Editorial

Tuesday, December 3, 2024
సామాన్యశాస్త్రం‘ఎద్దు గానుగ’తో విప్లవం : బసవరాజు – అతడి బలగానికి అభివాదాలు

‘ఎద్దు గానుగ’తో విప్లవం : బసవరాజు – అతడి బలగానికి అభివాదాలు

వాళ్ళ నాయినమ్మ పెట్టిన పేరు మూడు దశాభ్దాలు గడిచాక అతడిని సార్థక నామధేయుడిగా మలవడం నిజంగానే విశేషం. అవును. ఎద్దు గానుగల పునరుజ్జీవనంలో నిజంగానే తన పేరును సార్థకం చేసుకుంటున్న‘బసవరాజు’ ధన్యజీవి. అతడి గురించి, తన బలగం గురించి పెద్దగా చెప్పుకోవలసిన తరుణం వచ్చింది.

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh Babu

స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణాలో జగవలసిన పునరుజ్జీవనం పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరిట చాలా మటుకు ‘అభివృద్ధి’ దిశలోనే సాగుతుండగా ‘స్వావలంభన’ కోసం, ‘గ్రామ స్వరాజ్యం’ కోసం కొద్ది మంది సాధారణ వ్యక్తులు ‘వన్ మ్యాన్ ఆర్మీ’గా పని చేస్తుండటం, వారు అద్భుత విజయాలు సాధిస్తుండటం ఆశ్చర్యకరం. ఐతే, సేంద్రీయ వ్యవసాయం గురించి చాలా మంది ఆలోచిస్తున్నప్పటికీ ఆరోగ్యానికి హాని చేస్తున్నఆహార పదార్థాల్లో అత్యంత ముఖ్యమైన ‘మంచి నూనె’ గురించి, దానికి దోహదపడే ఎద్దు గానుగల అభివృద్ధి గురించిన ఆలోచనలు అతి తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. నిజానికి మానవుడి శారీరక స్థితిగతులను అత్యంత ప్రభావితం చేసే నూనెల పట్ల జరగవలసినంత కృషి జరగడం లేదనే చెప్పాలి. ఆ దిశలో బసవరాజు బలగం చేస్తున్న కృషి విశేషమైనది. అది పౌర సమాజం దృష్టిలో పడవలసి ఉంది. వారికి వెన్నుదన్నుగా ఉండవలసిన ఆవశ్యకతా ఎంతైనా ఉంది. నిజానికి ప్రభుత్వాలు కూడా వారి నుంచి స్ఫూర్తి పొందవలసి ఉన్నది.

వాస్తవికంగా నేడున్న యాంత్రిక సమాజానికి అసలు అవసరమైంది ఆ ఎద్దు గానుగ జీవితమే అని నొక్కి చెబుతున్నందుకు బసవరాజుకు అభినందనలు చెప్పక తప్పదు.

ముఖ్యంగా ఆధునిక సమాజంలో ‘గానుగెద్దు జీవితం’ అన్న మాట చాలా యాంత్రికంగా వాడుకలో ఉన్నది. ‘గానుగెద్దు’ అన్నది ఒకే గాడిలో, చిన్న పరిధిలో నిరాటంకంగా చేసే పనే. కానీ, అది మొత్తం నేడు నిష్పయోజకత్వానికి, అపజయానికి, భయానికి, అనవసరమైన వ్యవహారానికి లేదా యాంత్రికత్వానికి పర్యాయ పదంగా మారిన తరుణంలో దాన్నిసరికొత్త ఆదర్శంగా చూసేలా చేస్తూ, అది పనికిరాని విషయం కాదు, వాస్తవికంగా నేడున్న యాంత్రిక సమాజానికి అసలు అవసరమైంది ఆ ఎద్దు గానుగ జీవితమే అని నొక్కి చెబుతున్నందుకు బసవరాజుకు అభినందనలు చెప్పక తప్పదు. కరోనా అనంతరం అదృష్టవశాత్తూ సకల జనులూ ఆరోగ్యం కోసం వంటింటి వైపు దృష్టి మరల్చినప్పటికీ ఒక సమాజంగా ముందరి రోజుల్లో అందరం తప్పనిసరిగా గానుగ నూనె వాడకాన్ని స్వీకరించవలసి వస్తుందని, ఆ దిశలో ముందు చూపుతో బసవరాజు బృందం తమ పనిని వేగవంతం చేయడం విశేషం.

కేవలం నాలుగేళ్ళలో వంద ఎద్దు గానుగలు పనిచేయడం, నెలకు ఒక యూనిట్ ఐదువేల లీటర్ల మంచి నూనెను ఉత్పత్తి చేయడంతో అటు ఎద్దులకు పని, ఇటు గ్రామాన్ని వదిలిపెట్టి ఉపాధికి వలస పోకుండా రైతుకు ఉపయోగం, అదే విధంగా ఈ పనిలో నిమగ్నమయ్యే మహిళలకు అదనపు జీవనోపాధి.

బహుశా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మూడు పదులకు పైబడిన యువకుడి చొరవతో మొదలైన ఎద్దు గానుగల పునరుజ్జీవనం కేవలం నాలుగేళ్ల లోనే వంద యూనిట్లు ఏర్పాటవడం దాకా సాగిందంటే అది నిస్సందేహంగా విప్లవమే. తాను స్వయంగా తొమ్మిది ఎద్దు గానుగ యూనిట్లను పాలమూరులోని గండీడ్ మండలం జక్లపల్లిలో నిర్వహిస్తుండగా, అతడి ఆధ్వ్యర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాల ఫలితంగా మరో తొంభై ఎద్దు గానుగలు పని చేస్తున్నాయంటే ఇది అనతికాలంలో సాధించిన అద్భత ప్రగతి కిందే చెప్పాలి.

కేవలం నాలుగేళ్ళలో వంద ఎద్దు గానుగలు పనిచేయడం, నెలకు ఒక యూనిట్ ఐదువేల లీటర్ల మంచి నూనెను ఉత్పత్తి చేయడంతో అటు ఎద్దులకు పని (Bull employment), ఇటు గ్రామాన్ని వదిలిపెట్టి ఉపాధికి వలస పోకుండా రైతుకు (self-employment for farmers ) ఉపయోగం, అదే విధంగా ఈ పనిలో నిమగ్నమయ్యే మహిళలకు (Women employment) అదనపు జీవనోపాధి. వీటన్నిటికన్నా ముందు చెప్పవలసినది, ఆరోగ్యానికి హాని కలిగించే ‘రిఫైండ్ ఆయిల్’ స్థానంలో గానుగ పట్టిన ‘మంచినూనె’ వాడకంతో సిసలైన ఆరోగ్యం (Helath) పొందడం తొలి ప్రాధాన్య ఫలితం అని చెప్పాలి. అంతేకాదు, విధ్యుత్ ఉత్పత్తితో సంబంధం లేని ఈ ఎద్దు గానుగల పరిశ్రమ కారణంగా పర్యావరణానికి (Environment friendly) కూడా ఎంతో మేలు. ఇట్లా బహుముఖాలుగా ప్రయోజనకారిగా ఉన్న ఈ ‘ఎద్దు గానుగ విప్లవం’ ఎట్లా మొదలైందో చిన్నగా చెప్పుకుందాం.

ఒకరకంగా ఇది వారిద్దరూ స్థాపించిన దేశీయ స్టార్టప్. ఇద్దరు నేతృత్వంలో మొదలై ప్రస్తుతం పద్నాలుగు మంది భాగస్వాములతో ఇరవై మంది మహిళా పనివారితో, మొత్తం ముప్పయ్ ఎద్దులతో నెలకు ఐదువేల లీటర్ల మంచి నూనె ఉత్పత్తి చేస్తూ విజయవంతంగా నడుస్తూన్న కేంద్రం ఇది

తానూ తన మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి కలిసి ‘ఆరోగ్య దాయిని’ పేరిట ఏర్పాటు చేసిన గానుగ అభివృద్ధి మరియు శిక్షణ సంస్థ ఈ విప్లవానికి మూలం. ఒకరకంగా ఇది వారిద్దరూ స్థాపించిన దేశీయ స్టార్టప్. ఇద్దరు నేతృత్వంలో మొదలై ప్రస్తుతం పద్నాలుగు మంది భాగస్వాములతో ఇరవై మంది మహిళా పనివారితో, మొత్తం ముప్పయ్ ఎద్దులతో నెలకు ఐదువేల లీటర్ల మంచి నూనె ఉత్పత్తి చేస్తూ విజయవంతంగా నడుస్తూన్న కేంద్రం ఇది. ఒకవైపు ఇక్కడ పదమూడు రకాల గానుగ నూనెల ఉత్తత్తి చేస్తూ మరోవైపు గానుగ పరిశ్రమ అభివృద్ధికి గాను శిక్షణా శిబరాలు కూడా ఏర్పాటు చేస్తూ వీరు ఈ పరిశ్రమను పూర్వ వైభవం తెస్తుండటం విశేషం. ఇటీవలే జక్లపల్లిలోని ‘ఆరోగ్య దాయని’ కేంద్రంలో పదో యూనిట్ కూడా ఇన్స్టాల్ చేశారు. ఐతే, ఇంకా పని ప్రారంభించవలసి ఉన్నది. అన్నట్టు, తాము పని చేసే క్రమంలో సింగపూర్ కు చెందిన cow and farmers group వారు వీరి కృషిలో జతకట్టడం తమ ఆశయ సాధన మరింత ఊపందుకున్నదని చెప్పాలి.

ఇక్కడ ఒక ఎద్దు రోజుకు రెండు గంటలు మాత్రమే పని చేస్తుంది. అట్లా రోజుకు మూడు ఎద్దులు రెండు గంటల చొప్పున పని చేస్తూ నెలనెలా ఐదు వేల లీటర్ల మంచి నూనెను వీరు ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని బసవరాజు వివరించారు.

‘ఆరోగ్య దాయని’ గురించి మరింత వివరంగా మాట్లాడుకుంటే, ఇక్కడ ఒక ఎద్దు రోజుకు రెండు గంటలు మాత్రమే పని చేస్తుంది. అట్లా రోజుకు మూడు ఎద్దులు రెండు గంటల చొప్పున పని చేస్తూ నెలనెలా ఐదు వేల లీటర్ల మంచి నూనెను వీరు ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని బసవరాజు వివరించారు. మొత్తం, ముందు చెప్పినట్టు, వంటకోసం ఉపయోగించే పది నూనెలకు వీరు గానుగ పడుతున్నట్టు చెప్పారు. అవి- పల్లి, నువ్వులు, కచ్చెర, కుసుమ, ఆవాలు, అవిశ గింజలు, నువ్వు పప్పు, బాదాం, గడ్డి నువ్వులు. వీటితో పాటు వ్యవసాయానికి ఉపయోగించే కానుగ, వేప నూనెల రెండు. అలాగే దీపానికి వాడే ఇప్ప నూనె కూడా వీరి వద్ద లభ్యమవుతుంది.

ఎద్దు గానుగ పరిశ్రమలో నిమగ్నమైన వీరంతా కలిసి ఒక సహకార సంస్థగా ఏర్పాటు చేసుకుని ఇటీవలే ఒక షాప్ ప్రారంభించారు.

ఈ నూనెలను అందమైన డబ్బాల్లో లీటరు, రెండు లీటర్లు, ఐదు లీటర్ల చొప్పున వీరు విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి ఆన్ లైన్ లో ఆర్డర్ చేయలేం గానీ హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఎద్దు గానుగ పరిశ్రమలో నిమగ్నమైన వీరంతా కలిసి ఒక సహకార సంస్థగా ఏర్పాటు చేసుకుని ఇటీవలే ఒక షాప్ ప్రారంభించారు. అక్కడ మీరు ఈ పదమూడు రకాల నూనెలను కొనుగోలు చేసుకోవచ్చు. కాంటాక్ట్ నంబర్ – 9030 666959.

ఎద్దు గానుగ పరిశ్రమలో జీవితం మధ్య మనిషికి జీవికీ మధ్య చక్కటి అనుభంధం ఉన్నదని, ప్రకృతితో మమేకమైన ఆ జీవన శైలిలో ఆరోగ్యం సైతం ఇమిడి ఉందని అయన నొక్కి చెప్పారు.

ఐతే, మొదట అన్నట్టు, గానుగెద్దు జీవితం అనగానే నేటి తరానికి పనికి రానిది గాను, వేగవంతమైన జీవన విధానానికి అడ్డు వచ్చే విధానం గానూ అనిపించడం సహజమే. ఐతే, నిజానికి తీరుబాటు వ్యవహారంలోనే మన వికాసం ఇమిడి ఉన్నదని బసవరాజు ఎన్నో ఉదాహరణలతో చెప్పారు. ఎద్దు గానుగ పరిశ్రమలో జీవితం మధ్య మనిషికి జీవికీ మధ్య చక్కటి అనుభంధం ఉన్నదని, ప్రకృతితో మమేకమైన ఆ జీవన శైలిలో ఆరోగ్యం సైతం ఇమిడి ఉందని అయన నొక్కి చెప్పారు. అ సంగతి వివరిస్తూ, మనకు బాగా అలవాటైన నేటి రిఫైన్డ్ నూనెల్లో పోషక విలువలు పూర్తిగా తరగి పోతాయని, ఆ నూనెకు సహజమైన రుచీ వాసనా కూడా ఉండవని ఆయన గుర్తు చేశారు.

ఈ సంగతి ఒక ఉదాహరణతో వారు వివరిస్తూ ఒక గ్రైండర్ లో వేసిన పదార్థం నిమిషానికి పదిహేను వందల సార్లు గిరగిరా తిరిగి ఎలా పేలిపోతుందో మనకు తెలుసు. కానీ, రోటి పచ్చడి వేరు. రోట్లో నూరుకోవడంతో పదార్ధం నలుగుతుంది. గ్రైండర్ లోలా పేలిపోదు. ఇక్కడ మనం చిన్నగా పదార్థాన్ని దంచుతాం. ఇలా తయారైన పచ్చడిలో రుచి ఎక్కువని మనకు తలుసు. సరిగ్గా రిఫైన్డ్ ఆయిల్ కీ ఎద్దు గానుగతో నిదానంగా తయారయ్యే నూనెకు తేడా ఇదే అని బసవరాజు వివరించారు. పదార్థం వేగంగా వేడితో పేలడం కన్నా నిదానంగా నలగడం మంచిది. అదే cold press oil అని పేర్కొనే గానుగ నూనెల తయారీ మూల ఉద్దేశ్యం, ‘ఎద్దు గానుగ’ ప్రయోజనం అని వివరించారు. అందువల్లే ఎద్దు గానుగతో రూపొందించే నూనెలు సంపూర్ణ పోషక విలువలతో కూడి రుచికరంగా ఉండటాయని తెలిపారు.

ఒక చెంచా రిఫైన్డ్ ఆయిల్ కి రెండు చెంచాల గానుగ నూనె సరిసమానం అని చెబుతారు. ఆ లెక్కన దాదాపు ఒకే ధరకు ఒక లీటర్ రిఫైన్డ్ ఆయిల్ కొనే బదులు రెండు లీటర్ల గానుగ నూనె పొందవచ్చు

నిజానికి రిఫైన్డ్ ఆయిల్స్ తయారీలో వాడే ఇతరత్రా కెమికల్స్ ఆరోగ్యానికి కలిగించే హాని, వ్యక్తిపై పర్యావరణంపై వాటి తక్షణ, దీర్ఘకాలిక దుష్పరిణామాలన్నీ బసవరాజు చిన్న పిల్లలకు మల్లే మనకు వివరిస్తారు. అంతేకాదు, ఒక చెంచా రిఫైన్డ్ ఆయిల్ కి రెండు చెంచాల గానుగ నూనె సరిసమానం అని చెబుతారు. ఆ లెక్కన దాదాపు ఒకే ధరకు ఒక లీటర్ రిఫైన్డ్ ఆయిల్ కొనే బదులు రెండు లీటర్ల గానుగ నూనె పొందవచ్చు, మా అంటే మరో అరవై నుంచి ఎనభై రూపాయలు ఎక్కువ అవుతుందని వివరిస్తారు. సాధారణంగా గానుగ నూనె ధర ఎక్కువ అనుకుంటాం గానీ ఆ మొత్తం ఎక్కువేమీ కాదని గుర్తు చేస్తూ ఈ వస్తవ విషయాలు తెలియని కారణంగా అసలైన మంచి నూనెకు మనం దూరమవడాన్ని బసవ రాజు గుర్తు చేస్తున్నారు.

ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు పట్ల పెరిగిన ఆదరణ మాదిరిగానే గానుగ నూనెల కొనుగోల్ల గురించి కూడా ప్రజల అభిరుచిలో మార్పుతేవాలి.

ప్రస్తుతం మన రెండు రాష్ట్రాల్లో వందల యూనిట్ల స్థానంలో ఉన్న ఈ ఎద్దు గానుగల పరిశ్రమ వేలు, పదివేలు, లక్షల స్థాయికి వెళ్ళాలంటే అది ఖచ్చితంగా ప్రజలకు ఈ నూనెలను ఎందుకు వినియోగించాలో తెలియాల్సిన అవసరం ఉంది. నిజానికి ఎద్దు గానుగ నూనెలు అంత ఖరీదు కావని కూడా తెలియాలి. అంతేకాదు, ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు పట్ల పెరిగిన ఆదరణ మాదిరిగానే గానుగ నూనెల కొనుగోల్ల గురించి కూడా ప్రజల అభిరుచిలో మార్పుతేవాలి. ఉదాహరణకు మిల్లు వస్తల కన్నా ప్రజల్లో చేనేత వస్త్రాలకు ఎలాగైతే మెల్లగా ఆదరణ పెరిగిందో అలా గానుగ పరిశ్రమకు వైభవం తేవడంలో మన అందరి స్వచ్ఛంద కార్యాచరణ వేగవంతం కావాలి.

కాగా, ఎవరైనా గానుగెద్దు పరిశ్రమలోకి రావాలని భావించే వారికోసం ఒక ముఖ్య్హ విషయం ఇక్కడ చెప్పాలి. ఒక యూనిట్ ఏర్పాటుకు షెడ్ నిర్మాణంతో సహా మూడు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని బసవరాజు చెబుతున్నారు. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో సొంత భూమిగల రైతులు కూలీ పనికోసం ఇతరుల సహాయం తీసుకోకుండా తమ వ్యవసాయ పనులు చేసుకుంటూనే ఒక గానుగెద్దు యూనిట్ ని ఏర్పాటు చేసుకోవచ్చని, అలా ఒక కుటుంబం హాయిగా నెలకు నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు దాకా సంపాదించుకోవచ్చని ఆయన అంటున్నారు. ఒకవేళ వేరే మనిషిని పెట్టుకుని చేపించుకుంటే నెలకు ఇరవై ఇదు వేల సంపాదన ఖాయం అని కూడా వారు వివరిస్తున్నారు.

ఆసక్తి ఉన్న రైతులు, ఇతరులు ఈ నెలలోనే అంటే ఏప్రిల్ ఆరు, ఏడు తేదీల్లో నిర్వహించనున్న శిక్షణా శిబిరానికి రిజిస్టర్ చేసుకొని హాజరు కావొచ్చు. వసతి ఉచితం. కేవలం భోజన రుసుము చెల్లిస్తే చాలని వారు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకు బసవరాజు కాంటాక్ట్ నంబర్ ఇది — 93466 94156. సంప్రదించగలరు.

బసవరాజు – శ్రినివస రెడ్డి ‘బలగం’

గ్రామ స్వరాజ్యం అన్నది ఒక ఆదర్శం అనుకోకుండా అది ఆచరణ సాధ్యమే అని భావిస్తూ ముందుకు కదల వలసి ఉన్నది.

చివరగా ఒక మాట. బసవరాజు మిత్ర బృందం లేదా ఈ దేశీయ బలగం ఆరంభించిన విప్లవాన్ని ఇతర గ్రామీణ ప్రాంతాలకు తెలియజేసి గానుగ పరిశ్రమను మరింత విస్తృతం చేయడంలో వ్యక్తులు, సంస్థలు చొరవ చూపవలసి ఉంది. శాస్త్రీయంగా గానుగ నూనెలు చేసే మేలు గురించి మరింత సమాచారం అర్థం చేసుకుని పదుగురికి అందించవలసి ఉన్నది. గ్రామ స్వరాజ్యం అన్నది ఒక ఆదర్శం అనుకోకుండా అది ఆచరణ సాధ్యమే అని భావిస్తూ ముందుకు కదల వలసి ఉన్నది. ఈ సదుద్దేశ్యంతో గత ఆదివారం ‘సంఘమిత్ర సంస్థ’ తరపున వందేమాతరం ఫౌండేషన్ మిత్రులు ఎడ్మ మాధవ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు ఇరవై మంది సామాజిక మార్పులో భాగస్వామ్యమైన మిత్రులం స్వయంగా క్షేత్ర పర్యటనకు వెళ్లి జక్లపల్లిలోని ఈ గానుగ పరిశ్రమను సన్నిహితంగా చూసి వచ్చాం. మేము సైతం ఎద్దుగానుగల పునరుజ్జీవనంలో భాగస్వాములం అవుతామని ప్రతిన బూనాం. ఆ క్రమంలో రూపొందిన నివేదికే ఇది.

ఒక మంచి అనుభవాన్ని వర్తమానంలో సాకారమవుతున్న గొప్ప ఆశయాన్ని మా దృష్టిలో పెట్టిన ‘ఆరోగ్య దాయని’ సంస్థకు, ముఖ్యంగా సార్థక నామధేయుడైన ‘బసవరాజు’కు, వారి బలగానికి కృతజ్ఞతాభివంధనాలు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article