https://www.facebook.com/IndiaCurrentAffairs/videos/1635775740109854
దాదాపు నాలుగున్నర నిమిషాల ఈ వీడియోలో యాదాద్రి పున:ప్రారంభానికి ప్రధాని మోడిని పిలుస్తారా లేదా అన్న అంశాన్ని ప్రొ.నాగేశ్వర్ గారు తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కెసిఆర్ గైర్హాజరయ్యారు. జ్వరం వచ్చిందని చెప్పారు. ‘ఇది జ్వరం కాదు సమరం’ అని మీడియా విశ్లేషించింది. ఐతే, మోడీ అటు వెళ్ళగానే ముఖ్యమంత్రి యాదాద్రి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఐతే, మరి వచ్చేనెలలో యాదాద్రి పున:ప్రారంభానికి ప్రధానిని పిలుస్తారా లేదా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.
కాగా, గత సెప్టెంబర్ లో ప్రధానిని కెసిఆర్ ఆహ్వానించి ఉన్నారు. అప్పటికి కెసిఆర్ మోడికి మధ్య స్నేహం బాగానే ఉండే. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. మరి అప్పడు పిలవడం, దానికి ప్రధాని ఒప్పుకుని కూడా ఉన్న నేపథ్యంలో నేడు మారిన ఎత్తుగడల నేపథ్యంలో వచ్చేనెలలో ఆయన్ని ఆహ్వానిస్తారా లేదా అన్నది రాజకీయంగా కీలకమైన అంశం. ప్రొ. నాగేశ్వర్ గారు ఈ విషయమై ఒకటే మాట అంటున్నారు, పిలవాల్సిందే అని. “రాజకీయాలు రాజకీయాలే. ప్రోటోకాల్ ప్రోటోకాలే. ప్రధానిని రెండు విధాలా చూడాలి” అంటున్నారు. “మోడిని బిజెపి నేతగా చూసినప్పుడు వ్యతిరేకించవచ్చు. కానీ ప్రధానిని వ్యక్తిగతంగా దూరం ఉంచడం మాత్రం రాజకీయ పరిణితి కాదు” అన్నది ప్రొ.నాగేశ్వర్ అభిప్రాయం. మరి వినండి, తనదైన విశ్లేషణకు.
కె.నాగేశ్వర్ గారి సంక్షిప్త పరిచయం
తెలుగు నాట ‘అనాలిసిస్’కి కేరాఫ్ గా నిలిచిన శ్రీ కె.నాగేశ్వర్ గారు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఏదులాపురం వాస్తవ్యులు. వారి విశ్లేషణ వినని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వారు మాజీ శాసన మండలి సభ్యులు, ఉస్మానియా జర్నలిజం శాఖ అధిపతిగా పని చేశారు. ది హన్స్ ఇండియా ఆంగ్ల దినపత్రికకు ప్రధాన సంపాదకులుగా, హెచ్.ఎం. టివి ఎడిటర్ గాను, అలాగే 10 టీవి తెలుగు న్యూస్ ఛానల్ కు ఛైర్మన్ గానూ పనిచేశారు. ప్రస్తుతం ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమలతో సహా అన్ని రకాల మాధ్యమాల ద్వారా రాజకీయ ఆర్ధిక సామాజిక అంశాలు, సమకాలీన సమస్యలపై వారు అప్పటికపుడు స్పందించి విశ్లేషణ అందిస్తుంటారు. వారి వాణిని వినడం అంటే వర్తమాన అంశాలపట్ల ఎరుక కలిగి ఉండటమే అనాలి.