ఈ మధ్యంతర తీర్పును ఆహ్వానిస్తూనే ఆలోచించవలసిన అంశాలున్నాయి. ఇప్పుడే పెద్దగా సంతోషించడానికేమీ లేకపోయినా ప్రస్తుత దుర్మార్గ పాలన వరదలో గడ్డిపోచ దొరికినా సరే అని పట్టుకోవలసిందే.
ఎన్ వేణుగోపాల్
భారత శిక్షా స్మృతిలో సెక్షన్ 124 ఎ (రాజద్రోహ నేరం) ను తాత్కాలికంగా పక్కన పెట్టాలని (అబెయన్స్), తుది తీర్పు వెలువడేవరకూ ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయగూడదని, ఆ సెక్షన్ కింద నేరారోపణతో జైలులో ఉన్న వారికి బెయిల్ ఇచ్చే ఏర్పాట్లు త్వరితం చేయాలని మహా ఘనత వహించిన సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చింది. ఇది తుది తీర్పు కూడ కాదు గనుక, తుది తీర్పులో ఏమి చెపుతారో తెలియదు గనుక ఇప్పుడే పెద్దగా సంతోషించడానికేమీ లేదు. కాకపోతే, ప్రస్తుత దుర్మార్గ పాలన వరదలో గడ్డిపోచ దొరికినా సరే అని పట్టుకోవలసిందే.
ఈ మధ్యంతర తీర్పును ఆహ్వానిస్తూనే ఆలోచించవలసిన అంశాలున్నాయి.
1. భారత న్యాయ వ్యవస్థలో (భారత శిక్షా స్మృతి, నేర విచారణా స్మృతి, ప్రత్యేక చట్టాలు) ఉన్న అనేకానేక అప్రజాస్వామిక, దుర్మార్గ, ప్రజావ్యతిరేక చట్ట నిబంధనలలో సెక్షన్ 124ఎ ఒకానొకటి మాత్రమే. అది ఉన్నా, ఊడిపోయినా పెద్ద మార్పు జరగబోయేదేమీ లేదు. జరగవలసినది సెక్షన్ 124ఎ రద్దు ఒక్కటే కాదు, ప్రజావ్యతిరేక చట్టాలన్నిటి, సెక్షన్లన్నిటి రద్దు. ఒక వంద విష పురుగులలో నుంచి ఒక విష పురుగును చంపి (చంపి కూడ కాదు, బుట్టలో పెట్టి) ఏదో సాధించామని సంతోషపడడం కుదరదు.
ఇంకో నెలో రెండు నెలలో పోలీసులు సెక్షన్ 124ఎ వాడడానికి వీలులేదు. అంతమేరకు సంతోషమే.
2. సెక్షన్ 124 ఎ ఒక్క నేరం మీదనే పోలీసులు కేసు పెట్టరు. ఆ సెక్షన్ తో పాటు ఐపిసి లోని నాలుగైదు సెక్షన్లు, రాష్ట్ర ప్రజా భద్రతా చట్టంలోని నాలుగైదు సెక్షన్లు, యుఎపిఎ లోని నాలుగైదు సెక్షన్లు, కావాలనుకుంటే పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టం వంటి చట్టాలలోని నాలుగైదు సెక్షన్లు కలిపి ముద్ద చేసి కేసు పెడతారు. అటువంటి కేసుల్లో ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నవారికి ఇప్పుడు ఒక్క 124ఎ ను పక్కన పెట్టినా, సుప్రీం కోర్టు చెప్పినట్టు “త్వరితగతి బెయిల్” కు అవకాశమేమీ రాదు.
3. ఇవాళ్టి ఉత్తర్వులతో బహుశా జరగగల ఒకే ఒక్క మేలు తుది తీర్పు వచ్చేవరకూ, అంటే ఇంకో నెలో రెండు నెలలో పోలీసులు సెక్షన్ 124ఎ వాడడానికి వీలులేదు. అంతమేరకు సంతోషమే. కాని ప్రజలకు ఆ మేలు జరుగుతుందంటే, దాన్ని ఎత్తగొట్టడానికి పాలకులు మరెన్నో ఎత్తులు వేస్తారు. ఇతర క్రూర నిర్బంధ చట్టాలను వాడడం, వాటి కింద కేసులు పెట్టడం ఎక్కువవుతుందేమో….
అడగవలసింది సెక్షన్ 124 ఎ రద్దు ఒక్కటే కాదు, అడగవలసింది ప్రజాస్వామ్యం.
4. రాచరికం పోయినా వదలని రాజద్రోహం అనే కాలం చెల్లిన వలసవాద చట్టంగా సెక్షన్ 124ఎ పూర్తిగా, తప్పనిసరిగా రద్దు కావలసిందే. దాన్ని రద్దు చెయ్యాలని పోరాడవలసిందే. కాని ఆ పోరాటం కన్న ముఖ్యం ప్రివెంటివ్ డిటెన్షన్ ఆక్ట్, నేషనల్ సెక్యూరిటీ ఆక్ట్, అన్ లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్, రాష్ట్రాల పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ లు, ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ ఆక్ట్ వంటి అన్ని అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక, క్రూర, నిర్బంధ చట్టాలను రద్దు చెయ్యాలని పోరాడవలసి ఉంది.
అడగవలసింది సెక్షన్ 124 ఎ రద్దు ఒక్కటే కాదు, అడగవలసింది ప్రజాస్వామ్యం.
ఎన్. వేణుగోపాల్ కవి, రచయితా విమర్శకులు. వీక్షణం సంపాదకులు. తన తాజా రచనలు చదివేందుకు కడలి తరగ క్లిక్ చేయవచ్చు.