Editorial

Thursday, November 21, 2024
సంప‌ద‌WEALTH : మక్కా నగరంలో నాన్న – సయ్యద్ షాదుల్లా

WEALTH : మక్కా నగరంలో నాన్న – సయ్యద్ షాదుల్లా

నాన్న …….ఒక నిశ్శబ్ధ యోధుడు.

నా స్మృతి పథంలో నిరంతరం పరిభ్రమించే మా నాన్న గారి జ్ఞాపకాలు తేనెలూరే ఊటలే.

నాన్నా – మీకేమివ్వగలను?
మీరు నేర్పిన ఈ అక్షరాలతో శ్రద్ధాంజలి తప్ప ?

సయ్యద్ షాదుల్లా

అది 5వ ఏప్రిల్ 1969 . నా మాతృమూర్తి పురిటి నొప్పులతో విలవిలలాడి పోతున్నారు. తొమ్మిది నెలలు నిండి చాల రోజులైనా ఇంకా ప్రసవం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, కంగారు పడ్డారట. ఆ కాలంలో సిజేరియన్ అలోచనే లేకపోవటం వల్ల మంత్రసానులతోనే ప్రసవం చేయించడం సర్వసాధారణం. ఎంతకీ ప్రసవం కాకపోవడం, ప్రసవ వేదన తీవ్రతరం కావడంతో నిస్సహాయులైన మా పెద్దలు మా నాన్నపై అరిచారట, ఏదైనా చేయమని, తుపాకులు గాలిలో పేల్చమని, ఆ చప్పుడుకైనా ఆమె ప్రసవిస్తుందని!

కన్నీటి పర్యంతమై నాన్న అక్కడినుండి బయటికి వెళ్ళి దేవుడుకి మొర పెట్టుకున్నారట ఈ ప్రసవం సుఖవంతం కావాలని.

అదే రోజు నారాయణపురం ప్రియంగా తన గడ్డ మీదికి నా జన్మను ఆప్యాయంగా ఆహ్వానించి తన అక్కున చేర్చుకుంది. మా నాన్నకు ఆరోజు ఎంతో ఆనందకరమైన దినమని! తన్మయత్వంలో పూర్తిగా మునిగిపోయి, తదాత్ములై కళ్ళు మూసుకుని మాకు చెబుతుంటే మా అందరికి కళ్ళకు కట్టినట్టుగా కనుపించేది. నా పుట్టుక వారిని అంతటి వేదనకు, బాధకు గురిచేసిందా?

ఇకపై నావల్ల వారు ఎప్పుడూ బాధ పడకూడదని, జీవితాంతం వారికి ఆనందం, సుఖమే పంచాలని దృఢంగా నిశ్చయించుకున్నాను.

వారిని రియాద్ ఏర్ పోర్టులో ఆనందభాష్పాలతో స్వాగతించి గుండెలకు హత్తుకుని నా కారులో మా ఇంటికి నేనే స్వయంగా కారు నడుపుతూ పోయిన ఆ రోజు నా జీవితంలో అత్యున్నత శిఖరం అధిరోహించి రోజు.

అమ్మనాన్నలు సౌదీ అరేబియాలో మాతో రెండు నెలలు గడపడం, నా భార్యాపిల్లలతో కలిసి మక్కా సందర్శించడం, మక్కాలో “ ఉమ్రా” ( మిని హజ్) చేయడం మా అందరి జీవితాల్లో మరిచిపోలేని మధురానుభూతి. అప్పుడు తీసిన ఫొటోనే మీరు చూస్తున్నది.

అమ్మతో కలిసి నాన్నగారు 2007 సంవత్సరంలో రియాద్, సౌదీ అరేబియాకు వచ్చారు. ఆ రోజల్లో డైరెక్ట్ ఫ్లైట్ లేదు. హైదరాబాద్ నుండి బాంబే, బాంబే నుండి రియాద్. బాంబే లో ఫ్లైట్ మారడం వారికి కొంచెం ఇబ్బందే కాని విజయవంతంగా రియాద్ చేరుకున్నారు. వారిని రియాద్ ఏర్ పోర్టులో ఆనందభాష్పాలతో స్వాగతించి గుండెలకు హత్తుకుని నా కారులో మా ఇంటికి నేనే స్వయంగా కారు నడుపుతూ పోయిన ఆ రోజు నా జీవితంలో అత్యున్నత శిఖరం అధిరోహించి రోజు.

సాధారణంగా అదొక పెద్ద విషయం కాదు. కాని నాలాంటి వాడు అధఃపాతాళం నుండి పైకి ఉబికి నా కంటూ ఒక లోకం సృష్టించుకుని అమ్మానాన్నలను అందులోకి ఆనందంగా ఆహ్వానించడంలో ఉన్న తృప్తి మాటకందదు. అలాంటి తృప్తిని నా జ్ఞాపకాల్లో ఘనీభవింపజేసి నన్ను సంపూర్ణంగా సంపన్నుడిగా మార్చారు మా అమ్మానాన్నలు.

నా కారువైపు అబ్బురంగా, గర్వంగా చూసిన నాన్న కళ్ళు నా కళ్ళలో నిక్షిప్తమైనాయి.

అంతకన్నా ఇష్టంగా చెప్పవలసింది అమ్మానాన్నల మక్కా సందర్శన. అవును. జీవితంలో ఒక్కసారైనా మక్కా సందర్శించుకోవాలన్న కోరిక ప్రతి ముస్లింకుంటుంది. కాని ఆ కోరిక చాలా అరుదుగా తీరుతుంది. కాని అమ్మానాన్నలు నాతో తన కోడలు, మనవడితో మక్కా సందర్శన కడు రమ్యం, హృద్యం , పరమానంద భరితం.

దాదాపుగా ఐదు వందల సార్లు ముఖానికి రంగేసుకుని యక్షగాన నాటకాలు ఆడిన ఘనత నాన్న గారిది.

నాన్న మంచి వక్త, ఆయన వాగ్దాటి చాల గొప్పది. ఆయన జీవితంలో జరిగిన ఒక్కో సంఘటన చెబుతుంటే దానికి అక్షరరూపం ఇస్తే మంచి కథ, దృశ్య రూపం పొందితే అపురూప కావ్యం అయ్యేది.

తన మాట తీరు సూటిగా , నిక్కచ్చిగా ఉండేది. నిజాయితీ, నిబద్ధత నిండుగా పలికేవి. విన్న వారికి తన హాస్య ప్రియత్వం ఆయన్ని మరింత ఇష్టపడేలా చేస్తుంది. దాదాపుగా ఐదు వందల సార్లు ముఖానికి రంగేసుకుని యక్షగాన నాటకాలు ఆడిన ఘనత నాన్న గారిది. సత్య హరిశ్ఛంద్ర నాటకంలో చంద్రమతి పాత్రతో ఎన్నో హృదయాలను గెలుచుకున్నారని జనాలు చెప్పగా విన్నాను నేను. రాత్రి మొదలైన నాటకం తెల్లారేదాకా సాగిన రోజులెన్నో. ఆయన నటనతో బరువెక్కిన గుండెలెన్నెన్నో…

ఆయన రామాయణ భారతాల్లోని పాత్రల ఔచిత్యాన్ని వర్ణిస్తుంటే ఆ పాత్రల్లోకి వారు పరకాయ ప్రవేశం చేసారా అనిపించేది.

నేను సైన్సు ను పూర్తిగా నమ్ముతాను. కాని ఆయన హస్తవాసి సైన్సు లాజిక్ కి అందలేదు.

మా ఊరు నారాయణపురం నుంచి గొల్లపల్లికి  దూరం దాదాపు మూడు కిలోమీటర్ల పై చిలుకే. మేమిద్దరం నడుస్తూ ఎల్లారెడ్డిపేట మీదుగా కిష్షంపేటను దాటి గొల్లపల్లి వెళ్ళి సినిమాలు చూసిన రోజులెన్నో. తిరిగి ఆ సినిమాలపై ఇంట్లో చర్చా గోష్టి జరపడం, మా అభిప్రాయాలు మా కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా  బలవంతంగా రుద్దడం, టైటిల్ కార్డ్ ల నుండి శుభం కార్డు వరకు కథ చెప్పడం అదొక ఎనలేని తృప్తి.

ఒకసారి కామారెడ్డి కమల్ టాకీసులో కమలహాసన్ , శ్రీదేవి నటించిన ‘ఎర్రగులాబీలు’ సినిమాకి వెళ్ళాం. వెళ్ళాం సరే కాని ఎందుకో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నాన్నగారికి యన్టీఆర్, ఏఎన్నార్ హీరోలు, అంజలి జమున లాంటి హీరోయిన్లు ఉన్న సినిమాలు- పైగా కుటుంబ పక్షంగా ఉండే కథాకథనానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆ సినిమా మొదలైన తరవాత ఇంటర్వెల్ లో , ఆపై సినిమా శుభం కార్డు తర్వాత మాత్రమే ఆయన్ని కలిసి, తల వంచుకుని మెల్లిగా వెంట వెంట నడుస్తూ వెళ్లాను. ఆ సినిమా గురించి ఎప్పుడూ చర్చాగోష్టి జరగలేదు.

నా బాల్యం నుండి నాన్న తో గడిపిన జ్ఞాపకాలు అనంతం. మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉండేవారము. నాన్నని నేను ‘అబ్బా’ అని పిలుస్తాను. వారు నన్ను కోపగించిన దాఖలాలు ఎప్పుడూ లేవు.

తన ముగ్గురు చెల్లెల్ల పెళ్లిళ్శు చేసి వారికి నాన్నయ్యాడు. నా ఇద్దరు అక్కల, అన్నల పెళ్ళిళ్ళు జరిపారు. నాకు తెలిసి ఎవరు మా ఇంటికి వచ్చినా వారికి దారి ఖర్చులు ఇచ్చి పంపేవారు. మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో బంధువులు ఉండేవారు. వారి మంచి చెడు ఎంతో బాధ్యతగా చూసేవారు.

ఆయన స్పర్శిస్తే చాలు పిల్లలు కేరింతలు కొట్టేవారు.

నిర్మలంగా, నిష్కపటంగా ఉండేవారు. ఆయన చేతిమహిమ గొప్పదని వేరే ఊళ్ళనుండి జిల్లాల ఎల్లలు దాటి పసికందులను తీసుకుని ఆయన కోసం వచ్చేవారు. ఫజర్ (ప్రాతఃకాల నమాజు) నమాజు తర్వాత ఆయన కోసం బారులు తీరేవారు. ఆయన స్పర్శిస్తే చాలు పిల్లలు కేరింతలు కొట్టేవారు. పాలు తాగని పిల్లలు సైతం పాలు తాగేవారు. డాక్టర్లు, పొలీసులు, న్యాయవాదులే కాకుండా, కులమతాలకు అతీతంగా అందరూ ఆయన దగ్గిరకి వచ్చే వారు. దాదాపుగా వారు మూడు తరాలను చూసారంటారు.

సూర్యోదయానికి ముందే ఎముకలు కొరికే చలిలో నిష్ఠగా స్నానం చేసే తన పని మొదలు పెట్టేవారు. “చలిలో స్నానం వద్దు నాన్నా, మీ ఆరోగ్యం పాడవుతుంది” అంటే “నా కోసం చంటి బిడ్డలు అంత దూరం నుండి వస్తున్నారు కదా! వారి కష్టంతో పోల్చుకుంటే నా కష్టం ఏపాటిది” అనేవారు. నేను సైన్సు ను పూర్తిగా నమ్ముతాను. కాని ఆయన హస్తవాసి సైన్సు లాజిక్ కి అందలేదు.

నేను తిరిగి మాతృదేశానికి వచ్చేవరకు ఆయన గుండె చప్పుడు అలాగే సాగాలని దైవాన్ని అశ్రునయనాలతో మనసులో అర్థించేవాడిని.

నేను ఎంత సంపాదించినా ఆయన ‘చేతికి’ ఎప్పుడు డబ్బు ఇవ్వలేదు. నా చేయి ఎప్పుడూ ఆయన చేతి కిందే ఉండేది. “నాన్నా! బయటకెళుతున్నాను. చిల్లర ఉంటే ఇవ్వండి “ అంటే, తన జేబులు తడిమి చేతికందినది ఏదో నా చేతిలో పెట్టేవారు. కళ్ళ కద్దుకుని జేబులో వేసుకునేవాన్ని. ఇంటిలో ఈ తంతును అందరూ మౌనంగా గమనించేవారు. నేను ఆర్థికంగా స్థిరపడ్డాక కూడా “చిల్లర ఉంటే ఇవ్వండి” అని అయన దగ్గర ఎంతో కొంత డబ్బులను చేతుల్లో తీసుకుంటేగానీ నాకు తృప్తిగా ఉండేది కాదు. ఈ  పద్ధతి ఆయన జీవిత చరమాంకం వరకు సాగింది.

నా మనసు బాగా లేక పోయినా, వేదన నా దరి చేరినా నాన్నగారిని గుండెలకు గట్టిగా హత్తుకునేవాడిని. తనూ నన్ను పొదివి పట్టుకుని లాలించేవారు. నా నయనాలు సజల నయనాలయ్యేవి. మనసు దూది పింజలా, వర్షం కురిసిన తరువాతి ఆకాశంలా తేలిక పడేది. ఆయన ఆలింగనంలో అంత ఆత్మీయత, అనురాగం నిండి గుండెల్లో ఎంతో ధీమా, ధైర్యాన్ని నింపేది.

నా ప్రవాస జీవితంలో సెలవులు ముగించుకుని సౌదీ అరేబియాకు తిరిగి వెళ్ళే సమయంలో నాన్నగారిని గుండెలకు హత్తుకుని పలికే ప్రతీ వీడ్కోలు ఉద్వేగంగా సాగేది. నేను తిరిగి మాతృదేశానికి వచ్చేవరకు ఆయన గుండె చప్పుడు అలాగే సాగాలని దైవాన్ని అశ్రునయనాలతో మనసులో అర్థించేవాడిని. విడవలేక విడిపోతూ, నా ప్రాణాన్ని ఆయన గుండె గదుల్లో నిక్షిప్తం చేసినట్లు, నా జీవాన్ని ఆయనకు సమర్పించి, నిర్జీవమైన నా కాయంతో నేను బయలు దేరినట్లు, కను చూపు మేర ఆయన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ, ముందుకు పోలేక, పోతూ పోయిన జ్ఞాపకాలెన్నో.

సౌదీ అరేబియాలో అబ్బా మాతో ఉన్న రోజులు ఎంతో ఆనందంగా గడిచాయి. షాద్ నగర్ లో నేను కట్టుకున్న స్వంత ఇంటిలో మూడు వారాలు తృప్తిగా గడిపారు.

28 మే 2016. అది నాకు జన్మ నిచ్చిన నాన్నగారిని కోల్పోయిన రోజు. తన 93 వ యేట ఆయన కన్ను మూసినరోజు. ఆశనిపాతంలా తాకిన ఆ వార్త నన్ను మిన్ను విరిగి మీద పడినట్లుగా ఖిన్నున్ని చేసింది. మరుసటిరోజు ఆయన కడసారి చూపు కోసం సౌదీ నుండి సాగిన నా ప్రయాణం ఆద్యంతం అశ్రుపూరితం, బాధాతప్తం, నిర్వేదం.

తెల్లని బట్టల్లో అంబరానికి ఎగిరి పోయే శాంతి దూతలా, తన కిష్టమైన మా పొలంలో తన అమ్మానాన్నలు, నా అక్కా తమ్ముళ్ళ సమాధుల మధ్య శాశ్వత నిద్రకు ఉపక్రమించారు.

నన్ను ఈ సుందర లోకానికి పరిచయం చేసిన మహోన్నత మనీషి మౌనంగా, నిర్మలంగా, నిశ్చలంగా , భవబంధాలను తెంచుకుని, తెల్లని బట్టల్లో మల్లెపూవులా నిదురిస్తూ, అంబరానికి ఎగిరి పోయే శాంతి దూతలా, మా అందరి కన్నీటి వీడుకోల్ల మధ్య తన కిష్టమైన మా పొలంలో తన అమ్మానాన్నలు, నా అక్కా తమ్ముళ్ళ సమాధుల మధ్య శాశ్వత నిద్రకు ఉపక్రమించారు.

ఆయన గతించిన నాలుగు నెలల్లోనే తను లేని జీవితం శూన్యంగా భావించిన అమ్మ మమ్మల్ని విడిచి నాన్న గారి దగ్గరకు వెళ్లిపోయారు.

సయ్యద్ షాదుల్లా నిండుగా కలలు గన్న మనిషి. వాటిని సాకారం చేసుకోవడానికి ఎదురీదిన వ్యక్తి. ఆ ఎదురీతను ఎక్కడ ఆపాలో కూడా తెలిసిన మనిషి. తాను డైరీ టెక్నాలజీ చదివాక దేశ విదేశాల్లో దాదాపు మూడు దశాబ్దాలు వివిధ సంస్థల్లో వేరు వేరు హోదాల్లో పనిచేశారు. చివరకు స్వదేశంలో ఉంటూనే తన వృత్తి నైపుణ్యాలకు పని చెప్పాలని నిర్ణయించుకున్నాక నాలుగేళ్ల క్రితం సౌది అరేబియా నుంచి తిరిగి భారత్ వచ్చేశారు. అప్పటి నుంచి కన్సల్టెంట్ గా వివిధ దేశ విదేశీ సంస్థలకు సేవలు అందిస్తూ షాద్ నగర్ లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. సాహిత్యం, సంగీతం వారి అభిరుచులు.

తెలుపు ప్రచురించిన వారి గత వ్యాసాలు

అది 18 మార్చి 2013 : సాహిత్యానికి కృతజ్ఞతాంజలి

నారాయణపురం : మా ఊరు ఒక ముత్యాల దీవి 

“నా USA ప్రయాణం సోదరుడి సమాధి నుండి మొదలయ్యింది  

మా ‘జైన్’ గురించి చెప్పాలి

అశ్రువొక్కటి చెక్కిలిపై…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article