‘చాళుక్య త్రిభువనగిరి – ఉత్తుంగ కవితాఝరి’
‘నజర్ బదిలీతో నజారేఁభీ బదల్ జాతే హైఁ
ఆద్ మీతో క్యా ఆద్ మీ! సితారే భీ బదల్ జాతేహైఁ’అంటాడో ఉర్దూకవి. ‘Beauty is in the eyes of beholder’ అన్న మాటకు అచ్చుగుద్దినట్టున్న నఖల్ కాదు ఆ షేర్. దృష్టి-అంటే కేవలం చూపు అనే అర్థంలో మాత్రమే తీసుకోగూడదన్న భావం అది. ఆ భావం ‘యాదాద్రి భువనగిరి’, జిల్లాగా ఏర్పడ్డ తర్వాత నాకు కొత్తగా అర్థం కాసాగింది. ఆ మాటే చాలాసార్లు కవిమిత్రుడు డా. పోరెడ్డి రంగయ్యతో అన్నాను. బహుశా ఆ మాట డా.పోరెడ్డి మనసులో నాటుకోవడం వల్ల కాబోలు ‘భువన కవనా’నికి మీరే ముందుమాట రాయాలని నాతో పోరు చేశాడు. ఆయనే గెలిచాడు.
డా.ఏనుగు నరసింహారెడ్డి
‘ఆంధ్రా, తెలంగాణ విడిపోతే భూమేమీ బద్దలు కా’దన్నాడు కాళోజీ. ఉమ్మడి నల్లగొండ మూడు జిల్లాలైనా నష్టమేమీ జరగలేదు. పైగా మనందరికీ దృష్టి వైశాల్యం పెరిగింది. కొత్తజిల్లా, పాత గ్రామాల మీద కూడా మన చూపుల వెలుగు ప్రసరించింది. గ్రామస్థాయి కూడా లేని ఉపగ్రామాల గురించి, గూడాల గురించి, తాండాల గురించి మనం వివరంగా ఆలోచించగలుగుతున్నాం. ప్రభుత్వాలు, ప్రతినిథులు చేరుకోవాల్సిన మూలాలన్నీ చేరుకుంటున్నారు. దక్కన్ పీఠభూమిలో విలక్షణ చరిత్ర ఉన్న భువనగిరి, రాచకొండలతోపాటు నారాయణపురం, రాజాపేట లాంటి కేంద్రాలను మనం ఇన్ని రోజులుగా ఎందుకు మరిచిపోయామో ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నది. అగ్నిపర్వతాలు నిక్షిప్తం చేసిన రాతి సంపద (Rock deposit) కు కారణం ఇక్కడ ఘనీభవించిన లావా. యాదమహర్షి కొండ; రాచగిరి (రాచకొండ) శిలాసమూహం; వలిగొండ, దుబ్బాక గుట్టల గుండ్రాతులు, భువనమల్లుడి పేరు మోస్తున్న ఏకశిల ప్రకృతి సౌందర్యాన్ని కేంద్రీకృతం చేశాయి ఇక్కడ. రైతులు రాజుల మీద తిరగబడ్డ చరిత్రకు ఆనవాళ్ళుగా కూలిన గడీగోడల కేంద్రమిది. భూదానానికి, ఉద్యమానికి ముందే జరిగిన భూదానానికి సంబంధించిన కథలు ఒక పోచంపల్లి, ఒక బొల్లేపల్లి గానం చేస్తుంటాయి. పట్నపోళ్ళ మురికి కాల్వను పరిశుద్ధ మూసీనదిగా మారుస్తుందీ ఈ జిల్లా. అటు ఓరుగల్లుకు, ఇటు నీలగిరికి నట్టనడుమ భాగ్యనగరం సరసన భక్తినగరంగా, రమణీయ ప్రకృతివనంగా నిలుస్తుంది భువనగిరి పట్టణం. చూడగలిగే కళ్ళే ఉండాలే కానీ,
‘చూపులోన అద్భుతాలు దాగి ఉన్నవి
సృష్టిలోన అద్భుతాలు దాగి ఉన్నవి
ప్రకృతిలో దైవత్వం లేనిదెక్కడ
మనసు పొరన అద్భుతాలు దాగి ఉన్నవి’
(తెలంగాణ రుబాయిలు -ఏనుగు)
ప్రాచీన సారస్వత సంపదను ఈ నేల ప్రోదిచేసుకుందని ఆనంద పడిపోయాం. కానీ ఈ మన ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తూ డా. పోరెడ్డి రంగయ్య గ్రంథం ఇలా వస్తుందని ఊహించలేదు
33 కొత్త జిల్లాలతోపాటు యాదాద్రి జిల్లా 2016 అక్టోబర్ 11 విజయదశమి రోజున ఏర్పాటై తర్వాత యాదాద్రి-భువనగిరిగా పేరు సంతరించుకోవడంతో భువనగిరి ఆస్తి అప్పుల పునర్మూల్యాంకనం మొదలయింది. మిగిలిన సంగతులన్నీ ఎలా ఉన్నా సాహిత్యకారులు కవిత్వ వారసత్వాన్ని లెక్కించడం మొదలుపెట్టారు. గోపరాజుది ‘కొరవి’ అయినా ఆయన ఇక్కడే రచనలు చేశాడని మురిసిపోయాం. పోతన యవ్వన కాలం మూడవ సింగభూపాలుడి రాచగిరి (రాచకొండ)లో నడిచిందని, భోగినీ దండకం ఇక్కడే పుట్టిందని పులకించాం. ‘నందికంట పోతరాజు’ కోసం శ్రీనాథకవిసార్వభౌముడు పెదకోమటి వేమారెడ్డి ప్రతినిధిగా రాచగిరి (రాచకొండ)ని వినమ్రంగా ప్రస్తుతించాడని ఆనందించాం. గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం, రాజకవి సింగభూపాలుడి రసార్ణవ సుధాకరం ఈ నేలమీద పురుడు పోసుకున్నాయని ప్రాచీన సారస్వత సంపదను ఈ నేల ప్రోదిచేసుకుందని ఆనంద పడిపోయాం. కానీ ఈ మన ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తూ డా. పోరెడ్డి రంగయ్య గ్రంథం ఇలా వస్తుందని ఊహించలేదు. మనకు రేఖామాత్రంగా పరిచయమున్న ప్రసిద్ధ కవుల మూలాలను ఇక్కడికి ముడి వేసి చూపిస్తున్న రంగయ్య రచన చూస్తుంటే మట్టిపొరలను సాగుకోసం తవ్వినప్పటి పరిమళం గుర్తొస్తుంది. రేణుకా భాష్యం రాసిన జగద్గురు రేణుకాచార్య: బాలచిత్తాసురంజన వ్యాఖ్య, స్మృతిదర్పణం, తర్కరత్నం రాసిన నరహరి కవి; రమాధీశ్వర శతకకర్త నాగేంద్రుడు; సిద్ధేశ్వర పురాణకర్త దండి విశ్వనాథయ్య; శ్రీ శివరామ దీక్షితీయం రాసిన శివరామదీక్షితులు; గౌడపురాణకర్త మల్లికార్జున యోగి; అనేక శతకాలు రాసిన రావూరి సంజీవరాయకవి; బహుగ్రంథకర్త భాగవతుల కృష్ణప్రభువు, యాదగిరీశునిపై రెండు శతకాలు రాసిన తిరువాయి వేంకటకవిలాంటి స్వయం పోషక కవులను వెతికి వారి కవిత్వాన్ని కాలాన్ని నమోదు చేశాడు ఈ రచయిత.
1336లో రెండవ ప్రతాపరుద్రుని పతనానంతరం ఏర్పడ్డ వెలమ పాలకుల కేంద్రమైన రాచకొండను ఆశ్రయించిన ప్రసిద్ధులు విశ్వేశ్వరుడు, శాకల్య మల్లన, గౌరన, కొరవి సత్యనారన, బొమ్మకంటి అప్పలార్యుడు, కొరవి గోపరాజు, సర్వజ్ఞ సింగభూపాలుడు తదితరుల వివరాలు, కాలం, రచనలు కూడా ఇందులో పొందుపరిచాడు. రాచకొండను ఆశ్రయించారన్న మాటే కానీ వారిని గురించి వివరాలు ఎక్కువగా తెలియని పశుపతి నాగకవి, శాకల్య అయ్యలార్యుడు, బొమ్మకంటి హరిహరుడు, శ్రీ భైరవుడు. రావు మాదానీడుల గురించిన కొద్ది సమాచారం ఈ గ్రంథంలో చేర్చబడింది.
తెలంగాణేతరులైన తెలుగువారు సవ్యమైన పరిపాలనలో ఉన్నందువల్ల వారి చరిత్ర నమోదుకు, 20వ శతాబ్దం సగం వరకూ భూస్వామ్య సమాజంలో ఉన్న తెలంగాణ ప్రజల చరిత్రకూ తప్పనిసరిగా వ్యత్యాసముంటుంది
డా. పోరెడ్డి రంగయ్య పొందుపరిచిన 23 మంది ప్రాచీన కవుల సమాచారం విలువైనది. అయితే అది సమగ్రం అయ్యే అవకాశం లేకపోవడం ఆశ్చర్యం కాదు. వీళ్ళలో రాచకొండ ఆశ్రితుల గురించిన సమాచారం ఈ రచయితకు కొంత సులభంగా దొరికి ఉండవచ్చునేమో కానీ భువనగిరి, కొలనుపాక లాంటి ఇతర ప్రాంతాల కవుల సమాచారం కోసం రచయిత చాలా శ్రమ చేయవలసి వచ్చి ఉంటుంది. చాలా మంది పండితులను, పరిశోధకులను సంప్రదించాల్సి వచ్చి ఉంటుంది. ప్రాచీనకవుల జాబితాలోని కొందరిని ఇతర ప్రాంతాలవాళ్ళు క్లెయిమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పరిశోధన అన్నది నిరంతరం పరీక్షను ఎదుర్కొంటూనే ఉంటుంది కాబట్టి ఇది ఇతర పరిశోధనలకు మంచి పునాదిగా పనికొస్తుందంటే విజయం సాధించినట్లే. “Research usually means finding something new : a substance, a formula, or an invertion. So literary research means finding some thing new within a literary work’ అన్నారు కాబట్టి సాహిత్యకారుల ప్రాంతాలను అతిక్రమించడం పెద్ద తప్పిదం కూడా కాబోదు. ఇంత చర్చించిన తర్వాత చెప్పుకొని తీరాల్సిన విషయమేమిటంటే ఈ ప్రాచీన కవులకు కొన్ని పదుల రెట్ల కవులు మన చేతికి చిక్కకుండానే కాల గర్భంలో కలిసిపోయి ఉంటారు.
మధ్యయుగాలనుండే తెలంగాణేతరులైన తెలుగువారు సవ్యమైన పరిపాలనలో ఉన్నందువల్ల వారి చరిత్ర నమోదుకు, 20వ శతాబ్దం సగం వరకూ భూస్వామ్య సమాజంలో ఉన్న తెలంగాణ ప్రజల చరిత్రకూ తప్పనిసరిగా వ్యత్యాసముంటుంది. ‘పరస్పరం సంఘర్షించిన శక్తులలో’ చరిత్ర పుడుతుందనడానికి ఇక్కడి సాయుధ పోరాటమే సరియైన ఉదాహరణ. ‘తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని’ యని సురవరం చెప్పినట్లు ‘మనమూ చరిత్రకెక్కదగినవారమే అని ఘోషిస్తూ నడిచిన పోరాటంతో సాహిత్యం కలిసి నడిచింది. ఇక్కడి అట్టడుగు వర్గాల వారి జీవితాన్ని కరుణరసాత్మకంగా కళ్ళకు కట్టి, చేయాల్సిన పోరాటాన్ని చెప్పకనే చెప్పింది.
‘తాటిజెగ్గల కాలిజోడు తప్పటడుగుల నడకతీరు
బాటతో పని లేకుంటయ్యిందా ఓ పాలబుగ్గల జీతగాడా
చేతికర్రే తోడై నిలిచిందా
పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా
పాలుమరిచీ ఎన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడా
కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో’
(సుద్దాల హన్మంతు)
బి.ఎన్. శాస్త్రి, కూరెళ్ళ, తిరునగరి, ఎన్.గోపి, నిఖిలేశ్వర్, బోయ జంగయ్య, రవ్వా శ్రీహరి, సుద్దాల అశోక్ తేజలాంటి సీనియర్లతోపాటు 16 ఏండ్ల వయసున్న ఇంటర్ విద్యార్థిదాకా 378 (22+356) మంది కవులు, రచయితలను ఒకచోటికి చేర్చి ఒక గొప్ప కవులు గుచ్ఛాన్ని సాహిత్యలోకానికి అందిస్తున్నాడు డా॥పోరెడ్డి రంగయ్య,
అన్న సుప్రసిద్ధ గేయం యాదాద్రి భువనగిరి జిల్లా నుండే వచ్చి అలనాటి ఉద్యమానికి ఊపిరులూదిన సంగతి ఈ గ్రంథానికి వన్నె తెస్తుంది. స్వాతంత్య్రానంతరం, హైదరాబాద్ సంస్థానం విలీనానంతరం కొనసాగిన అన్ని ఉద్యమాలలో ఇక్కడ సాహిత్య సృజన కొనసాగింది. ఉద్యమేతరమైన మానవ సంవేదనలన్నింటిలోనూ ఈ జిల్లా కవులు, రచయితలు తమదైన భూమికను పోషించారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అక్షరాస్యతోద్యమం, గోదావరి లోయ పోరాటానికి మద్దతు, మలిదశ రాస్ట్రోద్యమాలలో కవులు కలిసి నడిచారు. అటు వచన కవిత్వం, ఇటు పాట, ఒకవైపు కథ, మరో వైపు విమర్శ, ఇంకోదారిలో అనువాదాలు ఈ జిల్లా సృజించిందన్న సంగతి ఈగ్రంథంలో డా.పోరెడ్డి రంగయ్య నిక్షిప్తం చేశారు.
కవిత్వంలో పద్యం, వచన కవితలను, ఫిక్షన్లో కథలు, నవలలను; పాటలలో అభ్యుదయ సంస్కరణ గీతాలను; విమర్శలో అన్ని సాహిత్యరూపాలపై విశ్లేషణను; పరిశోధనలో చారిత్రక, సాహిత్య కోణాలను ఈ జిల్లా తెలుగు సాహిత్య జగత్తుకు అందించిందన్న సత్యం రంగయ్య పుస్తకం తెలియజెప్తుంది. బి.ఎన్. శాస్త్రి, కూరెళ్ళ, తిరునగరి, ఎన్.గోపి, నిఖిలేశ్వర్, బోయ జంగయ్య, రవ్వా శ్రీహరి, ముక్తవరం పార్థసారథి, దేవరాజు మహారాజు, తెలిదేవర భానుమూర్తి, సుద్దాల అశోక్ తేజలాంటి సీనియర్లతోపాటు 16 ఏండ్ల వయసున్న ఇంటర్ విద్యార్థిదాకా 378 (22+356) మంది కవులు, రచయితలను ఒకచోటికి చేర్చి ఒక గొప్ప కవులు గుచ్ఛాన్ని సాహిత్యలోకానికి అందిస్తున్నాడు డా॥పోరెడ్డి రంగయ్య,
‘భారతీయులకు చరిత్ర స్పృహ తక్కువ’ అన్నమాట మనను కొంత బాధించినప్పటికీ అది నిజం. ఏలె ఎల్లయ్య సిద్ధాంతి డజన్ల కొద్ది కావ్యాలు రాసినా అవి ప్రచురణకు నోచుకోలేదు, బొడిగే ఉగ్రగౌడ ఎన్నో యక్షగానాలు రాసినా ఎవరికీ తెలియకుండా ఉండిపోయాడు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియలూ అవసరమైనవే, విశేషణమైనవే అనే స్పృహ తక్కువ ఉండడం వల్ల సాహిత్యకారులు పరస్పరం ఒకరినొకరు గుర్తించుకోవడానికి ఇష్టపడని సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇన్ని పరిమితుల నడుమ ఒక జిల్లా సాహిత్యకారుల చిట్టా ఒకచోటికి తేవడమనే బృహత్ కార్యాన్ని రంగయ్య నెరవేర్చ గలిగాడు. ఈ పుస్తకంలో కేవలం సమాచారం మాత్రమే ఉందన్న నిజం మనం గుర్తిస్తే విమర్శనాత్మక విశ్లేషణ (క్రిటికల్ ఎనాలిసిస్) గురించిన అత్యాశ మానుకోగలుగుతాము. అయినా రంగయ్య ప్రతి కవికీ వీలైనంతవరకు ఒక ప్రాతినిథ్య కవితాపాదాన్ని ఉటంకించడానికి ప్రయత్నించాడు. మొత్తంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంత దగ్గరగా, కనెక్టెడ్ గా, ప్రకృతి రమణీయంగా, ప్రాచీనాధునిక సమ్మేళనంగా ఉందో సాహిత్య చరిత్ర అంత వైబ్రెంట్ గా ఉందని ఈ సంకలనం ద్వారా డా॥రంగయ్య నిరూపించాడు. ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని విస్తృతమైన పరిశోధనలు చేయడానికి అవకాశం కలుగుతుంది. అదే ఈ గ్రంథం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం.
కేవలం కవి అయినవారివల్ల ఇంత బృహత్కార్యం సాధ్యం కాదు. అందరికీ తలలో నాల్కలా ఉండి సమయపాలన చేస్తూ సమాచారం సేకరించడం వల్ల ‘భువన కవనం’ సాధ్యమయింది.
డా.పోరెడ్డి రంగయ్య స్వయంగా కవి, కార్యదక్షుడు, వినయశీలి. కేవలం కవి అయినవారివల్ల ఇంత బృహత్కార్యం సాధ్యం కాదు. అందరికీ తలలో నాల్కలా ఉండి సమయపాలన చేస్తూ సమాచారం సేకరించడం వల్ల ‘భువన కవనం’ సాధ్యమయింది. ఈ గ్రంథం ఈ రూపును సంతరించుకోవడానికి కావలసిన సమాచార సేకరణ, కూర్పులో రంగయ్యకు జిల్లా కవులతోపాటు ఆయన సతీమణి రాజేశ్వరిగారి కృషి తప్పకుండా ఉంటుందని నేను నమ్ముతున్నా, ఇరువురూ కలిసి సాహిత్య సేవలో మునిగిన ఈ దంపతులకు కవులందరి తరఫున అభినందనలు. కృతజ్ఞతలు.
‘భువన కవనం’ వెల రూ. 300. ఈ పుస్తకం కావాల్సిన వారు సంప్రదించవలసిన నంబరు- 99480 49864, చిరునామా – పొరెడ్డి శరత్ రెడ్డి, ఇంటి నంబర్ 14-215/5, 3 వ వీధి, ఆదర్శ నగర్, ఆలేరు – 508 101.
వ్యాసకర్త డా.ఏనుగు నరసింహారెడ్డి కవి, రచయిత, సాహిత్య విమర్శకులు. వారి ‘తెలంగాణ రుబాయిలు’ ప్రసిద్ది పొందిన కవితా సంపుటి. దీంతో పాటు వారు ‘కొత్త పలక’, ‘మూల మలుపు’ కవితా సంపుటులు కూడా వెలువరించారు. మీర్ లాయక్ అలీ గ్రంధాన్ని ‘హైదరాబాద్ విషాదం’ పేరిట అనువదించారు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా సేవలు అందించిన విషయం సాహితీ లోకానికి పరిచితమే. మొబైల్ 8978869183.
మంచి ఆర్టికల్ సర్. అభినందనలు
భువన కవనం కవుల పరిశోధన గ్రంథం