‘యాదగిరి’ అన్న పేరు తెలంగాణ అమాయకత్వానికి ఆవేశానికి ప్రతీక. అది మార్చడం ఏమంత సమంజసంగా అనిపించడం లేదు. ఒక్క మాటలో తెలంగాణా ఆత్మగౌరవం ‘యాదగిరి’. ఇప్పటికైనా యాదాద్రి పేరుని యాదగిరి గుట్టగా పేరు మార్చాలని నా కోరిక.
మంగారి రాజేందర్
యాదగిరిలో గిరి ఉంది. యాదాద్రిలో ఆద్రి వుంది. గిరి ఆద్రి రెండు తెలుగు పదాలు కాదు. రెండూ సంస్కృత పదాలే. మహాభారతంలోని అవతారికలో రాజరాజనరేంద్రుని గురించి నన్నయ్య చెప్పిన మొదటి పద్యం “రాజకులైక భూషణుండు..” దీన్ని మొదటి తెలుగు పద్యం గా చెప్పుకుంటారు. ఈ పద్యంలో ఒక్క తెలుగు పదం కూడా లేదు. అన్నీ సంస్కృత పదాలే. ప్రతి పదానికి కొమ్ము చేర్చడం వల్ల తెలుగు పదంగా మారిపోయింది. అది మొదటి తెలుగు పద్యం గా చలామణి అవుతుంది. ఇక్కడ చెప్పే విషయం ఏమంటే సంస్కృతం లేకుండా తెలుగు మాట్లాడడం కష్టం. ఒక్క సంస్కృతాన్నే కాదు ఉర్దూని, పార్షీని, ఇంగ్లీష్ ని తెలుగు భాష అక్కున చేర్చుకుంది. ఏ భాష అయినా అన్యభాషా పదాలను తనలో కలుపుకోకుండా అభివృద్ధి చెందదు. తెలుగులో డుమువుల వల్ల అన్య భాషా పదాలకు తెలుగు తనం వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే యాదగిరిగుట్ట తెలుగని, యాదాద్రి సంస్కృతం అని, అది చిన్న జీయర్ స్వామి ప్రభావంతో జరుగుతుందని కొంతమంది భావిస్తున్నారు. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం లో యాదాద్రి అన్న పద ప్రయోగం ఉంది. అందుకని పేరు మార్చడం తప్పేమీ కాదని మరికొంతమంది భావిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైష్ణవ మతానికి ప్రాముఖ్యం పెరుగుతుందని మరికొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాసం రాయాల్సి వచ్చింది. ఈ వ్యాసం రాసే క్రమంలో కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావించాల్సి వస్తుంది.
మా ఊరు వేములవాడ. మేము మున్నూరు కాపు కులానికి చెందిన వాళ్లం. ఇంట్లోని ప్రతి గడపకి విష్ణు నామాలు ఉంటాయి. నా చిన్నప్పుడు మా పంట చేతికి రాగానే మా అమ్మ “కొత్త “పెట్టుకోవడానికి ముందు కొత్త బియ్యంతో అన్నం వండి గుడికి వెళ్లి అన్న పూజ చేసేది. కాలక్రమంలో రాజేశ్వర స్వామి దగ్గరికి భక్తుల సంఖ్య పెరగడం వల్ల ఈ పద్ధతి పోయింది. ఈ విషయం గురించి నేను రాసిన మా వేములవాడ కథల్లోని” అన్న పూజ “కథ లో ఉంటుంది. ఆ కథల్లో మొదటి నుంచి చివరి దాకా రాజేశ్వరుని ప్రస్తావన లేకుండా ఉండదు మరి మేం వైష్ణవులమా ..? శైవులమా..?
సామాన్య ప్రజలకి ప్రతీక యాదగిరి. నిజానికి తెలంగాణ ప్రజలని యాదగిరిగానే ఆంధ్ర ప్రాంత ప్రజలు చూశారు.
అది అలా ఉంచి శ్రావణమాసంలో మేం అంటే -మా ఊరి వాళ్ళు అందరూ చూసే ప్రాంతాలు మా ఊరి బయట తాళ్ళల్లో లో ఉన్న ఎల్లమ్మ గుడి, వేములవాడ కి సిరిసిల్ల కి మధ్యలో ఉన్న అగ్రహారం. అక్కడ ఆంజనేయస్వామి ఉంటాడు. చివరగా మేం వెళ్ళేది నాంపల్లి గుట్ట. అక్కడ ఉన్నది నరసింహ స్వామి. ఇది గత అరవై సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు సౌకర్యాలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఆ గుడులకి వెళ్లడం ప్రజలు తరచూ చేస్తున్నారు
ప్రతి పండుగకి మేం వెళ్ళేది రాజరాజేశ్వర స్వామి గుడికి.
మా ఊరి వాళ్ళ ఇళ్ళల్లో ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా పూజ చేసేది మా ఊర్లో ఉన్న బద్ది పోచమ్మ తల్లికి. బద్ది పోచమ్మ తల్లి కి కల్లు పోయకుండా, బోనం తీసుకొని వెళ్ళకుండా ఏ శుభకార్యం చేయరు. అన్ని కులాల వాళ్ళు ఇదే పని చేస్తారు. ఇవన్నీ చెప్పడంలోని ఉద్దేశం ఏమంటే అన్ని దేవుళ్ళని అందరూ పూజిస్తారు.
తెలంగాణ ఉద్యమం రాక ముందు ఉన్న పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుంటే మనం మనం కాకుండా ఎలా బతకామో అర్థం అవుతుంది. గోదావరి నది మన నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి లో ప్రవేశించి నాలుగైదు జిల్లాల నుంచి ప్రవహించి ఆంధ్రప్రాంతంలో కి పోతుంది. కానీ పుష్కరాల కోసం తెలంగాణ వాళ్ళు రాజమండ్రికి వెళ్ళే వాళ్ళు. అక్కడ పుష్కర స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందన్న భ్రమల్లో బతికారు.
తెలంగాణ ఉద్యమ ప్రభావం వల్ల ఇక్కడి ప్రజలు ఇక్కడే పుష్కర స్నానం చేయడం ప్రారంభించారు. కేసిఆర్ దంపతులు ధర్మపురిలో ,సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి కందకుర్తి లో పుష్కర స్నానం చేశారు.
అక్కడ స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందని అన్న భ్రమ తొలగిపోయింది. ఇట్లా చాలా భ్రమలు ఇంకా ఉన్నాయి. వాటిని తొలగించే క్రమం ఇప్పుడు జరుగుతుంది.
టంగుటూరి అంజయ్య “గరీబోళ్ళ బిడ్డ”.అణగారిన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఆయన హెలికాప్టర్ పేరు యాదగిరి. ఆయన మీద ఎన్నో జోకులు ఎన్నో కార్టూన్లు వేశారు.
యాదగిరిగుట్ట కి సామాన్య ప్రజలు ఎక్కవ వెళ్తారు. అన్ని వర్గాల ప్రజలు కూడా వెళ్తారు. సామాన్య ప్రజలకి ప్రతీక యాదగిరి. నిజానికి తెలంగాణ ప్రజలని యాదగిరిగానే ఆంధ్ర ప్రాంత ప్రజలు చూశారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి అంజయ్య “గరీబోళ్ళ బిడ్డ”.అణగారిన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఆయన హెలికాప్టర్ పేరు యాదగిరి. ఆయన మీద ఎన్నో జోకులు ఎన్నో కార్టూన్లు వేశారు. ఎంతో గేలి చేశారు .
యాదగిరి నరసింహస్వామి ఓ కులానికి చెందిన దెవుడు కాదు. అందరి దేవుడు. ఇంకో విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలకి ప్రతీక.
ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. యాదగిరికి కోట్లకి కోట్లు కేటాయిస్తున్నారు మంచిదే. మా వేములవాడ రాజేశ్వర స్వామిని పట్టించుకోవడంలేదని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తావించారు.
ఒక్క యాదగిరే కాదు తెలంగాణలో చాలా గుళ్ళు ఉన్నాయి . వాటి అన్నింటి పైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.
కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు వేములవాడ కొమురవెల్లి అయినవోలు , భద్రకాళి, మహబూబ్ నగర్ లోని మన్యంకొండ బాచుపల్లి, ఆలంపూర్ వికారాబాద్ లోని అనంత పద్మనాభ స్వామి ఇట్లా ఎన్నో. ఈ గుళ్ళని ఇంకా అభివృద్ధి పరచాల్సి ఉంది.
యాదగిరి అన్న పేరులో సామాన్యుడు కనిపిస్తున్నాడు. యాదాద్రి లో ఇంకా వేరే ఎవరో కనిపిస్తున్నారు.
రెండింటి అర్దాలు ఒకటే అయినప్పటికీ కూడా.
యాదగిరి గుట్ట పేరు యాదాద్రి గా మార్చాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న వస్తుంది. బొంబాయి నగరం ముంబై గా మారింది. బెంగళూరు బెంగళూరు గా మారింది. కాల క్రమంలో మార్పులు సహజమే. కానీ యాదగిరి అన్న పేరు తెలంగాణ అమాయకత్వానికి ఆవేశానికి ప్రతీక. అది మార్చడం ఏమంత సమంజసం గా అనిపించడం లేదు.
యాదగిరి అన్న పేరులో సామాన్యుడు కనిపిస్తున్నాడు. యాదాద్రి లో ఇంకా వేరే ఎవరో కనిపిస్తున్నారు.
రెండింటి అర్దాలు ఒకటే అయినప్పటికీ కూడా.
యాదగిరి అన్న పేరు ఆత్మగౌరవానికి సంబంధించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పేరు మన జెండా ఎగరాలి.
1994 సంవత్సరంలో ఓ కవితలో ఇలా అన్నాను.
“నా పేరు యాదగిరి
నా పేరు వింటేనే మీ ముఖాలు వెక్కిరిస్తాయి
నన్ను సర్వర్ గానో, విలన్ గానో
ద్వంద్వర్థాల జోకర్ గానో
మోసగాడి గానో
తార్పుడు గాడి గానో చూపిస్తారు
అవహేళన చేస్తారు.
నా భాషలో లేని అనాకారి తనాన్ని
వంకరలని జొప్పించి నాతో మాట్లాడిస్తారు
ద్రౌపదిని వివస్త్ర చేస్తున్నా కురుసోదరుల్లా సంబర పడతారు
నిజమే!
భార్యని వదినలని అవమానించిన వ్యక్తులు చరిత్రలో ఉన్నారు.
కానీ తల్లిని మానభంగం చేస్తున్న వ్యక్తులు ఇప్పుడే తయారవుతున్నారు
అందుకే
నేను నా యాసని పదును పెడుతున్నాను.”
యాదగిరి అన్న పేరు ఆత్మగౌరవానికి సంబంధించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పేరు మన జెండా ఎగరాలి.
అంతే కాని ఆ పేరుని మార్చుకోకూడదు. ఈ విషయం గురించి అందరూ ఆలోచించాలని నా ఆకాంక్ష.
తాజా కలం : ఈ వ్యాసం 15 మార్చ్ 2015 వ సంవత్సరములో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితం అయ్యింది. ఇప్పటికైనా యాదాద్రి పేరుని యాదగిరి గుట్ట గా పేరు మార్చాలని నా కోరిక.
కవి, రచయిత అయిన మంగారి రాజేందర్ ( జింబో ) వృత్తిరీత్యా జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. సూటిగా సుతిమెత్తగా న్యాయబద్దమైన వాణి విన్పించ్గడం వారి ప్రత్యేకత.