Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌‘మనసు పొరల్లో…’ : నేను వెతుకుతుంది గురు దత్ లాంటి స్పందించే హృదయాన్ని... –...

‘మనసు పొరల్లో…’ : నేను వెతుకుతుంది గురు దత్ లాంటి స్పందించే హృదయాన్ని… – పి. జ్యోతి తెలుపు

నేను సినిమా, పుస్తకం మలచిన మనిషిని అని చెప్పినప్పుడు కొందరి మిత్రులు మరి ఎందుకో దాన్ని అంగీకరించరు. నిజానికి నా జీవితంలో కుటుంబ ప్రభావం, మిత్రుల ప్రభావం, నేను తిన్న ఎదురు దెబ్బల ప్రభావం నాపై ఎంత ఉన్నా నాకు వాటి వలన కలిగిన ఎన్నో ప్రశ్నలు సందేహాలు సంఘర్షణలు నిరంతరం వేధించేవి కాని పరిష్కారార మార్గం చూపించేవి కావు. నాలో నేను వేసుకునే చాలా ప్రశ్నలకు జవాబులు నాకు పుస్తకం, సినిమాల ద్వారానే దొరికాయి. నన్ను ప్రభావితం చేసిన సినిమాల గురించి అందుకే ఈ వారం ప్రస్తావిస్తున్నాను.

పి.జ్యోతి

చిన్నప్పటి నుండి సినిమాలను బాగా చూసేదాన్ని. అప్పట్లో థియేటర్ కన్నా టివీలో చూసిన సినిమాలే ఎక్కువ. నేను సినిమాను చూస్తే ఆ సీన్లన్నీ మనసులో అలాగే ముద్రించుకునిపోయేవి. ఆఖరికి ఆ సన్నివేశంలో దర్శకుడు వాడిన వస్తువులను కూడా మనసు రికార్డ్ చేసేది. ఇది మాత్రం నేను విడిగా నేర్చుకున్న విద్య కాదు. సహజంగా అలా మనసులో అ దృశ్యాలు ముద్రించుకుపోయేవి. దీనికి నేను ప్రత్యేకంగా ఏ ప్రయత్నమూ చేయలేదు. చిన్నప్పటినుండి సినిమాల పట్ల నాలో బిన్నమైన టేస్ట్ ఉండేది. అందువలన ఆ సమయంలో పిల్లలకు బోర్ అనిపించిన సినిమాలు నాకు అర్ధం అవుతున్నట్లే ఉండేవి. కొన్ని సినిమాల ప్రభావం చూసిన మొదటి రోజు నుండి ఈ రోజు దాకా నాతో నిలిచే ఉంది. అందులో ముఖ్యమైన రెండు సినిమాలను వాటి ద్వారా మారిన నా వ్యక్తిత్వాన్ని నేను పంచుకుందామనుకుంటున్నాను.

నన్ను అత్యంత ప్రభావితం చేసిన సినిమా

‘ప్యాసా’ – నన్ను పూర్తిగా ఓన్ చేసుకున్న సినిమా ఇది. ఇందులో ప్రతి డైలాగ్, గురు దత్ ప్రతి భావం నాలోకి ఇంకిపోయింది. ఈ సినిమా నాకు ఆత్మహత్య ఆనే మరణ విధానం ఒకటుంటుందనే విషయాన్ని పరిచయం చేసింది. ప్రపంచంలోని హిపోక్రసి ని పరిచయం చేసింది. నా చుట్టూ నేను చూసే మనుష్యులలో ఈ లక్షణాలను గుర్తించడం నేర్పించింది. అలాగే సమస్యను వ్యక్తిగత స్థాయి నుండి కాకుండా సామాజిక స్థాయి నుండి చూడడం నేర్పించింది. ముఖ్యంగా మనుషులలో ఉండవలసిన సున్నితత్వాన్ని పరిచయం చేసింది. అందుకే కావచ్చు అంత ఇంటెన్సిటితో ప్రేమించే వ్యక్తులను వెతుకుతూనే ఉన్నాను. కాని అలాంటి వారు నిజ జీవితంలో ఎక్కడ దొరుకుతారు.

“ప్యాసా” సినిమా నాలో ఆ భావనను కలిగించి, నేను పిచ్చిదానవకుండా కాపాడింది

జీవితాన్ని యధావిధిగా స్వీకరించడం, రాజీ పడిపోవడం, బంధాలలో హిపోక్రసీని అంగీకరించడం నేను ఇప్పటికీ చేయలేకపోవడానికి కారణం బహుశా గురు దత్ చూపించే భావాలను పూర్తిగా ఓన్ చేసుకుని మనుషులిలాగే ఉండాలని అని అప్పట్లోనే నా మనసులో పడిన ముద్ర కావచ్చు.

కొంత మంది దృష్టిలో నేను ఎవరితోనూ మానసికంగా కనెక్ట్ కాలేని వ్యక్తిని. కాని నచ్చని వారిని అది మన కుటుంబీకులయినా సరే నచ్చినట్లు నటించడం, పైకి విశాలత్వాన్ని ప్రదర్శిస్తూ అనుకూలంగా లేని సమయాలలో సంకుచితులుగా మారడం నాకు చేతకాని అంశాలు. మనుష్యులు నిరంతరం పరపతికి, డబ్బుకి, హోదాకి, అధికారానికి, అవసరాలకు లొంగిపోతూ కనిపిస్తూనే ఉంటారు. ఇది నా వారయినా నేను అంగీకరించలేని అంశం. గురు దత్ కూడా ఈ భావాలతో జీవితంలో ఒంటరితనన్ని అనుభవించాడు తప్ప సాధించింది ఏంటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉంటాను.

పంకజ్ ఉధాస్ గజల్

అటువంటి సున్నిత మనస్తత్వాన్ని అలవర్చుకుని వేల సార్లు గాయాల పాలైన నాలో కూడా ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి. అప్పుడు పంకజ్ ఉధాస్ గజల్ ఒకటి వినడం జరిగింది. ఇది కాలేజీ రోజుల నాటి మాట. ఆ గజల్ పల్లవి ఇలా ఉంటుంది….”ఖుద్ కి ఖాతిర్ నా జమానే కే లియే జిందా హూ.. మై మసీహా కో బచానే కే లియె జిందా హూ… రూహ్ ఆవారా నా భటకే కిసీకే ఖాతిర్ మై సారి రిష్తో కొ భులానే కే లియే జిందా హూ…”

దీనర్థం…నా కోసం కాదు ప్రపంచం కోసం కాదు నేను జీవించి ఉన్నది. ఆ దైవాన్ని దైవత్వాన్ని బ్రతికి ఉంచడానికి జీవించి ఉన్నాను. నా అత్మ నా తదనంతరం అశాంతిగా తిరగకూడదని ప్రతి బంధాన్ని ఇక్కడే వదిలించుకోవడానికి జీవించి ఉన్నాను.

ఈ గజల్ ఇప్పుడు నా కలెక్షన్లో లేదు. కాని ఈ పల్లవి ఎవరు రాసారో కాని నా మనసుపై ముద్రించుకుపోయింది.

వేదన దూరం అవుతూ ఉంటే…

గురు దత్ తన సినిమాల ద్వారా ఇంకా మా లాంటి వారితో సంభాషిస్తూనే ఉన్నాడు. అతను కోరుకున్న ప్రపంచాన్ని కోరుకుంటున్న వాళ్ళం ఇంకా ఉన్నాం, భవిష్యత్ తరాలలో కూడా ఉంటూనే ఉంటాం.

ప్రాక్టికాలిటి అనబడే అవకాశవాదానికి విరుద్దంగా ఉండే ఆలోచనలను బ్రతికి ఉంచాలంటే అసలు మాలాంటి వాళ్ళు బ్రతికి ఉండాలి కదా.

ఈ ప్రపంచం నుండి మాకేమీ దొరకదు. కాని మా ఆలోచనలు మా వ్యక్తిగత పైత్యాలని కాక అవి కొందరు మనసుల్లో జీవితాల్లో నుండి పుట్టినవని తెలిసినప్పుడు మనం ఒంటరి కాదనే భావన వస్తుంది. “ప్యాసా” సినిమా నాలో ఆ భావనను కలిగించి, నేను పిచ్చిదాన్ని కాకుండా కాపాడింది. లేదంటే నాలోనే ఏదో తేడా ఉందని నిత్యం నన్ను వేలెత్తి చూపే వారి మధ్య నాలోని ఆత్మవిశ్వాసాన్ని బ్రతికించుకుని జీవించి ఉండగలిగే దాన్ని కాదు. ప్రాక్టికాలిటి అనబడే అవకాశవాదానికి విరుద్దంగా ఉండే ఆలోచనలను బ్రతికి ఉంచాలంటే అసలు మాలాంటి వాళ్ళు బ్రతికి ఉండాలి కదా! ఆ భావాలను, సున్నితత్వాన్ని, ప్రేమను గురించి చెప్పడానికి, దాన్ని కోరుకుంటూ ఈ ప్రపంచంలో అది లభ్యం అవవచ్చనే ఆలోచనను బ్రతికి ఉంచడానికి మా లాంటి వాళ్ళు బ్రతికి ఉండాలి కదా!

నా తొలి ప్రేమ, ఆఖరి ప్రేమ కూడా ఈ వ్యక్తే, అది గురు దత్తా అతను నటించిన పాత్రా అన్నది మాత్రం చెప్పలేను.

గురు దత్ ఆత్మహత్య ఇటువంటి ఆలోచనలు ఉన్న వారిలో అభద్రతా భావాన్ని కలిగించింది. ప్రపంచంలో ఈ సున్నితత్వం, ప్రేమ వెతుక్కోవడం ఓ మూర్ఖత్వం అన్న ఆలోచనలోకి చాలా మందిని నెట్టేసింది. గురు దత్ ప్రస్తావన వచ్చిన ప్రతి సారి అందరూ వారి చర్చలకు ఇదే రకమైన ముగింపు ఇస్తారు. కొందరు జీవితంలో ప్రాక్టికాలిటి అవసరం అని కాలు మీద కాలు వేసుకుని గర్వంగా చెప్పుకుపోతారు. ఎదగడం ముఖ్యం అని దాని కోసం కొన్ని విషయాలలో రాజీ పడడం తెలివైన పని అని చెబుతూ పోతారు. ఇలాంటి వారి మధ్య జీవించి ఉంటూ ఆ సున్నితత్వాన్ని ప్రేమిస్తూ, దాన్ని నమ్మి జీవించడం కొందరి భాద్యత అనిపించింది ఆ పై గజల్ విన్నప్పుడు.

నేను ఈ రోజుకీ విశ్వాసంతో బ్రతికి ఉన్నానంటే నాతో దైవత్వం బ్రతికి ఉంటుందని నమ్మే.

కొందరు జీవించి ఉంటే వారితో దైవత్వం జీవించి ఉంటుంది. కొందరు జీవించి ఉంటే వారితో భావుకత, సున్నితత్వం, సహజత్వం, నిజాయితీ జీవించి ఉంటాయి. అవి జీవించి ఉండాలంటే వాటిని ప్రేమించే వ్యక్తులు జీవించి ఉండలి, అందుకే చాలా సందర్భాలలో గుండెకు బలమైన గాయాలయినా “మై మసీహా కో బచానే కే లియే జిందా హూ” అనుకుంటూ ఊంటాను. ఇది గర్వం అని కొందరు అనుకోవచ్చుగాక కాని నేను ఈ రోజుకీ విశ్వాసంతో బ్రతికి ఉన్నానంటే నాతో దైవత్వం బ్రతికి ఉంటుందని నమ్మే. అందుకే నా పట్ల కౄరంగా ప్రవర్తించిన వారికి దూరం జరుగుతూనే కూడా భాద్యతల పట్ల అంతే జాగురూకతతో ఉండడం నాకు అలవాటయింది.

ఆ వేదన దాని కదే దూరం అవుతూ ఉంటే మనకు స్వేచ్చ ప్రసాదించినట్లు అనుకోవాలని ఆ నాటి ‘ప్యాసా’ సినిమాలోని ఓ మనసు పడిన ఒంటరి వేదన నుండి మా అమ్మమ్మ మరణం దాకా …చాలా విషయాలు నాకు నేర్పించాయి.

రెండు సంవత్సరాల క్రితం 93 సంవత్సరాలు బ్రతికిన మా అమ్మమ్మ మరణించింది. ఈవిడ చివరి ఆరు నెలలు మంచంలో ఉంది. శరీరం పై బెడ్ సోర్స్ తో ఆమె నరకం అనుభవించింది. ఆమె ఆఖరి క్షణాలలో నేనూ ఆమె పక్కనే ఉన్నాను. ప్రొద్దున తొమ్మిదిన్నర నుండి పదకొండున్నర దాకా ఆమె ప్రాణం కొట్టుకునీ కొట్టూకునీ పోయింది. అది ఎంత నరకమో ప్రత్యక్ష్యంగా ప్రతి నిముషం ఆమె పక్కనే ఉండి చూసాను. అది నాలో ఒక వైరాగ్యాన్ని తీసుకొచ్చింది. ఆమె చివరి రోజుల్లో మనుషుల కోసం, ఇష్టమైన వాటి కోసం తపించి తపించి చనిపోయింది. ఎవరిని ప్రేమించిందో, ఏం కోరుకుందో, ఏం ఆశించిందో, ఎవరి మీద ప్రేమ నిలుపుకుందో తెలియదు. కాని అన్ని బంధాలకు, అన్ని ఇష్టాలకు ఒక ముగింపు ఇక్కడే పలకడం మనిషికి ఓ వరం అన్న విషయం అప్పటి దాకా నా అనుభవాల దృష్ట్యా నాకు అర్దం అవుతున్నా, నాకు స్పష్టం అయింది మాత్రం ఆ క్షణంలోనే.

మనల్ని కాదనుకున్నవారు మనలను ఎన్ని విధాలుగా రక్షించారో అర్ధం అవుతే ఇక వీడీపోయిన వారిని తలచుకుని బాధపడవలసిన అవసరం రాదు.

ఈ ఆత్మ ఎవరి కోసమో కొట్టుకోకుండా, మనలను మన జీవితకాలంలోనే విడిచిపోతున్న ప్రతి బంధం మనల్ని ఓ రకంగా ఇలాంటి నరకం నుండి రక్షిస్తుందని అనుకోవచ్చని ఆమె మరణం నేర్పించింది.

మనల్ని కాదనుకున్నవారు మనలను ఎన్ని విధాలుగా రక్షించారో అర్ధం అవుతే ఇక వీడీపోయిన వారిని తలచుకుని బాధపడవలసిన అవసరం రాదు. ఈ స్థితిని దాటితే ఒకొక్కరు మనలను వీడి వెళ్ళిపోవడం ఒక రకంగా అదృష్టమేమో అని కూడా అనిపిస్తుంది. బంధాల నుండి వచ్చేది వేదనే అని తెలుసు మరి ఆ వేదన దాని కదే దూరం అవుతూ ఉంటే మనకు స్వేచ్చ ప్రసాదించినట్లు అనుకోవాలని ఆ నాటి ‘ప్యాసా’ సినిమాలోని ఓ మనసు పడిన ఒంటరి వేదన నుండి మా అమ్మమ్మ మరణం దాకా నా మనసుకు తగిలిన చాలా విషయాలు నాకు నేర్పించాయి.

రోషినిలో పనిచేయడానికి కారణం

‘ప్యాసా’ సినిమా నాలో కలిగించిన అలజడే నేను రోషిని అనే ఎన్.జీ.వో లో పని చేయడానికి కారణం అయింది. పదిహేను సంవత్సరాలుగా నేను ఇందులో వాలింటీరుగా పని చేస్తున్నాను. కొంత మందినయినా అత్మహత్య దిశనుండి జీవితం వైపులు మరలించే ప్రయత్నం నా వంతుగా చేస్తున్నాను. ఇది గురు దత్ నా పై చూపిన ప్రభావానికి నిదర్శనం అని ఈ రోజు కాదు, నేను రోషిణీలో వలంటీరుగా చేరిన రోజే మీటింగ్ లో అందరి ఎదుట చెప్పాను.

గురు దత్ తో నా పరిచయం నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు “ప్యాసా” సినిమాతో మొదలయింది. అప్పటి నుండి నేను మనుషులలో వెతుకుతుంది గురు దత్ లాంటి స్పందించే హృదయాన్ని.

జీవితంలో మనం చాలా సందర్భాలలో ఆకర్షణలకు గురి అవుతాం. అది ఫస్ట్ లవ్ అని చెపుతూ దాన్ని గుర్తుచేసుకుంటున్న ప్రతి సారి కూడా కొన్ని స్పందనలను అనుభవిస్తాం. ఇప్పటి జెనరేషన్ మాటల్లో చెప్పాలంటే గుండే లబ్ డబ్ లబ్ డబ్ అని కొందరు గుర్తుకు వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. నాకు జీవితంలో తెరపై గురు దత్ కనిపిస్తున్న ప్రతి సారి గుండె ఇలాగే కొట్టుకుంటుంది. “ప్యాసా” సినిమా “కాగజ్ కే ఫూల్” సినిమా చూస్తుంటే అచ్చం ఇదే స్పందనను అనుభవిస్తాను. నిజ జీవితంలో అంతగా స్పందింప జేసిన వ్యక్తి నా జీవితంలో ఎవరూ లేరు. ఎందుకంటే ఎవరిలో నాకు గురు దత్ కనిపించలేదు మరి. గురు దత్ తో నా పరిచయం నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు “ప్యాసా” సినిమాతో మొదలయింది. అప్పటి నుండి నేను మనుషులలో వెతుకుతుంది గురు దత్ లాంటి స్పందించే హృదయాన్ని.

ఐతే, ఇన్నిఆలోచనల మధ్య కూడా నేనెప్పుడూ ఎక్స్టోవర్ట్ గానే బ్రతికాను. మనసులో ప్రతి ఆలోచనను పైకే ప్రదర్శించడం నా అలవాటు. అసలే ఎవరికీ అంతు పట్టని పోకడ పైపెచ్చు వాటిని బైటికే వ్యక్తీకరించే అలవాటు. దానితో చాలా మంది మీ ప్రేమ కథ చెప్పండి అంటూ అప్పుడపుడు అడుగుతూ ఉంటారు. కథలో ప్రేమ ఉంటే అది ప్రేమ అవుతుంది. కాని బలవంతపు జీవితం, తప్పని కష్టం, లేదా తప్పుడు నిర్ణయం ప్రేమ ఎలా అవుతుంది. అందుకని నేను అందరికీ ఒకటే చెబుతాను నేను ఎప్పుడూ ప్రేమించింది ఒక్క గురు దత్ నే. మళ్ళీ అలా మనసుతో సంభాషించే వ్యక్తి కనిపిస్తే తప్ప నేను ఆ దిశగా స్పందించలేను.

ఒక్క “ప్యాసా” సినిమా ముఖ్యంగా ‘విజయ్’ గా గురు దత్ జీవితాంతం నన్ను ఇలా కట్టిపడేసాడు మరి.

ఒంటరి స్త్రీలు పిల్లులుగానే బ్రతకాలా బిడ్డలను నోట కరుచుకుని పది స్థలాలు మారుతూ. ఏం ఇలా ఉండలేమా

సింహం కూడా ఒంటరిగానే ఉంటుంది…

ఒంటరి స్త్రీ చుట్టూ ఎన్నో కథలు. మా చుట్టూ తిరిగే మనుషులు ఎందరో. చాలా మంచి డిగ్నిఫైడ్ వ్యక్తిగా సమాజం ముందు కనిపించే వ్యక్తి, అపర శ్రీ రాముడు కూడా ఒంటరి స్త్రీ దగ్గర చాటుమాటు కృష్టుడు అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలాంటి అనుభవాలు నాకు చాలానే ఉన్నాయి.

ఒంటరి స్త్రీలో ఈ సింహం కనపడదు ఎందుకు సమాజానికి. తిండి లేకపోతే మాడి చస్తుంది కాని సింహం గడ్డి తినదని, తన జీవితంలో సరైన తోడు లేకపోతే ఒంటరిగా చస్తుంది కాని ఎవరో ఒకరికిరాజీ పడి లొంగిపోదని ఒంటరి స్త్రీ గురించి ఎప్పుడూ సమాజంలో ఎవరూ ఇలా ఆలోచించరు

ముఖ్యంగా నేను గమనించింది ఒంటరి స్త్రీ బలహీనురాలయితే, ఆమె కన్నీళ్ళూ చిందించడానికి తమ భుజం అందించాలనుకునే సగటు మగాళ్ళు చాలా మంది ఉంటారు. దీనికి తగ్గట్టూ మహిళా లోకం ఆ స్త్రీని బలహీనపరుస్తూ ఆమెకు లేని సౌభాగ్యం తమకే ఉందని కనీ కనిపించని అవమానాలు చేస్తూ మళ్ళీ ఆమెను తమ పతుల మనసు చలించపజేసే శరీరంగా చూస్తూ నానా ఇబ్బందులకు పవిత్రంగా గురి చేస్తూ ఉంటారు. వీటికి విసుగు చెంది ఓ స్త్రీ తనకు భుజం అందించే ఓ పురుషుడిని నమ్మి అతన్ని ముందు స్నేహితుడని తరువాత ఆప్తుడని అనుకోవడం మొదలెడుతుంది. ఆ పురుషుడు తనకు అనుకూలంగా ఉన్నంత వరకు ఆమెకు ఆప్తుడుగా ఉండి తరువాత మగాడిగా మారిపోతాడు. ఇక మళ్ళీ ఆ జీవితంలో రాజీ మొదలవుతుంది. ఆమెను ఇంత కష్టానికి గురి చేసిన పతివ్రతలు ఆమె శీలాన్ని కించపరుస్తూ తమ పాతివ్రత్యాన్ని మెరిపించుకుంటూ ఉంటారు. ఈ సంఘటనకు దారి తీసే పరిస్థితులు నా జీవితంలో అనేకం వచ్చాయి. ఓపెన్ ప్రపోజల్స్, సీక్రెట్ ప్రపోజల్స్, ఉద్దరించాలనే కోర్కెను ప్రకటించిన స్నేహితులు ఇలా ఎందరో. వీరందరూ ఇప్పటికీ నా స్నేహ బృందంలో ఉన్నారు. అది వేరే సంగతి.

ఒంటరి స్త్రీని చూస్తే ఎందుకో చాలా మందికి ఓ పిల్లి పిల్ల లేదా కుక్క పిల్లను చూసిన భావం కలుగుతుంది. అసలు సింహం కూడా ఒంటరిగానే ఉంటుందిగా. అది తన సామ్రాజ్యాన్ని, పరిధిని నిర్మించుకుని ఎవరినీ అందులోకి రానీయక, తాను మరో సింహపు పరిధిలోకి వెళ్ళకుండా జీవిస్తుంది కదా. ఒంటరి స్త్రీలో ఈ సింహం కనపడదు ఎందుకు సమాజానికి. తిండి లేకపోతే మాడి చస్తుంది కాని సింహం గడ్డి తినదని, తన జీవితంలో సరైన తోడు లేకపోతే ఒంటరిగా చస్తుంది కాని ఎవరో ఒకరికిరాజీ పడి లొంగిపోదని ఒంటరి స్త్రీ గురించి ఎప్పుడూ సమాజంలో ఎవరూ ఇలా ఆలోచించరు.

బహుశా చాలా మంది స్త్రీలు బలహీనులుగానే జీవించడం వలన కావచ్చు. కాని ఎవరేం అనుకున్నా, నా స్నేహాల పట్ల ఎవరెన్ని అభిప్రాయాలు కనపర్చినా సంబంధాల విషయంలో నేను సింహంలానే జీవించానని గర్వంగా చెప్పుకోగలను. అంత మాత్రాన నేను సురక్షితంగా ఉన్నట్లు కాదు. బలహీనంగా ఉండడనికి ఇష్టపడాని స్త్రీని బలహీనురాలిగా మార్చాలని చూసే వ్యక్తులు, సృష్టించే పరిస్థితులు చాలా ఉంటాయి. అది నిత్య పోరాటమే. నన్ను బలహీన పరచాలని ప్రయత్నించే వ్యక్తులు, వ్యవ్యస్థ నా చుట్టూ ఇంకా బలంగా పని చేస్తూ పోతుంది.

‘వంశ వృక్షం’: నన్ను దాటించిన సినిమా

కాని నాలాంటి ఒంటరి స్త్రీలు కూడా మనుషులే కదా. ఏదో ఓ క్షణాన మమ్మల్ని బలహీనతలు ఆక్రమించుకోవచ్చు. నిత్యం చేసే యుద్దం, చుట్టూ ఉన్న సమాజం గురి చేసే సవాళ్ళు అసలు ఓ అడ్వెంచర్ చేస్తే పోలా అనిపించేంత కోపానికీ మనల్ని గురి చేస్తాయి కూడా. అలాంటి సమయం కోసం కాచుకునే వ్యక్తులు అప్పుడు అవకాశం కోసం ఒక్కడుగు మా వైపుకు వేసిన సందర్భాలు జీవితంలో మాకు అనేకం వస్తాయి. అయితే వాటన్నిటినీ నేను దాటగలిగానంటే నన్ను ప్రభావితం చేసిన మరో సినిమా కారణం. ఈ విషయాన్ని నేని నిత్యం మరో రీతిలో నా క్లాస్ రూం లో కూడా ఎప్పుడూ చర్చిస్తూ ఉంటాను.

స్త్రీ పురుష సంబంధాల పట్ల నా ఆలోచనలను ప్రభావితం చేసిన సినిమా.

జీవితంలో ఓ అవసరం మనిషి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని, అతని జీవన మార్గాన్ని, జీవితాదర్శాన్ని ప్రభావితం చేయడం ఎంత వరకు అవసరం అన్న ఆలోచనను నాలో కలుగజేసిన సినిమా ఇది.

బైరప్ప గారు కన్నడ రచయిత. వీరు రాసిన ‘వంశవృక్ష’ నవలను బాపు గారు ‘వంశ వృక్షం’ సినిమాగా తీసారు. ఇందులో సోమయాజులు, అనిల్ కపూర్, జ్యోతి నటీ నటులు. ఈ సినిమాను కూడా నేను హై స్కూలులో ఉండగా మా చిలకలగుడ లోని శ్రీదేవి థియేటర్లో చూసాను. సినిమాలో సోమయాజులు ఓ నిష్టాపరుడైన బ్రాహ్మణుడు. అతని కొడుకు చిన్న వయసులో ఓ ప్రమాదంలో మరణిస్తాడు. నెలల వయసున్న మనవడు అటు వితంతువైన కోడలు. సోమయాజులు అందరినీ కాదని కోడలిని కాలేజీ చదువుకు పంపిస్తాడు. అక్కడ ఓ లెక్చరర్ ఆమెను ప్రేమిస్తాడు. సాంప్రదాయాన్ని ఎదిరించి కోడలు పునర్వివాహం చేసుకుంటుంది. కాని తన వంశాంకురం అయిన మనవడిని కోడలికి దూరంగా ఉంచుతాడు సోమయాజులు. చివరకు తన పుటుకలోనే రహస్యం ఉందని, ఈ వంశం అన్న విషయమే పెద్ద భ్రమ అని తెలుసుకుని తల్లి దగ్గరకే కొడుకుని పంపి తాను వారు జీవితాల నుండి తప్పుకుంటాడు.

“ఇరవై సంవత్సరాలు ద్యాస లేదు. నలభై తరువాత ఉండదు. మధ్యలో ఈ జీవితం నా నూరేళ్ళ జీవిన మార్గాన్ని ప్రభావితం చేయడం నేను ఇష్టపడలేదు” అంటాడు…… ఇంత కన్నా గొప్ప పాఠం మరొకటి ఉంటుందా….

సినిమాలో జ్యోతి అనిల్ కపూర్ ల మధ్య ఓ సంభాషణ వస్తుంది. తన మామగారి గతం చెపుతూ కోడలు అతనెంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడొ వివరిస్తుంది. సోమయాజులు వయసులో ఉండగా అతని భార్యకు జబ్బు చేస్తుంది. ఆమె భర్తకు సంసార సుఖం ఇవ్వలేక పోతుంది. ఆ సమయంలో పెద్దలు సోమయాజులు వయసును దృష్టిలో పెట్టుకుని అతనికి శారీరిక అవసరాల కోసం ఆ ఇంట్లో ఉన్న ఓ బ్రాహ్మణ వితంతువుని ఈ సంబంధానికి ఒప్పిస్తారు. ఆమెను అతని గదిలోకి పంపుతారు. సోమయాజులు గది బైట ఆమె ఆ రాత్రి కూర్చుని ఉంటుంది. ఆమెని చూస్తూ రాత్రంతా గడిపుతాడు అతను. ఆమెను గదిలోకి రమ్మనడు. ప్రొద్దున్న గోదావరిలో స్నానం చేసి వచ్చి మళ్ళి ఇంట్లో ఈ తంతు జరగకుండా ఇంటివారిని ఆపుతాడు. అతన్ని గేలి చేసిన వారికి “ఈ శారీరిక వాంచ పై నాకు ఇరవై సంవత్సరాలు వచ్చే దాకా ద్యాస లేదు. నలభై తరువాత ద్యాస ఉండదు. మధ్యలో ఈ ఇరవై సంవత్సరాల జీవితం నా నూరేళ్ళ జీవిన మార్గాన్ని ప్రభావితం చేయడం నేను ఇష్టపడలేదు” అంటాడు…… ఇంత కన్నా గొప్ప పాఠం మరొకటి ఉంటుందా….

వాదించుకోవడానికి మనం ఇప్పుడు సెక్స్ టీనేజ్ కుర్రాళ్ళకు ప్రధానమైన అవసరం అయిందని, అరవైలలో కూడా దానికి ప్రాధ్యాన్యత ఇచ్చే మనుష్యులు ఉన్నారని చెప్పవచ్చు. కాని జీవితంలో ఓ అవసరం మనిషి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని, అతని జీవన మార్గాన్ని, జీవితాదర్శాన్ని ప్రభావితం చేయడం ఎంత వరకు అవసరం అన్న ఆలోచనను నాలో కలుగజేసిన సినిమా ఇది.

ఈ సినిమాలో ఈ పాయింట్ నన్ను చిన్నతనంలోనే ఆకర్షించినా దీన్ని నేను పూర్తిగా ఆకళింపు చేసుకుంది, నాకు నా జీవితంలో సవాళ్ళు ఎదురయినప్పుడే. ఈ రోజు నేను బలంగా నిలబడడానికి ఈ మాట నాలో వేసిన బీజం కారణం. జీవితం అర్ధం కేవలం అవసరం తీరడమేనా… పోనీ అలా లొంగిన స్త్రీల జీవితాలు ఎలా ఉన్నాయో నా కౌన్సలింగ్ అనుభవం నాకు చాలా స్పష్టంగా చూపించింది. అందుకే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో సమయాల్లో ఈ మాట గుర్తుకు వస్తూనే ఉంటుంది.

నేను బలహీనపడకుండా కాపాడింది. సింహంలా బ్రతుకుతూ నా ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి నాకు సహాయపడిన విలువైన మాట ఇది. అందుకే ఎవరూ నమ్మకపోయినా, సినిమా మలచిన మనిషిగా నన్ను నేను చెప్పుకుంటాను. ఇక పుస్తకం గురించి మరో సందర్భంలో.…

రచయిత్రి పి. జ్యోతి హిందీ ఉపన్యాసకులు. చక్కటి సమీక్షకురాలు. హైదరాబాద్ లో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు కూడా. పుస్తకం, సినిమా తనకు రెండు కళ్ళు. ప్రపంచానికి గవాక్షాలు. ఇటీవలే వీరు రచించన దిలీప్ కుమార్ సినిమాల సమగ్ర పరిచయ పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు.

కాగా, తెలుపు కోసం రాస్తున్న ఈ శీర్షికలో తాను మొదటిసారిగా అంతర్ముఖంలోకి చూసుకుంటున్నారు. జీవితాన్నే పుస్తకంగా అనుభవాలనే చలన చిత్రంగా ఎంచి సరళమూ, నిరాడంబరమూ, సామాన్యమూ ఐన జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకుంటున్నారు. ఈ శీర్షికలో మొదటి వ్యాసం మనసు పొరల్లో. రెండో వారం చిన్ననాటి చిరుతిళ్లు. మూడో వారం చిన్ననాటి సంగతులు. నాలుగో వారం పంచుకోవడంలో అనందం. ఐదో వారం ఒంగోలు గిత్తలు ….మా తాత. ఆరో వారం ‘చందమామ’తో మొదలు.  ఏడో వారం ఎవరు రౌడీలు? ఎవరు మర్యాదస్తులు??. ఎనిమిదో వారం నాకు తెలిసిన స్త్రీ వాది – My First Feminist. తొమ్మిదో వారం ఆ మూమెంట్ గోదావరి లాంటిదే. మీరు చదువుతున్నది పదో వారం జ్ఞాపకాలు.

More articles

1 COMMENT

  1. మనసు పొరలను తడిపి వేసే సార్ద్ర కథనం…. చాలా చాలా బాగుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article