంతసేపో కూడా చెప్పలేను. తృప్తిగా ఉంది. గుండె నిండా వూపిరి పీల్చుకుని విప్పారిత నేత్రాలతో ఆ సుందర దృశ్యాలను మళ్ళీ తదేకంగా చూశాను. అప్పుడు నా మనసులో మెదలాడిన భావం… ‘బహుశా యీ ప్రపంచంలోని మనుష్యులు చాలా మంది శాపగ్రస్తులేమో! యిలాంటి సుందరమైన ప్రదేశాలను చూసే తీరిక, అదృష్టం వారికి యెన్నటికీ దక్కదేమో!’

రిషికేష్ వైపునకు అడుగులు పడ్డాయి. ఆ దారిలో కొందరు మునులు, సన్యాసులు వెళుతున్నారు. వారంతా చాలా చలాకీగా, వుషారుగా నడుస్తున్నారు. వారిని చూస్తూ ఆశ్చర్యపోయాను నేను.

వారు తేజస్సును వెదజల్లుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యమంటే ఇదేనేమో! వారి వంటిపై పిసరు కండ కూడా యెక్కువగా లేదు. వారితో పాటే కొద్ది దూరం నడిచేసరికి రోడ్డుకు ఇరువైపులా అడవి ప్రారంభమైంది. పోనుపోను అడవి దట్టంగా పెనవేసుకుపోయింది.

యెటు చూసినా కనులకు యింపైన పచ్చదనం. చిన్న చిన్న గుబుర్లు, చెట్ల మధ్య నుంచి పెరిగిన మహా వృక్షాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి.

దక్షిణ భారతదేశంలోని వృక్షాలకు వాటికి పోలికలు కూడా నాకు కనిపించలేదు. వాటిలో అక్కడక్కడ టేకు మానులను మాత్రమే గుర్తించగలిగాను.

కొన్ని గుబుర్ల నుంచి చక్కటి పూల జడల్లాంటి అల్లికలు భూమిని తాకడానికి వువ్విళ్లురుతున్నాయి.
అది మధ్యాహ్న సమయం అయినప్పటికీ మనసును దోచే చల్లటి తెమ్మెర వీస్తోంది. దాంతో పాటే కొత్త పరిమళం యేదో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అది యే చెట్టునుంచి వస్తుందో కూడా తెలియడంలేదు. యేదో మత్తు మనసును ఆవరించింది. అలా అలా చూస్తూ సువాసన వస్తున్న దిశగా సాగిపోయాను. వెళుతున్న కొద్ది యింకా యింకా ముందుకు వెళ్లాలనిపించింది.

భలే అద్భుతం. యేదో సుందర లోకాలకు తీసుకెళ్లేటట్టుంది ఆ దారి. తెలియని నూతన వుత్సాహం నన్ను ఆవరించింది.

మరింత ముందుకు పోయాను. వెళ్లి ఒక చోట ఆగిపోయాను.

మనస్సులో యేదో ప్రశాంతత. యీ లోకంలోని మాలిన్యానంతటినీ తుడిచి పెట్టేంత స్వచ్ఛత.
యెందుకో చాలా ఆనందం కలిగింది. అది చినుకులా మొదలై రాన్రాను వర్షంలా వుప్పొంగింది. అదెదో కొత్తగా వింతగా వుంది. నుందుగా ఉంది.

దానిని అనుభవించాల్సిందే. ఆ మధురానుభూతిని వర్ణించనలవికానిది.

కాసేపు ఆ సమ్మోహనంలో ఉండిపోయాను. ఎంతసేపో కూడా చెప్పలేను. తృప్తిగా ఉంది. గుండె నిండా వూపిరి పీల్చుకుని విప్పారిత నేత్రాలతో ఆ సుందర దృశ్యాలను మళ్ళీ తదేకంగా చూశాను. అప్పుడు నా మనసులో మెదలాడిన భావం…

‘బహుశా యీ ప్రపంచంలోని మనుష్యులు చాలా మంది శాపగ్రస్తులేమో! యిలాంటి సుందరమైన ప్రదేశాలను చూసే తీరిక, అదృష్టం వారికి యెన్నటికీ దక్కదేమో!’

మనసంతా ఆనందం నింపుకొని, గాల్లో తేలిపోతూ ఆశ్రమానికి తిరిగి చేరుకున్నాను. ఆ అడవి సొగసును, సౌందర్యాన్ని, ఎగిసిపడ్డ నా ప్రకృతి గురించి మిత్రుడికి ఎపుడెపుడు చెప్పాలా అని వువ్విళ్లురాను.

అప్పటికే అతడు కంగారుపడిపోయి వున్నాడు.

నేను వెళ్లీవెళ్లగానే… యింతసేపు యెక్కడికి వెళ్లావు అని అడిగాడు గబరాపడుతూ… అలా వెళ్లొస్తానంటే యే అరగంటలోనో, గంటలోననో వస్తావనుకున్నాను. సాయంత్రం దాకా రావని యెలా అనుకుంటాను అని అన్నాను.

సారీ, అయాం వెరీ వెరీ సారీ అన్నాను. ఇన్ని గంటలు గడచిపోయాయని గుర్తించలేదు అన్నాను.

సాయంత్రం దాకా రానని చెప్పివుంటే నేను అనవసరంగా ఆదుర్దా చెందేవాడిని కాదు కదా. అన్నింటికంటే ముఖ్యంగా నీకేమైనా జరిగిందేమోనని భయపడ్డాను అన్నాడు అతడు ఆందోళనగా.

సారీ అన్నాను మళ్లీ. నాక్కూడా తెలియదు. అలా వెళ్లిపోతానని. యీ ప్రదేశం నా మనసుని దోచుకుంది. నాకే తెలియని వింత అనుభూతి నన్ను కట్టిపడేసింది అన్నాను.

ఇంతలో నిన్న ఏమనుకున్నానో గుర్తొచ్చింది. బహుశా యీ ప్రపంచంలోని మనుష్యులు చాలా మంది శాపగ్రస్తులేమో! సుందరమైన ప్రదేశాలను చూసే తీరిక, అదృష్టం వారికి యెన్నటికీ దక్కదేమో! అని కదా…ఎంత అనాలోచితంగా అనుకున్నాను అలా. కాదు కాదు. అది నిజం కాదు.

అన్నట్టు, రేపు యెలాగూ రిషికేష్ కు వెళదామన్నావు కదా. మనం కొంత దూరం నడిచే వెళుదాం. నువ్వు కూడా ప్రకృతి సొగసుకు లొంగిపోతావ్… తెలుసా… అని అన్నాను.

సరే గంగానదికి స్నానానికి వెళుతున్నాను వస్తావా అని అడిగాడు రామబ్రహ్మం.

పద అంతకంటే అదృష్టమా. వెళదాం పద అన్నాను మరింత వుత్సాహంతో…

మర్నాడు యెంతో సంతోషంగా బయలుదేరాను. అతడికి చూపాలన్న ఆనందం కూడా దానికి కారణం. మొదట దారిపొడవునా దట్టంగా విస్తరించిన అడవిని చూపాను మిత్రుడికి. అతడు చూస్తున్నాడు. నేను కూడా నిన్నటి అనుభూతిని తిరిగి పొందాలనే కాంక్షతో అడవి వైపు కన్నార్పకుండా చూస్తూ నడుస్తున్నాను. చిత్రం. చాలా యాంత్రికంగా ఉంది. ఎటువంటి స్పందనా లేదు. అతడిలో కలగనట్లే నాలోనూ యే భావనా కలగలేదు. చల్లటి గాలికి మనసు కాస్త తెలిగ్గా వుంది. అంతే…

యేమిటీ ఈ విచిత్రం.

నిన్న ఇదే దివ్యభూమి మీద నాలో పొంగిపొరలిన కొత్త ఆనందం యివ్వాళ యేమైపోయింది. కనీసం లేస మాత్రమైన చివురించలేదే!

నా పక్కనే నడుస్తున్న మిత్రుడు ఆశాభంగం చెందినట్లు ఉన్నాడు. యేముందిక్కడ… అంతలా చెప్పావు నాకు అంటూ నిలదీశాడు కూడా.

నిజమా యేమీ లేదా?

మరి నిన్నటి మధురానుభూతికి కారణం యేమిటి? మళ్లీ మళ్లీ ప్రశ్నించుకున్నాను. అనంతమైన ఆనందాన్ని వెదజల్లిన ఆ రమణీయ ప్రదేశం యివ్వాళ యెందుకు వెలసిపోయింది?

యేమో!

యే క్షణాన మనసు ఆనందంతో పరవళ్ళు తోక్కుతుందో బహుశా మనం ఊహించాలేమేమో!

ఆలోచిస్తూ వెనుదిరిగాను.

ఇంతలో నిన్న ఏమనుకున్నానో గుర్తొచ్చింది. బహుశా యీ ప్రపంచంలోని మనుష్యులు చాలా మంది శాపగ్రస్తులేమో! సుందరమైన ప్రదేశాలను చూసే తీరిక, అదృష్టం వారికి యెన్నటికీ దక్కదేమో! అని కదా…

ఎంత అనాలోచితంగా అనుకున్నాను అలా. కాదు కాదు. అది నిజం కాదు. ప్రపంచంలోని చాలామంది మనుషులు నిజంగా అదృష్టవంతులు. ఎప్పుడు యే క్షాణాన వారు అద్భుతమైన మధురానుభూతికి లోనవుతారో వారికే కాదు, ఎవరికీ తెలియదు.

మారసాని విజయ్ బాబు  రైతుబిడ్డ. పుట్టింది చిత్తూరు జిల్లా మంగినాయనిపల్లిలో.  స్వతహాగా ఆర్టిస్ట్. సాహిత్యంపై అభిలాషతో కథలు రాశారు. అలాగే మహత్తర జీవిత కాంక్షను రగిలించే తాత్వికతతో ‘కొత్తగీతలు’ అన్న నవలను అందించారు. పైగా సీనియర్ పాత్రికేయులు. ‘సహచర’ సమాంతర ఆలోచనల సామాజిక వేదిక వ్యవస్థాపకులు. జీవితానుభవంలో ఎగసిపడిన ఆనందోత్సాహాలను, అందలి తాత్వికతను  వారం వారం ‘ఆపాదమస్తకం’ శీర్షిక ద్వారా అందిస్తారు.

email: vijayababumarasani@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article