ఎస్.ఇళయరాజా స్వామినాథన్
నిన్న రాత్రి ఈ అపురూప చిత్రకారుడు కోవిడ్ తో మృతి చెంది లక్షలాది అభిమానులకు దుఃఖసాగరంలో ముంచి వెళ్ళారు. వారు మిగిల్చిన చిత్రరాజాలే ఇక తన స్మృతిని శాశ్వతంగా పదిలం చేస్తాయి.
చెన్నయ్ కు చెందిన ఇళయరాజా రియలిజంలో అందెవేసిన చేయి. సమకాలీన చిత్రకారుల్లో ఈ విభాగంలో రారాజుగా వెలుగొందారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో ఒకచోట వారి చిత్రాలు చూడని వారుండరు.
నలభై మూడేళ్ళ ఈ చిత్రకారులు ఇటీవల తన మేనకోడలు వివాహానికి కుంభకోణం వెళ్లి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. కోవిడ్ అని నిర్ధారణ అయి చికిత్స తీసుకునే లోపలే వారి ఊపిరి తిత్తులు చాలా వరకు పాడయ్యాయి. నిన్న రాత్రి గుండెపోటు రావడంతో అయన అంతిమ శ్వాస వదిలారు.
అతి తక్కువ వయసులోనే వారు వేసిన వేలాది చిత్ర రాజాలను మనకు యావదాస్తిగా వదిలి వీడ్కోలు చెప్పారు.
ఇళయరాజా అందంగా వర్ణ చిత్రాలు వేయడంలోనే కాదు, వాటిని వేయడానికి అతి తక్కువ సమయం తీసుకుంటారని కూడా ప్రతీతి.
వారి వర్ణచిత్రాలను చూసి తొలుత అవి ఛాయాచిత్రాలని పొరబడే అవకాశం ఉంది. అంతటి నైపుణ్యం వారి సొంతం.
దైనందిన జీవితం నుంచి స్ఫూర్తి పొంది వారు ఇతివృత్తాలను సంగ్రహించేవారు. వంట చేయడం మొదలు పూల మాల అల్లే చిత్రాలు, గుడిమెట్ల మీదనో, గుడి గంట మొగిస్తూనో యువతులు, మహిళలు సజీవంగా కానవచ్చి మనల్ని విస్మయానికి గురి చేస్తారు.
మరరపురాని వారి చిత్రాలు నేడు అయన లేని స్థితులో నిశ్చలంగా కానవస్తున్నై. తెలుపు వారి అజరామరమైన కళాఖండాలను పంచుకుంటూ కడపటి నివాళి అర్పిస్తున్నది.
ఇళయరాజా మృతికి చిత్రసీమకు చెందిన హీరో రజనీకాంత్ మొదలు ఎందరో చిత్రకారులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.
“ఇళయరాజా స్వామినాథన్ పెయింటింగ్స్ చూడని వారు దాదాపు ఎవరూ ఉండరు. నియో క్లాసిజం శైలిలో దక్షిణ భారతదేశపు జీవితాన్ని అత్యంత అందంగా చిత్రించినవారిలో ఇళయరాజా ఒకరు. 42 రెండెళ్లున్న ఈ చిత్రకారుడు కోవిడ్ వలన మరణించాడని పొద్దున్నే తెలియడంతో మనసంతా ఏదోలా అయిపోయింది” అని ప్రముఖ చిత్రకారులు శేష బ్రహ్మం వారి మరణ వార్తను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
That’s unfortunate. A big loss for the fraternity and family too. He made himself alive forever in these marvellous art scapes.