Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌కుంటాల జలపాతం - శివరాత్రి సోమన్న జాతర : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల...

కుంటాల జలపాతం – శివరాత్రి సోమన్న జాతర : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

50 ఏండ్ల క్రితం తీసిన కుంటాల ఎడమ వైపు జలపాతం ఛాయాచిత్రం

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, ‘కుంటాల జలపాతం – శివరాత్రి సోమన్నజాతర’ ఈ వారం.

శ్రీర్ రావు దేశ్ పాండే

సంక్రాంతి పండుగ తర్వాత సూర్యుడు మకర సంక్రమణం చేస్తాడు. అంటే సూర్యుడి గమనం ఉత్తరార్ధ గోళంలోకి మారుతుంది. చలి తీవ్రత తగ్గు ముఖం పడుతూ ఉష్ణోగ్రతలు మెల్లగా పెరగడం మొదలవుతుంది. ఫిబ్రవరి నెలలో మహా శివరాత్రి నుంచి ఎండలు తీవ్రమౌతాయి. అందుకే శివరాత్రికి చలి ‘శివ శివ’ అనుకుంటూ పోతదని జనం నానుడి. శివరాత్రికి సెలవు దినం. పెద్దవాళ్లకు ఒక్క పొద్దు. పిల్లలకు ఫలహారాలు. పెద్దలు, పిల్లలు శివాలయాలకు, జాతరలకు పోతారు.

ఆదిలాబాద్ జిల్లాలో పేరు పొందిన శైవ క్షేత్రాలు లేవు కానీ శివరాత్రికి జాతరలు జరిగే స్థలాలు చాలానే ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన జాతర కుంటాల సోమన్న జాతర.

నిజానికి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో జలపాతాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా Land of Water Falls. అందులో తలమానికమైనదే నేరేడిగొండ మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కుంటాల జలపాతం. శివరాత్రి రోజున జాతరలు జరిగే స్థలాలకు బండ్లు కట్టుకొని పోయేవారు పోతారు. ఎటు పోని వారు ఇంటి వద్దనే భజనలు చేస్తూ, ఇతరత్రా.. పరమపదసోపాన పటం మీద, పులి మేక ఆటలు ఆడుతూ, పత్తాలు ఆడుతూ కాలక్షేపం చేస్తూ రాత్రి అంతా జాగరణ చేస్తారు. ఆదిలాబాద్, నిర్మల్ లాంటి సినిమా టాకీసులున్న పట్టణాలలో రాత్రి ఫస్ట్ షో తర్వాత పాత పౌరాణిక చిత్రాలు తెల్లవారే వరకు ప్రదర్శిస్తారు. అట్లా సినిమాలు చూస్తూ జాగరణ చేయడం మనకు తెలిసిందే.

శివరాత్రి జాగరణ ఛాయ్

అందరితో పాటు చిన్న పిల్లలం మేము కూడా ప్రత్యేకంగా శివరాత్రి నాడు జాగరణ చేయడానికి సంకల్పించేవారం. మా ఇంట్లో ముందు గదిని ‘బైటక్’ అంటారు. మా తండ్రి తనను కలువడానికి వచ్చే వారిని ఈ బైటక్ లోనే కలుసుకునేవారు. మా శివరాత్రి జాగరణకు ఈ బైటక్ ను వాడుకోవడానికి మా ఆయి అనుమతినిచ్చేది. నా వద్ద అప్పటికే 30, 40 పిల్లల కథల పుస్తకాలు ఉండేవి. అవి ఒకరు చదివితే మిగతావారు వినే పద్దతిలో వంతుల వారీగా అందరం కలిసి కథలు చదుకునే వాళ్ళం. అందరూ రాత్రి భోజనాలు / ఫలహారాలు కానిచ్చి 8 కల్లా మా బైటక్ కి చేరుకోవాలని అనుకునేవాళ్లం.

మా శివరాత్రి జాగరణ ఆయి చేసిచ్చిన కమ్మటి ఛాయతో, కొన్ని కథలతో ముగిసిపోయేది.

నేను మా జాగరణ గురించి చెప్పి చాయ్ చేసి ఇవ్వుమని ఆయిని అడిగితే చాయ్ చేసి ఫ్లాస్క్ లో పోసి ఇచ్చేది. బైటక్ లో ఉన్న కుర్చీలు అన్నీ ఒక దిక్కు వేసి కింద శతరంజీ వేయించేది. మా ఇంట్లో రెండు చిన్నవి, ఒకటి పెద్దది.. మూడు శతరంజీ లు ఉండేవి. వీటిని మా తండ్రి పంజాబు నుంచి తయారు చేయించి తెప్పించినట్టు యాదికి ఉన్నది. ఎవరి ఇంట్లో కార్యక్రమానికైనా మా ఇంట్లో శతరంజీలు పోయేవి.

ఇక జాగరణ మొదలైనాక .. కథలు చదువుతున్నా అందరి దృష్టి చాయ్ మీదనే ఉండేది. ఒక గంట గడిచేటప్పటికి కను రెప్పలు మూత పడే స్థితి వచ్చేది. అయినా జాగరణకు కూచున్నాము కనుక నిద్ర పోకూడదు. మాలో ఒకడు “అరేయ్ నిద్ర వస్తున్నది. చాయ్ తాగుదామురా” అనేవాడు. అందుకోసమే నిద్ర కాచుకొని కూసున్న మేము కప్పుల్లో చాయ్ పోసుకొని తాగి ఇక మళ్ళీ కథల మీదకు మల్లేవాళ్ళం. అది ఒక 15 నిమిషాలే. అంతే .. నిద్ర పోకుండా ఆపే ఏ కారణం, ప్రలోభం మా ముందర లేదు కాబట్టి కొద్ది సేపట్లోనే అందరం నిద్రపోయేవారం. మా కథలు కంచికి .. మేము నిద్రలోకి. మా సంగతి ఆయికి ముందే తెలుసు కాబట్టి ఏ రాత్రికో తనిఖీకి వచ్చి మా మీద దుప్పట్లు కప్పి, లైట్లు బందు చేసి వెళ్లీపోయేది. తెల్లవారి లేచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపొయేది. అట్లా మా శివరాత్రి జాగరణ ఆయి చేసిచ్చిన కమ్మటి ఛాయతో, కొన్ని కథలతో ముగిసిపోయేది.

కుంటాల సోమన్న జాతరకు ఎడ్ల బండి ప్రయాణం

కుంటాల జలపాతం వద్ద మిత్రులతో .. ఎడమ నుంచి నగేష్ రెడ్డి, కాలమిస్ట్, వేణు, గంగాధర గౌడ్, వెంకట రమణా రెడ్డిలు.

కొంచెం పెద్దయ్యాక కుంటాల సోమన్న జాతరకు పోదామని ప్రతిపాదించాను. మా ఆయిని ఒప్పించాలి. ఆమె ఊర్లో ఉన్న పెద్దవాగు దగ్గరకి పోవడానికి అభ్యంతరం చెప్పేది కాదు. కానీ పొచ్చెర గుండం, కుంటాల గుండం దగ్గరకి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది కాదు. పొచ్చెర గుండం బోథ్ కు దగ్గరే కాబట్టి ఆమె వద్దన్నా, ఆమె పర్మిషన్ లేకుండానే పోయి వచ్చేవాళ్ళం. కుంటాల కొంచెం దూరం కాబట్టి ఎడ్ల బండిలో, లేదంటే నేరేడిగొండ వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి 11 కిలోమీటర్లు నడవాలి. ఆ కాలంలో .. అంటే 1970 వ దశకంలో ఇప్పుడున్నట్టు ఆటోలు లేవు. నడక తప్ప మరో మార్గం లేదు. మేము చిన్న పిల్లలం కాబట్టి 11 కిలోమీటర్లు నడవడం సాధ్యం కాదు. చిన్నఅడెల్లును తోడిచ్చి ఎడ్ల బండి మీద పోవడానికి ఒప్పుకున్నది.

కుంటాల సోమన్న జాతరకు పోవడం అంటే ఒక రాత్రి అక్కడనే ఉండి పొద్దున వండుకొని తిని ఇంటికి తిరిగి వచ్చేది. ఆయి రాత్రి తినడానికి రొట్టెలు, కూర సద్ది కట్టి ఇచ్చేది. పొద్దున వండుకోవడానికి బియ్యం, పప్పు, ఉప్పు, కారం, వంట పాత్రలు, తినడానికి విస్తార్లు, రాత్రి పడుకోవడానికి శతరంజీ, కప్పుకోవడానికి దుప్పట్లు .. అన్నీ మూట కట్టి ఇచ్చేది. శివరాత్రి ఉదయం 10 గంటలకు ఎడ్ల బండి బయలుదేరేది. నాతో పాటు సబ్బని నర్సయ్య, అరవింద్ బండిలో రావడం నాకు యాదికున్నది. ఎడ్ల బండి ధన్నూర్, వడూర్ గ్రామాల మీదుగా నేరేడిగొండ చేరుకొని అక్కడి నుంచి జాతీయ రహదారి నంబరు 7 దాటి కుంటాల చేరుకునేటప్పటికి సాయంత్రం 4 అయ్యేది. చీకటి పడక ముందే రాత్రి పడుకోవడానికి జలపాతం కింద లోయలో అడెల్లు జాగా సిద్దం చేసేవాడు. అంతకు ముందే కుంటాల జలపాతం వద్ద జాతర కోసం వెలసిన దుకాణాల టెంట్లు, వాటిల్లో తిను బండారాలు చూస్తూ సోమన్న గుండం వద్దకు పోయేది.

జలపాతం కిందకి పోయి దృశ్యం చూడాలంటే గుట్ట దిగి పోవలసి ఉండేది. కొందరు సాహసికులు మాత్రమే ఆ పని చేసేవారు. ఇప్పుడు ఏ కాలమైనా జలపాతం కిందకు పోవడానికి మెట్ల దారి ఏర్పడింది.

ఆ కాలంలో జలపాతం కిందకు దిగడానికి మెట్ల దారి లేకుండే. జలపాతం పరుపు బండ మీద నుంచి జాగ్రత్తగా కిందకు దిగి పోవాలి. ఫిబ్రవరిలో జలపాతాల్లో కొద్ది పాటి నీటి ధార ఉండేది రెండు నీటి ధార మధ్యన ఉన్న ఏటవాలు రాతి పరుపు మీద నుంచి కిందకు దిగి పోయే వేసులు బాటు ఉండేది. వానాకాలంలో ఉదృతమైన నీటి ప్రవాహం ఉంటది కాబట్టి జలపాతం కిందకి పోయి దృశ్యం చూడాలంటే గుట్ట దిగి పోవలసి ఉండేది. కొందరు సాహసికులు మాత్రమే ఆ పని చేసేవారు. ఇప్పుడు ఏ కాలమైనా జలపాతం కిందకు పోవడానికి మెట్ల దారి ఏర్పడింది.

కుంటాల సోమన్న దర్శనం – జాతర సంరంభం

కుంటాల వద్ద ఒకటి కాదు రెండు జలపాతాలు ఉంటాయి. ఎడమ వైపున 70 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకే జలపాతం వద్ద ఏర్పడే నీటి మడుగును సోమన్న గుండం అంటారు. కుడి వైపున ఏటవాలుగా ఉండే రాతి పరుపుపై నీరు జాలు వారుతూ రెండు స్టేజీల్లో నీరు కిందకు వస్తుంది. ఈ జలపాత దృశ్యమే బయట బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక ఎడమ వైపున ఉన్న జలపాతం నీటి ధార పక్కనే ఒక తొర్ర / గుహ ఉంటుంది. లోపల 5,6 గురు మనుషులు పట్టేంత జాగా ఉంటుంది. ఆ గుహలో శివలింగం ఉంటుంది. ఏవో రెండు మూడు చిన్న రాతి విగ్రహాలు కూడా ఉంటాయి. అప్పట్లో బేస్త వారే ఇక్కడ పూజారులు. మరి ఇప్పుడు కూడా బేస్త పూజారులే ఉన్నారా లేదా తెలియదు.

సోమన్న జాతర సందర్భంగా రాత్రి వేళ ఆ సంరంభం వర్ణించనలవి కానంత అద్భుతంగా ఉంటుంది. జాతర జరుగుతున్న జలపాతం పరిసరాలు అంతా వందలాది కొర్రాయి మంటల వెతురుల్లో వెలిగిపోతూ ఉంటుంది.

గుహలోకి పోవడమైనా, రావడమైనా ఒక్క మనిషి పట్టేంత మార్గమే ఉంటుంది. లోపలకు పోవాలంటే కింద నుంచి ఒక పది పన్నెండు ఇనుప చువ్వల ఆధారంగా పైకి ఎక్కి తొర్రలో నుంచి గుహలోకి వెళ్ళాలి(ఇప్పుడు ఇనుప నిచ్చెన ఏర్పాటు చేశారు). శివరాత్రి సందర్భంగా ఇద్దరు వ్యక్తులు సహాయంగా ఉండి భక్తులకు ఎక్కిస్తారు, దించుతారు. ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ రాత్రి అంతా ఈ కోలాహలం ఉంటుంది. రెండో రోజు సాయంత్రం వరకు సోమన్నదర్శన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది.

సోమన్న జాతర సందర్భంగా రాత్రి వేళ ఆ సంరంభం వర్ణించనలవి కానంత అద్భుతంగా ఉంటుంది. జాతర జరుగుతున్న జలపాతం పరిసరాలు అంతా వందలాది కొర్రాయి మంటల వెతురుల్లో వెలిగిపోతూ ఉంటుంది. ఆనాడు కరెంటు లేదు, LED లైట్లు లేవు కాబట్టి కట్టెలు వెలిగించి దాని చుట్టు కూచుని భజనలు చేస్తూ ఉంటారు. దుకాణాల వారు ఆనాడు వాడుకలో ఉన్న బిజిలీలు తెచ్చుకునే వారు. ఈ బిజిలీలు కందీలు కంటే ఎన్నో రేట్లు ఎక్కువ వెలుతురు ఇస్తాయి. డోలక్, తాళాల చప్పుళ్ళతో రాత్రి ఆ అడవి అంతా మారుమోగిపోతూ ఉంటుంది. రాత్రి అంతా ఈ కోలాహలం కొనసాగుతూనే ఉంటుంది.

రాత్రి వరకల్లా జలపాతం పరిసరాలను ప్రకృతికి ఒప్ప జెప్పి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. మళ్ళీ శివరాత్రి దాకా ఈ ప్రాకృతిక నిశబ్దాన్ని ఎవరూ భంగం చేయరు.

తెల్లవారు జామున మళ్ళీ జనం హడావిడి మొదలవుతుంది. స్నానాలు, దైవ దర్శనమ తర్వాత, వంటలు వండుకొని ఉపవాస దీక్షలు వదులుతారు. మధ్యాహ్నానికి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి వరకల్లా జలపాతం పరిసరాలను ప్రకృతికి ఒప్ప జెప్పి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. మళ్ళీ శివరాత్రి దాకా ఈ ప్రాకృతిక నిశబ్దాన్ని ఎవరూ భంగం చేయరు. ఈ జలపాతం సందర్శన ఫిబ్రవరి చివరి దాకా కొనసాగుతుంది. ఆ తర్వాత నీటి ప్రవాహాలు తగ్గిపోతాయి కాబట్టి పర్యాటకుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. మళ్ళీ జూలై లో ప్రవాహాలు పెరుగడంతో పర్యాటకుల రాక మొదలవుతుంది.

శకుంతల – దుష్యంతుల ప్రణయ ప్రదేశం

కుంటాల జలపాత పరిసరాలకు పురాణ ప్రాధాన్యత కూడా ఉన్నదని స్థానికులు నమ్ముతారు. కణ్వ మహర్షి తపస్సు చేసింది ఈ నది ఒడ్డునే కాబట్టి ఈ నదికి కణ్వ నది అని ప్రాచీన నామం. అది క్రమంగా ప్రజల నోళ్లలో కడం గా మారింది.

కుంటాల జలపాత ప్రాంతం శకుంతల దుష్యంతుల ప్రణయ ప్రదేశం కనుక దీనికి కుంతల జలపాతం అని పిలిచేవారు. అదే ఇప్పుడు కుంటాలగా మారింది అని ప్రజల నమ్మకం.

సోమన్న జాతరకు నడక

మేము 9,10 వ తరగతులకు వచ్చేటప్పటికి ఎడ్ల బండి మీద కుంటాల జాతరకు పోవడం అవమానకరంగా తోచేది. చెడ్డీలు పోయి ప్యాంట్లు వేసుకునే వయసు కదా! అట్లా అనిపించడం సహజమే. అందుకని దోస్తులం అందరం కలిసి బస్సులో నేరేడిగొండ పోయి 11 కిలోమీటర్లు నడిచి కుంటాలకు పోయేది. రాత్రి కొర్రాయి మంటల చుట్టూ కూచుని కబుర్లు చెప్పుకునేది. పత్తాలు ఆడేది. జాతర కలియదిరిగేది. తిను బండారాలు కొనుక్కొని తినేది. ఈత వచ్చిన వాళ్ళు సోమన్న గుండంలో ఈత కొట్టేది. మేము మాత్రం జలపాతం కింద వాగులో మాత్రమే దిగేవారం. సురేంద్రబాబు, జి శంకర్, సుధాకర్ లాంటి వారు సోమన్న గుండంలో ఈతకు దిగేది. వారి సాహాసం అబ్బురమనిపించేది. వాళ్ళు ఆ వయసులోనే సోమన్నగుండంలో ఈతకు దిగేది. ప్రకాష్ మా కంటే వయసులో పెద్దవాడు. ఆయన సోమన్న గుండంలో ఈదుతూ నీటి ధార వరకు పోయి తిరిగి వచ్చేవాడు. ఆయన సాహాసం ఇప్పటికీ మరచిపోలేను.

1980 లో కుంటాల జలపాతానికి నడిచి వెళ్ళిన ఆదిలాబాద్, బోథ్ మిత్ర బృందం. ఎడమ నుంచి .. కిరణ్ కుమార్ రెడ్డి, కాలమిస్టు, గంగారెడ్డి, నరసింహా రావు, బాలరాజు,సబ్బని నర్సయ్య, వేణు, నగేష్ రెడ్డి, మహావీర్, అశోక్ లు.

శివరాత్రి తెల్లవారి తిండ్లు అయినాక మళ్ళీ 11 కిలోమీటర్లు నడిచి నేరేడిగొండ చేరుకొని బస్సెక్కి బోథ్ చేరుకునేవాళ్ళం. ఆ నడకకు రెండు రోజులు కాళ్ళ నొప్పులు ఉండేవి. ఈ నడక బ్యాచ్ లో 8,9 మంది మిత్రులు ఉండేది. ఇప్పటి తరానికి ఆ శ్రమ తగ్గిపోయింది. బోథ్ నుంచి నేరేడిగొండకు బస్ లో వెళ్ళి అక్కడి నుండి ఆటోలో, జీబులో జలపాతం వెళ్ళవచ్చు. శ్రమ తగ్గిపోయింది, ప్రయాణ కాలం తగ్గింది. కానీ నడిచిపోయే ఆ అనుభవాన్ని, కుంటాల అడవి అందాలను ఆస్వాదించే అవకాశాన్ని ఇప్పటి తరం కోల్పోయింది.

శివరాత్రికి కుంటాల వెళ్ళడం కూడా అదే చివరిది. ఆ తర్వాత ఎన్నో సార్లు కుంటాలకు వెళ్ళినా కూడా నడిచి పోయే అవసరం మాత్రం రాలేదు.

ఇంటర్ పరీక్షలకు ముందు ఆదిలాబాద్ ఇంటర్ మిత్రులను తీసుకొని 1980 లో మళ్ళీ ఒకసారి నడిచి శివరాత్రికి కుంటాలకు వెళ్ళాము. ఆదిలాబాద్ ఇంటర్ బ్యాచ్ మిత్రుల్లో గంగా రెడ్డి, నరసింహా రావు, బాలరాజు, ఉదయ్ కిరణ్ రెడ్డి, సుశీల్, మహావీర్ ఉన్నారు. వీరితో పాటు నా పదవ తరగతి బ్యాచ్ మిత్రులు సబ్బని నర్సయ్య, వేణు, నగేష్ రెడ్డి, అరవింద్, శేఖర్ రెడ్డి, అశోక్ తదితరులు కలిశారు. అందరం బోథ్ నుండి నేరేడిగొండ బస్సులో వెళ్ళి అక్కడి నుండి 11 కిలోమీటర్లు నడిచి పోయాము. నడకలో సుశీల్ ను మించిన వారు లేరు. వాడు మా కంటే ఎంతో ముందు ఉండేవాడు. అదే కుంటాలకు నడచి పోయే చివరి అనుభవం. శివరాత్రికి కుంటాల వెళ్ళడం కూడా అదే చివరిది. ఆ తర్వాత ఎన్నో సార్లు కుంటాలకు వెళ్ళినా కూడా నడిచి పోయే అవసరం మాత్రం రాలేదు.

కుంటాల జలపాతం పరిరక్షణా ఉద్యమం

జలపాతాలు ప్రకృతి మానవులకు ప్రసాదించిన అద్భుతమైన వరాలు. వాటిని మానవుడు సృష్టించలేదు. ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకను మనుషులుగా మనం కాపాడుకోవడం తప్ప మరో దారి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2010 లో ఈ కుంటాల జలపాతానికి ఒక ఉపద్రవం వచ్చి పడింది.

జల విద్యుత్ ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమంలో గద్దర్ తదితరులు

నూరపరాజు అనే ఒక ఆంధ్రా కాంట్రాక్టర్ కు కుంటాల జలపాతం వద్ద 6 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసే జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి నీటిపారుదల శాఖ No Objection Cetificate జారీ చేసింది. అయితే అటవీ శాఖ మాత్రం కుంటాల జలపాతం చుట్టూ ఉన్నకుంటాల రిజర్వ్ ఫారెస్ట్, నాగమల్ల రిజర్వ్ ఫారెస్ట్, రోల్ మామడా రిజర్వ్ ఫారెస్ట్, సిరిచెలమ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న కారణంగా జలపాతం వద్ద జల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కు NOC జారీ చేయడానికి నిరాకరించింది.

నూరపరాజు మాత్రం ప్రభుత్వంలో తన పలుకుబడినుపయోగించి ఫారెస్ట్ అనుమతి పొందడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులను విశ్వాసంలోకి తీసుకున్నట్టు తెలిసి కుంటాల పరిరక్షణ కోసం ఉద్యమం మొదలయ్యింది. జల విద్యుత్ పేరు మీద ఒకసారి దట్టమైన ఈ రిజర్వ్ ఫారెస్ట్ లోనికి చొరబడే అవకాశం దక్కితే చాలు వేల కోట్ల అటవీ సంపద దోపిడీకి గురి అవుతుంది. జలపాతం ఎగువన, దిగువన 5 కిలోమీటర్ల పొడవునా ఉన్న నాణ్యమైన గ్రానైట్ పరుపు బండ తొలిచేసే అవకాశం ఉన్నది. జలపాతం ఒక రక్షిత ప్రదేశంగా మారిపోయి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది.

నిర్మల్ వాస్తవ్యుడు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్ ఈ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్త మద్దతు సాధించడంలో కీలక పాత్ర పోషించినాడు. గద్దర్, చుక్కా రామయ్య లాంటి వారు జలపాతాన్ని సందర్శించి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

ఈ జల విద్యుత్ ప్రతిపాదన వచ్చేనాటికి కుంటాల జలపాతానికి డాంబరు రోడ్డు వచ్చింది. శ్రీ టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో ఆనాటి బోథ్ శాసన సభ్యుడు అమర్ సింగ్ తిలావత్ గారు టూరిజం శాఖా మంత్రిగా కుంటాల జలపాతం వద్ద సౌకర్యాల కల్పనకు, రోడ్డు వేయించడానికి కృషి చేసినారు. ఆయన కృషి ఫలితంగా కుంటాలకు పర్యాటకుల రాక ఎక్కువ అయ్యింది. రోడ్డు రావడంతో ఆటోలు నడుపుతూ స్థానిక యువకులు ఉపాధి పొందుతున్నారు. కుంటాల, బుగ్గారం తదితర గ్రామాల ఆదివాసీల ఆధ్వర్యంలో నడుస్తున్న వన సంరక్షణ సమితికి కుంటాల జలపాతం నిర్వాహణ, సంరక్షణ బాద్యత ఇవ్వడం జరిగినది.

జలపాతం చుట్టూ దట్టమైన అరణ్యం ఉండడంతో స్థానిక ఆదివాసీ కుటుంబాలు తేనె, కుంకుడు కాయలు, పండ్లు, బంక తదితర అటవీ ఫలసేకరణ చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాయి. నేరేడిగొండ గ్రామం సందర్శకులకు ఒక విడిది కేంద్రంగా మారింది. ఇట్లా 2010 నాటికి వేలాది మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు ఏర్పడినాయి. నేరేడిగొండ నుంచే కాక చుట్టూ పక్కల ఉన్న బోథ్, బాజార్ హాత్నూర్, ఇచ్చోడ, గుడి హాత్నూర్, ఆదిలాబాద్, ఖానాపూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, నిర్మల్ తదితర మండలాల నుంచి కూడా ఆటోలు, జీబులు పర్యాటకులను తీసుకొని రావడం మొదలయ్యింది. శివరాత్రికి జాతరతో పాటు గోండు, కొలాం ఆదివాసీలు సంవత్సరానికి రెండు సార్లు సోమన్న గుండంకు వస్తారు. గుండంలో స్నానాలు చేసి తమ దేవుడు పెర్సపేన్ కు మొక్కులు చెల్లించుకుంటారు. బేస్త వారు గుండంలో, గుండం దాటిన తర్వాత కడెం వాగులో, మడుగుల్లో చేపల వేట ద్వారా జీవనోపాధి పొందుతారు.

కుంటాల వద్ద ప్రతిపాదించిన జల విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వ వద్దని కోరుతూ ఆట ఈ శాఖ PCCF శ్రీ సోమ శేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పణ. చిత్రంలో ప్రవీణ్, కాలమిస్టు, డి.పి.రెడ్డిలు.

జల విద్యుత్ ప్రాజెక్ట్ వస్తే తమ బతుకులు ఆగం అవుతాయని స్థానిక ప్రజలు బలంగా భావించారు. అందుకే “ మాకు జల విద్యుత్ ప్రాజెక్ట్ వద్దు-జలపాతమే ముద్దు” నినాదంతో ఉద్యమం మొదలయ్యింది. స్థానిక తెలంగాణ ఉద్యమ సంఘాలు అన్ని కలిసి “కుంటాల పరిరక్షణ సమితి” గా ఐక్యమై ఉద్యమాన్ని ఉదృతం చేశారు. నేరేడిగొండ శాఖా గ్రంథాలయ పాలకుడిగా ఉన్న మా చిన్నన్న గిరిధర్ దేశ్ పాండే సమితి కన్వీనర్ గా ఎన్నికైనాడు. నిర్మల్ వాస్తవ్యుడు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్ ఈ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్త మద్దతు సాధించడంలో కీలక పాత్ర పోషించినాడు. హైదరాబాద్ లో ఉండే ఉద్యమ సంఘాలు అన్నీ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. గద్దర్, చుక్కా రామయ్య లాంటి వారు జలపాతాన్ని సందర్శించి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. 2013 లో తెలంగాణ విద్యావంతుల వేదిక చొరవతో నిర్మల్ పట్టణంలో hmtv వారు కుంటాల పరిరక్షణ విషయమై ఒక దశ – దిశ కార్యక్రమాన్ని నిర్వహించింది. శ్రీ రామ చంద్ర మూర్తి గారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఆదివాసీలు, ఉద్యమకారులు అందరూ ముక్త కంఠంతో జలపాతం వద్ద జల విద్యుత్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడినారు. కేవలం 6 మెగావాట్ల కరెంటు కోసం అపురూపమైన కుంటాల జలపాతాన్ని, జిల్లా ప్రజల జీవనంతో, మనో భావాలతో ముడిపడి ఉన్న జలపాతాన్ని నాశనం చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ఉద్యమానికి పది తెలంగాణ జిల్లాల ప్రజలు, మేధావులు, పర్యావరణ వేత్తలు, రచయితలు, కవులు, పత్రికా, మీడియా విలేఖరులు అండగా నిలవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కుంటాల జల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోక తప్పలేదు. అట్లా అపురూపమైన కుంటాల జలపాతాన్ని తెలంగాణ సమాజం రక్షించుకున్నది.

కుప్టి ప్రాజెక్టు – ఏడాది పొడవునా నీటి ధార

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కడెం నది పైన ప్రస్తుత కడెం డ్యాంకు, కుంటాల జలపాతానికి ఎగువన కుప్టి వద్ద 6 టిఎంసిల జలాశయాన్ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్దతో ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసినారు. కడం ఆయకట్టుకు అవసరం అయినప్పుడు ఇక్కడి నుంచి నీరు వదలడం, జలపాతం వద్ద సదా నీటి ప్రవాహాలు ఉండే విధంగా డిసెంబర్ నుంచి జూన్ వరకు కుప్టి జలాశయం నుంచి నీటిని వదలడం, నేరేడిగొండ, బోథ్ , ఇచ్చోడ మండలాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

కుంటాల జలపాతం సమగ్ర దృశ్యం

ఈ సంవత్సరం జూలై లో కడం నదికి వచ్చిన అసాధారణమైన వరదలకు కడం డ్యాం ప్రమాదం అంచులకు పోయి సురక్షితంగా బయటపడింది. కడం డ్యాం వద్ద వరద నియంత్రణకు కూడా కుప్టి ప్రాజెక్టు నిర్మించడం అవసరమన్న భావన ముఖ్యమంత్రి సహా అందరిలో ఏర్పడింది. కుప్టి డ్యాం నిర్మాణం పూర్తి అవుతే కుంటాల జలపాతం ఏడాది పొడుగునా పర్యాటకులను అలరింపజేస్తుంది. నేరేడిగొండలో ఒక హరిత హోటల్, జలపాతం వద్ద రోప్ వే ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారు. అవి కూడా తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిద్దాము.

దూర ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో, బస్సుల్లో జలపాతానికి వందల సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. వారికి మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం అవసరం. ఏకొ టూరిజం అభివృద్ది చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఇదొక అద్భుతమైన ప్రదేశం.

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. ఐదో భాగం కోడి – గంపెడు బూరు : మా చిన్నాయి చెప్పిన కథ. ఆరో భాగం ‘కాముని బొగుడ’ – ‘హోలీ కేళీ కోలాటం’. ఏడో భాగం సహజీవన సంస్కృతికి మారు పేరు మొహర్రం. మీరు చదివింది ఎనిమిదో భాగం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

 

 

నిర్మల్ పట్టణంలో కుంటాల హైడల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా విద్యార్థుల మానవ హారం

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article