Editorial

Sunday, September 22, 2024
స్మరణవర్థంతిసారస్వతీయుడు శేషేంద్ర - ఎ.బి.కె.ప్రసాద్

సారస్వతీయుడు శేషేంద్ర – ఎ.బి.కె.ప్రసాద్

నేడు శేషేంద్ర శర్మ 14వ వర్ధంతి

Sheshendra
http://seshendrasharma.weebly.com/

వసంతం మాట ఎత్తకండి. ఇక మళ్ళీ కోకిలనై రాలేనంటాడు గాని శేషేంద్ర కోకిలలా ఆకులందున అణిగిమణిగి ఉంటూ మన మధ్యనే ఉంటూ, మన ప్రగతిని చూస్తూనే ఉంటాడు. అంతవరకూ ఆయన “లోకాన్ని మోసుకొచ్చే వార్తాపత్రిక మన గుమ్మంలో పూచే లిల్లీ” లాగేనే శేషేంద్ర కూడా వర్చస్సుకు తగిన కాంతులు, సువాసనలూ పంచుతూనే ఉంటాడు!

“వంద సూర్యులు ఉదయించుగాక, వంద చంద్రులు ఉదయించుగాక, విద్వాంసుని వాక్యాల వల్ల తప్ప లోపలి చీకట్లు చెదరిపోవ”ని ఒక ప్రాచీన సూక్తి! అలాంటి చిరంతన సూక్తుల్ని నిరంతరం వినిపిస్తూ సుమారు అర్థ శతాబ్దంగా కవితా వ్యవసాయంలోనే కాదు, ఆధునిక కావ్యశాస్త్ర నిర్మాణంలో కూడా అఖండ ప్రతిభతో ప్రభవిల్లుతూ వచ్చిన కవీ, అభ్యుదయగామీ, పండితుడూ మనల్ని వీడిపోయిన గుంటూరు శేషేంద్ర శర్మ.

నిరంతరం అభ్యుదయం వైపు ప్రపంచం కదులుతూనే ఉన్నా మానవులకు మాత్రం సంతృప్తి ఉండదంటాడు అనర్ఘ రాఘవ కర్త మురారి. అలాంటి అసంతృప్తి జీవి మన శేషేంద్ర, అందుకు కారణం పీడనా దోపిళ్ళ నుంచి సామాన్యుడింకా విమోచనతో తెరపిన పడలేదన్న ఆయన వేదన.

ప్రాచీన, ఆర్వాచీన భారతీయ కళా కవితా సాహిత్యాలనే గాక పాశ్చాత్య కవితా రీతులను, కావ్య నిర్మితిలోని మర్మాలనూ అధ్యయనం చేసిన వాడు ఆకళింపు చేసుకున్నవాడు, ఉద్యోగ ధర్మంగా సర్కారీ కొలువు చేసినా, సాహిత్య సృష్టిని సద్యోగంగా భావించినవాడు, ప్రౌఢ కవిత్వంతో పాటు సామాన్య జనాల గుండె గొంతుకలను తనలో పలికించుకున్న కవనమూర్తి శేషేంద్ర, 1940లలో శ్రీశ్రీ “మహాప్రస్థానం”తో ఆవిష్కరించుకున్న అభ్యుదయ కవితా విప్లవ యుగానికి తొలి ఆహ్వానాన్ని కవిత్వాభివ్యక్తితో చెప్పినవాడు శేషేంద్ర.

పద్యకవిగా, గద్యకవిగా, వచన కవిగా “మండే సూర్యుడు”, “నాదేశం నా ప్రజలు”, “గోరిల్లా “లలో దర్శనమిచ్చాడు. “ఋతుఘోష” మరో గొప్ప కావ్యం. ఆ తర్వాత ముప్పయి నాలుగేళ్ళ అనుభవంలో శ్రీశ్రీ ధోరణితో పాటు తెలుగు నవయువ కవుల పైన శేషేంద్ర ప్రభావం కూడా పడుతూ వచ్చింది. ఈ నాలుగు రచనలూ శేషేంద్ర భావనా స్ఫూర్తికి ఉద్దీపన కల్పించిన అపూర్వ పరిణామం “ఆధునిక మహాభారతం” రచన. దాదాపుగా ప్రతిరచనలోనూ ఆయన తన అనుభూతిని సామాజిక స్థితిగతుల నుంచి పొందగలిగాడు, అనుభవాన్ని సమాజ శ్రేయస్సుతో, సామాన్య ప్రజల కడగండ్లతో జోడించుకున్నాడు.

కవితా వస్తువుతో శబ్దార్థాలకు విలువ తెచ్చిన వాడు, శేషేంద్ర. రచనల్లో ఏకకాలంలో ఒక కాళిదాసును, ఒక భవభూతిని, ఒక శ్రీనాథుడిని, ఒక శ్రీ శ్రీని, ఒక జాషువానూ, ఒక విశ్వనాథనూ, ఒక కాళోజీని మనం చూస్తాం.

కవితా వస్తువుతో శబ్దార్థాలకు విలువ తెచ్చిన వాడు, శేషేంద్ర. రచనల్లో ఏకకాలంలో ఒక కాళిదాసును, ఒక భవభూతిని, ఒక శ్రీనాథుడిని, ఒక శ్రీ శ్రీని, ఒక జాషువానూ, ఒక విశ్వనాథనూ, ఒక కాళోజీని మనం చూస్తాం. రచనలో, రస నిష్పన్నతలో ఆయనతో తులతూగగల ఆధునికలు కొలదిమందే, శబ్ద సౌందర్యం తోడుగా వాగర్థాలకు సమన్వయం సాధించని వాడు.

శ్రీశ్రీని మరింత అభ్యుదయగామిగా మలచడానికి ఏ “లండన్ మానిఫెస్టో (భారత అభ్యుదయ రచయితల సంఘం ప్రణాళిక) దోహదం చేసిందో శేషేంద్రును కూడా తరువాతి కాలంలో ఆ ఛాయలే ప్రభావితం చేశాయి. రచయితలు భారత నాగరికతలోని ఉత్తమ సంప్రదాయాలకు వారసులు కావాలనీ, సృజనాత్మక విమర్శకు ద్వారాలు తెరవాలనీ, సాంస్కృతిక తిరోగమనాన్ని ఎదుర్కోవడానికి ఉదాత్తమైన శిల్పంతో అభ్యుదయ సాహిత్యాన్ని పునరుజ్జీవింప చేయాలని భావించిన వారిలో శేషేంద్ర కూడా ఉన్నారని మరచిపోరాదు.

1977 నాటి “ఆధునిక కావ్యశాస్త్రమ్” గా ఆయన ప్రకటించిన వైజ్ఞానిక ఉద్యమ సిద్ధాంత రచన “కవిసేన మానిఫెస్టో”కు ఈ పురోగమన భావాలు తోడ్పడడంతో పాటు “పిప్పి” లాంటి రచనలు గాక సందేశాన్ని సౌందర్యాన్ని ఏకకాలంలో పాఠకులకు అందించవలసి అవసరాన్ని గుర్తించి దానికొక ఉద్యమరూపం ఇచ్చిన వారు శేషేంద్ర.

సమతా భావాలు, సమాజ శ్రేయస్సు కావ్యసృష్టికి జోడు గుర్రాలుగా ఉండాలని భావించి కేవల నినాదభూయిష్టమైన రచనగా కవిత్వం ఉండరాదనీ, కవిత్వ కళలో శబ్దం నిర్వహించే పాత్రను కాదనరాదనీ, కమిటి మెంట్ అంటే “అధర్మ వ్యతిరేకత” అనీ, అదే నిబద్ధత అనీ, కళకళ కోసం కాదనీ ప్రజల కోసమనీ చెప్పాడు. ఆయన దృష్టిని సునిశితం చేసిన సిద్ధాంతం మార్క్సిజమే అయినా, లెనిన్, మావోలుసాహిత్యపరంగా వాదించినట్టు, మన ప్రాచీనులు చెప్పినట్లు పాతదయినంత మాత్రాన పూర్తిగా తోసిపుచ్చరాదనీ, కొత్తదయినంతనే పూర్తిగా అనుసరణీయమూ కాదనీ భావించిన వాడు శేషేంద్ర. ఈ దృష్ట్యానే ఆయన కావ్య సంబంధమైన రస సిద్ధాంతాన్నీ, అలంకారశాస్రాన్నీ చూశాడు; ఆ రెండింటి చేత ఆధునిక భావాల వ్యాప్తికి చాకిరీ చేయించుకోమాన్నడు. ఈ కొత్త సిద్ధాంతానికి రూపకల్పనే “కవిసేన మానిఫెస్టో” దేశీయ సాహిత్య స్ఫూర్తితో కూడిన 26 అలంకార గ్రంథాలు, మరి 30 మార్క్సిస్టు సాహిత్య శాస్త్ర గ్రంథాలు, అరడజనకు పైగా తన సొంత గ్రంథాలూ ఆధారంగా అధ్యయన తరంగాలుగా అనలు తొడిగి కొనలు సాగిన రచన “కవిసేన మానిఫెస్టో !

మన “తెలుగు బ్రాండు” కవిత్వం సామాజిక దృక్పథం లోపించిన వట్టి రాజకీయ శాస్త్రమని ఆయన భావన. కాని ఆయన గుర్తించనిదల్లా “మనిషి అతని పరిసరాలు” వెరసి రాజకీయమనీ, చైతన్యపూరితమైన రాజకీయ సందేశం లేని కవిత్వమూ, కళారంగమూ ఎంత పేలవంగా ఉంటాయో, కళారూపమూ, కవితారూపమూ లేని కేవల రాజకీయ సందేశాత్మక రచనలూ అంతనేని! రాజకీయ శాస్త్రం, నీతిశాస్త్రం, తత్వశాస్త్రం ఈ మూడింటి సమాహారమే రచన పరమావధి కావాలన్న అభిప్రాయంతో శేషేంద్ర కూడా ఏకీభవిస్తారు. అయితే ఏది ఎంత పాళ్ళల్లో రచనల్లో నిష్పన్నం కావాలన్నది రచయితలు, కవులు తేల్చుకోవలసిన విషయం. “రసాత్మకం కావ్యం” అన్న నానుడిని పరోక్షంగానూ, ప్రత్యక్షరసత్యం గానూ విప్లవ రసస్పోరకం చేసిన వాడు శేషేంద్ర. బహుశా అందుకే పాత కవులకూ, కొత్త కవులకూ కూడా శేషేంద్ర నచ్చి ఉంటాడు. శేషేంద్ర “ఋతుఘోష” కావ్యానికి మహాకవి శ్రీశ్రీ అందించిన ప్రశంసలో “శ్రీనాధుడి క్రీడల్లో | అల్లసాని వాడల్లో | కూడా దొరకని పదచిత్రం | విచిత్రం కడు పవిత్రం | ధుమాగా ఉంది ఇమేజి / రమారమి కవుల సమాధి” అని కీర్తించాడు.

డబాయింపులూ, డాంబికాలు నచ్చని కవి!

శేషేంద్ర నినాదకవి కాదు, విధివిధాన కవి, యువకుల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచడానికి తన కళ్ళనూ, కలాన్నీ విశాలం చేసుకున్న కవి నిర్మొహమాటంగా, వ్యంగ్యంగానూ, వాచ్యంగానూ నిజాలను నిగ్గుతేల్చి చూపగల కవి, “నీకు సేవలందించిన వాడికి నీవు రుణగ్రస్తుడవు, మార్క్స్ కు ప్రపంచ శ్రామికులంతా రుణగ్రస్తులన్న శేషేంద్ర చాలా లోతైన భావాలున్న వాడు, తన రచనల్లో ఆయన ఒకచోట గాలివానగా మారుతాడు; ఇంకోచోట గాండ్రింపుగా గొంతు విప్పుతాడు; మరో చోట అన్ని దిక్కులా కత్తులు మొలిపించి, అగ్నిగా మారి జ్వాలల్ని కొరడాలుగా ఝుళిపిస్తాడు. తాను సూర్యోపాసకుడు అయినందుననే ఈ ప్రతాపమా? ఈ పొగరా? కాదు, శేషేంద్ర పొగరుకు అర్థం ఉంది. తనను సముద్ర గాంభీర్యంతో పోల్చుకుంటూ తన వ్యక్తిత్వాన్ని శేషేంద్ర ఎలా చాటుకున్నాడో చూడండి :

“సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు / తుఫాను గొంతు ‘చిత్తం’ అనడం ఎరగదు / పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు | నేనింకా ఒక పిడికెడు మట్టే కావచ్చు / కానీ కలమెత్తితే నాకు / ఒక దేశపు జెండాకు వున్నంత పొగరుంది” !

ఈ దృష్టితోనే ఆయన తన కవిత్వాన్ని మనిషికి రక్షణ కవచంగా మలచాడు. ఇంకో వైపునుంచి యువకులకు దిశానిర్దేశం చేస్తూ శబ్దజ్వాలలు సృష్టించాడు! సాహిత్య సభల్లో సాహితీమూర్తులూ, కవితాప్రియులే ఉండాలి గాని ఒక ధనికుడు | ఒక అధికారో ఉంటే ఆయనకు కంపరం. ఈ విషయమూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు : “సాహిత్య సభల్లో ఒక సాహిత్య సామ్రాట్టు ఉంటాడు.
కానీ, అగ్రస్థానంలో ఎవరో ఒక ధనికుడో, ఒక అధికారో ఉంటాడు. అది చూడడానికి దుర్భరంగా ఉంటుందని శేషేంద్ర అన్నప్పుడు ధూర్జటి గుర్తుకు రావలసిందే!

“బతికి ఉంటే పామరుడ్ని” చస్తే అమరుడ్ని” !

బతికి ఉంటే పామరుడ్ని, చస్తే అమరుడ్ని అని చాటుకున్న శేషేంద్ర లొంగుబాటును సహించలేడు; “నా అవయవాలకు నీచంగా వంగే | భంగిమలు తెలీవు” అన్నాడు. కనుకనే మరో సందర్భంలో ఆయనే “ఈ దేశంలో వంగేవాడికి / వంగి సలాం చేసేవాడు పుడతున్నాడు | జాగ్రత్త! ఈ లక్షణం తలెత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టిందన్న మాటే” అని చరుపులు చరిచాడు! చేతిలో శతఘ్ని లేకపోవచ్చు గాని, మనిషి “ఛాతీలో గుండె” ఉంటే చాలని బోధించిపోయాడు! అంతేగాదు, సామాన్యుడు తుపాకుల్ని ఎదుర్కోగలరు. గాని నియంతలు మాత్రం ప్రశ్నల్ని ఎదుర్కోలేరని ఎద్దేవా చేశాడు. ఇలా, ఆకులందున అణగిమణిగి కవితా కోయిల కూయవలెనన్న గురజాడ వారసత్వం బలంగా అబ్బినందుననే శేషేంద్ర ” చెట్లు పూలెందుకు పూస్తాయి | బులెట్లెందుకు పూయవు” అనగలిగాడు శేషేంద్ర!

కష్టజీవుల కన్నీటి బిందువుల్లో “గర్జిస్తున్న సముద్రాలు” చూసిన కవి “ఆకులు కాదు. తుపాకులు కాయండ”ని చెట్లకు మొర పెట్టుకున్న వాడు. “అశ్రువులతో తిరుగుబాటు” చేయించేందుకు తన గీతాల్లో శేషేంద్ర “నిశ్శబ్దాల కుట్ర” కు అంకురార్పణ చేశాడు! కవి ఎవడంటే, ‘కష్టజీవి’కి మొదలు చివర నిలబడిన వాడే కవి అని శ్రీశ్రీ తన గురించి చెప్పుకోగా, “మరణించే లోపుగా తన మాట చెప్పలేని / నిస్సహాయ మానవుడి గొంతు పేరే కవి” అంటాడు శేషేంద్ర! అంతేనా? దళితవర్గంలో భాగంగా అంబేడ్కర్ భావించిన “స్త్రీలో ఉన్న ప్రేమను పోలీసు | ఎంక్వయిరీకి అప్పగించొద్దని చెబుతూ, “వసంతంలో అడుగు పెడుతున్న వృక్షాన్ని వంటచెరకుగా చూడకు” అని బరువైన గుండెతో శేషేంద్ర పలుకుతాడు! నాగలి నాగరికతకు అనాది అనీ, సేద్యం సంస్కృతికి పునాది అనీ గుర్తించిన ఆయన “మన ఉషస్సుల్ని పాతిపెట్టి మన దేశంలోనే మనల్ని బానిసలు చేసిన వాళ్ళ ప్రాణవాయువులు పీలుద్దాం” రమ్మంటూ నాగళ్ళు తీసుకోమని రైతు సోదరుల్ని వేడుకున్నాడు కవి!

అన్ని ఋతువులకూ ఆదర్శంగా సామాన్య మానవుడు!

శేషేంద్ర తన ప్రౌఢ కావ్యమైన “ఋతుఘోష” లోని ఆరు రుతువులనూ ప్రకృతి సౌందర్యానికి గాక, సామాన్య మానవుల బతుకు తెరువును వెలార్చేందుకు ప్రతీకలుగా ప్రతినిధులుగా వాడుకున్నాడు, మానవుడి శ్రేయస్సుకు ఆశీరాక్షతలుగా మలిచాడు.

రుతువులను ఆయన “అంతములేని కాలపథంమందొక/ ఒంటెల బారువోలె న | వింతము సాగిపోవు ఋతుజాలము జాలము సేయ” అంటాడు! “దైన్య స్థితిలో కూలివాడు కుటీర గర్భంలో ఆక్రోశించడాన్ని ఒక రుతువు వర్ణనలో చూపించాడు.

ఒక ఋతు ప్రవర్తన రుజువర్తనాన్ని “దుర్జన రాజ్య శాసనం”తో పోల్చాడు! బాధా పీడనలతో కోరికలు చచ్చిపోయి, కళ్ళుమూస్తే చాలు పీడకలల మధ్య జీవించే వారికి శుభాన్ని కోరుకుంటూ కవి మరొక రుతువును ఇలా వేడుకుంటున్నాడు.

“హితవుగ మేఘమాలిక
ద్రవించును గాక, చిగిర్చి యంతటన్‌
లతలు సుమించుగాక
పృథులమ్మగుగాక వెలంది వెన్నెలల్
ఋతువులు మారుగాక
జ్వలించు క్షుధావ్యధితో
జీవన క్రతువులు మారెనే యుగయుగమ్ముల
భార మొకింత తీరెనే”

అంతేగాదు, శిశిర ఘోషను వినిపిస్తూ శేషేంద్ర ఒకచోట ‘కలడు కలండెనెడు వాడు కలడో, లేదో” అని పోతన అనుమానించినట్టుగానే తాను కూడా “ఓ పరమేశ్వరా! యెచట | నుంటిని నీ వసులుంటివా ప్రజా | శాపములం భరించుటకు | సాధ్యముగాదని పాత పెత్తనం / బీపయి సాగబోదని | యెటేని పరారయినావ? బాధలం / బాపగ లేవు నీవు శిలవా / కలవా సెలవీయుమో ప్రభూ” ఉంటే, గింటే అనిన వేడుకుంటాడు! గ్రీష్ముతాపం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా ఉంటుందో రిక్షా కార్మికుని దారుణ జీవితాన్ని వర్ణిస్తూ అంటాడు కవి; “క్రూర దారిద్ర్య దుర్విధి కారణమున / తన భుజాగ్రము నెక్కు భేతాళమూర్తి / సర్వ కాలానువర్తి రిక్షా ధరించి లాగలేకను వేసవి కాగలేక !

ఇంతటి ప్రతిభావంతుడైన కవి పండితుడు, విద్వత్ సంపన్నుడు రావలసినంత గౌరవ పురస్కారాలకు కీర్తి ప్రతిష్ఠలకూ దూరంగా ఉండడానికి సాహిత్యరంగంలో కూడా రాజకీయ రంగ వారసత్వమైన బహునాయకత్వమే కారణమై ఉండాలి.

వసంతం మాట ఎత్తకండి. ఇక మళ్ళీ కోకిలనై రాలేనంటాడు గాని శేషేంద్ర కోకిలలా ఆకులందున అణిగిమణిగి ఉంటూ మన మధ్యనే ఉంటూ, మన ప్రగతిని చూస్తూనే ఉంటాడు. అంతవరకూ ఆయన “లోకాన్ని మోసుకొచ్చే వార్తాపత్రిక మన గుమ్మంలో పూచే లిల్లీ” లాగేనే శేషేంద్ర కూడా వర్చస్సుకు తగిన కాంతులు, సువాసనలూ పంచుతూనే ఉంటాడు!

ఆంధ్రప్రభ (దినపత్రిక)
శుక్రవారం, 1 జూన్, 2007

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article