Editorial

Tuesday, December 3, 2024
కాల‌మ్‌ఈ వారం మంచి పుస్తకం : అరుంధతీ రాయ్ రాసిన '..ఎ ఘోస్ట్ స్టోరీ’

ఈ వారం మంచి పుస్తకం : అరుంధతీ రాయ్ రాసిన ‘..ఎ ఘోస్ట్ స్టోరీ’

‘మంచి పుస్తకం’ఒక సంపద. తెలుపు అందిస్తున్న సగౌరవ శీర్షిక. ఈ పుస్తక పరిచయ పరంపరలో పద్దెనిమిదో పరిచయం అరుంధతీ రాయ్ వ్యాసానికి అనువాద పుస్తకం ‘పెట్టుబడిదారి విధానం : ఒక ప్రేతాత్మ కథ’

కొసరాజు సురేష్

‘క్యాపిటలిజమ్: ఎ ఘోస్ట్ స్టోరీ’ అన్న పేరుతో అరుంధతీ రాయ్ ఔట్ లుక్ పత్రికలో 2012 మార్చిలో ఒక వ్యాసం రాశారు. ఆమె చాలా పుస్తకాలు ముందుగా ఇలా పత్రికలలో వ్యాసాలుగా లేదా ఉపన్యాసాలుగా వచ్చేవి. అదే సంవత్సరం  జూన్ లోనే మలుపు ప్రచురణ సంస్థ దీనిని తెలుగులో పుస్తకంగా ప్రచురించింది. అంటే ఇంగ్లీషులో వచ్చిన కొద్ది కాలానికే తెలుగు పాఠకులకు ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చింది.

అరుంధతీ రాయ్ ఈ పుస్తకం రాసి ఈ ఏడాదికి పది సంవత్సరాలు అయ్యింది. ఈ పదేళ్లలో తేడా అంతా గణాంకాలు మారి ఉండవచ్చు, సంస్థల పేర్లు, పన్నుల పేర్లు మారి ఉండవచ్చు కానీ పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి.

ఈ చిన్న వ్యాసంలో అరుంధతీ రాయ్ తనదైన వ్యంగ్య శైలిలో సమాజమూ, అభివృద్ధికీ సంబంధించి స్పృశించని అంశమంటూ లేదు.

పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థిస్తూ ‘ట్రికిల్ డౌన్ థియరీ’ అని ఒకటి ఉంది. మొత్తంగా ఆర్థిక ప్రగతి పెరుగుతూ ఉంటే అట్టుడుగు ప్రజలకు కూడా దాని ఫలితాలు అంది, ప్రయోజనం కలుగుతుందని అది చెబుతుంది. అభివృద్ధి ఫలాలు కిందకి చేరటం అటుంచి ‘పైకి ఎగదన్నుతున్నాయని’ (Gush-up) అరుంధతీ రాయ్ వ్యంగ్యంగా అంటారు. ‘120 కోట్ల జనాభా ఉన్న దేశంలో వంద మంది అత్యంత సంపన్నుల ఆస్తులు దేశ స్థూల ఉత్పత్తి (జిడిపి)లో నాలుగో వంతును ఆక్రమిస్తున్నాయి’ అన్న వాస్తవాన్ని అరుంధతీ రాయ్ మన కళ్ల ముందు ఉంచుతారు.

అరుంధతీ రాయ్ ఈ వ్యాసం రాసినప్పుడు భారత దేశంలో అంబానీ అత్యంత పన్నుడు. ఇప్పుడు అతనికి పోటీగా అదానీ వచ్చాడు. అదానీ సంపద రోజుకి వెయ్యి కోట్ల చొప్పున పెరుగుతోందట.

అనేక దేశాలు ప్రస్తుతం ‘కె’ (K) తరహా అభివృద్ధి పధంలో ఉన్నాయని మనకు తెలుసు. అంటే ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. అరుంధతీ రాయ్ ఈ వ్యాసం రాసినప్పుడు భారత దేశంలో అంబానీ అత్యంత పన్నుడు. ఇప్పుడు అతనికి పోటీగా అదానీ వచ్చాడు. అదానీ సంపద రోజుకి వెయ్యి కోట్ల చొప్పున పెరుగుతోందట. కోవిడ్ సంక్షోభం నేపధ్యంలో వంద కోట్లకు పైగా ఆస్తులు కలిగిన వ్యక్తుల సంఖ్య 30 శాతం పెరిగింది, ఇంకో వైపున ఇదే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా కుటుంబాలు పేదరికంలోకి నెట్టబడ్డాయి. అయినప్పటికీ స్వేచ్ఛా వాణిజ్యమే మంచిదని పెట్టుబడిదారీ వర్గాలు నమ్మింప చూస్తున్నాయి.

ప్రజా సంపదని వ్యక్తిగత ఆస్తులుగా మార్చటం పెట్టుబడిదారీ ప్రభుత్వాలు చేసే పనులలో ఒకటి. ‘ఉచితంగా’ దొరికే ప్రకృతి వనరులను, ఖనిజాలను, భూములను ఇవి వ్యాపారవేత్తలకు గుత్తగా కట్టబెడతాయి. ‘భూమి లేదా పద పునఃపంపిణి గురించి ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే అప్రజాస్వామికంగానే కాక పిచ్చి వాళ్ల కింద జమ కట్టబడతారు’ అని అరుంధతీ రాయ్ అంటారు. ఇప్పుడైతే అటువంటివాళ్లని ఉగ్రవాదులు, దేశద్రోహులు అని అంటారు. ‘ఎన్నికల పండగలప్పుడు కోలాహలం ఎంత ఎక్కువగా ఉంటే ప్రజాస్వామ్యంపై మన నమ్మకం అంత బలహీనం అవుతూ ఉంటుంది’ అన్న వాస్తవాన్ని అరుంధతీ రాయ్ మన కళ్ల ముందు ఉంచుతారు.

‘అంతర్గత ముప్పు’, ‘సొంత ప్రజల మీదకే సైన్యాలను పంపటం’ యుడిఎఫ్ ప్రభుత్వం నాటి నుంచే ఉన్నాయి. ‘అత్యంత పేదల నుంచి, ఆకలిగొన్న, పోషకాహార లోపం ఉన్న ప్రజల నుంచి తనను తాను రక్షించుకోటానికి ప్రపంచం లోకెల్లా అతి పెద్ద సైన్యాలలో ఒకటి ప్రస్తుతం యుద్ధ సన్నాహాలు చేస్తోంది’ అన్న నిజాన్ని వెల్లడి చేస్తూ, దీనిని ‘పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడం’గా పేర్కొనటాన్ని పరిహసిస్తారు. ప్రకటనలపై ఆధారపడిన, కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్న మీడియా సంస్థలు ఈ నిజాల గురించి రాయవనీ, మాట్లాడవనీ అరుంధతీ రాయ్ పేర్కొంటారు.

కార్పొరేట్ దాతృత్వ సంస్థలు, ఫౌండేషన్ల గురించి ప్రస్తావిస్తూ అరుంధతీ రాయ్ ఏ ఒక్కరినీ వదిలి పెట్ట లేదు.

కార్పొరేట్ దాతృత్వ సంస్థలు, ఫౌండేషన్ల గురించి ప్రస్తావిస్తూ అరుంధతీ రాయ్ ఏ ఒక్కరినీ వదిలి పెట్ట లేదు. ‘తమ లాభాల్లో శత సహ్రాంశం మాత్రమే ఉపయోగించి ప్రపంచాన్ని శాసించటానికి జలగలకు ఇంతకంటే మెరుగైన మార్గం ఇంకేముంది? కాకపోతే కంప్యూటర్ల గురించి ఒకటి రెండు విషయాలు మాత్రమే తెలుసని స్వయంగా పేర్కొన్న బిల్ గేట్స్ ఒక్క అమెరికా ప్రభుత్వానికే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలకు విద్య, ఆరోగ్యం, వ్యవసాయంపై విధాన నిర్ణయాలు ఎలా రూపొందించగలుగుతాడు?’ అని అరుంధతీ రాయ్ నిలదీస్తుంది. కోవిడ్, ఇటీవల మంకీపాక్స్ నేపధ్యంలో వైద్య సంస్థల కంటే ఎక్కువ సూచనలు, హెచ్చరికలు బిల్ గేట్స్ నుంచి రావటం మనం చూస్తూనే ఉన్నాం.

ఈ కార్పొరేట్ ఫౌండేషన్లు, విధానాలను నిర్దేశించే సంస్థలు, సంపన్నుల క్లబ్బులు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో అరుంధతీ రాయ్ బట్టబయలు చేస్తారు.

‘పేదరికం పేరుతో కూడా బాగా సొమ్ము చేసుకోవచ్చు. అంతేకాకుండా నోబెల్ బహుమతులు కూడా పొందవచ్చు’ అని అరుంధతీ రాయ్ వ్యంగ్యాస్త్రాన్ని విసురుతారు.

మెగసెసే బహుమతి చాలా ప్రతిష్ఠాత్మకమైనదిగా భారత దేశంలోని కళాకారులు, సామాజిక కార్యకర్తలు, ప్రజల కోసం పని చేసేవాళ్లు భావిస్తారంటూ, ఆ బహుమతి పొందిన కొందరి ప్రముఖల పేర్లను చెప్పి,‘ఆ బహుమతి వల్ల దానిని పొందిన వారికంటే, వీరి వల్లే ఆ బహుమతికి ఖ్యాతి వచ్చిందని’ అరుంధతీ రాయ్ నిర్మొహమాటంగా పేర్కొంటారు.

అమెరికా ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి 1920లలోనే అప్పులు ఇచ్చే కార్యక్రమం మొదలయ్యింది. అమెరికా ప్రజలు నిరంతరం అప్పుల్లో కూరుకుని పోయేలా, తమ జీవనశైలికి తగినంత సంపాదన కోసం ఉరుకులాడేలా ఇది చేసింది. ఈ కార్యక్రమం సూక్ష్మ రుణాల పేరుతో అభివృద్ధి చెందిన దేశాలకు వచ్చినప్పుడు వాటి పరిణామాలు ఎలా ఉంటాయో 2010లో ఆంధ్ర ప్రదేశ్‌లో 200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే గాని మనకి తెలిసి రాలేదు. ‘కష్టపడి సంపాదించండి, అప్పులు చెయ్యవద్దు’ అని రాసి, ఆత్మహత్య చేసుకున్న 18 ఏళ్ల బాలిక హృదయ విదారక కథను మనకు గుర్తు చేస్తారు. ‘పేదరికం పేరుతో కూడా బాగా సొమ్ము చేసుకోవచ్చు. అంతేకాకుండా నోబెల్ బహుమతులు కూడా పొందవచ్చు’ అని అరుంధతీ రాయ్ వ్యంగ్యాస్త్రాన్ని విసురుతారు.

మరిన్ని సంస్కరణలు చేపట్టటానికి, ప్రైవేటీకరణను వేగవంతం చేయటానికి అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎలా ఉపయోగపడిందో ఆరుంధతి రాయ్ వివరిస్తారు. అలా మహ్మద్ యూనస్ నుంచి అన్నా హజారే దాకా ఎవరికి మేలు చేశారో గుట్టు విప్పారు.

కార్పొరేట్ అవినీతి కుంభకోణాల నుంచి దృష్టిని మళ్లించి, రాజకీయ నాయకుల పట్ల ప్రజాగ్రహాన్ని సాకుగా చేసుకుని ప్రభుత్వ అధికారాలు నీరు కార్చటానికి, మరిన్ని సంస్కరణలు చేపట్టటానికి, ప్రైవేటీకరణను వేగవంతం చేయటానికి అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎలా ఉపయోగపడిందో ఆరుంధతి రాయ్ వివరిస్తారు. అలా మహ్మద్ యూనస్ నుంచి అన్నా హజారే దాకా ఎవరికి మేలు చేశారో గుట్టు విప్పారు.

నిజమైన ప్రజా ఉద్యమాలను దెబ్బ తియ్యటానికి అవి విదేశీ నిధులు పొందుతున్నాయని ప్రభుత్వ బురద చల్లుతుంది. కానీ బాగా నిధులున్న స్వచ్ఛంద సంస్థల లక్ష్యం కార్పొరేట్ ప్రపంచీకరణను ప్రోత్సహించటమని అందరికీ తెలుసని అరుంధతీ రాయ్ పేర్కొంటారు. ఫౌండేషన్లతో ముడిపడి ఉన్న మానవ హక్కుల పరిశ్రమ, స్త్రీవాద ఉద్యమాలు సిద్ధాంత చర్చలో తీసుకుని వచ్చిన మార్పును, అసలైన ప్రజా ఉద్యమాలకు దూరమైన విధానాన్ని అరుంధతీ రాయ్ ఎత్తి చూపారు.

భారతదేశ ప్రస్తుత ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు సంబంధించి దాదాపుగా అన్ని పార్శ్వాలను స్పృశించి తనదైన శైలిలో అరుంధతీ రాయ్ విశ్లేషిస్తూ, చురకలు వేశారు.

ప్రజల అశాంతిని మచ్చిక చెయ్యటానికి, నిరసనలను పెంపుడు జంతువులుగా మార్చటానికి, ప్రజల ఆగ్రహాన్ని దారులు లేని చీకటి మార్గాల లోకి మళ్లించటానికి ఉదాహరణగా ‘బ్లాక్ పవర్’ని ‘బ్లాక్ క్యాపిటలిజం’గా మలచటంలో ఫౌండేషన్లు, వాటి అనుబంధ సంస్థల పాత్రను అరుంధతీ రాయ్ వివరించారు. అదే విధంగా దళిత శక్తిని కూడా ముక్కులుగా చేసి, ప్రమాదరహితంగా మార్చారు. ‘దళిత రాజకీయాల ఆశలు, సైద్ధాంతిక చట్రం దళిత పారిశ్రామికవేత్తల విజయం మాత్రమే అయితే అంతకంటే విషాదకరమైన అంశం మరొకటి ఉండదని’ అరుంధతి రాయ్ వాపోతారు. బిఎస్‌పి అనుసరించే అస్తిత్వ రాజకీయాలు ముఖ్యమైనవే కాని దీర్ఘ కాలంలో అవి ప్రయోజనకరంగా ఉండవని చెప్పటానికి ఆమె ఏమాత్రం నీళ్లు నమలలేదు. భారత కమ్యునిస్టు పార్టీకి దళితులు దూరం కావటానికి ఆ పార్టీ నాయకత్వంలోని పై కులాల వాళ్లు నిందార్హులు అనటంలో కూడా ఆమె ఏమాత్రం వెనకాడ లేదు. ఇలా భారతదేశ ప్రస్తుత ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు సంబంధించి దాదాపుగా అన్ని పార్శ్వాలను స్పృశించి తనదైన శైలిలో అరుంధతీ రాయ్ విశ్లేషిస్తూ, చురకలు వేశారు.

ప్రస్తుత కాలంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తులలో అరుంధతీ రాయ్ ఒకరు. అణగారిన ప్రజలు ఎవరు, ఇప్పుడు వాళ్ల పక్షాన నిలబడింది ఎవరు, ప్రజలపై, పర్యావరణంపై దాడులు చేస్తున్నది ఎవరు అన్నది అరుంధతీ రాయ్‌కి స్పష్టమైన అవగాహన ఉంది. నేడు ప్రజల పక్షాన ఉన్న వాళ్లు ఒకవేళ రేపు అధికారంలోకి వచ్చి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తే వాళ్లను ఖండించే వాళ్లంల్లో నేను ముందుంటాను అని అరుంధతీ రాయ్ స్పష్టం చేశారు. ఆ విధంగా మేధావి వర్గం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడాలని ఆమె గుర్తు చేస్తున్నారు.

ఈ పుస్తక అనువాదానికి అవకాశం ఇచ్చిన మలుపు ప్రచురణ సంస్థకి ధన్యవాదాలు. ఈ పుస్తకం ప్రస్తుతం అందుబాటులో లేదు. దీనిని పద్మ వంగపల్లి తన చక్కని కంఠంతో ఆడియో బుక్‌గా చేశారు. దీన్ని క్లిక్ చేసి వినవచ్చు.

కాలమిస్టు పరిచయం

కొసరాజు సురేష్ పాత్రికేయులు, అనువాదకులు. ప్రభుత్వం ప్రభుత్వేతర  స్వచ్ఛంద సేవా సంస్థలో దశాబ్దాలు కృషి చేశారు. ప్రచురణా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వారి అనువాదాల్లో ‘గడ్డిపరకతో విప్లవం’ మొదటిదైతే ఇప్పటిదాకా వారు చిన్న పెద్ద పుస్తకాలను వంద దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అందించారు. అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే.

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. తెలుపు కోసం వారు ఇప్పటిదాకా పరిచయం చేసిన పదిహేడు పుస్తకాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. అక్కడి నుంచి ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకంలోకి వెళ్లి చదవొచ్చు. అందుబాటులో ఉన్న వాటిన్హి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు మెయిల్ చేయొచ్చు లేదా కింది వెబ్సైట్ చూడండి.

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article