సహజసమాధి చిత్తుడై చెప్తున్నాడు కబీరు, ఇప్పుడు నేను భయపడను, మరొకణ్ణి భయపెట్టను.
కోరికలు తొలగిపోయాయి, అతడు లభించాడు, నా నమ్మకం బలపడింది.
వాడ్రేవు చినవీరభద్రుడు
ఇప్పుడు కబీరు పూర్తి బంగారం
అతడిప్పుడు రాముడు ఈ పాత్రలోనే ప్రకాశిస్తున్నాడు, నా దేహం పునీతమై పుత్తడిగా మారిపోయింది.
స్వర్ణకారుడు బంగారాన్ని ఆకురాతిమీద గీసి చూసుకున్నట్టు, నా శరీరం కఠిన పరీక్షకు నిలబడి తనువు పరిశుద్ధపడింది.
ఒకదాని వెనుక ఒకటి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చానని! ఇప్పటికి నా మనసు కుదుటపడింది, శాంతి స్థిరపడింది.
బయట వెతికి వెతికి జీవితమంతా వృథా చేసుకున్నాను, మనసు నిలిచి లోపల ధ్యానించగానే ఆయన్ని లోపల కనుగొన్నాను,
అతడి పరిచయం లేనంతకాలం ఈ దేహం వట్టి గాజు, ఒకసారి అతడు ఎరుకపడ్డాక, ఇప్పుడు కబీరు పూర్తి బంగారం.
2
యముడు రాముడిగా మారిపోయాడు
యముడు రాముడిగా మారిపోయాడు. దుఃఖం నశించి సుఖం కుదురుకుంది. వైరిజనులు మిత్రులుగా మారారు, శక్తికోసం పాకులాడేవాడు సుజనుడైపోయాడు.
ఇప్పుడు మోహమంతా కుశలమైపోయింది. గోవిందుణ్ణి కనుగొన్నాక మనసు నెమ్మదించింది.
నన్ను పీడిస్తున్న కోటి ఉపాధులు సహజసుఖసమాధిగా మారిపోయాయి. నిన్ను నువ్వు పోల్చుకున్న రోజున అన్ని రుగ్మతలూ, త్రివిధ తాపాలూ తొలగిపోతాయి.
ఇప్పుడు నా మనస్సు అనంతమూ, నిత్యనూతనమయ్యింది. ఆ సంగతి తెలిసాక, మరణించినా జీవితం కొనసాగుతుంది.
సహజసమాధి చిత్తుడై చెప్తున్నాడు కబీరు, ఇప్పుడు నేను భయపడను, మరొకణ్ణి భయపెట్టను.
3
ఇప్పుడు అతణ్ణి నా వాణ్ణి చేసుకున్నాను
ఇప్పుడు అతణ్ణి నా వాణ్ణి చేసుకున్నాను. ప్రేమలో, భక్తిలో నిలువెల్లా తడిసిపోయాను.
శరీరం నిలువెల్లా దహించుకుపోనీ, రవ్వంత కూడా చలించను. ప్రాణాలు కొడిగట్టిపోనీ, అతడి స్నేహాన్ని మాత్రం విడిచిపెట్టను.
మనోవల్లభుడు చేరువ కావడం ఏమంత సులువైన సంగతి కాదు, నా మనసు చెల్లించి మరీ నిర్మల రాముణ్ణి కైవసం చేసుకున్నాను.
అతణ్ణింతకాలం బయట వెతుకుతూనే బతుకంతా గడిచిపోయింది. ఇప్పుడతణ్ణి నా లోపలే కనుగొన్నాను, నా ఇంట్లోనే కలుసుకున్నాను.
కబీరు అంటున్నాడు, కోరికలు తొలగిపోయాయి, అతడు లభించాడు, నా నమ్మకం బలపడింది.
4
కబీరు రాముడైపోయాడు
గంగలోకి ప్రవహించే కాలవ కూడా గంగగా మారిపోతుంది. అట్లానే కబీరు కూడా రాముడిగా మారిపోయాడు. సత్యమైపోయాడు. ఇంక అతడికి ఎక్కడికీ పోవలసిన పనిలేదు.
చందన సాంగత్యంలో తరువు కూడా చందనమైపోయింది. ఇప్పుడది చందన సుగంధం విరజిమ్ముతోంది. పరుసవేది తగిలి రాగి అదృశ్యమైపోయింది. ఇప్పుడది పుత్తడిగా మారిపోయింది.
సాధు సాంగత్యంలో కబీరు మారిపోయాడు. ఇప్పుడు కబీరు రాముడైపోయాడు.
5
రామరసాయనం ప్రేమ రసం
రామ రసాయనం ప్రేమ రసం, ఎంత తాగు, అంత మధురం. కాని అదేమంత చౌక కాదు, నీ శిరసు చెల్లించి కొనుక్కోవాలి.
కవి, రచయిత, చిత్రకారులు వాడ్రేవు చినవీరభద్రుడు రచించిన ‘కబీరు : దు:ఖం లేని దేశం’ ఈ నెల పది నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రచురణ అనల్ప. ప్రతులకోసం 7093800303