ప్రభుత్వాలు సరే, పాలమూరు బాల్యానికి భరోసా ఇచ్చే ఆలోచనలు, ప్రణాళికలను డిమాండ్లుగా పెట్టడంలో సమాజంగా అందరి వైఫల్యం ఉంది. అందుకే పాలమూరు బడి పిల్లలకోసం ప్రత్యేక పాఠశాలల ఆలోచన ఇప్పటికీ ముందుకు రానేలేదు.
-కందుకూరి రమేష్ బాబు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎనభయ్యవ దశకంలో ముప్పై లక్షల జనాభా ఉంటే అందులో సగం అంటే పదిహేను లక్షల మంది వలస పోయే వారని చెబుతారు. అట్లా చాలా దశాబ్దాలు నిరాటంకంగా సగానికి సగం జనాభా ‘దేశాలు’ వలస పోయి బతికి బట్ట కట్టిన చరిత్ర తెలంగాణలోని పాలమూరు ప్రజానీకపు అత్యంత విషాద అధ్యాయ్యాల్లో ఒకటి. ఒక దశాబ్ద కాలంగా ఆ దుస్థితి మారుతున్నది. ఇప్పుడు ఇరవై శాతం వలసలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇక చూడాల్సిన విషయాల్లో వాళ్ళ పిల్లల విద్య ఒక ముఖ్య విషయం.
పాలమూరు లేబర్ తాలూకు రెండు రకాల వలసలలో గుంపు మేస్త్రీల కింద లక్షలాది దళిత బహుజనులు ప్రధానంగా మహారాష్ట్రం, కర్నాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెళ్ళగా మరో వంక స్వతంత్రంగా తండాల లోని లంబాడాలు పూనే, ముంబై వలస వెళుతూ ఉన్నారు. పాలమూరు లేబర్ ఇలా ఇలా వలస వెళ్ళే క్రమంలో పిల్లలను తల్లిదండ్రుల వద్ద ఉంచి వెళ్ళేవారు. ఆ పెద్దలు తమ మనువలు మనుమరాండ్లను స్థానికంగా బడిలో వేసి చదివించే ప్రయత్నం చేయడం ఒక మానవీయ కోణం. కానీ దురదృష్టవశాత్తూ వాళ్లకు బడి అందుబాటులో లేని స్థితే కొన్ని దశాబ్దాలు కొనసాగింది. దాంతో పాలమూరు లేబర్ రెండో తరం కూడా వలస వెళ్ళింది. అట్లా మొదటి తరం లేబరు పిల్లలు చదువుకోవడం కష్టం గాకా రెండో తరం మాత్రమే ఎక్కువగా బడికి వెళ్ళింది. ఇట్లా పాఠశాలలు అందుబాటులో లేని స్థితిలో తాతలు బడికి పంపలేని నిస్సహాయ స్థితి ఒక తరంలో ఉంటే ఆ తర్వాతి తరం బడికి పంపే క్రమంలో మెల్లగా ఊపందుకున్న ప్రైవేట్ పాఠశాలలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి,
ఆ లెక్కన చూస్తే, పాలమూరు వలస నేపథ్యంలో ప్రభుత్వ బడి అన్నది ఉపాధి మాదిరిగానే లభ్యం కాని ఒక కలగా ఉండిందని ఇప్పటికైనా మనం గ్రహించాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో రెండో తరం యువత కూడా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రాకపోవడంతో విద్యకు దూరమై మళ్ళీ వలస కూలీలుగా దేశాలు పోవడం అనివార్యమైంది.
విషాదం ఏమిటంటే, బడి ఆవశ్యకతను నిర్వచించి వలస కూలీల కోసం ప్రత్యేక పాఠశాలలు ఆవశ్యకతను ఎవరూ ఒక డిమాండ్ గా ముందుకు తేకపోవడంతో రెండు తరాలు కాదు, మూడవ తరంలో కూడా పాలమూరు పిల్లల భవితవ్యం కోసం విద్యను వలస కోణంలో పునర్నిర్వచించి, అందుబాటులోకి తేవాల్సిన ప్రయత్నం ఇప్పటికీ జరగాల్సి ఉన్నది. ఆ దిశలో ప్రభుత్వం, పౌర సమాజం జమిలిగా యోచన చేయవలసిందే.
వాస్తవానికి పాలమూరు బాల్యానికి భరోసా ఇచ్చే ఆలోచనలు, ప్రణాళికలను డిమాండ్లుగా పెట్టడంలో ప్రజా చైతన్యం ఒక సమాజంగా ఉదాసీనంగానే వ్యవహరించిందని చెప్పాలి లేదా సంప్రదాయ ధోరణిలో కొట్టుకు పోయిందనే అనాలి.
నిజానికి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి రంగారెడ్డి, మేడ్చెల్ తదితర జిల్లాలో చేసిన ప్రయత్నం వంటిది ఈ పిల్లలు కార్మికులు కాకపోవడంతో మొదలు కాలేదు. ఆ పిల్లలు దేశాలు పట్టుకు పోయిన వలస కార్మికుల బిడ్డలుగా రికామిగా తిరుగుతూ అటు చదువుకు ఇటు పనికి దూరమై, ఆ తర్వాత తిరిగి తమ దండ్రుల మాదిరి రెక్కల కష్టాన్ని నమ్ముకుని రెండో తరం కార్మికులే అయ్యారని గమనించాలి. రెండవ తరంలో కూడా ఈ ‘వలస వలయం’ చేదించడంలో విద్య ఒక మహత్తర కార్యం నేరవేర్చగలిగి ఉండీ ఆ పని జరగకపోవడానికి వీరి పిల్లలను రేపటి పౌరులుగా మార్చాలన్న సంకల్పం మూడో తరంలోనూ ఎవరికీ లేకపోవడం విషాదంగా కాక వైఫల్యం గానే చూడాలి. ఏమైనా, తెలంగాణలో పాలమూరు ప్రజలు వలసలు పోయే చరిత్ర ఇప్పటికీ నిరాటంకంగా సాగుతూ వస్తోంది. పిల్లలకు బడి ఒక అండంగా ముందుకు రానేలేదు.
వామపక్ష కార్యాచరణలో బడి ఇరుసుగా లేదు!
విషాదం ఏమిటంటే, తెలంగాణాలో వివిధ విప్లవ పార్టీలు, ముఖ్యంగా పాలమూరులో బలంగా పనిచేసిన మావోయిస్ట్ పార్టీ ఎదో ఒక దశలో పిల్లలు బడి బాట పట్టాలన్న నినాదం ఇచ్చి ఉంటే తెలంగాణా పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ వారు హాస్టల్స్ కి వెళ్ళి భోజనం చేసి వెళ్ళారు గానీ ఈ పిల్లల భవితవ్యం కోసం నిర్దిష్ట నినాదం ఒకటి ఇవ్వలేకపోయారు. పర్యవసానంగా పాలమూరులో సైతం వామపక్ష ఉద్యమాలు ముందుకు తెచ్చిన డిమాండ్లలో బడి ప్రాథమికం కానే లేదు. వలస కార్మికుల సంక్షేమం కూడా ముఖ్యమైన అంశం కాలేదు. ఈ వలసలకు మూలం నీటి ఎద్దడి, వర్షాభావం, కరువు వంటి విషయాలను నొక్కి చెప్పడం కారణంగా ‘జలం’ ఒక్కటే కాక ‘విద్య’ కూడా దీర్ఘకాలికంగా యువతకు ఉపాధికి కారణం అవుతుందన్న స్పృహ అటు లెఫ్ట్ వింగ్, ఇటు రైట్ వింగ్ -ఇద్దరి దృష్టిలో లేకపోయింది. ఫలితంగా పాలమూరు లేబర్ ఇప్పటికీ తమ బ్రతుకులు తాము బ్రతికడంతోనే సరిపోయింది. వారికి ఏ అండా లేకుండా పోయింది.
ఏమీ ఉపాధి లేని స్థితిలో వలస ఒక పరిష్కారం
వామపక్ష నక్సలిజం పాలమూరు ‘లేబర్ సమస్య’ను ఒక పరిష్కారంగా ముందుకు వచ్చిన విధానంగా కాకుండా అదొక సమస్యగానే భావించింది. దాన్ని ‘పీడకులు- పీడితులు’ అన్న ధోరణిలోనే చూడటం వల్ల వలస కూలీలను దేశాలు తీసుకువెళ్ళే గ్రూపు మేస్త్రీలు, గుంపు మేస్త్రీలు పీడకులుగానే కనిపించారు. ఈ కూలీలలను ‘పీడితులు’గా చూశారు. దాంతో జరిగిన నష్టం ఏమిటంటే, కూలీల నుంచే ఉమ్మడి పాలమూరులో గుంపు మేస్త్రీలు, గ్రూపు మేస్త్రీలు ఎదిగారని, ఆ పరిణామ క్రమంలో ఇరువురి అంశం మిత్రు వైరుధ్యమే గానీ శత్రు వైరుధ్యం కాదన్న అవగాహన ఏర్పడలేదు. తద్వారా లక్షలాది ప్రజలు వలస పోవడంలో, వారి జీవన శైలిలోని ప్రత్యేక సమస్యలను, వాటి పరిష్కారాలను కనుగొనడంలో సౌహర్ద్ర కార్యాచారణ, మెరుగైన విధానం ఏర్పడలేదు. వలస వెళ్ళే లేబర్, అందలి వేర్వేరు శ్రేణులు, అందలి మనుషుల అవసరాలు, స్త్రీలు, పిల్లల పట్ల ప్రత్యేక దృక్పథంతో చేయవలసిన కార్యాచరణ – ఇవేవీ లోతుగా చర్చకు తేలేకపోయారు. వలస కార్మికుల మిస్సింగ్, లేబర్ పై దోపిడీ – దౌర్జన్యాలతో పాటు కార్మిక చట్టాల అమలు, ఇత్యాది విషయాలను గట్టిగా మాట్లాడటం కారణంగా ఇదంతా ఒక సాధారణ వర్గ పోరాటంలోని అంశంగా మారిందే తప్పా పాలమూరు లేబర్ వలస అన్నది ఒక ప్రత్యేక అంశంగా జీవిత పరిష్కారంగా ముందుకు రాలేదనే చెప్పాలి.
నిజానికి ఉమ్మడి పాలమూరులో పెల్లుభికిన పోరాటాల వల్ల గంజి కేంద్రాలు ఏర్పాటు మొదలు దీర్ఘకాలికంగా నీటి వనరుల ఏర్పాటుకోసం ఎత్తిపోతల పథకాలు అమలయ్యాయి గానీ పాలమూరు లేబర్ చేసిన బ్రతుకు పోరాటం దానంతట అదే ఒక విప్లవం అనే విషయం మరుగున పడిందన్నది వాస్తవం. తద్వారా వారికి తక్షణం, దీర్ఘకాలికంగా అండగా ఉండి సాధించవలసినవేవీ పోల్చుకోలేకపోయాం. అట్లా వారి బ్రతుకు, పోరాటం, పని పరిస్థితులు, సంక్షేమం, విద్య మనకు సంబంధం లేని విడి అంశాలుగా మారిపోయాయి.
ఇప్పటికీ పాలమూరు ప్రత్యేక పాఠశాలల డిమాండ్ లేదు!
బ్రతికి బట్ట కట్టడం అన్న మౌలిక అంశం కోసం లేబర్ చేసిన మహత్తర జీవన పోరాటాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం కావడంతో వలస వెళ్ళే క్రమంలో వారి బతుకు నేర్పు, అందలి సానుకూల అంశాలను గమనించలేకపోయాం. వారి పిల్లలను చదివించడం గానీ, వృద్దుల సంక్షేమం గురించి చేయవలసిన పనులు గానీ సమాజంగా మనం చేయలేకపోయాం. వీటి గురించి ఒక గురుతర బాధ్యతగా ప్రభుత్వాలను డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడలేదు. దాంతో ఇప్పటికీ పాలమూరు ప్రత్యేక పాఠశాలలు ఊసు లేదు. ఒక డిమాండ్ గా విద్య కోసం ప్రయత్నాలు ముందుకు రాలేదు. ఇప్పటికైనా ఆ దిశలో సోయి పెరగాలని, ప్రయత్నాలు జరగాలన్నది ఈ వ్యాసకర్త డిమాండ్.
ప్రతిభ ఆధారంగా కాదు, వలస ఆధారంగా కల్పించాలి !
పాలమూరులో క్రమానుగతంగా మెల్లగా ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి చూస్తుండగానే నిర్వీర్యం కావడం, తర్వాత ప్రైవేట్ పాఠశాలలు తామర తుంపరగా ఎదగడం, అందులో డబ్బులు పోసి చదివించలేని పాలమూరు తల్లిదండ్రుల బాధ – ఇవన్నీ గమనిస్తే పాలమూరు లేబర్ పిల్లలో మొదటి తరమే కాదు, రెండో తరం కూడా పెద్దగా బడికి పోలేదన్నది వాస్తవం.
ఏమైనా పాలమూరు లేబర్ వారి పిల్లలు బాల్యంలో బడికి వెళ్ళని స్థితి కొన్ని దశాబ్దాలు కొనసాగిందనే చెప్పాలి. దాదాపు డెబ్బయ్యవ దశకం నుంచి ఈ వలసలు అత్యధికంగా ఉండగా కేవలం ఒక పుష్కరకాలంలో కనీసమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 2009నుంచి వలస కార్మికులకు పిల్లలకు ముఖ్యంగా బాలికలకు ఎంతో మేలు చేశాయని చెప్పాలి.
స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక నెలకొల్పిన గురుకుల పాఠశాలలు గానీ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నవోదయ పాఠశాలలు, ఇతరత్రా మోడల్ స్కూల్స్ గానీ పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి మంచి చదువు చెబుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఏర్పాటైన ఇవేవీ లక్షలాది పాలమూరు లేబర్ పిల్లలను చేర్చుకోవడంలో ప్రత్యేక మినహాయింపు లేని కారణంగా ఈ లేబరు బిడ్డలకు అవి అందని ద్రాక్షగా మారాయి. ఇవన్నీ ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించడం కారణంగా – ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఈ లేబర్ పిల్లల చేర్పు పది శాతం కూడా లేదని చెప్పాలి. గత రెండు దశాబ్దాలలో బాగా చదువుకున్న కొద్ది మంది మాత్రమే ఈ పాఠశాలల్లో ప్రతిభ ఆదరంగా ప్రవేశాలు పొందుతున్నారు గానీ ప్రత్యేక మినహాంపు లేకపోవడంతో మంచి విద్యకు వేలాది బిడ్డలు ఇప్పటికీ దూరంగానే ఉంటున్నారు. ఇన్ని పాఠశాలలు ఉండగా, కేవలం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మాత్రమే పాలమూరు లేబర్ కు కొద్దిలో కొద్ది ఉపయోగంగా ఉండటం విశేషం. ఆ పాఠశాలు పిల్లల ప్రవేశానికి పెట్టిన నిబంధనలో వలస ఒకటి. క్షేత్ర పర్యటనలో ఇదే నన్ను ఆకర్షించి ఈ వ్యాసం రాయడానికి ప్రేరేపించింది.
‘కస్తూర్బా గాంధీ’ మాదిరి ప్రత్యేక పాఠశాలలు
అవును. ఈ పాఠశాల్లో ప్రవేశానికి ఉన్న నాలుగు నిబంధనలో మౌలికంగా బాలికలకు విద్య అందించడం ముఖ్య కారణం కాగా, పిల్లలను చేర్చుకోవడంలో తొలి నిబంధన – తల్లిదండ్రులు ఇద్దరూ లేని పిల్లలను చేర్చుకోవడం. రెండవది తల్లిగానీ తండ్రి గానీ లేని పిల్లలను చేర్చుకోవడం, మూడవది వలస కార్మికుల పిల్లలకు అవకాశం కల్పించడం, ఆ తర్వాత దారిద్ర్య రేఖకు దిగివున ఉన్న పిల్లలకు అవకాశం కల్పించడం. ఇట్లా – ఒక పాఠశాలలో రెండు వందల యాభై మందికి పైగా స్త్రెంథ్ ఉంటే కనీసం ఇరవై మంది దాకా వలస కార్మికుల పిల్లలు ఈ బడులలో చేరడం విశేషం. అ లెక్కన ఉమ్మడి జిల్లాలోని దాదాపు 14 పాఠశాలల్లో దాదాపు మూడొందల మంది దాకా ఇలా చదువుకుంటున్నారు. ఇంటర్ దాకా అప్ గ్రేడ్ ఐన పాఠశాలలు కూడా నాలుగు దాకా ఉన్నాయి. ఈ పిల్లలు టెంథ్ లో ఇంటర్ కోసం ప్రవేశ పరీక్ష రాసి అక్కడ చేరుతున్నారు. కాగా, ఇవి కేవలం బాలికల పాఠశాలలే అని గుర్తించాలి. ఆ లెక్కన బాలురు ఈ సదవకాశాన్ని మిస్ అవుతున్నారనే చెప్పాలి.
ఈ పాఠశాలల్లో తల్లిదండ్రులు లేని పిల్లల కోటాలో చేరుతున్న వారు కూడా కొందరు వలస కార్మికుల పిల్లలు ఉంటారు. భయంకరమైన పని పరిస్థితుల నడుమ పాలమూరు లేబర్ పని చేయడం వల్ల వాళ్ళలో ఒకరు చనిపోవడం కూడా ఉంది. అటువంటి పిల్లలు కూడా ఈ పాఠశాలల్లో ప్రవేశం పొందుతున్నారు.
ఏమైనా, ఈ వ్యాసం ఉద్దేశ్యం ఒకటే, ఇప్పటికైనా పాలమూరు వలస జీవితాల్లో పెను మార్పులు రావాలంటే అది కేవలం నీళ్ళ గురించి, ఆ నీటి కాలువలు గ్రామగ్రామానా చేరడం ఒక్కటే పరిష్కారం కాదు, భూ పంపిణీ దళితులకు జరగడం మాత్రేమే చాలదు. పిల్లకు కేంద్రంగా విద్యా వ్యూహం రచించడం కూడా ఒక గొప్ప యజమాన్యంగా జరగాలి. అదే పునర్నిర్మాణంగా భావించాలి.
పైన పేర్కొన్న మాదిరిగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఒక మేరకు వలస కార్మికుల పిల్లలకు ప్రవేశం కల్పిస్తున్నట్టు మరే పాఠశాలలు చేయడం లేదు. కానీ ప్రభుత్వం ప్రారంభించిన గురుకుల పాఠశాలలు కేవలం తరగతికి ఇద్దరి చొప్పున తల్లిదండ్రులు లేని వారికీ, వలస కార్మికులకు ప్రవేశం ఇస్తున్నాయి. అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రవేశం కల్పించేందుకు నిబంధనలు సవరించాలి.
అలాగే, పూర్తిగా వలస కూలీలను చేర్చుకునేందుకే ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటుకై గట్టి ప్రయత్నాలు జరగడం మరింత అత్యవసరం. గ్రామ గ్రామానా వలస కూలీల పిల్లలను ఏరి, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా వారిని ఒక్క చోటకు చేర్చి ప్రత్యేక విద్యాలయాల్లో చేర్చి మంచి విద్య అందివ్వాలి. వచ్చే ఏడునుంచి ఇలాంటి ఇంటెన్సివ్ దృక్పథంతో పని చేయగలిగితే ఈ ఐదు జిల్లాల్లో రేపటి పౌరుల గురించి చక్కటి పాదు పడుతుంది, అలా జరిగితే తప్పా వలస జిల్లాలో బహుముఖ విధాలుగా ప్రజా జీవితంలో పెను మార్పు తేలేము.
ముగింపు
ఒకప్పటి వలసలు ఇరవై శాతానికి తగ్గిన నేటి సమయంలో ఈ దృక్పథం అవశ్యం. ఇప్పటికైనా బాలబాలికలపై దృషి పెట్టి పాలమూరు లేబర్ కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పడం మన కర్తవ్యం కావాలి. దశాబ్ద కాలం అలస్యమైనప్పటికీ పాలమూరు కేంద్రంగా తెలంగాణా పునర్ నిర్మాణానికి ఇదొక చక్కటి పరిష్కారంగా భావించాలి.
వ్యాసకర్త స్వతంత్ర జర్నలిస్ట్. ఫోన్ నంబర్ -99480 77893