Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు ఆ కుర్రాడే గుర్తుకొచ్చాడు : జింబో 'కథా కాలమ్'

ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు ఆ కుర్రాడే గుర్తుకొచ్చాడు : జింబో ‘కథా కాలమ్’

‘నగర జీవిత కథలు

మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఎలా చూస్తున్నామన్నది ముఖ్యం. నగరంలో ఉన్నా, పల్లెలో ఉన్న విభిన్నంగా చూసే చూపుండాలి. అప్పుడు కథలకేం తక్కువ. గొప్ప సత్యాలను ఆ కథలు ఆవిష్కరిస్తాయి. అందుకు ఉదాహరణగా  ముక్కవాసన వేసే బన్ కథను, మరికొంత నేపథ్యాని ఈ ఆదివారం పరిచయం చేస్తాను.

నిజానికి చూసే కోణం ఉండాలి కానీ నగర జీవితంలోని రచయితలు మంచి కథలు రాయగలరనడానికి దాఖలా ఆ  కథ. ఎందుకూ అంటే మనిషి ఉన్నాడు అంటే అక్కడ జీవితం ఉన్నట్టే కదా!

జింబో 

మానవ విలువలకి రిజర్వాయర్ లాంటివి కథలు. కథా రచయితలు ఒకరకంగా సృష్టికర్తలు.

కథల గురించి ఓ ఇంగ్లీషు రచయిత ఇలా అన్నాడు-“ఉదయం కిటికీ తలుపు తెరవగానే వచ్చే పక్షుల లాగా కథలు వస్తాయి” అని.

ఇది ఒక రకంగా అందమైన ప్రతీక. అయితే రచయిత అనేవాడు తన మనసు కిటికీని తెరవాలి. అది రోజూ తీయాలి. ఆ కిటికీ దగ్గర నిల్చొని ఆ పక్షులని చూసే సమయం అతనికి వుండాలి. అంటే కథ గురించి ఆలోచన రావడం ఒక ఎత్తు. కాగితం మీద పెట్టడం మరొక ఎత్తు.

కవిత్వం లాగా కథని వెంటనే రాయలేం. దానికి కొంత ఓర్పు సమయం కూడా ఉండాలి. అవి ఉన్నప్పుడే ఆ పక్షులు అంటే ఆ భావాలు కథల్లాగా మారతాయి.

ఈ ఆధునిక జీవితంలో వేగం పెరిగి ఉండవచ్చు. కానీ అదే మనస్సు. అదే మనుషులు.అదే నెత్తురు.

ఈ ఉపమానాన్ని విమర్శించిన రచయితలూ ఉన్నారు. ఈ యాంత్రిక నగరంలో కిటికీ తెరిస్తే ఓ పచ్చటి దృశ్యం కనిపించదు. అంతా కాంక్రీట్ మయం. అది తప్ప మరేమీ కనిపించదు. నగరంలో నివసించే రచయితకి అనుభవాలు తక్కువ. ఎలాంటి అనుభవాలు లేకుండా అతను కథని ఎలా రాస్తాడన్న విమర్శ కూడా ఉంది. ఈ నగర యాంత్రిక జీవితంలో అంటే ఈ ఆధునిక జీవితంలో వేగం పెరిగి ఉండవచ్చు. కానీ అదే మనస్సు. అదే మనుషులు.అదే నెత్తురు.

చూసే కోణం ఉండాలి కానీ నగర జీవితంలోని రచయితలు మంచి కథలు రాయలేరన్నది సత్యదూరం. మనిషి ఉన్నాడు అంటే అక్కడ జీవితం ఉన్నట్టే. ఆ నగర జీవితాన్ని నగర రచయితలు చిత్రించే అవకాశం ఉంది. ఇంతకు ముందు అన్నట్టు చూసే కోణం ఉంటే కథలకి కొదవలేదు. కన్నీరుతో బాటు కథలు వున్నాయి. నవ్వులతో బాటు కథలు వున్నాయి.

ఓ చిన్న సంఘటన

ఈ మధ్య ఓ చిన్న సంఘటన చూశాను. పోలీస్ అకాడమీ దగ్గర కొత్తగా ఒక బేకరీ అయింది. దాని పేరు బ్రాడ్ వే. అక్కడ సమోసాలు చాలా బాగుంటాయి. రద్దీ కూడా ఎక్కువే. వికారాబాద్, చేవెళ్ల నుంచి ప్రయాణించే వ్యక్తులు చాలా మంది అక్కడ ఆగి సమోసాలు తిని చాయ్ తాగి వెళ్తూ ఉంటారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్పుడప్పుడూ వెళ్తూ ఉంటారు. ఈ మధ్య ఓ ఇద్దరు వ్యక్తులని అక్కడ నేను గమనించాను. ఓ వ్యక్తి, అతనికి 50 సంవత్సరాలు ఉంటాయి. సమోసాలు కొనడానికి అక్కడ నిలుచున్నాడు. తనకు ఒక పెద్ద సమోసాని ఇప్పించమని ఆ పక్కనే ఉన్న ఓ వ్యక్తి అతన్ని అడుగుతున్నాడు. అతను బిచ్చగాడిలా లేడు. ఇబ్బందుల్లో వున్నట్టున్నాడు. ఆ వ్యక్తి ఓ ఐదు రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అడిగిన వ్యక్తి ఏమీ అనకుండా ఆ డబ్బులు తీసుకున్నాడు. అతన్ని విసిగించలేదు. ఆ పక్కనే మరో చిన్న కుర్రవాడు, అతనికి 12 సంవత్సరాలు ఉంటాయి. అతను ఈ విషయాన్ని గమనించాడు. తను నాలుగు ఉల్లి సమోసాలు కొనుక్కొని, ఆ వ్యక్తికి రెండు పెద్ద సమోసాలు అతనికి కొని ఇచ్చాడు.

అతను ఏ మూడ్ లో వున్నాడో తెలియదు. కాని ఆ కుర్రవాడిని అభినందించాల్సిన అవసరం మాత్రం ఉంది.

మొదటి వ్యక్తిని తప్పుపట్టాల్సిన పనిలేదు. అతను ఏ మూడ్ లో వున్నాడో తెలియదు. కాని ఆ కుర్రవాడిని అభినందించాల్సిన అవసరం మాత్రం ఉంది.

ఇలాంటిదే ఆ మధ్య ఓ చిన్న కథను చదివాను. ఆ కథ పేరు “పేద పిల్లవాడు-కుక్క ”

ఆ కథ కూడా నగర నేపథ్యంలో రాసిన కథ. ఆ కథ చదివి మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. ఆ కథ రాసింది ఎవరో తెలియదు. నామ రహిత రచయిత రాసిన కథ అది. అంటే అనానిమస్ కథ.

ఆ కథ మీకు చెబుతాను.

అనానిమస్ కథ

“కొద్ది రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి టాక్సీలో బయలుదేరాను. పీవీ ఎక్స్ ప్రెస్ వే దాటిన తర్వాత రద్దీ ఎక్కువగా ఉంది. అది ఏసీ కారు. అందులో డ్రైవింగ్ చేస్తున్నది నేను కాదు. అందుకని ఆ రద్దీ నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టడం లేదు. చివరికి ఓ జంక్షన్లో ఎర్ర లైటు పడటంతో మా కారు ఆగింది. అటు ఇటు పరిగెడుతున్న జనాలని చూస్తూ కూర్చున్నాను.

రోడ్డుకి అవతల ఫుట్ పాత్ మీద ఓ కుర్రవాడు కనిపించాడు. అతనికి ఓ 12 సంవత్సరాలు వుంటాయి. ఆ కుర్రవాడు నా దృష్టిని ఆకర్షించాడు. అతను తన జేబులో నుంచి ఓ బన్నుని తీసి ఆనందంగా కొరికాడు. అతను తినడం చూసి అతని ముందుకు ఓ కుక్క వచ్చి ఆశగా అతని వైపు చూసింది. రెండవసారి బన్ కొరుకబోతున్న ఆ కుర్రవాడు బన్ ముక్కని కుక్క ముందు వేశాడు, ఏ మాత్రం ఆలోచించకుండా. ఏమాత్రం సందేహించకుండా అతను ఆ పని చేశాడు. ఆ బన్ ముక్క వాసన చూసి ఆ కుక్క ఆ బన్నుని తినకుండా వెళ్ళిపోయింది. అది తిరిగి వస్తుందేమోనని ఆ కుర్రవాడు కొంతసేపు చూశాడు. తిరిగి వచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ బన్ ముక్కని తీసుకుని అతను తినేసాడు.

ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు ఆ కుర్రాడే గుర్తుకొచ్చాడు.

ఆ దృశ్యం చూసి నా మనసు బాధతో మూలిగింది అతని దగ్గరికి వెళ్ళాలని అనిపించింది. నేను కారు తలుపు తీసేంతలో గ్రీన్ లైట్ పడి కారు కదిలింది.

ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు ఆ కుర్రాడే గుర్తుకొచ్చాడు. ఆ దృశ్యం చూసి ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్దామా అని అనుకున్నాను కానీ వెళ్ళలేదు. నెపాన్ని గ్రీన్ లైట్ మీదకి తోసేసాను. కారు కదిలినా, దాన్ని ఆపవచ్చు. ముందుకు వెళ్లినా తిరిగి వెనక్కి రావచ్చు. నేను ఆ పని చేయలేదు. ఆకలితో ఉన్న ఆ కుర్రవాడు ఎలాంటి సంశయం లేకుండా తాను తింటున్న బన్ను ముక్కని ఆ కుక్కకి వేశాడు. కానీ నేను ఆలోచిస్తూనే ఉన్నాను.

ఆ కుర్రవాడు నాతో మాట్లాడకుండానే నాకు ఓ పెద్ద పాఠం చెప్పాడు. నా జీవితంలో మర్చిపోగూడని, మర్చిపోలేని పాఠం నాకు చెప్పాడు. ప్రేమనీ,సంతోషాన్ని ఇతరులతో పంచుకొమ్మని చెప్పాడు. అతను ధన రూపేనా పేదవాడు కావచ్చు. కానీ మనసు రూపేణా కాదు.

విభిన్నంగా చూసే చూపు

మొదటి కథ నా అనుభవంలోకి వచ్చిన కథ. రెండవ కథ నేను చదివిన కథ. ఈ రెండు కథలు కూడా చాలా మందిలో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి

కథలేం చేస్తాయి, మనల్ని సంస్కరిస్తాయి. మనలో ఉన్న మానవత్వాన్ని తట్టి లేపుతాయి. మనలో కొంత మార్పుని తెస్తాయి. మనం ఉన్న సమాజాన్ని కూడా కొంత మార్చే ప్రయత్నం చేస్తాయి. ఇంకా చెప్పాలంటే దేశంలోనే కొంత మార్పుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి.

మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఎలా చూస్తున్నామన్నది ముఖ్యం.

కథలో ఒక మాంత్రిక శక్తి ఉంది. మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మనలో కొంత మార్పుని తీసుక రావడానికి ప్రయత్నం చేస్తుంది.

మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఎలా చూస్తున్నామన్నది ముఖ్యం. నగరంలో ఉన్నా, పల్లెలో ఉన్న విభిన్నంగా చూసే చూపుండాలి. అప్పుడు కథలకేం తక్కువ. గొప్ప సత్యాలను ఆ కథలు ఆవిష్కరిస్తాయి.

అందుకు ఉదాహరణే పై రెండు కథలు.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు.
గతవారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు.

వృత్తిరీత్యా జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన రాజేందర్ గారు అందరికీ న్యాయం అందాలని  కల్పనాత్మక రచనలతో పాటు వారు న్యాయం, ధర్మం గురించిన అనేక రచనలు చేస్తూ వస్తున్నారు. ఒక్క మాటలో అయన వృత్తీ ప్రవృత్తీ వ్యావృత్తీ అన్నీ కూడా రచనలుగా ఆవిష్కారం కావడం అదృష్టం అనే చెప్పాలి. 

ఎములాడ రాజన్న పాదాల ముందు జన్మించిన ఈ తెలంగాణ బిడ్డ ‘మా వేములవాడ కథలు’, ‘రూల్ ఆఫ్ లా’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్న మాట’ వంటి కథా సంపుటులు వెలువరించారు. రాబోయే సంపుటులు “నాల్ల కోటు”, మా వేములవాడ కథలు-2″. కవిత్వానికి వస్తే ‘హాజిర్ హై’ అంటూ నేర న్యాయ వ్యవస్థపై మరే కవీ రాయలేని కవిత్వం రాసిన జింబో ‘లోపలివర్షం’, ‘చూస్తుండగానే’ పేరిట ఇతర కవితా సంపుటులు తెచ్చారు. ఈ మధ్య వచ్చిన కవితా సంపుటి -“ఒకప్పుడు” కాగా రాబోయే కవితా సంపుటి -“ఒక్క కేసు చాలు”.  ఇవి కాకుండా వారు చాలా పుస్తకాలని వెలువరించారు.  

జింబో e-mail: rajenderzimbo@gmail.com

 

More articles

2 COMMENTS

  1. సార్ నమస్కారం..
    మీ కథానుభవం ద్వారా కథా రచనా మెలకువలను విడమరిచినందుకు కృతజ్ఞతలు..
    @డా. వాసాల వరప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article