శనివారం మే 29వ తేదీ ఉదయం గం.8.30లకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఎల్.వేణుగోపాలరెడ్డి సమావేశమందిరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతులమీదుగా పురస్కారాన్ని అందజేస్తామన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ‘నటరత్న’ యన్.టి.ఆర్ పేరిట ఏర్పాటుచేసిన సాహిత్య పురస్కారాన్ని 2021 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడికి అందజేయనున్నట్లు యన్.టి.ఆర్. విజ్ఞాన్ ట్రస్ట్ ఛైర్ పర్సన్, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి సంచాలకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
స్వర్గీయ యన్.టి.ఆర్ కు తెలుగు భాష, సంస్కృతులంటే ఎంతో ఇష్టమని, ఆయన కృషి వల్లే తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు లభించి తెలుగు వారి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాతమైందన్నారు. తెలుగు భాషా ప్రియులైన యన్.టి.ఆర్ పేరిట ఏర్పాటుచేసిన సాహిత్య పురస్కారానికి ఈ ఏడాది వాడ్రేవు చినవీరభద్రుడిని ఎంపికచేసినట్లు చెప్పారు. శనివారం మే 29వ తేదీ ఉదయం గం.8.30లకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఎల్.వేణుగోపాలరెడ్డి సమావేశమందిరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతులమీదుగా పురస్కారాన్ని అందజేస్తామన్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి సంచాలకులు వి.రామకృష్ణ, నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్, ప్రముఖ సంస్కృత పండితులు థాయ్ లాండ్ రాజపురస్కార గ్రహీత ఆచార్య ధూళిపాళ రామకృష్ణ ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొంటారు.
పురస్కార గ్రహీత వాడ్రేవు చినవీరభద్రుడు బహుముఖ ప్రజ్ఞావంతులు. సాహిత్య సృజన, విమర్శతో ఉపన్యాసం కూడా వారు విశిష్టంగా సాధన చేశారు. అలాగే చిత్రలేఖనం కూడా చేస్తారు. తన వ్యక్తీకరణలన్నిటికీ ఒక వేదికగా వారు ‘నా కుటీరం’ పేరుతో ఒక వెబ్ సైట్ అందుబాటులో ఉంచారు. ఆ కుటీరం నీడన కొద్ది సేపు సేదదీరండి. చదవండి… చూడండి….
తెలుపు అభినందనలతో…