Editorial

Wednesday, January 22, 2025
ARTS'కొండపల్లి సందర్భం' : శత జయంతి స్మారక వ్యాసం

‘కొండపల్లి సందర్భం’ : శత జయంతి స్మారక వ్యాసం

ఈ నెల జనవరి 27న ప్రసిద్ధ చిత్రకారులు డా.కొండపల్లి శేషగిరి రావు గారి జయంతి. నిజానికి జయంతి మాత్రమే కాదు, గత ఏడు పుట్టినరోజు నుంచి వారి ‘శత జయంతి’ సందర్భం మొదలైంది. ముఖ్యంగా కళాకారులు, పరిశోధకులు గొప్ప వేడుకగా జరుపుకోవాల్సిన తరుణం. వారి గురించి ఆ మహనీయులు ఉన్నప్పుడు, గతించాకా ఈ వ్యాసకర్త చాలా వ్యాసాలు రాశాడు. అందులోంచి శత జయంతిని పురస్కరించుకుని స్మారకంగా వారి తొలి వర్థంతి సందర్భంగా 2012లో రాసిన ఈ వ్యాసం మొదటగా మరోసారి.

కందుకూరి రమేష్ బాబు 

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..మీరెవరు?’ అని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అడిగేవారు. ఆయన అలా అడిగిన ప్రతిసారీ ఇవతలి వ్యక్తికి, తాను ఎవరో చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. అలా చెప్పగలిగే అదృష్టం నాకూ దక్కింది. ముందు పేరు చెబుతాం. ఫలానా ఊరి వారమనీ చెబుతాం. ఎవరి కొడుకువని అడిగితే చెబుతాం. ఏం పని చేస్తున్నామో చెబుతాం. ‘అలాగా’ అని ఆయన ఆశ్చర్యపోయేవారు. ‘నమస్తే తెలంగాణ’ పేరిట ఒక పేపరు వస్తున్నదా?’ అని ఆయన ఆశ్చర్యపోయారు. ‘బతుకమ్మ’ను చిత్రించిన వాడైనందున పత్రిక ఆదివారం అనుబంధానికి ఆ పేరు పెట్టారా అని సంతోషించారు. ఐతే మళ్లీ ఐదు నిమిషాల్లో ఆయన అన్నీ మరచిపోయి మళ్లీ అడిగేవారు. మనం ఎవరు, ఏమిటీ, ఏం చేస్తున్నాము అని. ఎందుకు ఆయన్ని కలవడానికి వచ్చామో చెప్పాల్సి వచ్చేది. దాంతో తనతో గడిపిన గంటలో పదిసార్లు మనం ఎవరమో చెప్సాల్సి వచ్చినప్పుడు నిజంగానే ‘మనం ఎవరం?’ అన్న ప్రశ్న ఎవరికైనా ఉదయిస్తుంది.

చరిత్ర, సంస్కృతి గురించి మనల్ని మనం దేవులాడుకుంటున్నప్పు డు, స్వీయ రాజకీయ అస్తిత్వం గురించి పోరాడుతూ ఉన్నప్పుడు కొండపల్లి వంటి వారు ‘మీరెవరు?’ అని అడుగుతూ ఉంటే, ప్రతిసారీ మనం మరింత లోతుగా మనల్ని మనం విడమర్చి చెప్పాల్సి వచ్చేది. మన పరిచయం మనకే కొత్తగా వినిపించేది.

సమైక్య రాష్ట్రంలో ఉన్న కారణంగా ఆయన ‘తెలుగుతల్లి’ చిత్రం వేయవలసి వచ్చింది. చాలా శ్రమించి నోట్సు రాసుకుని అపూర్వంగా తెలుగుతల్లిని ఆవిష్కరించి ఇచ్చారు కూడా. కానీ ఆంధ్ర పాలకులకు ఆయన అందించిన తల్లి నచ్చలేదు. నయమే అయింది. మనం ఎవరమో మనకు తెలియక పోయినా వాళ్లకైనా తెలుసు. ఇప్పటికైనా మనం వేరు… వాళ్లు వేరు అని భావించినందువల్లో ఏమో ఆయన తెలుగుతల్లిని వాళ్లు స్వీకరించలేదు. కానీ ఏమైంది. ఇవ్వాళ్టికి వేరు పడటం ఖాయమే అయింది. అందరం కలిసి ఉంటే మేలే జరుగుతుందని భావించిన అలనాటి తరం ఇలా అనేక విధాలుగా కలిసి మెలిసి బతకలేక భంగపడ్డారు. ఆ భంగపాటు మధ్య వాళ్లు హృదయాలను రాయి చేసుకున్నారు. తమకి దక్కని గౌరవానికి లోలోపల కుమిలిపోయారు. కళను అర్థం చేసుకోలేని వాళ్ల సంస్కారాలకు కృంగిపోయారు. సమైక్య భావన ముసుగులో మనల్ని మభ్యపెట్టిన పాలకుల దుర్నీతికి ఇలాంటి పెద్దలు మౌనమే దాల్చారు. అటువంటి తరానికి చెందిన వారే కొండపల్లి శేషగిరిరావు. వారు మలి తెలంగాణ ఉద్యమం ఉధృతమై, మన కలలు సాకారం అవుతున్న సమయంలో జ్ఞాపకశక్తిని కోల్పోయారు. ఇంతటి ఆశాజనకమైన వాతావరణం ఏర్పడిందని వారికి తెలిసేలోగా మళ్లీ వారు విన్నది మరచిపోయి కొత్తగా అడిగేవారు. అలాంటి స్థితిలోనే ఆయన శాశ్వతంగా నిద్రలోకి జారుకున్నారు. ఎల్లుండి వారి తొలి వర్ధంతి. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ రెండు, మూడు విషయాలు.

వాస్తవానికి మనకు రాజకీయ రంగంలో సరైన నాయకత్వంలేదు గానీ, తెలంగాణలో చిత్రకళా సాంస్కృతిక రంగాల్లో నాయకత్వం వహించే శక్తియుక్తులు చాలామందికే ఉన్నాయి. కానీ, ముందే చెప్పినట్టు సమైక్యాంద్రలో మనం వెనుకడుగు వేసే పరిస్థితులే కొనసాగాయి. అందువల్ల కూడా కొండపల్లి వంటివారి కృషి మలి తెలంగాణ ఉద్యమానంతరమే వెలుగుచూస్తున్నది.

కొండపల్లి తెలుగుతల్లిని చిత్రించారు. అది ఆంధ్రుల సంకుచిత మనస్తత్వాల వల్ల విఫలమైంది. మంచిదే. అయితే, ఆయన మన తెలంగాణ ఆత్మను అపూర్వంగా ఆవిష్కరించిన తాత్వికుడు కూడా. ఆయన పోతనామాత్యుడిని చిత్రించారు. రాణీ రుద్రమదేవిని చిత్రించారు. లచ్చిని చిత్రించారు. శకుంతలను చిత్రించారు. ఒక్కమాటలో రవివర్మ దేవీదేవతలకు రూపం ఇచ్చినట్లే కొండపల్లి మన పురాణేతిహాసాలకు చిత్రరూపం ఇచ్చారు. కావ్య నాయకులకు జీవం పోశారు. దక్కనీ శిలలను చిత్రించారు. కాకతీయ శిల్ప వైభవాన్ని అపూర్వంగా చిత్రభరితం చేశారు. మన చరిత్ర పురుషుల వర్ణ చిత్రాలను, అనేక రూప చిత్రాలనూ అందించి వెళ్లారు. కాకిని చిత్రించారు. కావ్య నాయకులనూ అంతే ఘనంగా చిత్రించారు. రేపటి తెలంగాణకు దక్కే విలువైన ఆస్తిపాస్తులను మనకు రాసి పోయారు.

నిజానికి ఆయన వారాల అబ్బాయి. అటెన్క మెహిది నవాజ్ జంగ్ ప్రోత్సాహంతో శాంతి నికేతన్‌లో చదువుకున్న చిత్రకళా విద్యార్థి. తర్వాత చిత్రకళా ఉపాధ్యాయులు. జెఎన్‌టియూ చిత్రకళా విభాగంలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అయితే, పూర్తికాలం చిత్రకారుడిగా జీవితకాలం కృషి చేశారు. అయితే వాస్తవానికి మనకు రాజకీయ రంగంలో సరైన నాయకత్వంలేదు గానీ, తెలంగాణలో చిత్రకళా సాంస్కృతిక రంగాల్లో నాయకత్వం వహించే శక్తియుక్తులు చాలామందికే ఉన్నాయి. కానీ, ముందే చెప్పినట్టు సమైక్యాంద్రలో మనం వెనుకడుగు వేసే పరిస్థితులే కొనసాగాయి. అందువల్ల కూడా కొండపల్లి వంటివారి కృషి మలి తెలంగాణ ఉద్యమానంతరమే వెలుగుచూస్తున్నది.

ఇంతకూ ఆయన కళాకారుడే కాదు. ఆయన కుంచెకు పని చెప్పినట్టే కలానికీ పని చెప్పారు. పాదాలకూ పని చెప్పి పరిశోధకుడిగా విశేషమైన కృషి చేశారు. కళా విమర్శకులుగానూ విలువైన రచనలు చేశారు. ఒక గురుతర బాధ్యతను తనంతట తాను మోసి ఆయన విలువైన రచనలెన్నో చేశారు. తెలంగాణకు దక్కని గౌరవానికి, పొందని మన్ననకూ ఆయన కలత చెందారు. అలాగని మౌనం దాల్చకుండా, స్థిరచిత్తంతో రాబోవు తరాలైనా తెలుసుకోవాలన్నట్టు ఆయన మనదైన తెలంగాణ రచనా సంవిధానాన్ని, పరిశోధనా ఒరవడిని కళారంగంలో అనాడే నిర్వహించి మార్గదర్శకులయ్యారు. తెలంగాణ సోయితో ఆయన చేసిన రచనలు ‘చిత్రశిల్పకళా రమణీయము’ అన్న గ్రంథంలో చూడవచ్చు. ఇందులో ఆంధ్రుల చిత్రకళ, తెలంగాణ చిత్రకళ పేరిట కూడా వ్యాసాలు రాశారు. శిల్పకళ. కుడ్య కళ, అలంకార కళ గురించి లోతైన వ్యాసాలు రాశారు. స్త్రీల చిత్రలిపి గురించి కూడా ఆయన పరిశోధన గావించారు. ఇవి రచయితగా ఆయన విస్తృత పరిశోధనను, అనుభవాన్ని, దీర్ఘదర్శనాన్ని ఆవిష్కరిస్తాయి. ఆ రచనల నుంచి మనం మన తెలంగాణ పునర్నిర్మాణానికి తగిన ముడి సరుకును తప్పక పొందగలం.

ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. వట్టికోట ఆళ్వారుస్వామి, అడవి బాపిరాజు, పి.టి.రెడ్డి, కాపు రాజయ్య, ఎ.ఎస్.రామన్, ఎన్.సరోత్తమరెడ్డితో పాటు కల్లూరి సుబ్బారావు, మండలి కృష్ణారావు వంటివారి కృషి గురించి కూడా చక్కగా ఆయన రాశారు. ఎంతమాత్రం నిందా దృష్టి లేకుండా నిర్మాణాత్మకంగా, పునర్నిర్మాణావశ్యకత తెలిసి ఆయన రచనలు చేయడం గమనిస్తే ఇవ్వాళ్టి సందర్భంలో మనం ఆశ్చర్యానందాలకు లోనవుతాం.

కాకతీయ ఉత్సవాల సందర్భంగా ఇటీవల ఒక ‘కాఫీ టేబుల్ బుక్’ వచ్చింది. ఇది ఛాయాచిత్రాల సంకలనం. అందులో ‘రుద్రమ’ వర్ణచిత్రం కొండపల్లిదే. అంతేకాదు, మరో నవలా వచ్చిం ది. దాని ముఖచిత్రం కూడా వారిదే. కానీ చిత్రకారుడి ప్రస్తావన లేదు.

ఇక ఆయన కాకతీయ శిల్పాన్ని చూసి ఆ వైభవానికి అబ్బురపడి, మళ్లీ మేలుకుని, ఒకానొక ఏకలవ్య బాంధవ్యాన్ని ఏర్పరుచుకుని చిత్రలేఖనం గావించారు. రాబోవు తరాలకు ఆ నిధిని పదిలం చేసి అందించే యోచనతో ఆయన వందలాది చిత్రాలు గీశారు. ఇవన్నీ కాకతీయుల శిల్ప వైభవాన్ని, అందలి లావణ్యాన్ని నిశిత పరిశీలనతో అధ్యయనం చేసి, పూస గుచ్చినట్లు చిత్రించి ఒక ‘మాల’గా మనకు అందించారు. ఆ చిత్ర సంకలనమే ‘సురేఖ.’ ఈ గ్రంథాన్ని వారి తొలి వర్ధంతి రోజున పుస్తకంగా విడుదల చేస్తున్నారు. వారే అన్నట్టు ఈ రేఖా చిత్రాలను చూస్తే ‘భూతకాలం నుంచి వర్తమానంలోకి అడుగిడునట్లు’ గోచరిస్తుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఈ కళను ఎలా పరిరక్షించుకోవాలీ అన్న తపన ప్రతి ఒక్కరిలో పెల్లుబుకుతుంది. అంతకన్నా ముఖ్యంగా మన కళాదృష్టి కాంతులీనుతుంది. ఒక్కమాటలో ‘సురేఖ’ మన చూపును విస్తరింపజేసి జాగృతం చేసే కరదీపక అన్నా అతిశయోక్తికాదు.

విషాదం ఏమిటంటే, కాకతీయ ఉత్సవాల సందర్భంగా ఇటీవల ఒక ‘కాఫీ టేబుల్ బుక్’ వచ్చింది. ఇది ఛాయాచిత్రాల సంకలనం. అందులో ‘రుద్రమ’ వర్ణచిత్రం కొండపల్లిదే. అంతేకాదు, మరో నవలా వచ్చిం ది. దాని ముఖచిత్రం కూడా వారిదే. కానీ చిత్రకారుడి ప్రస్తావన లేదు. ఇప్పటికి కూడా ఇలా చిత్రకారుడి సౌజన్యం నిర్లక్ష్యం అవుతూనే ఉంది. గతంలోనూ ఆయన చిత్రాలు చాలామంది వినియోగించుకున్నారు. కానీ, ఆయనకు ఇవేమీ పట్టలేదు. ఒక భూమి పుత్రుడిగా, నిత్య విద్యార్థి గా, కళాతపస్విగా ఆయన ఎన్నో చిత్రాలు గీశారు. ఏ రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో పలుమార్లు పేరుపేరునా ఆయా గుళ్లను సందర్శించి, వాటిని అడుగడుగునా పరిశీలించి, రాత్రనకా పగలనకా పరిక్షిశమించి గీసిన చిత్రాలు, వర్ణ చిత్రాలవి. ఇప్పటికైనా కనీసం ఆయన రేఖా చిత్రాలను పుస్తకంగా చూసే భాగ్యం లభించింది. అది చిన్న పుస్తకంగానే వస్తున్నది. కానీ అందులో ఒక ఆత్మ ఉన్నది. అన్నిటికన్నా మిన్న ఒక అపూర్వమైన కళ మరొక అసామాన్యమైన కళాకారుడి వల్ల శాశ్వతత్వం పొందుతున్న తీరూ ఉన్నది. ఇటువంటి మాదిరే ఆయన లేపాక్షి ఇతర దేవాలయాల మీద కూడా పనిచేశారు. అవన్నీ రేపటి మన తెలంగాణకు తరగని ఆస్తులనే అనాలి.

జయధీర్ తిరుమలరావు గారు అన్నట్లు, జానపద కళలు, కులగాథలకూ- కళకీ గల అవినాభావ సంబంధాన్ని మొదటిసారిగా ఆయన గనుక తెలియజెప్పకపోతే వరంగల్ జిల్లా చేర్యాల నకాషీ కళాకారులెవరో ప్రపంచానికి తెలిసేవాళ్లే కాదు.

ఇక చివరగా చెప్పుకోవలసిన ముఖ్య విషయం. ఆయన జానపద పరిశోధకులు కూడా అని! అవును. కాలికి బలపం కట్టుకుని అంటారు కదా…అట్లే ఆయన పలుమార్లు వరంగల్ జిల్లా చేర్యాల మొదలు మరి నాలుగైదు జిల్లాలు తిరిగి ‘కాకిపడగలు’ అనే స్క్రోల్ పెయింటింగ్స్-వాటిని తయారు చేసే నకాషి కళాకారుల గురించి అధ్యయనం చేసి, వారి కళను, జీవనాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఏడెనిమిది కులాలకు చెందిన కుటుంబీకులు కాకి పడగలను దగ్గర పెట్టుకుని వివిధ కుల పురాణాలు చెబుతారని, ఆ కళాకారుల వివరాలను, నకాషీ కళాకారులు ఆ కాకి పడగలను ఎలా తయారు చేస్తారన్నదీ వివరంగా తెలియజేశారు.

జయధీర్ తిరుమలరావు గారు అన్నట్లు, జానపద కళలు, కులగాథలకూ- కళకీ గల అవినాభావ సంబంధాన్ని మొదటిసారిగా ఆయన గనుక తెలియజెప్పకపోతే వరంగల్ జిల్లా చేర్యాల నకాషీ కళాకారులెవరో ప్రపంచానికి తెలిసేవాళ్లే కాదు. నకాషీ వాళ్ల కళను ఆయన పరిశీలించి, పరిశోధించి అప్పటి లలిత కళా అకాడమీకి తెలియజెప్పి వారి కళా ఉనికిని ఆయన బలంగా ప్రపంచానికి వెల్లడించారు. స్వయంగా ఒక ఫొటోక్షిగ్రాఫరును వెంట బెట్టుకుని వారి కళను ఛాయాచివూతాల్లోనూ బంధింపజేశారు.

ఈ పరిశోధనలో ఉన్నప్పుడు ఆయన రెండు కీలకమైన అంశాలను తెలియజెప్పారు. ఒకటి, రాజుల పోషణలో కాకుండా ప్రజల పోషణలో ఈ కళ ఉన్నదని విస్పష్టంగా తెలిపారు. దాంతో ఇలా ప్రజలే కాపాడుకుంటున్న కళల గురించి మనం చేయవలసిందేమిటీ అన్న సందేశాన్ని హెచ్చరికగా మన ముందు పెట్టారు. తన వంతుగా తాను చేయగలిగింది చేశాననీ చెప్పుకున్నారు. మరొకటి, ఈ కళలను కుల మత విషయకమైన ఆచారంగానే భావిస్తున్నాం అని, అది పొరబాటని ఆయన గట్టిగానే చెప్పారు. తానైతే దీనిని జానపద కళగా భావిస్తున్నానని చెప్పి, ఆ రంగంలో మనం చేయవలసిన పనిని స్వయంగా చేసి చూపారు.

ఇదే సందర్భంలో ఆయన మరొక విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో ఇలా అడవి గాచిన వెన్నెల వలే పల్లె ప్రాంతంలో వివిధ కులస్థులు జానపద కళను పోషిస్తూనే ఉన్నారన్నారు. ఇలా ఆయన చాలా స్పష్టంగా తెలంగాణలో జానపదుల గురించి మనం చేయవలసిన పని గురించి ముందే హెచ్చరించి, ఆ పనిలో తాను ఒక అడుగు వేసి వెళ్లారని మనం గుర్తించుకోవాలి. ఇక్కడ గ్రహించాల్సింది, ఆయా రంగాలకు పరిమితమై ఉండకుండా తమ దృష్టికి వచ్చిన ఇతర అంశాలనూ కళాజగత్తులోనివే అని నొక్కి చెప్పడం, చెప్పి ఊరుకోకుండా మనసా వాచా కర్మణా ఆ పనిని చేసి చూపడం…ఆ పనిని విశ్వవిద్యాలయాల బాధ్యత అని చెబితే పనులు జరగవని, తానే చేసి చూపడం…ఆ పనిలో రచనల అవసరాన్ని గ్రహించి వాటి గురించి సవివరంగా రాయడం-ఇలా కొండపల్లి ఎంతో సృజనాత్మకంగా తెలంగాణ పరిశోధకుడిగా పనిచేసిన తొలి తరం వారుగా చెప్పుకోవలసిందే.

ఆయన తన కళను కాసులకు అమ్ముకునే పనిలో పడలేదు. ‘ఆర్ట్ కలెక్టర్’గా కాకుండా భూమి పుత్రుడిగా బాధ్యతాయుతంగా జానపద కళను ఉన్నత స్థానంలో చూడాలని శ్రమించారు.

ముగించే ముందు ఒక్క విషయం. నకాషి చిత్రకారులు తయారు చేసిచ్చిన కాకి పడగలు జీర్ణమై పాడయిపోతే, తమ ఇంట్లోని మనిషి పోయినట్లే ఆయా కులస్థులు భావిస్తారు. మనిషికి అంత్యక్రియలు చేసినట్లే ఆ పటాన్ని నదికి తీసుకుపోయి గంగకు అర్పించి పూజా పునస్కారాలతో నివాళి అర్పిస్తారు. ఆ సంగతి కొండపల్లి చెప్పేదాక విజ్ఞులైన మేధో ప్రపంచానికి తెలియదు. ఈ ఉదంతం కళకు, కళాకారులకూ మధ్య బాంధవ్యం ఎంతటి ఉత్కృష్టమైన స్థితిలో ఉంటుందో తెలియచెబుతుంది. ఇవన్నీ స్వయంగా చూసిన వారు అయినందున, కళాకారుల జీవితాల్లో ఎంతటి పవిత్రమైన కళా వ్యాకరణం దాగుంటుందో తెలిసిన మహానుభావులు కూడా అయినందునే ఆయన తన కళను కాసులకు అమ్ముకునే పనిలో పడలేదు. ‘ఆర్ట్ కలెక్టర్’గా కాకుండా భూమి పుత్రుడిగా బాధ్యతాయుతంగా జానపద కళను ఉన్నత స్థానంలో చూడాలని శ్రమించారు. ఇక తన చిత్రాలనూ ఆయన అంతే పదిలంగా చూసుకున్నారు. జన సామాన్యం గానీ, రసజ్ఞులైన కళాభిమానులు కానీ వాటిని తనవి తీరా చూడనే లేదే అని వాపోలేదు. దేనికైనా సమయం వస్తుందన్నట్టు, యోగిలా, తపస్విలా తన చిత్రకళా జీవితాన్ని అపూర్వంగా కొనసాగించి నిష్క్రమించారు.

అన్నట్టు, చివరి రోజుల్లో ఆయన మరుపు ఉండేది. కానీ తన చిత్రాల గురించి మాత్రం అన్నీ గుర్తుండేవి

***

ఇక రానున్నది మన రాజ్యమే అయినందువల్ల, అనివార్యమైన జీవన ప్రస్థానాన్ని ముగించిన ఆయన స్మృతికి నీరాజనాలు తెలుపుతూనే తెలంగాణ కళా నిర్మాణంలో ఇటువంటి కళాకారుల కృషిని సముచిత రీతిలో అధ్యయనం చేద్దాం. వాటి ఫలితల నుంచి పునర్నిర్మాణానికీ కావలసిన ప్రణాళికలు రచించుకుందాం.

ఈ వ్యాసం నమస్తే తెలంగాణ దినపత్త్రికలో వారి తొలి వర్థంతి సందర్భంగా రాసింది. ప్రచురణ తేది : 25.07.2012. కాగా, వారి స్మారకంగా ఏర్పాటు చేసిన ఆ ప్రథమ వర్ధంతి జూలై 26న సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్‌లో జరుగింది. ఈ కార్యక్షికమంలో పద్మశ్రీ జగదీష్ మిట్టల్, బీ నర్సింగ్‌రావు, ప్రొఫెసర్ అంజనీ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ .వేణుగోపాల్ సభా నిర్వాహకులుగా వ్యవహరించారు. 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article