తన కాలపు విప్లవోద్యమాల పట్లా, బహుజన ఉద్యమాల పట్లా కవిగా త్రిశ్రీ నిర్వర్తించిన పాత్ర అద్వితీయం. అది సదా స్పూర్తివంతం. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సాహిత్య విమర్శకులు జి. లక్ష్మీ నరసయ్య విలువైన స్మరణ ఇది.
జి. లక్ష్మీ నరసయ్య
ఈరోజు త్రిపురనేని శ్రీనివాస్ పుట్టిన రోజు. తన కాలాన్నీ, వయసునూ మించి పరిణతి చూపగలిగిన వారిలో శ్రీనివాస్ ఒకడు. కవిత్వం రాయడం ద్వారా, ప్రచురించడం ద్వారా ‘కవిత్వం కావాలి కవిత్వం’ అని ఉద్యమించడం ద్వారా తెలుగు కవిత్వ ప్రమాణాలను పెంచిన వ్యక్తి. విప్లవోద్యమాలలో పూర్తికాలం పనిచేసి అసంతృప్తి తో బయటికి వచ్చిన ఉద్యమకారుడు.
ఒకరి వెనుక నడవటం చేతకాదు
నీడకింద
ఆలోచన కదలాడదు
లోపల సరస్సులున్న వాడు
బయట సముద్రాల్ని సృష్టించగలడు
లోపల మంట ఉన్న వాడు
బయట చలి మంటల్ని రగిలించగలడు
అతడు ఎవరికీ జడవడు
ఎవరి వెనుకా నడవడు…అని ప్రకటించాడు.
సంస్థలతో, పార్టీలతో, వాటి నిర్మాణాలతో పొసగక ఘర్షణపడి ఆ వేడి నుంచి వేదన నుంచీ పలికిన పలుకులివి. శ్రీనివాస్ వ్యక్తిత్వాన్ని పట్టివ్వగల వాక్యాలు.
‘నాకే ఇల్లూ లేదు’, ‘సంతకం ఎప్పుడూ ఒకేలా చేయలేను’, నా గుండెకు ఒక్క దేహం చాలదు’ లాంటి లోతైన ఈటెల్లాంటి వాక్యాలతో కవిత్వ ప్రపంచాన్ని కలవరంలోకి నెట్టాడు
‘నాకే ఇల్లూ లేదు’, ‘సంతకం ఎప్పుడూ ఒకేలా చేయలేను’, నా గుండెకు ఒక్క దేహం చాలదు’ లాంటి లోతైన ఈటెల్లాంటి వాక్యాలతో కవిత్వ ప్రపంచాన్ని కలవరంలోకి నెట్టాడు. తన వ్యక్తిత్వం టెంపరమెంట్ నుంచి దూసుకొచ్చిన వ్యక్తీకరణలివి.
‘పుడుతున్నారు, పెరుగుతున్నారు, చదువుతున్నారు, ఉద్యోగిస్తున్నారు, పెళ్లిచేసుకుంటున్నారు, వాళ్ళకీ పిల్లలు పుడుతున్నారు, పెరుగుతున్నారు, చదువుతున్నారు, ఉద్యోగిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళకీ పిల్లలు….ఓహ్ ఏం పునరుక్తి వైభవం! ‘ ఇదీ మన మీద త్రిశ్రీ కామెంట్.
సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా గుర్తిస్తూ దాన్నే రాసి రాసినదాన్నే బతికాడు. అందుకే..
విధి వ్రాత ఇంకా
కంపోజ్ కాలేదు
జీవితానికి
ద్వితీయ ముద్రణ లేదు
మినహా మరేవీ లేదు
అనగలిగాడు.
‘నాకే ఇల్లూ లేదు’, ‘సంతకం ఎప్పుడూ ఒకేలా చేయలేను’, నా గుండెకు ఒక్క దేహం చాలదు’ లాంటి లోతైన ఈటెల్లాంటి వాక్యాలతో కవిత్వ ప్రపంచాన్ని కలవరంలోకి నెట్టాడు
అగ్రకుల ప్రగతి వాదులు దళిత ఉద్యమాన్ని చూసి విస్తుపోతున్న రోజుల్లో దానిపట్ల ఎలా స్పందించాలో తెలియక గందరగోళంలో పడినప్పుడు ఆ ఉద్యమాన్ని సొంతం చేసుకుంటూ…
యుద్ధం మనమీద కాదు మనది కూడా
అంటరానిదాన్నే అంటుకుందాం అపూర్వంగా పరస్పరం
ఆలోచన మీద సాము
కవిత్వం ఉభయచరం
ముగింపు బహుజనముఖం…అని ఖరాఖండిగా చెప్పగలిగాడు త్రిపురనేని శ్రీనివాస్.
బహుజనుల విమర్శ బహుజనులే కాదు ప్రగతివాదులందరూ ముందుకు తీసుకెళ్లదగిందని చెప్పి ఊరుకోలేదు. అలా చేయలేని వాళ్ళు ప్రగతివాదులే కాదని తేల్చిపడేశాడు.’కష్టమైన పాఠం చదవటానికి మనసొప్పని విద్యార్థులు పరీక్షలంటే కంగారు పడుతున్నార’ని ఎద్దేవా చేశాడు.
విప్లవకర పరిణామాల్ని చూసి
బహు విప్లవకారులే
భయపడుతుంటారు
ఎందుకో ఎప్పుడూ
సాధారణంగా
సామాన్యులు ఓడిపోరు…అని ఆనాడు అనగలగటం పెద్ద సాహసమే.
‘ఒకే నావకు అనేక దిక్సూచీలు ‘గా సాగుతున్న విప్లవాన్ని బోనులో నిలబెట్టగలగడం చాలా మందిని ఇబ్బంది పెట్టింది.
తనూ నేనూ కలిసి పీడిత కులాల సాహిత్యం కోసం సాగించిన పోరు ఆ చరిత్రలో భాగమే.
హరి జనంలో ‘హరి’ మరణించాడు అని ప్రకటించడం ద్వారా దళితవుద్యమాన్ని గుర్తించి ప్రోత్సహించాడు. అగ్రకుల ప్రగతి వాదులు కుల నిర్మూలన పోరాటాలపట్ల తీసుకోవాల్సిన స్టాండ్ ను సరిగా ధ్వనించగలగటం కవిగా త్రిశ్రీ సాధించిన ఘనత. అందుకే పీడితకుల శ్రేణులు ఇతనికి ఫ్యాన్ లయ్యారు. అగ్ర కులాల దురహంకారం మీద బహుజనులు చేస్తున్న విమర్శను తమ మీది విమర్శగా పీడకకుల ప్రగతివాదులు భావించటం అన్యాయమనీ ఆ విమర్శతో తామూ గొంతు కలపటమే అసలైన ప్రగతివాదమనీ చెప్పటంలోనే ఇతని న్యాయబద్ధత ఉంది. ఇదే వాయిస్ ను హెచ్చార్కె వినిపించాడు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి వినిపించాడు. రాణీ శివశంకర శర్మా, రామిరెడ్డి లాంటి కవులూ ఈ వైఖరిని ప్రదర్శించారు. ఆ ఊపులోనే పీడక కుల ప్రగతివాద కవులు’ కాస్త సిగ్గుపడదాం’ పుస్తకంలో సంకలితమయ్యారు. ఇవ్వాళ మువ్వా శ్రీనివాసరావు చేస్తున్న పనీలో, రాస్తున్న కవిత్వంలో కూడా త్రిశ్రీ continuation కనబడుతుంది నాకు.
ఇదీ తన కాలపు విప్లవోద్యమాల పట్లా, బహుజన ఉద్యమాల పట్లా కవిగా త్రిశ్రీ నిర్వర్తించిన పాత్ర. ఇక ప్రచురణ కర్తగా, ఆంధ్రజ్యోతి ఆదివారం ఎడిటర్ గా తాను బహుజన కవులకు ఇచ్చిన చేయూతా ప్రోత్సాహం చెరిగిపోని చరిత్ర. తనూ నేనూ కలిసి పీడిత కులాల సాహిత్యం కోసం సాగించిన పోరు ఆ చరిత్రలో భాగమే.
అడ్డగోలు లోకంలో ఆదర్శంగా వుండేవాళ్ళంతా అడ్డగోలుగా ఎలా కనిపిస్తారో తెలియడానికి త్రిశ్రీ జీవితం, కవిత్వం గొప్ప ఆలంబన.
ఈ తరం కవులకూ, యువకులకూ త్రిశ్రీ జీవితం, కవిత్వం ఆదర్శనీయం, అనుసరణీయం.కవిత్వ సింహాసనం కోసం కవులు అడ్డ దారులు తొక్కుతూ, బాకాలనీ, బాజాలనీ తయారుచేసుకునే రందిలో ఉన్న ఈ తరుణంలో త్రిశ్రీ స్మరణ inspiring నోట్ గా పనిచేస్తుందని మీ అందరికీ తెలుసు.
విత్తనాలు జల్లకుండా, నాట్లు వేయకుండా, రకరకాల తెగుళ్ళతో యుద్ధం జరపకుండా పంటను తన్నుకెళ్లాలని చూసే అవకాశవాద, అల్ప మనస్కులకు శ్రీనివాస్ సింహ స్వప్నం. అడ్డగోలు లోకంలో ఆదర్శంగా వుండేవాళ్ళంతా అడ్డగోలుగా ఎలా కనిపిస్తారో తెలియడానికి త్రిశ్రీ జీవితం, కవిత్వం గొప్ప ఆలంబన.
కవిత్వమొక తీరని దాహమన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనంగా జీవించిన త్రిపురనేని శ్రీనివాస్ 1996 ఆగస్టు 17న తన 33 వ ఏట రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయనపై తెలుపు ప్రచురించిన మరో వ్యాసం ‘హో’ ఇక్కడ చదవండి.