‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, ఒక బిడ్డ తల్లి వెనకాలి తల్లి వంటి ఊరి మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక. చదవండి. గతవారం తమ గ్రామ పూర్వ పరాలతో ప్రారంభమైన ఈ శీర్శికలో ఈ వారం మూల నక్షత్రంలో తన పుట్టుక, మొదలు తెలుపు.
శ్రీధర్ రావు దేశ్ పాండే
మా ఆయి (మరాఠీలో అమ్మ) సుశీలా బాయి. మా బాబ (నాన్న) అంబారావు దేశ్ పాండే. నేను ఎప్పుడు పుట్టానో చెప్పడానికి మా ఆయి ఒక సంఘటన చాలా సార్లు గుర్తు చేసేది. పోచంపాడు ప్రాజెక్టు (శ్రీరాంసాగర్) శంఖు స్థాపన కోసం ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ వచ్చినప్పుడు నేను ఒక సంవత్సరం పిల్లవాడినట. నెహ్రూను చూడడానికి బండ్లు కట్టుకొని వేలాది మంది జనం పోచంపాడుకు పోయినారని చెప్పేది. ఆయన 1964 లో ప్రాజెక్టుకు శంఖు స్థాపన చేశాడు. అంటే నేను పుట్టింది ఖచ్చితంగా 1963 లోనే. తేదీ, నెల గురించి ఖచ్చితంగా నిర్ధారించే సాక్ష్యాలు లేవు. నేను పుట్టింది ఆదిలాబాద్ జిల్లా దవాఖానాలో అని చెప్పేది. దవాఖానా రికార్డులు వెదికితే పుట్టిన తేదీ దొరుకుతుంది. ఇన్నేళ్ల తర్వాత అది ఇప్పుడు అప్రస్తుతం. వెతకాలన్న ఆసక్తి కూడా లేదు. అయితే స్కూల్ రికార్డుల ప్రకారం నా పుట్టిన రోజు 5 ఏప్రిల్, 1963. ఇక తిథుల ప్రకారం చూస్తే నేను మూల నక్షత్రంలో పుట్టినానని చెప్పేది. “వీడిది మీల నక్షత్రం పుట్టుక: అని చాలా సార్లు ముచ్చట్లలో చెప్పగా విన్నాను.
ఆయి – సుశీలాబాయి, బాబా – అంబారావు దేశ్ పాండే
మూల నక్షత్రం గురించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. మూల నక్షత్రంలో పుట్టడం కుటుంబానికి అరిష్టమని ఒక నమ్మకం. మూల నక్షత్రంలో పుట్టిన వారు కుటుంబంలో ఎవరో ఒకరిని.. ఒక మూలను లేపేస్తారట. నా విషయంలో ఇది నిజమా కాదా అని నిర్ధారించుకునేందుకు మా తాయిని (మరాఠిలో పెద్దక్క) అడిగాను. నేను పుట్టినప్పుడు మా కుటుంబంలో అటువంటి సంఘటన ఏదీ జరుగలేదని చెప్పింది. అయితే మూల నక్షత్ర ప్రభావాన్ని తగ్గించడానికి శాంతి పూజలు మాత్రం ఏవో చేసినారని మాత్రం గుర్తున్నట్టు చెప్పింది.
అయితే మూల నక్షత్రం ప్రభావమో కాదో నాకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు ఒక అర్భకుడిగానే పెరిగాను. మా ఆయిని బాగా సతాయించానట. చిన్నప్పుడు చాలా సన్నగా, అనారోగ్యంతో, పుండ్లతో, ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడినని చెప్పేది. నా తర్వాత ఒక సంవత్సరానికే చెల్లి పుట్టడం వలన అటు మా చెల్లిని ఇటు నన్ను చూసుకోలేక సతమతమయ్యేదని చెప్పేది. నా తర్వాత పుట్టిన చెల్లిపై ఆమె ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి వచ్చింది. నా ఏడుపు ఎందు కోసమో ఎవరికి అర్థం అయ్యేది కాదు. ఆకలికా లేక ఆయి స్పర్శ కోసమా ఇప్పుడు నేను చెప్పలేను.
లాలన కోసం నాకు ఏడుపు
మాది పెద్ద కుటుంబం. మా తండ్రి ఊరికి సర్పంచ్, తాలూకా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో సందడిగా ఉండేది. ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో, సర్పంచ్ గా ఇతర వ్యాపకాలతో తీరిక లేకుండా ఉండేవాడు. నా కంటే ముందు ముగ్గురు .. ఒక అక్క, ఇద్దరు అన్నలు పుట్టారు. మా ఆయి ఐదు గురు పిల్లలను, ఇంటిని, బోథ్ లో ఐదు అరకల వ్యవసాయాన్ని సంభాళించుకునేది. ఈ ఒత్తిడిలో బహుశా నా మీద శ్రద్ధ పెట్టడానికి ఆమెకు తీరిక లేని స్థితిలో లాలన కోసం నాకు ఏడుపు తప్ప వేరే మార్గం ఏమి ఉంటుంది? తల్లులను ఆకర్షించడానికి పిల్లలు అంతకు మించి ఏమి చేయగలరు? నా ఏడుపును చూడలేక నన్ను ఒడిలోకి తీసుకొని లాలించి ఓదార్చేది మా నాయినమ్మ (చిన్నాయి).
బుష్కోటు అంటే ఏందో అప్పుడు తెలియదు. ఏదో తినే పదార్థమే అయి ఉంటుందని నమ్మేవాడిని. పెద్దయ్యాక తెలిసింది.. బుష్కోటు అంటే వొంటి మీద వేసుకునే అంగీ అని.
మా నడిపి కాక కిషన్ రావు దేశ్ పాండే ఏకైక కుమార్తె.. మా కుటుంబంలో అందరి కంటే పెద్దది అయిన శిలక్క కూడా ముద్దు చేసేది. “ఎడవకురా నీకు బుష్కోటు కొనిస్తా” అని ఊరడించేది. బుష్కోటు అంటే ఏందో అప్పుడు తెలియదు. ఏదో తినే పదార్థమే అయి ఉంటుందని నమ్మేవాడిని. పెద్దయ్యాక తెలిసింది.. బుష్కోటు అంటే వొంటి మీద వేసుకునే అంగీ అని. అయితే శిలక్క బుష్కోటు కొనిచ్చింది లేదు కానీ ఆమె ఊరడింపుతో ఏడుపు మాత్రం మానేసేవాడిని. స్వాంతన ఆమె బుష్కోటు కొని ఇస్తా అన్నందుకు కాదు, ఆమె నన్ను ఎత్తుకొని ముద్దు చేసినందుకే అని ఇప్పుడు నేను భావిస్తున్నా.
డాక్టర్ ముకుంద రావు మా ఇంటి డాక్టర్. ఈయన చాలా ఏండ్లు బోథ్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత కామారెడ్డికి వెళ్లిపోయారు. ఆ కాలంలో డాక్టర్లు ఇంటింటికీ తిరిగి వైద్యం చేసేవారు. ఆయన నా పుండ్లకు, నా అనారోగ్యానికి చికిత్స చేసినట్టు నాకు యాదికి ఉన్నది. పెద్దయి బడికి పోయే వయసు వచ్చేదాకా ఈ పుండ్ల బాధ నన్ను, నాతో పాటు మా ఆయిని వెంటాడింది. బయటి ప్రపంచంలో పడిన తర్వాత బడి, ఆటలలో మునిగిపోయినాక నా పుండ్ల బాధలు కొంత తగ్గినాయని చెప్పాలి. ఆటలలో దెబ్బలు తగులుతూనే ఉండేవి. మోకాళ్ళు, మోచేతులు, కాలి వేళ్ళ పొట్టలు పగిలి.. శరీరం మీద ఎక్కడో ఒకచోట పుండ్లు ఉంటూనే ఉండేవి. వాటి కవే తగ్గిపోయేవి. మళ్ళీ దెబ్బలు తగిలి మళ్ళీ పుండ్లు లేచెవి. చిన్నప్పుడు నేను బక్కగా, గట్టిగా గాలి వీస్తే లేచిపోయేంత బలహీనంగా ఉండేవాడిని. నన్ను “బక్క తట్టు” అని బనాయించడం నేను మరచి పోలేను. దీనికి సంబందించి నన్ను ఇప్పటికీ వెంటాడుతున్నసుడిగాలి ముచ్చట తర్వాత చెపుతాను.
వివి – కెసిఆర్ గార్లవీ ఆ నక్షత్రాలే….
ఇకపోతే మూల నక్షత్రంలో పుట్టిన వారు నష్ట జాతకులు కారని, వారిలో చాలా మంది గొప్ప వారిగా, మేధావులుగా ప్రఖ్యాతి గాంచినారని నా మిత్రులు మా ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ నాగేందర్ రావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కొండపల్లి వేణుగోపాల రావు గార్లు చెప్పారు. వారు ప్రస్తావించిన పేర్లలో నాకు బాగా తెలిసిన, పరిచయం ఉన్నవారు వరవరరావు గారు. ఇప్పుడు మూడేండ్లుగా చేయని నేరానికి బొంబాయి జైలులో ఉన్నాడు. మొన్ననే సుప్రీంకోర్టు ఆతనికి పర్మనెంట్ బెయిల్ ఇచ్చిందని తెలిసి సంతోషించిన వాళ్ళలో నేనూ ఒకడిని.
వీటిపై ఏ నమ్మకం లేని నేను ఇంత చర్చ చేయడం ఏమిటి అంటే ఏమి లేదు. నా పుట్టుక అరిష్టం కాదని, కాలేదని చెప్పడానికే. ఇవన్నీ మూఢ నమ్మకాలని నొక్కి చెప్పడానికే.
నాగేంద్రరావు గారు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చెపారు. బెజవాడ కనకదుర్గ, బాసర సరస్వతి అమ్మవార్ల జన్మ నక్షత్రం కూడా మూల నక్షత్రమేనట. అమ్మవార్ల జన్మ నక్షత్రమే మూల అయినప్పుడు మూల నక్షత్రం మీద ప్రజలకు (ఒకప్పుడు బ్రాహ్మలకే పరిమితం అయిన ఈ జాతకాల పిచ్చి ఇప్పుడు అన్ని కులాలకు వ్యాపించింది) ఈ అపోహలు ఎందుకు ఉన్నాయి? అని అడిగాను. ఆయన స్పష్టంగా చెప్పినదేమంటే ప్రజల్లో ఉన్నఅపోహలే తప్పు. మూల నక్షత్రంలో పుట్టడం తప్పు కాదు. అరిష్టమూ కాదు అన్నాడు.
ఇటువంటి అపోహలే ఆశ్లేష నక్షత్రంపై కూడా ఉన్నాయని, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలతో అత్తకో, మామకో ప్రాణ గండం ఉందని ఒక అర్థం లేని నమ్మకం ప్రభలి ఉన్నదని చెప్పాడు. అదంతా వట్టి అబద్దమని చెపుతూ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారిలో మహార్జాతకులు ఉన్నారని, మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ కంటే మరో ఉదాహరణ అవసరం లేదని చెప్పాడు. నా మూల నక్షత్రం పుట్టుక గురించి ఆయన ఇంత కథ చెప్పిన తర్వాత నా జన్మ నక్షత్రంపై ప్రేమ పెరిగింది. వీటిపై ఏ నమ్మకం లేని నేను ఇంత చర్చ చేయడం ఏమిటి అంటే ఏమి లేదు. నా పుట్టుక అరిష్టం కాదని, కాలేదని చెప్పడానికే. ఇవన్నీ మూఢ నమ్మకాలని నొక్కి చెప్పడానికే.
ముక్తాయింపు
ఏ నక్షత్రంలో పుట్టడమైనా ఎవరి చేతుల్లో లేదు. అది విధి రాత తప్ప మరొకటి కాదు. ఆ విధి రాతను ఇటీవలి కాలంలో మార్చే ఆశాస్త్రీయమైన పని ప్రైవేటు హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి. తిథి, నక్షత్రాలు, పాదాలు చూసి సిజేరియన్ ఆపరేషన్లు జరిపి పిల్లలను బయటకు తీసుకువస్తున్నారు. ఈ విషయమై వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఆవేదన వ్యక్తం చేసినారు. ఈ వ్యవహారం తల్లి, పిల్లలకు నష్టదాయకమని ఆయన అనేక సభల్లో శాస్త్రీయంగా చెపుతున్నారు. అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేయడాన్ని ప్రైవేటు దవాఖానాలు మానుకోవాలని, లేనట్టయితే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. వైద్యపరంగా అత్యవసరం అయితే తప్ప తల్లిదండ్రులు కూడా ఇటువంటి అశాస్త్రీయ పద్దతులను ప్రోత్సహించ వద్దని హితవు పలికారు. దానితో పాటు ఈ జాతకాల పిచ్చి కూడా తగ్గితే బాగుండు. ఇది తగ్గితే సిజేరియన్ ఆపరేషన్లు కూడా కొంత మేరకు తగ్గుతాయి.
కాలమిస్టు పరిచయం
శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను గత వారం నుంచి ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”.
వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com