మాతోటలో మేమిద్దరం కాక ఎవరు నాక్కావలసిన గింజలు తెచ్చి చల్లుతున్నారు.
జయతి లోహితాక్షణ్
పసుపు ఆకుల్లో పనసతొనలు వరిపిండి బెల్లం కొబ్బరితు చుట్టి ఆవిరిపై ఉడికించి చక్క అడ తయారు చేస్తారు. ఐదేళ్ళక్రితం తొలకరిలో కేరళలో యింటికి వెళ్ళినప్పుడు లోహి చిన్నచెల్లెలు అజి (అజిత) చక్క అడ తయారుచెయ్యడం నాకు నేర్పించింది.
లోహి నేనూ పశ్చిమకనుమల్లో తొడుపులో ఉంటున్నప్పుడు ఒకటి పదిరూపాయలకి సాయంత్రం నాలుగు చక్క అడలు కొనుక్కునేవాళ్ళం. పనసకాయలు లేనప్పుడు పనసతొనలు లేకుండా చేయవచ్చు. దానిని బెల్లం అడ అంటారు. అరటిఆకులో చుట్టిచెయ్యవచ్చు. పసుపు అకులో చుట్టితే ప్రత్యేకమైన రుచి వస్తుంది.
ఈ తొలకరికి పసుపు ఆకులు లేవు. తోటలో నాటాలని దుంపలకోసం విత్తనాలకోసం కుటీరానికొచ్చిన వాళ్ళందరిని అడిగాను. తెస్తామని మాట ఇచ్చారుకాని వారెవరు మళ్ళీ రావడం వీలు కాలేదు.
నేను నా చుట్టు పావుమైలు దూరన్ని దాటే ఎంతో కాలమైంది. చుట్టుపక్కల తోటల్లో రైతుల్ని అడిగాను. ఎవరూ లేదనే అన్నారు.
అడవికుటీరానికి తిరిగి వెళ్తే అక్కడ నేను నాటినవాటిలోంచి ఒక మొలక తెచ్చుకోవాలనుకున్నాను. నేను నా చుట్టు పావుమైలు దూరన్ని దాటే ఎంతో కాలమైంది. చుట్టుపక్కల తోటల్లో రైతుల్ని అడిగాను. ఎవరూ లేదనే అన్నారు. లోహిని జగ్గంపేట సంతకీ ఏలేశ్వరం సంతకీ వెళ్ళమని అడిగాను పచ్చికొమ్ములు దొరుకుతాయని. రెండుసంతలకీ వెళ్ళి వెతికి తిరిగొచ్చారు.
నిన్న సాయంత్రం తోటలో పనిచేస్తున్నప్పుడు పసుపు మొలక కనిపించింది. సంతోషం. లోహిని పిలిచి చూపించాను ఇది పసుపే చూడమని. ఎప్పుడో ఎత్తుకొచ్చి పోసిన మట్టిలోంచి మొన్న వానకి పసుపు మొలక మెత్తగా పైకొచ్చింది. మాతోటలో మేమిద్దరం కాక ఎవరు నాక్కావలసిన గింజలు తెచ్చి చల్లుతున్నారు.
జయతి లోహితాక్షణ్ చాయా చిత్రకారిణి. జీవిత రచయిత. ‘అడవి నుంచి అడవికి’, ‘అడవి పుస్తకం’ తాను వెలువరించిన అక్షర కృతులు. తెలుపు ప్రచురించిన వారి ఇతర వ్యాసాలు : ప్రకృతివైపు ,స్వేచ్ఛ వైపు, Of Solitude 2021.