Editorial

Tuesday, December 3, 2024
హెరిటేజ్తియ్యటి యాది : లగ్గపు లాడూలు - డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి

తియ్యటి యాది : లగ్గపు లాడూలు – డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి

ఎనుకట లడ్డుముచ్ఛట గట్లుండెమరి ! అబ్బో! ముట్టుకుంటె ముడుచుకపొయ్యే ఆరుద్రపురుగు లెక్కన అప్పటి బాల్యం ఎంత అపురూపంగ అమూల్యంగ ఉండేటిదో!!

డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి

ఇది 1980-85 కాలపు సంగతి!
అవి నేను ఐదారు తరగతులు చదివేరోజులు. ఆ కాలంల, అప్పటి పద్ధతుల ప్రకారం మా కరీంనగర్ చుట్టుపక్కల గ్రామసీమలల్ల పెండ్లిపేరంటాలకు, ప్రభోజనాలకు ఊరందరికీ శుభలేఖలు పంచెటొల్లు.

చెయిగలిసిన వారందరి ఇంటింటికీ, శుభకార్యం జరుపుతున్నవారి ఇంటిచాకలి పొద్దుపొద్దుగాలనే ఇంటింటికి వచ్చి ‘పిలుపు’ అందించి పోయెవాడు.

పిలుపందుకున్నవారు (సహజంగా మగవారు) ఉదయం పలారానికీ, మధ్యాహ్నం భోజనానికి రెండుపూటలూ పెండ్లింటికి విధిగా పొయ్యేటొల్లు.

ఎప్పుడెప్పుడా అని.. ఎదిరిచూసి ఎదిరిచూసి తండ్రులవెంట జోజోటంగా పిల్లలమూ పోయేది.

కుడుమంటె పండుగని సంబురపడే ఎడ్డిమొకాలకు లగ్గంల, కమ్మటితియ్యటి ‘లాడుముద్దలు’ పెడుతరంటె
అదేమన్న చిన్నబొన్న సంబురమా! తోడు పెండ్లికొడుకై పల్లకి ఎక్కినదానికంటేగూడా, చింతాకంత ఎక్కువనే!

మూడిండ్ల భవంతిల ఒక చంకకో, కచ్చీరింట్లనో, పాలపొరుకతోటి కప్పిన ఇంటెనుక పందింట్లనో…
నాలుగు గోడలకు గోనెపట్టాలు/చుట్టసాపలు పరిచి ఎదురెదురుగ బంతికూచోబెట్టి, మోతుకాకు విస్తర్లువేసి
పలారంగా లాడూలు & అటుకులు/పూస పెట్టెటోల్లు.

పెద్దలకు రెండు లాడూలువెట్టి, పిల్లలకు ఒకటే.. పెట్టేది.

ఇగ మేమేమొ మా బాపు ఇచ్చింది మెల్లెగదిని, మా వంతుది, జెప్పన లాగుజేబుల వేసుకొని దాన్ని పానపానంగ ఇంటికి తెచ్చుకునెటొల్లం. దాసుకొని దాసుకొని మల్ల తెల్లారెప్పుడో తినెటొల్లం!

గంపెడాశతోటి కొండకు ఎదురుచూస్తున్న పిల్లగండ్లకు ఒక్కటంటె ఒక్కలఢ్ఢు అసలు ఏమూలకైతది?

లెక్కకైతె ఆశకొద్ది కూసున్న పిల్లలకు రెండువెట్టి, పండ్లరిగిన పెద్దొల్లకు ఒకటి వెట్టినా.. సరిపోదా…??

పిల్లగండ్ల ఆరాటం, వారి పెద్దలకే తెల్సుగనుక,  తండ్రులు ఒకలడ్డు తిని, రెండోది పిల్లలకు ఇచ్చెటొల్లు.

ఇగ మేమేమొ మా బాపు ఇచ్చింది మెల్లెగదిని, మా వంతుది, జెప్పన లాగుజేబుల వేసుకొని దాన్ని పానపానంగ ఇంటికి తెచ్చుకునెటొల్లం. దాసుకొని దాసుకొని మల్ల తెల్లారెప్పుడో తినెటొల్లం!

ఆ వయసులో— లడ్డూ ఖరీదు తెలియదుగానీ దాని విలువెంతటిదో మాకు మాత్రమే తెలుసు..!
మల్ల ఎవలదన్న ఏదన్న పెండ్లిపత్రిక వచ్చెదాక, ఈ పాతలడ్డు.. మాకు ఒక సరికొత్త ఙ్ఞాపకం…!!

ఎనుకట లడ్డుముచ్ఛట గట్లుండెమరి ! అబ్బో! ముట్టుకుంటె ముడుచుకపొయ్యే ఆరుద్రపురుగు లెక్కన.. అప్పటి బాల్యం ఎంత అపురూపంగ, అమూల్యంగ ఉండేటిదో!!

ఇప్పటి మన ఫారంకోడి పిల్లలకు  సరైన బాల్యమెక్కడిది.. ? ఆకలిగొన్న తిండెక్కడిది?
అసలిప్పుడు– తిండికి నికరమైన విలువెక్కడిది?

ఇగ ఈ నడుస్తున్న కాలంల– లడ్డూల సంగతంటరా!
అదెంత మహత్కార్యమూ..కుక్కనుగొడితె రాలుతయి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article