Editorial

Thursday, November 21, 2024
కాల‌మ్‌దిగ్బ్రమకి గురి చేసే 'ఖోల్ దేవొ' : ఈ వారం 'పెరుగన్నం'లో 'మంటో' కథా వైనం

దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ఈ వారం ‘పెరుగన్నం’లో ‘మంటో’ కథా వైనం

Manto

గతవారం మంటో గురించిన పరిచయం, కథకుడిగా అతడి విశిష్టత గురించి చెప్పుకున్నాం. ఈ వారం ‘పెరుగన్నం’లో  అతడి ‘ఖోల్ దేవొ’ అన్న కథ… దాని ప్రత్యేకత గురించి చెబుత.

 మన దేశ విభజన సమయంలో ప్రజలపై హింసాత్మక ప్రభావాలను వర్ణించే కళాఖండాలలో ఈ కథ అత్యంత ప్రసిద్దమైనది. అంతే వివాదాస్పదమైనది కూడా. దిగ్బ్రమ కలిగించే కథకుడిగా మంటో వస్తు శైలులు తెలుపు గాథ ఇది.

జింబో

నిజానికి కథలు ఎలా ఉన్నా అవి జీవితాన్ని ప్రతిబింబించాలి. ఐతే, కథలో ముగింపు చాలా ముఖ్యం.
కొన్ని ముగింపులు పఠితలని దిగ్బ్రమకి గురిచేస్తాయి . పాఠకులు దిగ్భ్రమకు లోనై అలోచనల్లో పడతారు. సాదత్ హసన్ మంటో రాసిన కథలు దాదాపు అన్ని అలాంటివే.

మంటో కథల్లో సెక్స్ ఉందన్న అపవాదు ఉండేది. ఈ విషయం గురించి మంటోని అడిగితే ఆయన ఇలా అన్నాడు. “నా కథల్లో చెత్త ఉంటే అది మీరు నివసిస్తున్న సమాజంలో ఉంది. సమాజంలో ఉన్న చెత్తని నా కథల్లో చూపించాను అంతే..!”

‘ఖోల్ దేవొ’ (తెరువు) కూడా అలాంటిదే. నిజానికి ఈ కథ అత్యంత ప్రసిద్ధ, వివాదాస్పద కథ కూడా.

భారతదేశ విభజన సమయంలో దేశంలోని ప్రజలపై హింసాత్మక ప్రభావాలను వర్ణించే కళాఖండాలలో ఇది ఒకటి. చాలా మందిలా కాకుండా, మంటో నేరస్థులను హిందువులు లేదా ముస్లింలు, హిందుస్తానీలు లేదా పాకిస్థానీలు అని చూడలేదు. అతను వారిని మనుషులుగానే చూస్తాడు. అలాగే చిత్రీకరిస్తాడు. వారి అనాగరికాన్ని, దుర్మార్గాన్ని మంచితనాన్ని చిత్రీకరిస్తాడు. మరి చూడండి.

కథలోకి వెళ్దాం

అమృత్‌సర్ నుండి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరింది. లాహోర్‌ లోని మొఘల్ పురాకి చేరుకుంది. ప్రయాణం మొదలైన ఎనిమిది గంటల తర్వాత దారిలో చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు మరియు లెక్కలేనంత మంది కనిపించకుండా పోయారు.

తెల్లవారి ఉదయం 10 గంటల సమయంలో సిరాజుద్దీన్‌కు స్పృహ వచ్చింది. అతను నేల మీద పడి ఉన్నాడు, చుట్టూ పురుషులు, మహిళలు,పిల్లలు. అందరూ అరుస్తున్నారు. ఏమీ అర్ధం కాలేదు అతనికి.

అతను అదోలా ఆకాశం వైపు చూస్తూ వున్నాడు. అతను చుట్టూ వున్న గందరగోళాన్ని ,శబ్దాలని గమనించనట్లు కనిపించాడు. అతను లోతైన ఆలోచనలో ఉన్న వృద్ధుడిలా కొత్తవాళ్ళకి కనిపిస్తూ ఉండవచ్చు, కానీ అతను షాక్‌లో ఉన్నాడు.

అతని కళ్ళు అకస్మాత్తుగా సూర్యుడి వైపు చూసాయి. షాక్ నుంచి తేరుకొని ప్రపంచంలోకి వచ్చాడు. అతని మదిలో వరుస చిత్రాలు పరుగెత్తాయి. దాడి… కాల్పులు… తప్పించుకోండి… రైల్వే స్టేషన్… రాత్రి… సకీనా. అతను అకస్మాత్తుగా లేచి శరణార్థి శిబిరంలో గుంపులో వెతకడం ప్రారంభించాడు.

సకీనా ..! అని అరుస్తూ గంటల తరబడి చూస్తూ గడిపాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు.

అతను తన కూతురి పేరు… సకీనా.
సకీనా ..! అని అరుస్తూ గంటల తరబడి చూస్తూ గడిపాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు.

తప్పిపోయిన కూతుర్ల కోసం ,కొడుకుల కోసం ,తల్లల కోసం ,భార్యల కోసం వెతుకుతున్న వ్యక్తులతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా వుంది.

చివరికి సిరాజుద్దీన్ గుంపు నుండి దూరంగా కూర్చుని ఆలోచించడానికి ప్రయత్నించాడు. సకీనా తను ఆమె తల్లి నుండి ఎక్కడ విడిపోయారు.?

అప్పుడు కనిపించింది. అతని భార్య మృతదేహం, ఆమె నడుము విరిగిపోయింది.

సకీనా తల్లి చనిపోయింది. గుర్తుకొచ్చింది. అతని కళ్ల ముందే ఆమె చనిపోయింది. ఆమె చివరి మాటలు గుర్తుకొచ్చాయి. “నన్ను వదిలేయండి. అమ్మాయిని తీసుకెళ్లండి”.

ఇద్దరూ పరుగెత్తడం మొదలుపెట్టారు. సకీనా దుపట్టా నేలపైకి జారిపోయింది. అతను దాన్ని తీయడానికి ఆగాడు. “నాన్న, వదిలేయండి” ఆమె చెప్పింది.

అన్నీ గుర్తుకొస్తున్నాయి.

తన జేబులోఏదో ఎత్తుగా వున్నట్టు అనుభూతి చెందాడు. అతను దానిని గుర్తుపట్టాడు. అది సకీనా దుపట్టా.
మరి సకినా ఎక్కడ ఉంది?

గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసాడు. తను ఆమెను రైల్వే స్టేషన్ వరకు తీసుకొచ్చాడా? ఆమె అతనితో రైలు ఎక్కిందా? రైలును ఆపివేసినప్పుడు, వారు ఆమెను తమతో తీసుకెళ్లారా?

అన్నీ ప్రశ్నలు. సమాధానాలు లేవు. ఏడ్చినా కన్నీళ్లు రావని అనిపించింది అతనికి. ఎవరైనా సహాయం చేస్తె బాగుండునని అనిపించింది.

సరిగ్గా ఆ సమయంలో తప్పిపోయిన మహిళలను బార్డర్ నుంచి తీసుకు వస్తున్న కొంతమంది యువకులు సిరాజుద్దీన్ కి తారసపడతారు. వాళ్లను చూసిన సిరాజుద్దీన్ కి ఆశ చిగురిస్తుంది. తన కూతురు వివరాలు వాళ్ళకి చెబుతాడు.

వాళ్ల గురించి కథకుడు ఏమి చెప్పడు. వాళ్ళు ఏమి చేశారో కూడా కథకుడు చెప్పడు.

తన కూతురు చాలా అందంగా ఉంటుందని, ఆమె తనలాగా ఉండదని వాళ్ళ అమ్మ లాగా చాలా అందంగా ఉంటుందని చెబుతాడు. పెద్ద కళ్ళు, నల్లటి పొడవైన వెంట్రుకలు, ఎడమ బుగ్గ మీద పుట్టుమచ్చ, ఇలా గుర్తులు ఆనవాళ్ళు వాళ్ళకి చెప్పి తన కూతురిని వెతికి పెట్టమని కోరతాడు. భగవంతుడు మీకు మేలు చేస్తాడని కూడా అంటాడు. ఇలా అతను వాళ్ళని వేడుకుంటాడు. తన కూతురు వాళ్ళకి దొరకాలని దేవున్ని ప్రార్థిస్తాడు.

ఆ యువకులు షకీలాని కొంత కాలం తరువాత పట్టుకుంటారు. సిరాజుద్దిన్ చెప్పిన గుర్తులు ఆమెకు సరిపోతాయి. వీళ్ళను చూసి ఆమె భయపడుతుంది.

“భయపడకు! నీ పేరు సకీనా కదూ ..!”అంటాడు యువకుల్లో ఒకడు.

దాంతో ఆమెకు ధైర్యం వస్తుంది. ఆమె పట్ల దయతో ఉన్నట్టుగా వ్యవహరిస్తారు. ప్రేమతో ఉంటారు. భోజనం పాలు ఇస్తారు. వాళ్ల గురించి కథకుడు ఏమి చెప్పడు. వాళ్ళు ఏమి చేశారో కూడా కథకుడు చెప్పడు.

రోజులు గడుస్తాయి. కూతురు జాడ తెలియదు సిరాజుద్దీన్ కి. అతను ఒక క్యాంపు నుంచి మరో క్యాంపు కి కూతురు కోసం తిరుగుతూ ఉంటాడు. కానీ ఫలితం ఉండదు. ఓ రాత్రి ఆ యువకులు సిరాజుద్దీన్ కి తిరిగి తారసపడతారు. తన కూతురు సకీనా గురించి వాళ్లను విచారిస్తాడు. ఆమె బ్రతికి ఉంటే తప్పక పట్టుకుంటామని వాళ్ళు అతనికి చెబుతారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధించాలని సిరాజుద్దీన్ కోరుకుంటాడు.

ఓ రోజు సాయంత్రం ఒక అమ్మాయిని నలుగురు వ్యక్తులు క్యాంప్ హాస్పిటల్ కి తీసుకుని వెళుతుంటారు. రైల్వే ట్రాక్ పక్కన ఆమె అచేతనంగా వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళని సిరాజుద్దీన్ వెంబడిస్తాడు. ఆమెను స్ట్రెచర్ మీద హాస్పిటల్ లోకి తీసుకుని వెళ్తారు. కొంతసేపు హాస్పిటల్ బయట నిల్చొని ఆ తర్వాత హాస్పిటల్ లోపలికి వెళ్తాడు సిరాజుద్దీన్. ఆ యువతిని చూస్తాడు. చెంప మీద పుట్టుమచ్చ ని గమనిస్తాడు. ఆమె సకీనా అని గుర్తించి గట్టిగా సకీనా అని కేక వేస్తాడు.

“ఆ కిటికీ తెరువు (ఖోల్ దేవో) అంటాడు డాక్టర్ సిరాజుద్దీన్ వైపు చూస్తూ .

మంటో కథా నైపుణ్యం కథ చివర్లో కనిపిస్తుంది. ప్రతి కథ చివర్లో ఈ నైపుణ్యం కనిపిస్తుంది. అతని కథలు మనల్ని ఒక షాక్ కి గురి చేస్తాయి. ఆ షాక్ నుంచి మనం కోలుకోలేక పోతాం. ఈ కథ కూడా అలాంటిదే.

సిరాజుద్దీన్ అరుపు విని డాక్టర్ లైట్ వేస్తాడు. ఆమె వైపు చూస్తాడు.

“నేను ఆమె తండ్రిని “అంటాడు సిరాజుద్దీన్ .

ఆమెను పరిశీలించి ఆమె నాడిని చూస్తాడు డాక్టర్.

“ఆ కిటికీ తెరువు (ఖోల్ దేవో) అంటాడు డాక్టర్ సిరాజుద్దీన్ వైపు చూస్తూ .

స్ట్రెచ్చర్ మీద ఉన్న సకీనాలో చలనం కనిపిస్తుంది. ఆమె చేతులు నడుము చుట్టూ వేసి-సల్వార్ కి వున్న పైజామాకి ఉన్న నాడాని తొలగించి దుస్తులను తొడలు కనిపించేలాగా కిందికి లాగుతుంది .

అది చూసి సంతోషంతో -” నా కూతురు బతికే ఉంది” అని అరుస్తాడు సిరాజుద్దీన్.

డాక్టర్ కి ముచ్చెమటలు పడతాయి.

ఖోల్ దేవో అని డాక్టర్ అనగానే సకీన దుస్తులు కిందికి లాగేయడం లేదా తెరవడాన్ని కథకుడు మనందరం చూపిస్తాడు. ఏమి చెప్పడు. 17 సంవత్సరాల సకీనాకి ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం లేకుండా పాఠకులని దిగ్బ్రమకి గురి చేస్తాడు రచయిత.

పాకిస్తాన్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న సాదత్ హసన్ మంటో చెప్పిన కథ ఇది. ఆ యువకులు ఆ దేశానికి చెందిన వ్యక్తులే.

ఈ కథలో అశ్లీలం ఉందని మంటో పై పాకిస్థాన్ మేజిస్ట్రేట్ కోర్టులో అభియోగం దాఖలవుతుంది.

ఈ కథలో అశ్లీలం ఉందని మంటో పై పాకిస్థాన్ మేజిస్ట్రేట్ కోర్టులో అభియోగం దాఖలవుతుంది. అతను దేశ వ్యతిరేకీ అని దేశ ప్రతిష్టను దిగజారుస్తున్న వ్యక్తి అని ఆరోపణలు వస్తాయి. ఆ కేసు నెలల తరబడి కొనసాగుతుంది.

వామపక్షాల నుంచి, రైటిస్టుల నుంచి విమర్శలని ఎదుర్కొంటాడు సాదత్ హసన్ మంటో. అతనికి మూడు మాసాల జైలు శిక్షని, జరిమానాని మెజిస్ట్రేట్ విధిస్తాడు. తీర్పుకు వ్యతిరేకంగా మంటో సెషన్స్ కోర్టులో అప్పీలు దాఖలు చేస్తాడు.

సెషన్స్ కోర్టు అతన్ని నిర్దోషిగా వదిలేస్తుంది. అయితే ఆ తీర్పు చెప్పిన న్యాయమూర్తి మంటోతో ఒక మాట అంటాడు -“మీ అప్పీలుని నేను ఆమోదించకపోతే నువ్వు దేశమంతా తిరిగి ఆ గడ్డం మౌల్వీ శిక్షని నిర్ధారించాడు అని చెప్తావ్ అంటాడు.

కథ చివర్లో మలుపు ఎంత ముఖ్యమో. ఉహించని విధంగా వుండటం అంతకన్నా ముఖ్యం. కథని ఎలా చెప్పాలో తెలుసుకోవానుకునే రచయితలు తప్పక చదవాల్సిన రచయిత సాదత్ హసన్ మంటో.

ఇదీ ‘ఖోల్ దేవో’ కథా. ఆ కథ పూర్వాపరాలూ.  ఈ ఒక్క కథే కాదు. ప్రతి కథ ఇంతే !పాఠకులని దిగ్భ్రమకు గురి చేస్తాయి. నిజాయితీ, ధైర్యం ఉన్న రచయిత మంటో. చరిత్రలో జరిగిన దుర్మార్గ సంఘటనలని కథలుగా చిత్రించినందుకు అధికారులు ఆగ్రహానికి గురయ్యాడు మంటో .

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’. 10వ వారం ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article