మంచి పుస్తకం ఒక సంపద.
‘తెలుపు’ కోసం కొసరాజు సురేష్ అందిస్తున్న సగౌరవ శీర్షిక
గడ్డిపరకతో విప్లవం ప్రచురితమయిన 1990 నవంబరులోనే మరో రెండు పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వీటిల్లో మొదటిది Keith Warren రాసిన Preparation for Understandingకి రఘుబాబు ‘తెలుసుకుందాం’ పేరుతో చేసిన అనువాదం. రెండవది IDAC (Institute of Cultural Action – Economic Development) Document 16/17 సంచికగా వచ్చిన Danger: School!కి నా తెలుగు అనువాదమైన బాబోయ్: బడి! ఈ రెండు పుస్తకాలను భారత జ్ఞాన విజ్ఞాన సమితి (బిజివిఎస్) ప్రచురించింది. ముప్పై సంవత్సరాల తరవాత ఆ మూడు పుస్తకాలు ఇప్పటికీ అందుబాటులో ఉండటం విశేషమనే చెప్పుకోవాలి.
1984-86లో మధ్య ప్రదేశ్‌లోని కిశోర్ భారతిలో పని చేసిన నాకు చాలా మంది పరిచయమయ్యారు. వారిలో అరవింద గుప్తా ఒకరు. పుస్తకాలను పరిచయం చెయ్యటం, అందుబాటులోకి తీసుకుని రావటం, అనువాదాలు చెయ్యటం, చేయించటంలో అరవింద గుప్తా పోషిస్తున్న పాత్ర చాలా విశేషమయినది. బాల సాహితి తరఫున ప్రచురించిన మొదటి రెండు పుస్తకాలు పూనా లోని ఆయన ఇంట్లోనే రూపొందాయి.
ప్రశాంతమయిన ఆ పల్లెటూరి వాతావరణంలో, వచ్చే, పోయే రైళ్లను చూస్తూ, అమ్మ వంటలను ఆస్వాదిస్తూ మూడు రోజులలో ఈ పుస్తకం అనువాదం పూర్తి చేశాను.
www.arvindguptatoys.com అన్న ఆయన వెబ్సైట్లో అనేక వందల పుస్తకాల తోపాటు విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల వీడియోలు వందల సంఖ్యలో ఉన్నాయి. అరవింద గుప్తా ఇప్పుడు ఆర్కైవ్‌లో వందల సంఖ్యలో ప్రపంచ బాల సాహిత్యాన్ని హిందీలోకి అనువాదం చేసి/ చేయించి అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని మరాఠీ, గుజరాతీ వంటి భాషలలోకి కూడా అనువాదం చేయిస్తున్నారు. వీటిల్లో నేను తెలుగు లోకి ఇప్పటి దాకా వందకి పైగా అనువదించాను. వీటి గురించి ప్రత్యేకంగా ఒకసారి రాస్తాను.
కిశోర్ భారతి నుంచి 1990లో సుశీల్ జోషి టీచర్లకు శిక్షణ ఇవ్వటానికి హైదరాబాదు వచ్చినప్పుడు నాకు డా. వి. లక్ష్మణ రెడ్డి పరిచయమయ్యారు. అప్పుడు ఆయన జన విజ్ఞాన వేదిక, బిజివిఎస్లలో బాధ్యులుగా ఉన్నారు. తెలుసుకుందాం, బాబోయ్: బడి! పుస్తకాల ప్రచురణను బిజివిఎస్ తీసుకుంటుందని ఆయన చెప్పారు.
అప్పుడు సుబ్బయ్య, బాల్ రెడ్డి బొమ్మాయిపల్లిలో చేను కొని వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఆ కారణంగా సుబ్బయ్య వాళ్ల అమ్మా, నాన్నలు అరుంధతి, రామస్వామి గార్లు బొమ్మాయిపల్లిలోని రైల్వే క్వార్టర్లో ఉంటున్నారు. ప్రశాంతమయిన ఆ పల్లెటూరి వాతావరణంలో, వచ్చే, పోయే రైళ్లను చూస్తూ, అమ్మ వంటలను ఆస్వాదిస్తూ మూడు రోజులలో ఈ పుస్తకం అనువాదం పూర్తి చేశాను.
Danger: School! అన్నదానికి తెలుగు పేరు గురించి చర్చిస్తూ చివరికి నా భార్య భాగ్యలక్ష్మి సూచించిన బాబోయ్: బడి! ఖరారు చేశాం. ఈ పేరు ఈ పుస్తకానికి బాగా నప్పింది.
బడి పట్ల నా రాజకీయ అవగాహనను ఈ పుస్తకం బలోపేతం చేసింది. పిల్లలను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెంచితే, మంచి విలువలు నేర్పితే, మంచి బడులు ఉంటే సమాజం మారిపోతుందన్న ఒక అమాయకమైన భావన చలామణి అవుతూ ఉంటుంది. సామాజిక వ్యవస్థ అనే పెద్ద యంత్రంలో బడి అనే సంస్థ ఒక చిన్న మర లాంటిదని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది
బాబోయ్: బడి! అన్న ఈ పుస్తకం కార్టూన్ స్ట్రిప్ శైలిలో ఉంటుంది. బొమ్మలు ప్రధానంగా ఉంటాయి. ఏ కారణం వల్లనో తెలుగులో పేజీలు తగ్గించాలని బొమ్మలు చిన్నవిగా చేసి ప్రచురించాం. దీని వల్ల అక్కడక్కడా బొమ్మల అందం తగ్గింది, బొమ్మలలోని క్యాప్షన్స్ రీడబిలిటి తగ్గింది. ఇలా చేసినందుకు భాగ్యలక్ష్మి ఇప్పటికీ నన్ను క్షమించదు.
‘అన్నదాత’ ఎడిటర్‌గా కె. ఎస్. రెడ్డి గారు పదవీ విరమణ చేసిన తరవాత రైతే రాజు బ్యూరో చీఫ్ డా. వాసిరెడ్డి నారాయణ రావు గారు దానికి ఎడిటర్ అయ్యారు. రైతే రాజుకి సబ్ ఎడిటర్‌గా ఉన్న నేను అప్పుడప్పుడు అన్నదాత లేఅవుట్ చేయించేవాడిని. ఆ క్రమంలో ఆర్టిస్ట్ టి. శివాజీ పరిచయం అయ్యారు. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. బాబోయ్: బడి! పుస్తకంలోని సంభాషణలన్నీ శివాజీ తన చేతితో అందంగా రాశారు (అప్పటికి ఇంత కంప్యూటరైజేషన్ జరగ లేదు, ఇన్ని రకాల ఫాంట్లు లేవు).
బడి పట్ల నా రాజకీయ అవగాహనను ఈ పుస్తకం బలోపేతం చేసింది. పిల్లలను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెంచితే, మంచి విలువలు నేర్పితే, మంచి బడులు ఉంటే సమాజం మారిపోతుందన్న ఒక అమాయకమైన భావన చలామణి అవుతూ ఉంటుంది. సామాజిక వ్యవస్థ అనే పెద్ద యంత్రంలో బడి అనే సంస్థ ఒక చిన్న మర లాంటిదని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది
సమాజాన్ని బడి మార్చటం కాక, బడిని సమాజం మలుచుకుంటుందని మనం గుర్తుంచుకోవాలి. ‘కుటుంబం’ అనే వ్యవస్థని ఎంతమంది, ఎంతగా పొగిడినా యధా తధ స్థితి (స్టేటస్ క్వో)ని కాపాడటంలో బడి తోపాటు అది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సమసమాజంలో ఈ రెండు సంస్థలను ఇప్పటికి పూర్తి భిన్నంగా రూపొందించుకుంటే తప్పించి పెత్తందారీ ధోరణులను వదిలించుకోలేం. ఉదాహరణకు పిల్లలు అన్న సత్యు కవిత నుంచి ఈ రెండు చరణాలను చూడండి-
(పిల్లలు) అమాయకులు కదా,
చింపిరి బట్టలవాళ్లకు బట్టలు ఇవ్వటం కంటే
పొద్దునే లేచి పళ్లు తోముకోవటం ఎందుకు ముఖ్యమో
అర్థం చేసుకోలేరు
సమాజానికి ముప్పు పొంచి ఉంది.
అందుకే ప్రతి బాలుని వెనక
అమ్మా, నాన్నలను నిలబెట్టండి,
ముందు జాగ్రత్తగా బడులు తెరవండి.
బాబోయ్: బడి! పాశ్చాత్య దేశాల అనుభవాల ఆధారంగా రాసినప్పటికీ మనకి కూడా వర్తిస్తుంది. ఈ పుస్తకంలో ప్రొటగొనిస్ట్, యాంటగొనిస్ట్ రూపంలోని రెండు పాత్రల మధ్య సంభాషణలో బడి విశ్లేషణ సాగుతుంది.
బడి చేసే ముఖ్యమైన పనులలో అసమానతలకు చట్టబద్ధత కల్పించటం (లెజిటమైజ్ చేయటం) ఒకటి. అందరికీ ఉచిత, నిర్బంధ విద్య 15, 16 సంవత్సరాల వరకు ఉన్నప్పుడు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారన్న దానితో సంబంధం లేకుండా ‘ప్రతిభ’ కలవాళ్లు, ‘అర్హులు’, ‘తెలివైన’ వాళ్లు విజయవంతులు కావాలి. కానీ, సామాజిక అసమానతలు అలాగే ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలోనే శ్రామిక వర్గ పిల్లలు ఎక్కువ మంది తప్పుతున్నారు, ఎక్కువ మంది బడికి వెళ్లటం మానుకుంటున్నారు. అంతే కాకుండా ఎవరు ఏ చదువులో కొనసాగుతారన్నది వాళ్ల సామాజిక వర్గం మీద ఆధారపడి ఉంటోంది.
అసమానతలతో ఉన్న పిల్లలని బడి ఒకే రకంగా చూడటం అంటే ఆ అసమానతలను కొనసాగనివ్వటమే కాకుండా వాటిని పెంచినట్లు అవుతుంది. పిల్లల మధ్య (1) జీవన సరళిలో, (2) సాంస్కృతిక నేపధ్యంలో, (3) బడి బయట పొందే అనుభవాలలో, (4) బడి పట్ల తల్లిదండ్రుల దృక్పథంలో తేడాలు ఉంటాయి. ఉదాహరణకి మూడవ అంశానికి సంబంధించి బడి బయట సంపన్న కుటుంబాల పిల్లలు నేర్చుకునే విషయాల వల్ల బడిలో ప్రయోజనం పొందుతారు. కానీ మిగతా పిల్లల అనుభవాలు ఎంతో గొప్పగా ఉన్నా వీటికి బడిలో ఏ విలువా ఉండదు.
బడిది జీవితంతో సంబంధంలేని ఒక ప్రత్యేక ప్రపంచం. ఇంటి నుంచి బడి దాకా ఎంతో ఉత్సాహంగా వచ్చిన పిల్లవాడు బడి గేటు ముందుకు రాగానే నీరసంగా అయిపోతాడు. అలాగే ఇంటి బెల్లు కొట్టగానే అందరూ పొలోమంటూ బయటకు పరిగెత్తుతారు.
బడిది జీవితంతో సంబంధంలేని ఒక ప్రత్యేక ప్రపంచం. ఇంటి నుంచి బడి దాకా ఎంతో ఉత్సాహంగా వచ్చిన పిల్లవాడు బడి గేటు ముందుకు రాగానే నీరసంగా అయిపోతాడు. అలాగే ఇంటి బెల్లు కొట్టగానే అందరూ పొలోమంటూ బయటకు పరిగెత్తుతారు. పిల్లలు తమ భావాలను (కలలు, కోరికలు, చొరవ, రాజకీయాలు, వ్యక్తిగత అనుభవాలు వంటి వాటిని) బడి బయటే వదిలిపెట్టి రావాలి. కదలకుండా, మాట్లాడకుండా వినటమే పిల్లల పని. దండనలు, అవరోధాలతో కూడుకున్న ప్రపంచం అది. మెడ మీద కత్తి పెట్టి చదవమంటే ఎలా ఉంటుంది? చదవటం రానందువల్ల ఎక్కువమంది పిల్లలు తప్పుతుండటం ఆశ్చర్యం కలిగించదు. దాంతో పిల్లలు ఆందోళన, తక్కువ మార్కులు,తప్పటం, నిరుత్సాహం, ఆత్మ విశ్వాసం కోల్పోవటం అనే సుడి గుండంలో చిక్కుకు పోతారు.
అన్నిటికి మించి బడిలో పాఠ్యాంశాల తోపాటు ‘ప్రవర్తనా నియమావళి, ప్రామాణికాలు, విలువలు’ నేర్చుకుంటారు. ఇవి ఎటువంటివో చూడండి-
1. వ్యక్తి వాదం, పోటీతత్వం అలవర్చుకుంటారు
2. హీనభావనను అలవర్చుకుంటారు
3. అధికారానికి తల ఒగ్గటం నేర్చుకుంటారు
4. ప్రస్తుత వ్వవస్థను గౌరవించటం నేర్చుకుంటారు
5. మిగతావాళ్ల కంటే భిన్నంగా ఉండటమంటే భయపడతారు
ప్రశ్నించటాన్ని, సృజనాత్మకతని పెంపొందించేలా బడి ఉండాలి అంటారు. కానీ, బడి సరిగ్గా ఇందుకు విరుద్ధంగా పని చేస్తుంది. ప్రజలని విడదీసి ఏకాకులను చేస్తుంది, పరాధీనతను (ప్రతిదానికీ ఇతరులపై ఆధారపడటాన్ని) పెంపొందిస్తుంది. బడి చదువుల ద్వారా వాస్తవాన్ని నిశితంగా, పరిశీలనగా చూసే దృష్టిని కోల్పోతాం. నిర్దిష్ట వైఖరిని, ధైర్యంగా నిలబడే శక్తిని కోల్పోతాం. ఫలితంగా ప్రత్యామ్నాయాలను అన్వేషించే దృష్టిని కోల్పోతాం.
బడి స్వరూప, స్వభావాల పట్ల సరైన అవగాహన ఏర్పడటానికి బాబోయ్: బడి! ఎంతైనా దోహదం చేస్తుంది.
బడి లేని సమాజం నుంచి, ఉన్నవాళ్లకే బడి నుంచి, ప్రజాతాంత్రిక బడి పేరుతో అసమానతలను చట్ట బద్ధం చేసే సమాజానికి వచ్చాం. బడి పరిస్థితులలో మార్పులు వస్తున్నాయి. ఎంతో మంది ఎన్నో బడులలో అనేక ప్రయోగాలు చేశారు. పిల్లలను కేంద్రంగా చేసుకునే (చైల్డ్ సెంట్రిక్) విద్య, పిల్లల చొరవ (ఇనీషియేషన్)తో సాగే విద్య వంటి వాటితో ప్రయోగాలు జరుగుతున్నాయి. రైలు బడి, సమ్మర్ హిల్, సద్బరీ వ్యాలీ వంటి ప్రత్యామ్నాయ బడులు గురించి పుస్తకాలు వచ్చాయి. పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాని, పిల్లలను మూసపోత పొయ్యటానికి, తీర్చి దిద్దటానికి, మలచటానికి ప్రయత్నించని సమాజంలో, అందరికీ చదువు, ఒక ప్రాంతంలోని పిల్లలందరూ ఒకే రకమైన బడికి వెళుతూ, అన్ని పనులకు సమానమైన విలువ ఉండే సమాజంలో పరిపూర్ణమయిన బడి రూపుదిద్దుకునే అవకాశం ఉంది. అప్పటివరకు మనం ఆ దిశలో ఆలోచిస్తూ, ప్రయోగాలు చేస్తూ ఉండాలి. బడి స్వరూప, స్వభావాల పట్ల సరైన అవగాహన ఏర్పడటానికి బాబోయ్: బడి! ఎంతైనా దోహదం చేస్తుంది.
వ్యాసకర్త పాత్రికేయులు, అనువాదకులు. ప్రభుత్వం ప్రభుత్వేతర స్వచ్ఛంద సేవా సంస్థలో దశాబ్దాలు కృషి చేశారు. ప్రచురణా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వారి అనువాదాల్లో ‘గడ్డిపరకతో విప్లవం’ మొదటిదైతే (ఇక్కడ క్లిక్క్ చేసి చదవవచ్చు) మీకు పరిచయం చేసిన పై పుస్తకం రెండవది. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే.
పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. ప్రతి వారం ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తారు.
Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/
బాభోయి బడి ….అద్భుతమైన పుస్తకం. ధన్యవాదాలు