మీ చేతుల్లో ఉన్న పుస్తకం ఒక పెన్నిధి. ఇది మీదాకా వచ్చిందంటే మీరెంతో భాగ్యం చేసుకున్నట్టు. ఇందులో ఉన్న విషయం వల్లనే కాదు, అసలు ఈ పుస్తకం రాసిన మనిషే మన సమాజానికి దొరికిన పెన్నిధి.
వాడ్రేవు చినవీరభద్రుడు
సుంకు బాలచంద్ర ని కలుసుకున్నప్పుడు, ఆయన ఇంతదాకా నడిచిన దారి గురించి విన్నప్పుడు నమ్మశక్యం కానంత ఆశ్చర్యం కలుగుతుంది. కాని, ఆశ్చర్యం లేదు. భగవంతుడు ఈ నిష్ఠుర ప్రపంచం మీద తన నిర్హేతుకమైన అనుగ్రహాన్ని వర్షించాలనుకున్నప్పుడు, తన సంకల్పాల్ని నెరవేర్చగల మనుషులకోసం వెతుక్కున్నప్పుడు ఇలాంటి కార్యశూరుల్నే, నిస్వార్థపరుల్నే ఎంచుకుంటాడు. ఒకప్పుడు వివేకానందుణ్ణి ఎంచుకున్నట్టు, నిన్న డా. కలాం ని ఎంచుకున్నట్టు.
ఇప్పుడు బాలచంద్ర చేస్తున్న పనుల్నీ, చెయ్యాలనుకుంటున్న పనుల్నీ చూసినప్పుడు ఆయన నా కళ్ళకి మరో వివేకానందుడిలా, మరో కలాం లా కనిపిస్తున్నారు.
ఆయన జీవితం చూడండి. సైన్సు విధార్థి. న్యాయశాస్త్ర పట్టభద్రుడు. కంపెనీ సెక్రటరీగా చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టి, తోటిమనుషులకోసం పూర్తిస్థాయి సామాజిక కార్యకర్తగా పనిచేయాలన్న కోరికతో తాను దాచుకున్న పొదుపు డబ్బుతో 2006 లో అభయ ఫౌండేషన్ ప్రారంభించారు. ఇంకా రెండు దశాబ్దాలు పూర్తి కాలేదు, అప్పుడే అభయ 15 రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నది. విద్య, వైద్యం, అత్యవసరసేవలతో పాటు యువత నైపుణ్యాభివృద్ధి మీద, ఉపాధి కల్పన మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఇప్పటిదాకా వేలాది మంది యువత జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. మూడు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక లలో ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలు నడుస్తున్నాయి. ఇలా అన్ని రకాల కార్యక్రమాల ద్వారా ఇప్ప్పటి దాకా 5 లక్షలమందికి పైగా అభయ ఫౌండేషన్ నుండి ఏదో ఒక రూపేణా సహాయసహకారాలు పొందారంటే అది చిన్న విషయం కాదు.
ఈ సేవాకార్యక్రమాల్ని నడిపిస్తూ ఉండటంతో బాటు, బాలచంద్ర తన చుట్టూ ఉన్న సమాజాన్ని మేల్కొల్పటం కోసం మరో రెండు గొప్ప కార్యక్రమాలు చేపట్టారు.
ఒకటి, 2019 లో ఆయన చేపట్టిన భారతదర్శన్ యాత్ర. ఒకప్పుడు ఆదిశంకరాచార్య ఏ మార్గంలో భారతదేశ సంచారం చేసి ధర్మప్రతిష్టాపన చేసారో, ఆ మార్గాన్నే ఎంచుకుని, నేడు బాలచంద్ర కూడా భారతసంచారం చేయడం నాకు ఒక మహిమాన్విత ప్రయత్నంగా అనిపిస్తున్నది. 4 దేశాలు, 23 రాష్ట్రాలు, 106 దివ్యదేశాలతో పాటు ఎన్నో ఊళ్ళు, నగరాలు, కొండలు, అడవులు, నదులు, సముద్రతీరాల్ని దర్శిస్తూ ఆయన చేసిన యాత్ర ఆయనకి అడుగడుగునా భగవత్కృపతో పాటు యథార్థ భారతదేశ దర్శనాన్ని కూడా అందించింది. తాను ఏ అంతర్వాణి పిలుపు విని సేవారంగంలోకి ప్రవేశించారో, ఆ రంగంలో మరింత క్రియాసిద్ధి పొందడానికి ఆయనకి ఈ యాత్ర ఉపకరిస్తున్నది అనడంలో సందేహం లేదు. ఆయన యాత్రా చరిత్ర చదువుతూ ఉన్నాను. అడుగడుగునా ఆయన ఆ యాత్ర తన దేహాన్నీ, మనసునీ, ఆత్మనీ కూడా పునీతం చేస్తోందనే చెప్తున్నారు.
తన దేశంకోసం, తన మనుషుల కోసం తాను వీలైనంతగా తన శక్తియుక్తుల్ని సమర్పించాలనే ఈ సంకల్పం ఆయనలో ఎలా ఉదయించిందో గాని, అది ఆయన జీవితాన్ని బలోపేతం చెయ్యడమేకాక, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలని కూడా బలోపేతం చేస్తున్నది.
ఆయన చేపట్టిన రెండో బాధ్యత, రచయిత కావడం. తన స్ఫూర్తిని నలుగురితో పంచుకోవడం. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ విజయదీపిక మొత్తం భారతదేశాన్ని కళ్ళారా చూసిన ఒక దేశభక్తుడు తన జాతి యువతీయువకుల్ని మేల్కొల్పడానికి రాసిన పుస్తకం. ఒకప్పుడు స్వామి వివేకానందులు భారతదేశాన్ని మేల్కొల్పానుకున్నప్పుడు యువతమీదనే దృష్టి పెట్టారు. ఆయన యువతరాన్ని ఉద్దేశిస్తూ చెప్పిన ప్రతి వాక్యం భారతీయ ఆకాశంలో ఉరుములాగా మార్మ్రోగుతూనే ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ వాక్యాలు:
నాకు నా దేశంలో, ముఖ్యంగా నా దేశ యువతలో అపారమైన విశ్వాసం ఉంది. మీమీదే నా ఆశలు పెట్టుకున్నాను. మన పూర్వీకులు ప్రవచించిన సనాతన సత్యాల్ని బోదిస్తూనో, ప్రవచిస్తూనో, యువవీరులు, తమ రక్తంలో ఉరకలెత్తే ఉత్సాహంతో, అంతులేని సహానుభూతితో, దేశం ఒక మూలనుండి మరొక మూలకు పయనిస్తూనే ఉంటారు.
అటువంటి యువవీరులు ఎలా ఉండాలో కూడా ఆయన చెప్తున్నాడు:
నాకు కావలసింది, ఇనప కండరాలు, ఉక్కు నరాలు, లోపల కూడా అట్లాంటి లోహంతోనే తయారైన వజ్రమానసం, దాన్నుంచి ఉల్కలు, ఉరుములూ, పిడుగులూ రూపొందాలి.
యువకులు అలా రూపొందాలంటే ఏమి చెయ్యాలి?
ఇదిగో, సందిగ్ధ సమయంలో మీ విశ్వాసాన్ని నిలబెట్టగల మంత్రం ఇదే: మిమ్మల్ని భౌతికంగా, బౌద్ధికంగా, ఆత్మికంగా ఏది బలహీనపరుస్తుందో, దాన్ని విషప్రాయంగా తృణీకరించండి, ఎందుకంటే అందులో జీవం లేదు, కాబట్టి అది సత్యం కాదు. సత్యమంటే నిర్మలత్వం. సత్యానికి తెలియంది ఏదీ ఉండదు. సత్యమంటే మనం బలపడటం, మనను జాగృతపరచడం, మనలో జవసత్త్వాలు ప్రోదిచెయ్యడం.
వివేకానందుడి తర్వాత మనదేశ యువతని అంతే సత్యనిష్టతో మేల్కొల్పినవాడు, బలపరిచినవాడు, దారి చూపినవాడు మహాత్మాగాంధి. ఆయన నడిపిన పత్రిక పేరు యంగ్ ఇండియా! నవ జీవన్ అనే మాట ఆయనకి ఎంతో ఇష్టమైన మాట. ఆయన నిజంగానే ఒక జాతిని నిర్మించాడు.
తిరిగి మన కాలంలో, ఇప్పటి పరిస్థితుల్లో, ఈ గ్లోబలైజేషన్ నేపథ్యంలో యువత పాత్రను పునర్నిర్వచించినవాడు కలాం. ఆయన కూడా వివేకానందుడిలాగా, గాంధీలాగా తన దేశ ప్రజల్ని, ముఖ్యంగా యువతరాన్ని ఉత్తేజితుల్ని చెయ్యడం కోసం ఎన్నో రచనలు చేసారు. మహాత్మా గాంధీ తన జీవితం గురించి చెప్పుకున్నట్టే కలాం జీవితం కూడా దానికదే ఒక మహత్తర సందేశం అనవచ్చు. ఒక వ్యక్తి తాను పుట్టి పెరిగిన పరిస్థితుల్ని దాటి తన జీవితాన్ని సార్థకంగా ఎలా మలుచుకోవచ్చో కలాం జీవితమే ఒక నిరూపణ.
కాని ఈ నాటి యువత గురించి తలుచుకుంటే ఇనపకండరాలూ, ఉక్కు నరాలూ, వజ్రసమానమైన మనస్సూ కనిపించడం లేదు. ఏ చిన్న విద్వేషాగ్నికైనా రగిలిపోగల ఎండుగడ్డిలాగా ఉన్నారు వాళ్ళు. ఒక దేశంలో యువత సరైన దారిన నడవకపోతే, ఆ దేశానికి భవిష్యత్తు లేదనే చెప్పాలి.
మహాత్మా గాంధీ ఇలా రాస్తున్నారు:
ఈ దేశ యువతమీదనే నా ఆశలు పెట్టుకున్నాను. వారిలో కొంతమంది వ్యసనాలకు బానిసలవుతున్నారు, కాని వారు స్వతఃసిద్ధంగా చెడ్డవారు కారు. నిస్సహాయంగానూ, అనాలోచితంగానూ వారు ఆ దారిలోకి లాగబడ్డారు. అది సమాజానికి ఎంత చెరుపు చేసిందో వారు గుర్తించాలి. అత్యంత కఠోరమైన క్రమశిక్షణతో కూడిన జీవితం ఒక్కటే వారినీ, దేశాన్నీ కూడా వినాశనం నుండి తప్పిస్తుందని వారు గుర్తించాలి.
ఇప్పుడు మన దేశం జనాభా పరంగా ఒక డెమోగ్రఫిక్ డివిడెండును అనుభవిస్తున్నదని మనకు తెలుసు. దేశ జనాభాలో నేడు యువత దాదాపు 67 శాతందాకా ఉన్నారు. ఈ అవకాశం 2005-06 లో మొదలయ్యింది కాని ఇది మరొక ముప్ఫై ఏళ్ళకి మించి ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికే దాదాపు రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. మరొక రెండు దశాబ్దాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోగా మనం మన యువశక్తిని దేశనిర్మాణానికి మేల్కొల్పకపోతే, దేశనిర్మాణంలో వారిని భాగస్వాముల్ని చేయకపోతే అంతకు మించిన దేశద్రోహం మరొకటి ఉండదు.
యువతని మేల్కొల్పడానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో వారికి స్ఫూర్తినివ్వడం కూడా ఒకటి. ఒకచోట డా. కలాం ఇలా అంటున్నారు:
ఒకటి నిశ్చయంగా చెప్పవచ్చు. మానవుడు సాధించిన అతి పెద్ద విజయం తన జీవితాన్ని తనకై తాను తీర్చిదిద్దుకోవడమే. తోటిమనుషులు తమ జీవితాల్ను తామెలా తీర్చిదిద్దుకున్నారో తెలుసుకోవడంలో ఎంతో ప్రయోజనం ఉంది. ఎందుకంటే మనం మన జీవితాల్లో వారు చేసినంత గొప్ప పనులు చేయగల్గినా చేయలేకపోయినా, వారి అనుభవాలను మన జీవితాలకు కూడా అన్వయించుకుని చూసుకోవచ్చు.
బాలచంద్ర ఒక సన్న్యాసి, ఒక తపస్వి, ఒక నిష్కామ కర్మయోగి. ఈయన ద్వారా భరతమాత మరింత సేవ పొందగలదని ఆశిస్తున్నాను.
ఈ మాటలు బాలచంద్ర జీవితానికి కూడా వర్తిస్తాయి. తన దేశంకోసం, తన మనుషుల కోసం తాను వీలైనంతగా తన శక్తియుక్తుల్ని సమర్పించాలనే ఈ సంకల్పం ఆయనలో ఎలా ఉదయించిందో గాని, అది ఆయన జీవితాన్ని బలోపేతం చెయ్యడమేకాక, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలని కూడా బలోపేతం చేస్తున్నది.
ఈ పుస్తకం చదవండి. చుట్టూ ద్వేషం, హేట్ స్పీచ్, దూషణ మంచులాగా కమ్మిన ఈ కాలంలో తొలి సూర్యకిరణంలాగా ఈ పుస్తకం నా కళ్ళకు కనిపించింది.
అటువంటి వ్యక్తి రాసినది కావడం వల్ల ఈ పుస్తకంలో ప్రతి ఒక్క పుటలోనూ నాకు అపారమైన ఆవేదన, స్ఫూర్తి, యువతరాన్ని బలోపేతం చెయ్యాలన్న దృఢ నిశ్చయం కనిపిస్తున్నాయి. విజయం గురించీ, జీవితంలో రాణించడానికి పాటించవలసిన మెలకువల గురించీ తెలుగులో పుస్తకాలేమీ తక్కువలేవు. వ్యక్తిత్వ వికాసాన్ని ఒక వృత్తిగా కొనసాగిస్తున్న రచయితలు కూడా తెలుగులో తక్కువ కాదు. కాని తన వ్యక్తిగత జీవితంలోనూ, బహిరంగ జీవితంలోనూ కూడా ఒక్కలానే జీవిస్తూ, తన యావచ్ఛక్తినీ జాతికి సమర్పణ చేస్తూ యువతరాన్ని మేల్కొల్పుతున్న రచయిత సుంకు బాలచంద్ర ఒక్కరే అని మాత్రం చెప్పక తప్పదు.
ఈ పుస్తకం చదవండి. చుట్టూ ద్వేషం, హేట్ స్పీచ్, దూషణ మంచులాగా కమ్మిన ఈ కాలంలో తొలి సూర్యకిరణంలాగా ఈ పుస్తకం నా కళ్ళకు కనిపించింది. ఇందులో బాలచంద్ర తన జీవితం నుంచే ఎన్నో ఉదాహరణలు ఇస్తూ యువతీయువకులకు దారి చూపిస్తున్నారు.
వివేకానంద, మహాత్మా గాంధి, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, రవీంద్రనాథ టాగోర్, డా.రాధాకృష్ణన్, స్టీఫెన్ విలియం హాకింగ్, థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి సుప్రసిద్ధ జీవితాలనుంచి ఉదాహరణలతో పాటు దీపా కర్మాకర్, డా.ఆశుతోష్ చక్రవర్తి, సివిల్ సర్వీసెస్ విజేత జునిద్ అహ్మద్, హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, స్వీట్స్ పుల్లారెడ్డి, సునీతా కృష్ణన్ వంటి వారి జీవితాలనుంచి కూడా ఆయన ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు ఇచ్చారు.
ఒక మనిషి స్ఫూర్తి పొందడానికి సుప్రసిద్ధుల జీవితాలే కాదు, పట్టిన పట్టు విడవకుండా విజయాన్ని కైవసం చేసుకోగల ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకులే అన్నట్టుగా PS రావు, రామప్రసాద్ డా.సాయిలత, మృదుల, నరసింహ వంటి వారి జీవితాలనుంచి కూడా ఉదాహరణలు ఇచ్చారు. ఆయన ప్రతి అధ్యాయం వెనక పొందుపరిచిన విజయగాథల్లో నన్ను అమితంగా ఆకట్టుకున్నవి మణిపూర్ కు చెందిన మేరీ కామ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కలిఖో పుల్ జీవిత జయ గాథలు. అంత మారుమూల ప్రాంతాలనుంచి వాళ్ళు నమోదు చేసుకున్న జీవితానుభవాలు నాకు విస్మయం కలిగించడమే కాదు, కొత్త స్ఫూర్తినీ, ఉత్సాహాన్నీ కూడా కలిగించాయి.
63 అధ్యాయాలు. 63 సూత్రాలు. విజయానికి అడ్డదారుల్లేవు. 63 మెట్లూ ఎక్కవలసిందే. కాని విజయసోపానంలో ప్రతి మెట్టూ నిన్ను మరింత ఉన్నతస్థానానికి చేరుస్తుంది, వేసిన ప్రతి అడుగూ నిన్ను మరింత బలోపేతుణ్ణి చేస్తుంది.
బాలచంద్ర ఒక సన్న్యాసి, ఒక తపస్వి, ఒక నిష్కామ కర్మయోగి. ఈయన ద్వారా భరతమాత మరింత సేవ పొందగలదని ఆశిస్తున్నాను. తన చుట్టూ ఉన్న సమాజానికి స్ఫూర్తిప్రదాతకావడంలో ఈయన మరొక వివేకానందుడు, మరొక మహాత్ముడు, మరొక కలాం కాగలరని నమ్ముతున్నాను. ఆయన స్ఫూర్తి ప్రసరిస్తున్న ఈ గ్రంథం చదువుతున్న మనం కూడా ఎంతో కొంత దూరం ఆ బాటలో పయనించే శక్తి పొందాలని సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.
compass గ్రంధ రచయిత బాల చంద్ర సుంకు. వారు స్థాపించిన అభయ ఫౌండేషన్ నేడు పదహారవ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ – నార్సింగి లోని ఓం కన్వెన్షన్ లో ‘భారత్ csr సమ్మిట్’ పేరిట కృతజ్ఞతా పూర్వక సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తున్నారు. పుస్తకం విడుదల కూడా ఈ రోజే, ఈ సమావేశంలోనే. గౌరవ అతిథిలుగా బ్రహ్మానందం గారితో పాటు వాడ్రేవు చినవీరభద్రుడు గారు కూడా హాజరయ్యే సమావేశ వివరాలు ఇన్విటేషన్ లో చూడగలరు.
వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి. వారి రచనల కుటీరం ఇక్కడ చూడండి.