MUSINGS: కలిగున్నప్పుడు అవి కలిగున్నామనే స్పృహ వుండదు కదా దేనిపట్లైనా మనుషులకి.
ఉషా జ్యోతి బంధం
అమ్మతో జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి ఒక్కదాన్నే వున్నపుడు.
చిన్నపుడు చాలా విషయాల పట్ల చాలా చాలా బలమైన ఇష్టాయిష్టాలుండేవి. తిండి విషయాల్లో ఐతే ఇంకా ఎక్కువ.
నాకు ఇష్టంలేనివి సరిగా కాచీకాని పాల వాసన. సేమ్యాపాయసం. రవ్వలడ్లు ఇత్యాదులనుకోండి.
విపరీతమైన ఇష్టం వున్నవి అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అన్నం, పచ్చడన్నం, పప్పన్నం, పెరంగన్నం ఏదో రూపంలో అన్నం అనుకోండి. కారంగానైతే వుండాలి.
మెత్తటి అట్లు, కారప్పూస, జిలేబీ.
స్కూల్ దగ్గరమ్మే ఎర్ర జాంకాయలూ, పుల్లైసు లాంటి అతికొద్ది మాత్రమే.
చిన్నప్పుడు కామెర్లొచ్చి పత్యం చెయ్యాల్సి వస్తే కిక్కురుమనకుండా రెండ్నెల్లపాటు తాలింపు పెట్టని టొమాటో పచ్చడితో అన్నం తిన్నానట.
ఇపుడనిపిస్తుంది. అదంతా తిండి గురించి కాదు. నాకు ఎటెన్షన్ ఇవ్వమ్మా.. నీతోనే వుంటామ్మా.. నన్ను దూరంగా ఎక్కడికీ పంపించొద్దమ్మా అని చెప్పే ప్రయత్నమేమోని.
అలాగే ఇంట్లో గొడవలయితే చిన్నపిల్లలని పట్టించుకునే నాథుడుండేవాడు కాదు. నాకు విపరీతమైన ఆకలి అప్పుడూ ఇప్పుడూ. ఎంతంటే ఆకలికి కళ్ళెంట నీళ్ళొచ్చేసేవి. ఇపుడు పెద్దయ్యాక కోపం తెచ్చుకునే ప్రివిలేజ్ వుంది కాబట్టి కోపమొచ్చేస్తుంది. సో, గొడవయ్యే ఆంబియన్స్ వుంటే చకచకా వంటగదిలోకెళ్ళి ఏముంటే అది అన్నంలో కలుపుకొని తిని బయటపడేది ఆటకోసం.
నాకేమాత్రం ఇష్టంలేకపోయినా ఇంటర్ లో మమ్మీ నన్ను హాస్టల్ లో వేసింది. అప్పుడప్పుడూ చూట్టానికొచ్చినపుడు అవీ ఇవీ తీసుకొస్తారుగా. ఇక ఇంటికొచ్చినపుడు రాజసం వెలగబెట్టడానికి ట్రై చేసేది మొదటి రెండురోజులు.
ఓసారి కారప్పూస చేసుంచమని చెప్పా మమ్మీకి. సరే అంది కానీ వీలులేక ఏదో ఒకటని సేమ్యాపాయసం చేసింది. నాకు విపరీతంగా ఏడుపొచ్చింది. నన్ను హాస్టల్ వేసింది కాక ఎప్పుడో ఓసారొస్తే ఇష్టమైనవి చెయ్యకుండా వుంటమే కాక ఇష్టంలేని సేమ్యా చేస్తావా మమ్మీ అని ఆరోజంతా ఏడుస్తునే వున్న.
ఇపుడనిపిస్తుంది. అదంతా తిండి గురించి కాదు. నాకు ఎటెన్షన్ ఇవ్వమ్మా.. నీతోనే వుంటామ్మా.. నన్ను దూరంగా ఎక్కడికీ పంపించొద్దమ్మా అని చెప్పే ప్రయత్నమేమోని.
ఒసారలాగే నాకిష్టమని బాదుషా చేసింది. నూనె పొంగి చేతిమీద పడి బొబ్బలొచ్చేసింది. నా మనసుకి చాలా కస్టమేసింది. కానీ ఆ మాట బయటికి చెప్పడానికి నాకు ఏం అడ్డుపడిందో తెలియదు. థాంక్లెస్ బిడ్డగా మిగిలిపోయా.
అమ్మ చచ్చిపొయ్యాక ఆ రవ్వలడ్లని ముందు పెట్టుకొని ఏడ్చిన ఏడుపు ఒకేడుపు కాదు. మాటిమాటికి వంటగదిలోకెళ్ళి డబ్బా మూత తెరిచి చూసేది వున్నాయా లేవా అని. అమ్మ వుందనడానికి అవి గుర్తు అనిపించేది.
సరిగ్గా చనిపోడానికి రెండుమూడురోజుల ముందు రవ్వలడ్లు చేసుకొని తీసుకొచ్చింది బోనకల్ నుంచి ఖమ్మంకి. నాకు ఓ విషయం అర్థమయ్యేది కాదు. కావాలని ఎందుకిలా చేస్తుంది. నాకిష్టం లేనివే ఎందుకు చేస్తుంది నన్ను విసిగించడానికా అనుకునేది. కానీ ఇపుడర్థమైంది అవి ఈజీ కదా చెయ్యడం. ఆ గంపెడు సంసార బాధ్యతల్లో ఏం ఓపిక వుంటుంది నాలాంటి వాళ్ళు కోరే గొంతెమ్మ కోరికలకి. ఏదో కాంపెన్సేట్ చెయడానికి తనకి చేతనైనవి చేసేదేమో. వుట్టి చేతులతో రాకుండా. కానీ అప్పుడు కూడా ఏడ్చి గొడవ చేసా. రవ్వలడ్లేంటే అసహ్యంగా అని.
అమ్మ చచ్చిపొయ్యాక ఆ రవ్వలడ్లని ముందు పెట్టుకొని ఏడ్చిన ఏడుపు ఒకేడుపు కాదు. మాటిమాటికి వంటగదిలోకెళ్ళి డబ్బా మూత తెరిచి చూసేది వున్నాయా లేవా అని. అమ్మ వుందనడానికి అవి గుర్తు అనిపించేది.
ఓరోజు టెంత్ లో వున్నపుడు.. మామూలుగా ఐతే పొద్దుటే క్యారేజ్ ఇచ్చి పంపించేది స్కూల్ కి. వంట అవకపోతే ఎవరైనా తెచ్చి ఇచ్చేవాళ్ళు మధ్యాహ్నం. ఆరోజు ఇంట్లో ఎవరూ లేరని చూసి చూసి తనే తీసుకొనొచ్చింది రెండుకిలోమీటర్లు నడిచి ఎండలో.
చేతిమీద వాత పెట్టుకుందాం అనిపించేది మమ్మీ చనిపోయిన కొత్తలో అలా చేసినందుకు.
అవాళ దోసకాయ పప్పు. నాకు అన్నంలో తినేప్పుడు వెంట్రుకలు కనిపిస్తే ఘోరమైన ఓసీడీ. ఇంక ముద్ద దిగేది కాదు. ఇంటికొచ్చాక గొడవపడ్డా ఆ విషయం మీద.
ఇప్పటికీ ఎంత రిగ్రెటింగా అనిపిస్తదో ఆ సంఘటన.
చేతిమీద వాత పెట్టుకుందాం అనిపించేది మమ్మీ చనిపోయిన కొత్తలో అలా చేసినందుకు.
మమ్మీ చనిపోయినపుడు ఇవన్నీ గుర్తు చేసుకొని ఆమె మీద పడి ఇంకెప్పుడూ ఇలా చెయ్యనమ్మా నీ మాట వింటామ్మా.. లేమ్మా లేమ్మా అని గుండె పగిలిపోయేలా ఏడ్చినా కదల్లేదు ఆమె. ఈ లోకంతోనూ మనుషులతోనూ విసిగిపోయినదానిలా కదలకుండా హాయిగా పడుకున్నట్టుంది.
ముందు ముందు అమ్మ నాతో వుండదనే జ్ఞానముంటే అంత పెంకిగా మాటాడ్టం బెదిరించడం అలగటం చేసుందునా?
ఏ బిడ్డనుకుంటుంది అమ్మ ఎప్పుడైనా చచ్చిపోవచ్చు…కాబట్టి జాగ్రత్తగా నడుచుకుందామని?
పటాటోపంతో, ఆడంబరంగా, ఫార్మాలిటీ కోసమో పిలిచే భోజనాల్లో ఆ దగ్గరితనం మనసుకి తగలదు. అదో గెటుగెదర్ గా మనుషులని కలుసుకునే వేడుకలా అనిపిస్తుంది.
జీవితంలో చిన్న చిన్న విషయాల పట్ల కృతజ్ఞతతో వుండటం ఎంత అవసరమో పోగొట్టుకున్నపుడే తెలుస్తుంది.
కలిగున్నప్పుడు అవి కలిగున్నామనే స్పృహ వుండదు కదా దేనిపట్లైనా మనుషులకి. జీవితంలో చిన్న చిన్న విషయాల పట్ల కృతజ్ఞతతో వుండటం ఎంత అవసరమో పోగొట్టుకున్నపుడే తెలుస్తుంది.
దాదాపు ఇరవైయేళ్ళుగా ఏవో చిన్న చిన్న ఇంటర్వెల్స్ లో మినహాయించి నా వంట నేనే తినటం కదా. ఎంత శ్రద్ధగా రుచిగా చేసినా ఒక్కసారి ఏ రుచీ తెలియదు నాలుక్కి.
వేళగానివేళ ఎవరింటికైనా వెళ్ళినపుడు అన్నం వండి వున్నదేదో వేసిపెడతారు కదా… అమృతంలా అనిపిస్తుంది ఆ ముద్ద. ప్రత్యేకంగా ఆ స్పెషల్సూ ఈ స్పెషల్సూ చేయడం కంటే మనకి నచ్చిందేదో తెలుసుకొని పెట్టే ముద్దలో దగ్గరితనం కావాలనిపిస్తుంది.
మళ్ళా రోడ్డుమీద అమ్మా ఆకలేస్తుందమ్మా అని అడిగే ముసలివాళ్ళనీ, చంటి బిడ్డలనీ చూసినపుడు పైన చెప్పిన చిన్న కోరిక కూడా గొంతెమ్మ కోరికలా తోస్తుంది. జీవితం పట్ల కృతజ్ఞతతో వుండటం అలవాటవుతుంది.
మూగ మనసులను విని కని అమ్మలా ఆదరించే ఉషా జ్యోతి బంధం సహజ స్పందనకు మారుపేరు. కరోనా కాలంలో వలస జీవులకు కాసింత అండగా నిలిచారు. ఆమె కథకురాలు. పతంజలి రచనలపై వారు పిహెచ్ డి చేస్తున్నారు.
అమ్మ మాత్రమె కాదు అయిన వాళ్ళు ఎవరు పోయినా ఆ యాతన చెప్పనలవి కాదు. మోహన్ సర్ పోయినప్పుడు దగ్గరకు వెళ్ళా అంత దుఖం లోనూ నన్ను కసురుకుంది. ఆ తర్వాత ఆమెతో మాట్లాడాలి అనిపించలేదు. మాట్లాడ లేదు కూడా. ఉషకు రా రాతల మీద మంచి అభిప్రాయం. కానీ ముందు నేను ఆమెకు అభిమానిని. ఆమె కథ రాసినా చిన్న నోట్ రాసినా, కవిత అయినా అద్భుతమైన వచన శైలి ఆమెది. నేను ఇఫ్లూ లో ఉండే రోజుల్లో ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళా . ఒక ఆరేడు ఏళ్ళు హాస్టల్ లో తిన్న మొకాలకు బయట పచ్చడి మెతుకు దొరికి నా అపురూపమే. ఆ రోజు ఏదో రోటి పచ్చడి అద్భుతమైన పప్పు కాకుంటే కుక్కర్ లో అన్నం చూస్తే ఉన్నది ముగ్గురం ఉష మోషే నేను తింటూ ఉండగానే ఇది నాకు సరి పోద్ది మరి మీకూ అన్నా ఆ మాట అన్నందుకు ఇప్పటికీ సిగ్గు అనిపిస్తది. పాపం తినే అన్నం వదిలి చేయి కడుక్కొని మల్లె కాసింత రైస్ పెట్టింది. ఉషకు కేవలం ” జీవితం పట్ల కృతజ్ఞతతో వుండటం అలవాటవుతుంది” ఆమె కేవలం కృతజ్ఞత గా ఉండడం కేవలం అబ్లిగేషన్ కాదు ఒక బాధ్యత అని కూడా ఫీల్ అవుతుంది. అంత మంచి రాయసగాడు పతంజలి మీద డిగ్రీ రాయనందుకు ఆమె మీద నాకు బాగా కోపం. ఎంత కోప పడ్డా ఇప్పుడు చెవి మెలిపెట్టి రాయించలేను. పురా జ్ఞాపకాలు యేవో మెలిపెట్టినట్టు, ఇలా తొలకరి నవ్వినట్టు, ఎన్నెద్ర పూవంత సుకుమారంగా రాయగల ఈ కాలపు అరుదైన స్వరం ఆమెది. కాకుంటే బ్రతుకంతా పిల్లులకే అంకితం అయిన రాతలను అటకెక్కించింది.
చాలా బాగా రాశారు మా అమ్మా నాన్నా గుర్తొచ్చారు, మా నాన్న కుండే వినికిడి శక్తి లోపాన్ని కొన్ని సార్లు విసుక్కునేవాన్ని ,ప్రతిదీ ఆడిగేవాడు నేను చెప్పేవాన్ని కాదు నాన్న చనిపోయాక ఎంత వేదన మళ్లీ టైం వెనక్కి వెళ్తే తప్పులన్నీ సరిచేసుకుని నాన్నకు ఓపిగ్గా సమాధానం చెప్పాలని,అమ్మని కసురుకోకుండా ఇంకాస్త ఎక్కువగా ప్రేమ పంచాలని…. కళ్ళల్లో తడి నిలిచింది మీ రైటప్ కి🙏🙏