‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, బోథ్ లో ప్రదీప్ టూరింగ్ టాకీసు – నా చిన్ననాటి సినీ అనుభవాలు – ఈ పదో వారంలో..
శ్రీధర్ రావు దేశ్ పాండే
1970 దశకం నాటికి ఆదిలాబాద్ పశ్చిమ జిల్లాలో సినిమా థియేటర్లు నాకు గుర్తున్నంత వరకు ఆదిలాబాద్, నిర్మల్, బైంసా పట్టణాలలో మాత్రమే ఉండేవి. తూర్పు జిల్లాలో బహుశా మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి పట్టణాలలో ఉన్నాయేమో తెలువదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెద్ద జిల్లా కావడంతో తూర్పు జిల్లా వాళ్ళతో పెద్దగా సంబంధాలు ఉండేవి కావు. మా సంబంధాలు అన్నీ కూడా గట్టు కింద ఉన్న నిర్మల్, జిల్లా కేంద్రం ఆదిలాబాద్ తోనే ఉండేది. మా ఊరి అమ్మాయిలు అక్కడికి, అక్కడి అమ్మాయిలు మా ఊరికి, లేదంటే మాకు పక్కనే మహారాష్ట్రాలో భాగమైన కిన్వట్, నాందేడ్ వరకు పోయేవి. నిర్మల్ మా అమ్మ చెల్లెలు కౌసల్య మావుషి (అమ్మ అక్క చెల్లెళ్లను మరాఠీలో మావుషి అంటారు), ఆదిలాబాద్ లో మా మేన మామలు ఉండేవారు కాబట్టి సెలవుల్లో ఈ రెండు ఊర్లకు పోయేది. సినిమాలు చూసేదీ అక్కడే. అయితే వానా కాలం, చలికాలం అయిపోగానే సంక్రాంతి తర్వాత మహారాష్ట్రా యవత్మాల్ జిల్లా ఘటాంజి నుంచి ఒక టూరింగ్ టాకీసు వచ్చేది. దాని పేరు ప్రదీప్ టాకీసు.
రేకులతో కట్టిన గోదాము ఎదురుగా ఉన్న కత్తూరి చిన్నమల్లయ్య గారికి చెందిన ఒక ఖాళీ జాగాను లీజుకు తీసుకొని తెల్లని బట్టతో ఈ డేరా టాకీసు వెలిసేది. రెండే క్లాసులు ఉండేవి. ముందు నేల క్లాసు, వెనుక కుర్చీల క్లాసు ఉండేది.
ఆ టాకీసు యజమాని పేరు ఇప్పుడు యాదికి లేదు కానీ ఫిబ్రవరి నుంచి నుంచి మళ్ళీ వానలు వచ్చేదాకా మే నెలాఖరు వరకు ఈ టూరింగ్ టాకీసు నడిచేది. రేకులతో కట్టిన గోదాము ఎదురుగా ఉన్న కత్తూరి చిన్నమల్లయ్య గారికి చెందిన ఒక ఖాళీ జాగాను లీజుకు తీసుకొని తెల్లని బట్టతో ఈ డేరా టాకీసు వెలిసేది. రెండే క్లాసులు ఉండేవి. ముందు నేల క్లాసు, వెనుక కుర్చీల క్లాసు ఉండేది. ఒక 100 మీటర్ల పొడవున డేరా వేసేవారు. ఆడవారికి, మగ వారికి వేరుగా ఉండేది. ముప్పావు వంతు మగ వాళ్ళకు, పావు వంతు ఆడవాల్లకు కేటాయించేది. మధ్యలో తెర. మగ వాళ్ళ వైపు ప్రొజెక్టర్ ఉండేది. ఆడవారు ప్రొజెక్టర్ కు అటు వైపు కూర్చుంటారు కాబట్టి వారికి అంతా ఉల్టాగా కనబడుతుంది. కుడి చేత్తో చేసే కత్తి ఫైటింగ్ వారికి ఎడమ చేతి ఫైటింగ్ గా కనబడేది. ఏదైనా ఉల్టా గానే కనబడేది. రోజుకు రెండు ఆటలు వేసేది. వెలుతురు తగ్గిన తర్వాత 7 గంటలకు సినిమా మొదలయ్యేది. సినిమా మొదలవడానికి ముందు “నమో వెంకటేశా నమో తిరుమలేశా” ఘంటసాల రికార్డు ప్లే చేసేది. సినిమా మొదవుతున్నదని చెప్పడానికి అది ఒక సూచన.
నాయినమ్మతో సినిమా
మరీ చిన్నప్పుడు. అంటే నాలుగు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు మా నాయనమ్మ చిన్నాయితో పాటు బండిలో ప్రదీప్ టూరింగ్ టాకీసులో సినిమా చూసిన జ్ఞాపకం ఉన్నది. అది ఏ సినిమానో గుర్తుకు లేదు. ఆమె వెళ్ళేది పౌరాణిక సినిమాలకే .. పాండవ వనవాసం, శ్రీ కృష్ణ తులాభారం, భూకైలాస్, సతీ అనసూయ, సతీ సావిత్రి .. ఇట్లాంటి వన్నమాట. పాతాళ భైరవి, బాల నాగమ్మ లాంటి కొన్ని జానపద సినిమాలు కూడా చూసేది.
ఆ ఎండలో బరిగాళ్లతో తిరిగి ఇంటికి వచ్చేసరికి కుడి కాలు పాదానికి పుండు పడింది. అది మానక పెరిగి పెరిగి క్రమంగా గాంగ్రీన్ గా మారడంతో ఆదిలాబాద్ దవాఖానాలో మోకాలు పై వరకు కాలు తీసేశారు.
ఆమెతో బండి ఎక్కి సినిమాకు పోయే హక్కు నా ఒక్కడికే ఉండేది. ఆమె మధుమేహ వ్యాధి ఉండేది. ఒకసారి ఉత్తర భారత యాత్రకు పోయినప్పుడు కాశీలో ఒక గుడి ముందు విడిచిన ఆమె చెప్పులు పోయాయి. పోతే పోనీ అనుకొని యాత్ర మొత్తం చెప్పులు లేకుండానే తిరిగింది. ఉత్తర భారత యాత్రకు సాధారణంగా ఎండాకాలమే వెళతారు. ఆ ఎండలో బరిగాళ్లతో తిరిగి ఇంటికి వచ్చేసరికి కుడి కాలు పాదానికి పుండు పడింది. అది మానక పెరిగి పెరిగి క్రమంగా గాంగ్రీన్ గా మారడంతో ఆదిలాబాద్ దవాఖానాలో మోకాలు పై వరకు కాలు తీసేశారు. అప్పటి నుంచి ఆమే చనిపోయేదాకా ఒక్క కాలుతోనే జీవితాన్ని గడిపింది. అందుకే ఆమె సినిమాకు బండిలో పోయేది.
టాకీసు దగ్గర ఆమెను ఎత్తుకొని పోయి టాకీసులో ఆడవాళ్ళ సెక్షన్ లో కూచో పెట్టేవారు. ఆమెతో పాటు నేనూ. మా బాబ ఊరికి సర్పంచ కాబట్టి ఆమెకు నాకూ ఫ్రీ ఎంట్రీ ఉండేది. నడుచుకుంటూ టాకీసుకు వచ్చే మా అక్కలు మాత్రం టికెట్ తీసుకొని ఆడవాళ్ళ సెక్షన్ లో చిన్నాయి పక్కన కూచునే వారు. కొంచెం పెద్దయ్యాక చిన్నాయితో ఆడవాళ్ళ సెక్షన్ లో కూచుని ఉల్టా పుల్టా కత్తి ఫైటింగ్ చూసేది మానుకున్నాను. ఇటు ప్రొజెక్టర్ వైపుకు కూసోని దోస్తులతో సినిమా చూసే దానికి ఇష్టపడేవాడిని. ఆ సినిమా చూడటానికి చారాన పైసలు సంపాదించడానికి అష్ట కష్టాలు పడేది.
రాము సినిమా కోసం పడి గాపులు
కాంతారావు నటించిన గండర గండడు, ఎన్టీఆర్ గండికోట రహాస్యం, కాంతారావు, ఎన్టీఆర్ ఇద్దరు నటించిన చిక్కడు దొరకడు, ఎస్వీ రంగారావు నటించిన కత్తుల రత్తయ్య లాంటి సినిమాలు వచ్చినప్పుడు టాకీసు వాళ్ళు గొప్ప ప్రచారం ఇచ్చేవాళ్ళు. ఒక రిక్షాలో మైకులు పెట్టి ఒక మనిషిని పెట్టి ఊరంతా తిరిగి ప్రచారం చేసేవారు. ఆయన పేరు కిషన్ అని మిత్రులు చెపారు.
ఒంటి కన్ను, కుంటుతూ నడిచే కిషన్ సినిమాలకు ఇచ్చే ప్రచారం మాత్రం అద్భుతంగా చేసేవాడు. ఆ సృజనాత్మక ప్రచారం పిల్లలను సినిమా చూడకుండా ఉండలేని స్థితికి నెట్టేసేది. చిక్కడు దొరకడు సినిమా కిషన్ చేసిన ప్రచారం బాగా గుర్తుంది. “ నేడే చూడండి. ఎన్టీఆర్ కాంతారావు నటించిన చిక్కడు దొరకడు.. ఉరికితే చిక్కడు .. చిక్కితే ఉరకడు .. “ ఇట్లా ఆకర్షణీయంగా సాగేది ప్రచారం. కత్తుల రత్తయ్య సినిమాలో ఎస్వీ రంగారావు డైలాగ్ వినిపించేవాడు. “అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా పులి పులేరా డోంగ్రే”. సినిమాకు ముందే కిషన్ వినిపించిన ఈ డైలాగ్ ఇప్పటికీ యాదికి ఉన్నది. “ఆరేయ్ సినిమాకు పోదాంరా“ అని దోస్తులం అనుకునేవాళ్లం. అయితే మామూలు రోజుల్లో అయితే ఆఠానా టికెట్. చివరి రోజు బడి పిల్లలకు కన్సెషన్ ఇచ్చేది. అంటే చారానాకె సినిమా చూడవచ్చు. ఇక ఆఖరి రోజు వరకు ఎదురు చూసేవాళ్ళం.
సినిమా కోసం ఆయిని పైసలు అడిగిన ప్రతీసారి “రాము వచ్చినంక పోదాము” అనేది. ఈ రాము సినిమా వచ్చేదేన్నడో మేము సినిమాకు పోయేదేన్నడో ? అర్థం అయ్యేది కాదు.
ఒక సినిమా వారానికి మించి ఆడేది కాదు. అప్పటి వరకు ఎట్లానో ఒక తీరు చారాన పైసలు జమ చేసుకునే వాళ్ళం. సినిమా కోసం ఆయిని పైసలు అడిగిన ప్రతీసారి “రాము వచ్చినంక పోదాము” అనేది. ఈ రాము సినిమా వచ్చేదేన్నడో మేము సినిమాకు పోయేదేన్నడో ? అర్థం అయ్యేది కాదు. అయినా పోయి తీరవలే. సరుకుల కోసం బజారు పంపినప్పుడు పైసలు మిగిల్చుకొని, లేదంటే ఆయి దేవుడి గూట్లో పెట్టె డబ్బాలో నుంచి దొంగలించి దోస్తులతో సినిమాకు పోయేది మాత్రం పక్కా. అట్లా రాము సినిమా రాకపోయినా చాలా సినిమాలు దోస్తులతో కలిసి చూసాము. ఆ తర్వాత బడిలో, ఇంటి వద్ద కత్తి ఫైటింగ్ లు చాలా కాలం కొనసాగేవి. బోథ్ లో మాత్రం రాము సినిమా చూడనే లేదు. ఆయి నా కోరిక తీర్చనే లేదు. పైసలు సంపాదించలేని సాహాసికులు గూర్ఖా కండ్లు గప్పి మొఖా చూసి డేరా కింద నుంచి దూరి టాకీసులోకి చొరబడే వారు. ఎట్లనన్న చేసి సీన్మా చూసి తీరవలే అంతే.
రాము సీన్మా సంగతులు
ఆయి ప్రతీసారి నన్నుసినిమాకు పోకుండా మత్పరిచ్చే ఈ రాము సినిమా సంగతి తేల్చుకుందామని అనుకున్నాను. ఆ సందర్భం ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్ వచ్చాక దొరికింది. శివరాత్రి రోజున హైదరాబాద్ టాకీసుల్లో రాత్రి అంతా తెల్లవారేదాకా పాత సినిమాలు ఆడించేవారు. ఒక శివరాత్రి జాగరణ రోజున రాము సినిమా లేట్ నైట్ చూశాను. ఒక మూగ పిల్లవాడికి మాటలు రప్పించడానికి తల్లిదండ్రులు పడే కష్టం అందులో చూపించారు. తొలుత ఈ సినిమా 1966 లో ఏ వి ఏం సంస్థ తమిళంలో జెమిని గణేశన్, కె ఆర్ విజయ జంటగా నిర్మించారు. ఇది వ్యాపారపరంగా హిట్ కావడమే కాదు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కూడా అందుకున్నది. ఆ తర్వాత 1968 లో తెలుగులో అదే సంస్థ వారు అదే పేరుతో ఎన్టీఆర్, జమున జంటగా రీమేక్ చేశారు. తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగు రాము సినిమాలో ఘంటసాల, పి సుశీల పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయినాయి. “పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు”, మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే”, “ రారా కృష్ణయ్య ” పాటలు ఆ రోజుల్లో రేడియోలో కూడా మారుమోగి పోతా ఉండేవి. మా ఆయి ఈ సినిమాను బహుశా ఆదిలాబాద్ లోనో, నిర్మల్ లోనో చూసి ఉంటుంది. చిన్నపిల్లల సినిమా కాబట్టి ఆ సినిమా వచ్చాక పోదాం అని మమ్ములని మత్పరిస్తూ ఉండేది.
ఆ సినిమా ఇప్పట్లో వచ్చేది కాదని ఆమెకూ తెలుసు. సినిమాకు పోకుండా వీళ్ళను ఆపలేమని కూడా తెలుసు. అయినా పైసలు ఇవ్వడానికి మొండికి పోయేది. బహుశా వీళ్ళు చూసేదీ మంచి సినిమానో కాదో అన్న అనుమానం ఆమెకు ఉండేదేమో. ఇదీ నా చిన్నప్పటి రాము సినిమా ముచ్చట.
సతీ అనసూయ ప్రభంజనం
ప్రదీప్ టూరింగ్ టాకీసులోకి ఒకసారి “సతీ అనసూయ” సినిమా వచ్చింది. మా బోథ్ చుట్టూ పక్కల ఊర్ల నుంచి కూడా బండ్లు కట్టుకొని సినిమా చూడటానికి ఆడవాళ్ళు వచ్చేవారు. ఈ ఒక్క సినిమా కోసం తెరకు రెండు వైపులా ఆడవాళ్ళనే అనుమతించారు. జమున, శోభన్ బాబు, కాంతారావు, శారద తదితరులు నటించిన ఈ కలర్ సినిమా 1971 లో విడుదల అయ్యి 70 వ దశకంలో సంచలనం సృష్టించింది. ఒక నెల రోజుల పాటు ఆ సినిమా బోథ్ లో కూడా ప్రభంజనం సృష్టించింది.
నెల రోజుల పాటు ప్రజల కోరిక మేరకు నడిచిన సినిమా ఇదొక్కటే. సినిమా చూస్తున్నంత సేపు అనసూయ, సుమతి పడిన కష్టాలకు మహిళలు ముక్కు చీదుతూ బండెడు కన్నీళ్ళు కార్చినారు.
కాంతారావు అభిమాని వైద్య రమేష్
ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏ ఎన్నార్, కృష్ణ లాంటి నటులకు పెద్ద ఎత్తున అభిమానులు, అభిమాన సంఘాలు ఉండేవి. మా బోథ్ లో మాత్రం కాంతారావుకు ఒకే ఒక్క గొప్ప అభిమాని ఉండేవాడు. ఆయనే వైద్య రమేష్. ఆయన కాంతారావు అభిమాని అయినందున అతన్ని అందరూ కాంతారావు అనే పిలిచేవారు. వయసులో నా కంటే పెద్దవాడే. ఆయనను కాంతారావు అని తన కంటే వయసులో చిన్న పిల్లలు ఎంత బనాయించినా కాంతారావు పై తన అభిమానాన్ని మాత్రం వదులుకోలేదు.
ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏ ఎన్నార్ తో సమానంగా సినిమా పరిశ్రమలో గుర్తింపు పొందిన తెలంగాణ నటుడు కాంతారావు. కత్తి ఫైటింగ్ లో ఆయన మించిన వారు లేరు.
ఇవ్వాళ్ళ కాంతారావు లేడు. కాంతారావు అభిమాని వైద్య రమేష్ కూడా లేడు. ఆ ఇద్దరికి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాను.
ఏకవీర, చిక్కడు దొరకడు సినిమాల్లో ఎన్టీఆర్ తో కలిసి అద్భుతంగా నటించిన కాంతారావు ప్రతిభను ఆనాడు మేము కూడా తక్కువ చేసే చూసేవారం. వైద్య రమేష్ కాంతారావు అభిమానిగా మారడంలో తప్పు లేదని, అది సమంజసమైన అభిమానమని ఇప్పుడు అనిపిస్తున్నది. అంతటి గొప్ప కథా నాయకుడు ఆ తర్వాతి కాలంలో ప్రాధాన్యత లేకుండా పోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ వివక్షే కారణం అని ఇప్పుడు నమ్ముతున్నాను.
ఈ సంవత్సరం కాంతారావు శత జయంతి సంవత్సరం. తెలుగు సినిమా పరిశ్రమ మరచిపోయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయనను గుర్తు చేసుకున్నది. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆయన జన్మ దినం నాడు ఒక సంస్మరణ సభను నిర్వహించింది. రాబోయే రోజుల్లో కాంతారావు రెట్రాస్పెక్టివ్ కూడా నిర్వహిస్తామని డైరెక్టర్ మామిడి హరికృష్ణ చెప్పడం సంతోషం కలిగించింది. ఇవ్వాళ్ళ కాంతారావు లేడు. కాంతారావు అభిమాని వైద్య రమేష్ కూడా లేడు. ఆ ఇద్దరికి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాను. వైద్య రమేష్ కు కాంతారావు పై ఉన్న అభిమానాన్ని ఆ రోజుల్లో కించపరచినందుకు విచారం కూడా వ్యక్తం చేస్తున్నాను.
అస్లీ నక్లీ
డబుల్ రోల్ ఉన్న సినిమాల్లో కథ వివరించేటప్పుడు ఎవరు ఎవరో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మొదట కనిపించిన వాడు అస్లీ అని తర్వాత కనిపించిన వాడిని నక్లీ అని వర్ణించేవారం. నిజానికి సినిమాలో ఇద్దరు అస్లీలే. మాకు మాత్రం ఒకడు అస్లీ మరొకడు నక్లీ. రాముడు భీముడు, గండికోట రహాస్యం సినిమాలో ఎన్టీఆర్ ది డబుల్ రోల్. ఆ సీన్మాల కథలు చెప్పుకునేటప్పుడు మొదట కనిపించిన ఎన్టీఆర్ను అస్లీ ఎన్టీఆర్ అని తర్వాత కనిపించిన ఎన్టీఆర్ను నక్లీ ఎన్టీఆర్ అని వర్ణించేవారం. లేకపోతే ఏ ఎన్టీఆర్ గురించి చెపుతున్నామో అర్థం అయ్యేది కాదు.
రాజ్ టాకీసు
1970 దశకం చివరి రోజుల్లో బోథ్ లో ఒక సినిమా టాకీస్ నిర్మాణం జరిగింది. ఊరి పెద్ద మనుషులు కొందరు కలిసి టూరింగ్ టాకీసు ఏర్పాటు చేసే జాగాకు పక్కనే ఒక ఖాలీ స్థలాన్ని కొని సినిమా టాకీసును నిర్మించారు. దాని పేరు రాజ్ టాకీసు. ఇందులో మూడు .. నేల , బెంచీ, కుర్చీ క్లాసులు ఉండేవి. కుర్చీ క్లాసు వెనకాల ఎత్తు గద్దె కట్టి ఆడవాళ్లకు కేటాయించినారు. ఇక్కడ ప్రదీప్ టూరింగ్ టాకీసులో ఉన్న ఉల్టా పుల్టా సమస్య తీరిపోయింది. ఇంటర్వెల్ లో ఆడవాళ్ళ సెక్షన్ ను మూసి వేయడానికి సర్రున ఒక పరదా గుంజేవారు. ప్రొజెక్టర్ షురూ కాగానే మళ్ళీ పరదా తీసే వేసేవారు. ఆడవారికి ప్రైవసీ కోసం ఏర్పాటు అన్నమాట. ఇంటర్వెల్ లో పరదా గుంజే సమయానికి నేల టికెట్ తీసుకున్నకొంటె పొరలు లేచి సీటీలు లగాంచి కొట్టేవారు. అదొక సరదా. కరెంటు పోయినా, రీల్ కట్ అయినా బండ బూతులు వెలువడేవి. బీడీలు తాగడానికి ఏ నిషేధం లేదు. సినిమా అయి బయటికి రాగానే బీడీల వాసన మన ఒంటికి పట్టేసేది. ఆ వాసన పసి గట్టి సినిమాకు పోయారని పెద్దలకు తెలిసి పోయేది. ఇక తిట్లు కొట్లు ఉండేవి. పైసలు ఎక్కడివిరా అని నిలదీసేది.
రాజ్ టాకీసులో మ్యాటనీ షో కూడా ఉండేది. దొంగతనంగా సినిమాలు చూడటానికి ఎక్కువ అవకాశం ఉండేది. రాజ్ టాకీసులో నేల టికెట్ తీసుకోలేదు. అప్పటికే నేల టికెట్ తీసుకునే వయసు దాటిపోయింది. బారానా పెట్టి బెంచీకే వెళ్ళేది. కుర్చీ అయితే రూపాయిన్నర. అప్పుడప్పుడు సినిమాకు ముందు న్యూస్ రీల్ వేసేది. క్రికెట్ వార్తలు వచ్చినప్పుడు గేట్ కీపర్ కు పది పైసలు లంచం ఇస్తే న్యూస్ రీల్ చూడనిచ్చేవాడు.
అయితే టాకీసులో సినిమా చూసే అనుభవం, ప్రొజెక్టర్ లో నుంచి వెలువడే రంగుల కిరణాలు, వాటిల్లో కనిపించే ధూళి కణాలు, బీడీ పొగలు, కొంటె పోరల సీటీలు, కరెంటు పోయినప్పుడు, రీల్ కట్ అయినప్పుడు వినబడే తిట్లు, ఫిల్ములతో ఆటలు మాత్రం ఈ తరం పిల్లలకు లేకుండా పోయింది.
రాజ్ టాకీసు 1990 వ దశకం వరకు నడిచింది. ఆ తర్వాత ఏమయ్యిందో తెలియదు కానీ రాజ్ టాకీసు మూత పడింది. ఇప్పుడు ఆ జాగాలో మడిగెలు కట్టి షాపింగ్ కాంప్లెక్స్ గా మార్చి వేసినారు. ఇప్పుడు ప్రతీ ఇంట్లో టివి లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది. నచ్చిన సినిమా ఇంట్లోనే చూసే వెసులుబాటు ఉన్నది కనుక బోథ్ లో సినిమా థియేటర్ లేని లోటు ఏమి కనిపించడం లేదు. అయితే టాకీసులో సినిమా చూసే అనుభవం, ప్రొజెక్టర్ లో నుంచి వెలువడే రంగుల కిరణాలు, వాటిల్లో కనిపించే ధూళి కణాలు, బీడీ పొగలు, కొంటె పోరల సీటీలు, కరెంటు పోయినప్పుడు, రీల్ కట్ అయినప్పుడు వినబడే తిట్లు, ఫిల్ములతో ఆటలు మాత్రం ఈ తరం పిల్లలకు లేకుండా పోయింది. సినిమా థియేటర్ కట్టాలన్న ఆలోచన కూడా ఎవరికి రాక పోవడం విచిత్రం. సినిమా చూడాలంటే ఆదిలాబాద్, లేదంటే నిర్మల్ కు పోవలసిందే. జాతీయ రహదారి మీద ఉన్నఇచ్చోడలో సినిమా థియేటర్ నిర్మాణం జరిగి ఉంటుంది.
రాజ్ టాకీసులో స్టేజి పెళ్లి
రాజ్ టాకీసులో మా చిన్నప్పటి దోస్తు సురేంద్రబాబు (వీడిని 2020 లో కరోనా రెండవ వేవ్ తీసుకుపోయింది) స్టేజి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ముచ్చట్లు మరో జిగ్రీ దోస్తు అరవింద్ మాటల్లో ..
వాడి పెళ్లి గురించి మీకు తెలుసా అప్పుడు బోథ్ లో హల్ చల్. రాజ్ టాకీస్ లో వాడి పెళ్లి జరిగింది. దునియా బర్ కె మంది పెండ్లి చూడనీకి వచ్చిండ్రు. మా ఆయీ, బాపు కుడా పోయిండ్రు. వాళ్ళు అమ్మాయి మెడలో పుస్తే కట్టుమంటే, కమ్యూనిస్టుననే భావంతో పుస్తే కట్టకపోతే మా ఆయి నే ఆవిడకు పుస్తే కట్టిందట. ఇది వాడు, మా ఆయి ఇద్దరు చెబుతుండేవారు. పెండ్లిల దావత్ గీవత్ ఏం లేదు. వచ్చినోల్లందరికి చాయ్ తాగిపిచ్చిండట. వాడి తండ్రి కన్గుట్ట గంగారెడ్డి కమ్యూనిస్టులకు మారు పేరు. అతను సురేంద్ర పిల్లల పేర్లు కుడా బిపిన్, లెనిన్ అని పెట్టుకున్నాడు.
ప్రదీప్ టూరింగ్ టాకీసులో చూసిన సినిమాల్లో నాకు బాగా గుర్తుండిపోయిన సినిమా ఎన్టీఆర్ డబుల్ రోల్ చేసిన గండికోట రహాస్యం, రాజ్ టాకీసులో శోభన్ బాబు, వాణిశ్రీ, కృష్ణంరాజు నటించిన జీవన తరంగాలు సినిమా.
ఆదిలాబాద్ లో ఎక్కువగా హిందీ సినిమాలు ఆడేవి. నిర్మల్ లో తెలుగు సినిమాలు ఆడేవి. మార్నింగ్ షోలో పాత హిందీ సినిమాలు, మ్యాటనీ, రాత్రి రెండు షోలలో కొత్త సినిమాలు ఆడేవి. సెలవుల్లో ఆదిలాబాద్, నిర్మల్ పోయినప్పుడు సినిమాలు చూడనీకి పోయేది. అదే అక్కడ పెద్ద ఆకర్షణ మాకు. అట్లా హిందీ, తెలుగు సినిమాలతో పరిచయం ఏర్పడింది.
బోథ్ లో ప్రదీప్ టూరింగ్ టాకీసులో, రాజ్ టాకీసులో తెలుగు సినిమాలే వచ్చేవి. ప్రదీప్ టూరింగ్ టాకీసులో చూసిన సినిమాల్లో నాకు బాగా గుర్తుండిపోయిన సినిమా ఎన్టీఆర్ డబుల్ రోల్ చేసిన గండికోట రహాస్యం, రాజ్ టాకీసులో శోభన్ బాబు, వాణిశ్రీ, కృష్ణంరాజు నటించిన జీవన తరంగాలు సినిమా.
ఇవీ మా ఊరి సినిమా ముచ్చట్లు.
కాలమిస్టు పరిచయం
శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. ఐదో భాగం కోడి – గంపెడు బూరు : మా చిన్నాయి చెప్పిన కథ. ఆరో భాగం ‘కాముని బొగుడ’ – ‘హోలీ కేళీ కోలాటం’. ఏడో భాగం సహజీవన సంస్కృతికి మారు పేరు మొహర్రం. ఎనిమిదో భాగం కుంటాల జలపాతం. తొమ్మిదో భాగం బోథ్ గణపతి మండపంలో ఉస్తాద్ బడే ఖాన్ సాహెబ్ కచేరీ. మీరు చదివింది పదో భాగం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com