ఈ కండ్లకు ఏదికన్పిస్తదో అది ఎప్పడికైనా పడిపోయేదేనన్న జీవిత సత్యం నేర్పుతున్నగొప్ప అనుభవం ఈ గోడల జీవితం.
మహేశ్ పొట్టబత్తిని
మాగోడల గోడులు మాకంటే మెదటివే. ఎందుకంటే అవి మట్టిగోడలు. మాతాత కట్టినవి. మళ్ళ మానాయిన కట్టినవి. మేము కూడా కొన్నిగోడలు కట్టినం. అవి ఇట్కెగోడలు. ఆ కట్టిన కొత్తగోడలపై బరువు పాపం పాతగోడల కంటే ఎక్కువే. ఎందుకంటే పిల్లర్లు పోయలే.
ఈ కొత్తగోడల తర్వాతే ఇంటికి రెండో కొత్త కోడలు, మా వదిన చైతన్య వచ్చింది. అన్నకు భాద్యత, భారం పెరిగాయి.
అన్నీ పాతగోడలు తీసేసి కొత్తగోడలు కట్టినా బాగుండేది. ఎందుకంటే కొత్తగోడలు వచ్చినుంచి పాతగోడల పరిస్థితి దినదినానికి దయనీయంగా మారిపోతున్నది. అందుల మా పక్కింటి గోడలు బలుపుతోని నీల్గినట్టుంటై. పాతగోడలు బాగాపాతగైనా వాటికి దూలాలు సోపతున్నవి ఆ దూలాలది గూడా ఓగోసే ఇప్పుడు. నేతపని సాగినప్పుడు బాగనేవుండే ఆరోజులు. గోడలు, దూలాలు మొగ్గాలు మంచిగ మాట్లాడుకునేవి. గోడలకున్న కొయ్యలకు గడలకు రంగురంగుల దారపులుంగలు. అచ్చులు, బట్టమీటరేసే కొలతబద్ద, గోడలకున్న గూలళ్ళ పెట్టే దీపాళి దీపాలు – అవి నోముదాక వెలుగుతై. ఇప్పుడు ఈ దీపాలి దీపాలు పాతగోడలకు చివరి దీపాలైతవేమో… ఆ తెల్ల గోడలతోటి ఎప్పుడూ ముచ్చటైతుండే అన్నట్టుంటది. ఔసరమొచ్చి గోడలకు మోలలు కొట్టినా కొయ్యలు పెట్టినా మాకైతే మంచిగనేవుండేది. ఔసరం తీర్తుండే కాని వాటికేంబాదైతుండేనో ఇప్పుడనిపిస్తతది.
ఇప్పుడున్న కొన్నిపాతగోడలకు ఇంట్ల బైటా కొత్తగోడలతోని కొట్లాటేవున్నది. నాకు తెల్షిన్సంది పెయ్కి దెబ్బల్తాకితే మందురాశ్నట్టు అమ్మ ఈగోడలకు పూతలు పూస్తూనేవుంటుంది. ఎందుకంటే కొత్తగోడలతోని పాతగోడలు కిందికై వాన నీళ్ళకు ఉప్పురిళ్ళుతూనే ఉంటై. ఎండకాలంల ఇంట్లా బైటానీల్లు దొరకవు మనకు కని మాఇంట్ల గోడలల్ల మాత్రం ఎప్పుడుంటయి. గోడల గోడు గోడల నుంచి రక్తంకు బదులు నీళ్ళొస్తాయంతే. ఇప్పుడు మొగ్గాలకు ఆసులకు అచ్చులకు పంటెలకు పింజర్లకు మేమూగిన తొట్టెలకు కింద పనైపోయింది.
అన్నీ దూలాలమీద జేరి మాకు గోడలకు దూలాలకు భారమై భరువై వర్షానికి వర్షానికి కృుంగుతూ కృంగుతూ ప్రభాకర్ కోల్తే తన క్యాన్వాస్పేయింటింగులో వదిలిన రంగుల్లా, రంగులద్దుతున్నప్పుడు నాన్న బట్టలపైనా వంటిపైనా ధారాల్లాగా జాలువారిన రంగుల్లా ఎర్రగా పైనుంచి కిందికి పొరలు పొరలుగా ఎప్పడికప్పుడు కొత్తగా కనిపిస్తూ నన్ను బలవంతంగా అందులోని అంతరార్థాధాలు వెతికేలా చేస్తాయి.
వర్షాలకు కాకులకు కోతులకు ఇంటి గూనపెంక ఇరిగి గోడలు వాసాలు దూలాలు తడిచి మెలికలు తిరుగుతూ ఎప్డు ఈ ఇంటిబరువును వదిలేద్దామా అని చూస్తున్నట్టుటుంది.
చేతికి ఎచ్చంవాసనో పస్పువాసనో కొనుక్కోని తిన్నదైపోయినా కాని వచ్చేది. అదిప్పుడుకూడా గుర్తొస్తది వాసనొస్తది….ఇదీ వాటికెరుకే.
ఇంటి సూర్లనుండి పగటిపూట సూర్యుడు రాత్రిపూట పున్నమిలో చంద్రుడు మమ్మల్ని ఎప్పడికీ కాపాలా కాస్తూ పల్కరిస్తూనే ఉంటరు….గోడలకున్న గూళ్ళు, కిటికీలు తనాబీలు మా సొంత అనుభవాలకు మధుర స్ముృతులకు ప్రతీకలు. వాటిలో దాచుకున్న వస్తువులు, రేడియోలోని కిర్కెట్ వార్తలు, టేప్రికార్డులోని కిషోర్కుమార్ పాటలు, (ఆన్ చెల్కెతుఝె మై లేకేచలూ ఎక్ ఐసేగగన్కేతలే….) బలవంతంగా బుజ్జగించి బడికి పంపుకుంట అమ్మ మా పెద్దమామ కుట్టిన సంచిలోంచి పైసలో లేదా తినేపదార్తాలో కిటిలోంచి ఇస్తుండే….ఇవ్వన్నీ గోడలకెరుకే…
ఓ సారి ఆటలో నా ద్వారా ట్యూబ్లైట్ పగిలి పోతే భయపడి అది వేరేవాళ్ళొచ్చి పగలగొట్టి పారిపోయారని అబద్దం చెప్పాను. ఇంకోసారి అంటే చాలాసార్లు అమ్మ పోప్డబ్బాల్నో ఎచ్చండబ్బాల్నో జిలకర డబ్బాల్నో పస్పుడబ్బాల్నో పైసల్ దాస్తుండె. అవి అమ్మకు తెల్వకుండా తీస్కపోయి శాంతమ్మ దుకాండ్ల కొనుక్కోని తినేవాన్ని. ఐతే చేతికి ఎచ్చంవాసనో పస్పువాసనో కొనుక్కోని తిన్నదైపోయినా కాని వచ్చేది. అదిప్పుడుకూడా గుర్తొస్తది వాసనొస్తది….ఇదీ వాటికెరుకే.
గోడ గోడది ఓ గోసే….అవి ఎన్నిసార్ల సున్నమేసుకున్నవో వాటికి తగిలిన గాయాలవల్ల పొరలుపొరలుగా ఇప్పుడు కన్పిస్తున్నాయి.
ఇప్పుడు అన్న ప్రతీ సంవత్సరం ఇంటికి కవర్ కడుతుండు. ఎందుకంటే ఆ కవర్కింద అన్న స్టేషనరీ షాపు నడిపిస్తడు. దెబ్బతాకితే కట్లుకట్టినట్టు దూలూలకు మొగురాళ్ళకు చివరకు ఇంటికే లామినేషన్నట్టు కవర్లు తాళ్ళు కట్టి ఫస్‌టైడ్ చేసినట్టుటుంది. అన్నిగోడలకు దెబ్బలే. అప్పుడే ప్రమాదం జరిగిన మనిషిలా కన్పిస్తున్నవి.
గోడ గోడది ఓ గోసే….అవి ఎన్నిసార్ల సున్నమేసుకున్నవో వాటికి తగిలిన గాయాలవల్ల పొరలుపొరలుగా ఇప్పుడు కన్పిస్తున్నాయి….దుఖానమున్నవైపున సూరంతా కిందికి దిగి నేలనుతాకేతందుకు ప్రయత్నం చేస్తున్నట్టనిపిస్తుంది.
సగమిల్లు ఆసుపత్రిలో ఉన్నట్టుంటది. ఆ భాధ భాష భాగా అర్తమైన సోమ్నాథ్ హోర్ రూపొందించిన ‘గాయం’ వలె కనిపిస్తయి. దీనికిప్పుడు ఇంటి వైద్యం పనికొచ్చే పరిస్థితులు లేవు. నాయిన అన్నలు ఎన్నిసార్లో ఇరిగిన వాసాలకు వేరేవాసాలు పెడుతుండె. పగిలిన చెదిరిన పెంకలను సరిచేస్తుండే. దీనిలో నాయిన ఇంటికోసం పడే తపనలో చొరవ అభిమానం ప్రేమ కనపడేది. ఇప్పుడు అవ్వన్నింటి కాలంచెల్లింది. గోడలు వింతగా మావైపుచూస్తూ వెక్కిరిస్తున్నట్టుటుంది. అందుకే గోడలకు మాముఖం చాటేసి అన్ని పండుగలు పబ్బాలు… పిల్లల చదువులు… అన్నస్టేషనరిషాపు… నాయిన మొగ్గం… ఇంటికి అమ్మ ఊడ్గెం… వదినల కస్సుబుస్సులు.. దేనికవే స్వతంత్రంగా జరిగిపోతూనేవుంటాయి.
మా పాతగోడలు మాపై అలిగి అర్తాల్ చేస్తునట్టుంటుంది. అవి ఇంటికి గోడలుగా వుండే పరిస్థితి కనిపించడంలేదు….మేమూ వుండేటట్టులేదు. ఇప్పడికైనా వాటికి పూర్తిగ స్వేచ్చనిద్దామని గట్టిగనే ప్రయత్నం చేస్తున్నరన్నలు.
మానాయినమ్మ చెప్తుండే ఈ ఇంటిగోడలకు నేను మట్టిమోష్నని. ఎంతోకష్టపడి కట్టిన గోడలవి. గోడలు కావవి నా ఆస్తులు, నాప్రానమని చెప్తుండె …ఇప్పుడూ ఎప్పుడూ మానాయిమ్మ తాతలు ఈ గోడలల్లుండి మా అందర్ని ఎప్పుడూ చూస్తూ మాతోనేవుంటరనిపిస్తది.
ఏమైతేనేం రోజులు పోతనేవున్నయి. మేముకూడా గోడలమై గోసతీస్తున్నము.
గోడలపై ఓ వైపున రకరకాల చెట్లు పెరిగి ఓ రకమైన అలంకరణ తామేచేసుకున్నమని గొప్పకు పోయినట్టనిపిస్తది. వదినెలు అలిగి అప్పుడప్పు వారి అసహనాన్ని చూపిస్తారు. ఇంట్లోంచి వెల్లిపోతామని గొడవచేస్తారు. కాని గోడలు ఎన్నింటినో వాటిలోదాచుకొని గోడలు గోడల్లా నిలబడి నిశ్శబ్దాన్ని పాటిస్తాయి. వాటికి ఇవ్వన్నీ భాగాతెలుసు ఎన్నోతరాలకు సాక్షై సంరక్షించుకుంటూ వంశాభివృద్దికై వాటి సేవలను మాకోసం నిరంతరం చేస్తూనేవున్నాయి.
మానాయినమ్మ చెప్తుండే ఈ ఇంటిగోడలకు నేను మట్టిమోష్నని. ఎంతోకష్టపడి కట్టిన గోడలవి. గోడలు కావవి నా ఆస్తులు, నా ప్రానమని చెప్తుండె …ఇప్పుడూ ఎప్పుడూ మానాయిమ్మ తాతలు ఈ గోడలల్లుండి మా అందర్ని ఎప్పుడూ చూస్తూ మాతోనేవుంటరనిపిస్తది.
ఈ గోడలు నిలువెత్తు సాక్షై మాఇంట్ల అందరికి మరో అమ్మై నిశ్శబ్దమే తన సహజ లక్షణంగా చేసుకొని ఎప్పుడు నలువైపులా మనకు రక్షణై …బాడర్లో మిల్ట్రీవలే నిలబడేవుంటాయి.
ఇంటిముందు యాపచెట్టుకిందున్న అంజనేయునికి అంతాతెల్సు. అప్పడి కొత్తగోడలు ఇప్పుడు పాతగై పడిపోయే టైమొచ్చిందని. కొన్ని గోడలు అప్పుడే పడిపోయినై…..ఈ కండ్లకు ఏదికన్పిస్తదో అది ఎప్పడికైనా పడిపోయేదేనన్న జీవిత సత్యం నేర్పుతున్నగొప్ప అనుభవం ఈ గోడల జీవితం. మనిషి తన అస్తిత్వం భౌతికంగా ఈ గోడలల్లకు రాకమునుపుసంది, వచ్చిన తర్వాత తన అస్పురణ స్పురణల, వ్యక్తిగతమైన జీవితంతో పాటు మానసిక శారీరక, ఇతరములైన అన్ని పనులకు ఈ గోడలు నిలువెత్తు సాక్షై మాఇంట్ల అందరికి మరో అమ్మై నిశ్శబ్దమే తన సహజ లక్షణంగా చేసుకొని ఎప్పుడు నలువైపులా మనకు రక్షణై …బాడర్లో మిల్ట్రీవలే నిలబడేవుంటాయి.
కదలక వుంటాయి గోడలు ఈ మన గోడలు…
ప్రముఖ చిత్రకారులు మహేష్ పొట్టబత్తిని రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందినవారు. చేనేత కుటుంబంలో పుట్టి, చేనేత పనిముట్ల మధ్యన, ఎప్పటి కప్పుడు మారే రంగురంగుల అందమైన డిజైన్ల మధ్య వారు ఎదిగారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో వారు శిల్పం- చిత్రలేఖనం శాఖలో అసిస్టెంట్ ఫ్రోఫెసర్ గా పనిచేస్తున్నారు. స్వీయ వస్తుశైలులను బలంగా నమ్మే ఈ చిత్రకారులు తల్లివేరు వాటి మూలాల నుంచే సృజన అపురూపంగా ఆవిష్కారమవుతుందని విశ్వసిస్తారు. వారు చిత్రించిన నేత కారుల పనిముట్లు తాలూకు అధివాస్తవిక చిత్రాలు ప్రత్యేక అనుభూతికు గురిచేస్తాయి. మీరు చదివే ఈ ‘గోడలు’ కథనం సైతం వారి మనోఫలకంపై నమోదైన అలంటి జీవన చిత్ర సంచయమే.
కాంటాక్ట్ : 83090 11865
గోడల గోడులు ….అద్భుతమైన అంశం.అభినందనలు
ఇది చదువుతుంటే చిన్న నాటి జ్ఞాపకాలు ,మీ ఇంటికి వచ్చినప్పుడు అమ్మా నానలతో అన్నలతో పిచ్చ పాటి గా మాట్లాడిన ముచ్చట్లు ,మన మిత్రులు సార్లు ,నేత మగ్గాలు ,దారాలు ,రంగులు, బట్టలు డిజైన్లు గుర్తుకు వచ్చావి మహి