Editorial

Thursday, November 21, 2024
ఆనందంఅది 18 మార్చి 2013 : సాహిత్యానికి కృతజ్ఞతాంజలి – సయ్యద్ షాదుల్లా

అది 18 మార్చి 2013 : సాహిత్యానికి కృతజ్ఞతాంజలి – సయ్యద్ షాదుల్లా

నిజం చెప్పాలంటే నా జీవితం బీదరికంలోంచి విరిసింది. కానీ సాహిత్యం నాకు వర ప్రసాదమైంది. అదే కలలు కనేలా వాటిని సాకారం చేసుకునేలా నన్ను తీర్చిదిద్దింది.

సయ్యద్ షాదుల్లా

ఒక మంచి పుస్తకం, మంచి  వాక్యం జీవితాలను ప్రభావితం చేసి గణనీయమైన మార్పును సొంతం చేస్తుందని చెప్పడానికే ఈ అక్షరమాల.

అప్పుడు నేను ప్రాథమిక పాఠశాల విద్యార్థినే. అంత చిన్న వయసులోనే మధుబాబు, విశ్వప్రసాద్, యద్దనపూడి, మాదిరెడ్డి లాంటి విశిష్ట రచయితలను నాకు మా అన్న బాబుమియా పరిచయం చేయడం నా అదృష్టం. తరువాత యండమూరి గారి రచనలు చదివాను. అటు తర్వాత కాలేజీ దశలో సోమర్ సెట్ మామ్ వంటి రచయితల పుస్తకాలూ చదివినప్పటికీ బాల్యంలోని ప్రభావం అమితం.

చెప్పదలచుకున్నదేమిటంటే, ఆ రచనలు నా జీవితంలోకి రాకుంటే, అంత చక్కటి సాహితీ సుగంధాలు నాకు అబ్బకుంటే నా జీవితం ఇంత ప్రభావశీలంగా ఉండకపోవచ్చు అని.

నిజం చెప్పాలంటే నా జీవితం బీదరికంలోంచి విరిసింది.

పొగ చూరిన జీవితాలు, చాలీ చాలని బతుకులు, గంపెడంత కుటుంబం, గుప్పెడంత సంపాదన. ఇదీ మా ఆర్థిక పరిస్థితి. పెట్టిన పెట్టుబడి తిరిగి రాక పోయినా నాన్నకు భూమి మీది వల్లమాలిన ప్రేమ. అదే తనను ఇంటిల్లిపాదిని వ్యవసాయానికి అంకితం చేయించింది. ఆ నేపథ్యంలోనే తమ్ముడితో పాటు మా అన్న చదువుకూ ఆటంకం కలిగింది. దైవసంకల్పమో ఏమో గానీ నా చదువు నిరాటకంగా, వారి త్యాగాలకు ప్రతిరూపంగా సాగింది. ఇంట్లో గుడ్డి దీపం, ఇంటి వెనక పాకలో ఎడ్లు, ఆవులు, రెండు బర్రెలు, వాటి ధ్వనులు, రాత్రయితే దోమల గోల, దినమంతా ఈగల రొద. ఇంట్లో కట్లెల పొయ్యి. ఇల్లంతా పొగ.

అప్పుడనిపించింది ఏమిటీ జీవితమని?

నేను చదివిన పుస్తకాల్లోని జీవితం నా జీవితానికి పూర్తిగా విభిన్నంగా ఎందుకు ఉంది? స్విచ్ వేస్తే తిరిగే పంకా, ఎండా కాలంలో రూం ఏసి గదిని చల్లగా చేయడం, నల్లా విప్పితే షవర్ ఒంటి మీద వేడి నీరు దారాల్లా పడి గిలిగింతలు పెట్టడం, కిటికీ తెరిస్తే చల్లని గాలి మొహానికి తాకడం, మెత్తని ఫోం బెడ్, బయటి ప్రపంచ దూరతీరాలను దారాలతో సంధానమయి నిరంతరం మన ఆప్తులతో ఫోన్‌లో మాట్టాడ్డం,
పడవలాంటి కారు, కారు ఆఫీసులోకి వెళుతుంటే సెక్యూరిటీ వారు వినమ్రంగా సెల్యూట్ కొట్టి విశాలమైన గేట్లను బార్లా తెరవడం, ఆఫీసులో తన అనుచరులు అతని ఆదేశాల కోసం ఎదురు చూడడం, విమాన ప్రయాణాలు, విమానాశ్రయంలో తన పేరు రాసిన కార్డు పట్టుకుని తన కోసం ఒకరు ఎదురు చూడ్డం, అమెరికాలోకి అత్యంత ఖరీదైన హోటల్ చివరి అంతస్తుపై నిలబడి సగర్వంగా “ నేను గెలిచాను” అని అరవడం, మంచి మనసున్న ఓ పేద అమ్మాయిని ప్రేమించడం, పెళ్ళి చేసుకోవడం, జీవితాన్ని సఫలం చేసుకోవడం……. లాంటివెన్నో చదివిన తరువాత అది కాల్పనిక జీవితం కాదు, అంతకంటే ఇంకా జీవితం అందంగా, ఆనందంగా ఉంటుందన్నడి నా ప్రగాఢ విశ్వాసం. అ విశ్వాసమే నా చేత ఆ వేపుగా అడుగులు వేసేలా పురికొల్పింది.

నేను చూసిన ఆ కాల్పనిక జీవితం నిజం కావాలంటే, ఈ అత్తెసరు బతుకులు మారాలంటే చదువొక్కటే మార్గమని, అదే నా అంతిమ లక్ష్యమని ఆ లేత మనసులో బలంగా ముద్రితం కావడానికి కారణం చిన్ననాడు నేను చదివిన సాహిత్యమే.

కామారెడ్డిలో నా చదువు కష్టంగా సాగినా ఇష్టంగా చదివాను. బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసిలో జాతీయ స్థాయిలో మాస్టర్స్ సీటు రావడం గొప్ప ఆనందం. కానీ ఒక్కో సెమిస్టర్ మండే కడుపు, ఖాళీ జేబుతో అతి కష్టంగా చదవాదం నరకమే. దాంతో ఇక నా వల్లకాదని నా పై చదువుల కలను అర్ధాంతరంగా ముగించుకుని, రెట్టించిన పట్టుదలతో ఉద్యోగ ప్రయత్నం మొదలెట్టాను.

మేడ్చల్ లో ఓ డెయిరీలో ఉద్యోగం. ఆప్పుడే అదృష్టం తలుపుతట్టింది. దాన్ని అమాంతం సొంతం చేసుకుని సౌదీ అరేబియాకి పయనం కావడం నా పొగచూరిన బతుకు సప్తవర్ణాలంకారం కావడానికి మార్గం చూపింది. ఆ క్రమంలో ఇంద్ర ధనస్సులా విరిసిన ఒక అందమైన చాపాన్ని ఒక్కటి మీతో పంచుకుంటాను.

షికాగో విమానాశ్రయం నుండి బెలాయిట్ వరకు నాకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లిమోసిన్ కారు. అది నన్ను ఒక పెద్ద హోటల్ లో దిగబెట్టింది. భూతల స్వర్గమా అనిపించే ఆ వసతులు విభ్రమణకు గురి చేసి కలా నిజమా అన్న నమ్మలేని నిజాలు నా కళ్ళముందు కదలాడుతుంటే, నేను చూసిన కాల్పనిక జీవితం నిజం అయ్యిందా అనిపించింది.

అది 18 మార్చి 2013, నేను సౌదీ అరేబియాలో పనిచేసే సమయంలో లభించిన ఒకానొక ఆ అమెరికా ప్రయాణం. అది నా జీవితంలో అత్యంత కీలక ఘట్టం.

అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం. బెలాయిట్ అనే నగరం. కెర్రీ అనే 7.4 బిలియన్ యూరోల సంస్థ. దాని గ్లోబల్ ప్రెసిడెంట్ జెర్రీ బెహాన్. అతడితో 18 మార్చిన మా సంస్థ తరఫున నా మీటింగ్. ఇరవై ఐదు మంది ఫుడ్ సైంటిస్ట్‌లు నాతో ఆ రోజంతా గడపడం, వారితో మా సంస్థకు కావాలసిన సాంకేతిక సహాయం మరియు ముడి సరుకుల గురించి చర్చించడం, జెర్రీ బెహాన్ సహా వారందరితో ఒక పెద్ద హోటల్లో లంచ్ చేయడం. అది నా జీవితంలో మరిచిపోలేని సుమధుర జ్ఞాపకం.

అబుదాబి నుండి షికాగో విమానాశ్రయం వరకు పదహారు గంటల ఏకబిగిన సాగిన బిజినెస్ క్లాస్ ప్రయాణం. షికాగో విమానాశ్రయం నుండి బెలాయిట్ వరకు నాకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లిమోసిన్ కారు. అది  నన్ను ఒక పెద్ద హోటల్ లో దిగబెట్టింది. భూతల స్వర్గమా అనిపించే ఆ వసతులు విభ్రమణకు గురి చేసి కలా నిజమా అన్న నమ్మలేని నిజాలు నా కళ్ళముందు కదలాడుతుంటే, నేను చూసిన కాల్పనిక జీవితం నిజం అయ్యిందా అనిపించింది.

సామాన్యుడినైన నాకు ఈ అసామాన్య గౌరవం దక్కడం, నా జీవనయానం ఆసాంతం కళ్ళముందు కదలాడటం, అది నా కళ్ళను తడి చేస్తుంటే ముకుళిత హస్తాలతో జన్మనిచ్చిన నా తల్లితండ్రులకు, చదువులు చెప్పిన గురువులకు, నాకు అడుగడుగునా ప్రోత్సాహాన్నందించిన నా శ్రేయోభిలాషులందరికి, మరియు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ నా కలలను ఇలా సాకారం చేసుకునేందుకు మూలమైన సాహిత్యానికి వినమ్రంగా అభివాదాలు తెలుపుకున్నాను.

సయ్యద్ షాదుల్లా నిండుగా కలలు గన్న మనిషి. వాటిని సాకారం చేసుకోవడానికి ఎదురీదిన వ్యక్తి. ఆ ఎదురీతను ఎక్కడ ఆపాలో కూడా తెలిసిన మనిషి. తాను డైరీ టెక్నాలజీ చదివాక దేశ విదేశాల్లో దాదాపు మూడు దశాబ్దాలు వివిధ సంస్థల్లో వేరు వేరు హోదాల్లో పనిచేశారు. చివరకు స్వదేశంలో ఉంటూనే తన వృత్తి నైపుణ్యాలకు పని చెప్పాలని నిర్ణయించుకున్నాక నాలుగేళ్ల క్రితం సౌది అరేబియా నుంచి తిరిగి భారత్ వచ్చేశారు. అప్పటి నుంచి కన్సల్టెంట్ గా వివిధ దేశ విదేశీ సంస్థలకు సేవలు అందిస్తూ షాద్ నగర్ లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. సాహిత్యం, సంగీతం వారి అభిరుచులు.

తెలుపు ప్రచురించిన వారి గత వ్యాసాలు

నారాయణపురం : మా ఊరు ఒక ముత్యాల దీవి 

“నా USA ప్రయాణం సోదరుడి సమాధి నుండి మొదలయ్యింది  

మా ‘జైన్’ గురించి చెప్పాలి

అశ్రువొక్కటి చెక్కిలిపై…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article