Editorial

Monday, April 28, 2025
Opinionవిను తెలంగాణ : సినిమా రీళ్లలాగా కళ్ళముందు తిరిగాయి - జీవన్ కుమార్

విను తెలంగాణ : సినిమా రీళ్లలాగా కళ్ళముందు తిరిగాయి – జీవన్ కుమార్

‘విను తెలంగాణ’ పుస్తకం చదువుతుంటే గత పదేళ్ళ కేసీఆర్ పాలనలో అన్నిరకాలుగా హక్కులు విధ్వంసమైన తీరుతెన్నులు తిరిగి నా కళ్ళ ముందు ప్రత్యక్షమైనయి.

జీవన్ కుమార్
మానవ హక్కుల వేదిక

కందుకూరి రమేష్ బాబు ‘విను తెలంగాణ’ శీర్షికతో రాసిన వ్యాసాల్లో పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చెదిరిన ప్రజల ఆకాంక్షలు, వారి ఆశాభంగాలను ప్రజల జీవితాల్లోంచి వీక్షించి, మళ్ళీ ఆ ప్రజలకే నివేదించిన తీరు ముగ్దుడిని చేసింది. అదే సమయంలో ఆ వాస్తవాలు ఎంతో విచారానికి గురి చేశాయి. ఆ వ్యాసాలను పుస్తకరూపంలో ప్రచురించిన తర్వాత అన్ని వ్యాసాలను ఒకేసారి చదువుతుంటే హక్కుల కార్యకర్తగా, ప్రజల తరపున మాట్లాడే వ్యక్తిగా నేను భంగపడ్డ అనేక విషయాలు ఒక సినిమా రీళ్లలాగా నా కళ్ళముందు ప్రత్యక్షమై మనసు ఎంతో బాధకు గురైంది. వాటిలో కొన్నయినా పంచుకోవాలనిపించింది.

  • రాష్ట్రం ఏర్పడ్డ ఆరు నెలలకే ఒక సంస్థ తలపెట్టిన సమావేశం జరపనీయకుండా సుందరయ్య భవన్ హాలుకు పోలీసులు తాళం వేసారు. ఇలా జరగడం చరిత్రలో మొదటిసారి. ఆ సభకు వస్తున్న వారిని అన్ని జిల్లాలలో అడ్డుకున్నారు. కొందరిని అరెస్టు చేసారు. హోం మంత్రిని కలిస్తే సమావేశం నిర్వంహించే సంస్థ గురించి వేరే సమాచారం ఉందని, ముఖ్యమంత్రి గారు పోలీసుల సలహా ప్రకారం నడుచుకోమన్నాడని చెప్పి తానేమీ చేయలేనని చెప్పడం గుర్తుకు వస్తోంది.
  • ఇది జరిగిన మూడు నెలలకు నల్లగొండలో ఒక విద్యార్ధి సంస్థ విద్యా సమస్యలపైనే సెమినార్ నిర్వహించినా అదే పరిస్థితి. ఆ సభకు హోం మంత్రిని కలిసి అనుమతి తీసుకున్నప్పటికీ సెమినార్ కు వచ్చే విద్యార్థుల పోటోలు తీసారు, గుర్తింపు కార్డులను పరిశీలించారు. కొందరు విద్యార్థుల తండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు కూడా.
  • వరంగల్ లోని రేయన్స్ ఫ్యాక్టరీ కార్మికులు కొందరు కార్మికశాఖ మంత్రిని కలవాలని వస్తుంటే వాళ్లను అరెస్టు చేసి జనగామ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. చిత్రమేమిటంటే, ఆ మంత్రి ఒకప్పుడు ప్రముఖ కార్మిక నేత.
  • సభలు, సమావేశాలు పెట్టుకుంటే ఇలా అడ్డుకోవడమే కాదు, ఆఖరికి ధర్నాచౌక్ లో ఎవరూ సమావేశాలు పెట్టుకోవద్దని ఆదేశాలు వెలువడటం పరాకాష్ట.
  • నాంపల్లిలోని ఎన్.జి.ఓ భవన్ లో విద్యా సమస్యలపై ఒక ఉపాధ్యాయ సంస్థ సమావేశం పెడితే దాన్ని హడావిడిగా రద్దు చేసి పోలీసులు హాల్ కు తాళం వేసేశారు. వక్తగా వెళ్ళన హరగోపాల్ సార్ తో పోలీసులు ఎంత దురుసుగా వ్యవహరించారంటే, సార్ షర్ట్ కూడా చిరిగింది. “మీరు ఏమీ చేయలేరా?” అని ప్రముఖ ఎన్ జీ ఓ నాయకుల్ని అడిగితే “మా చేతుల్లో ఏమీ లేదు” అని సమాధానం. అనతికాలంలోనే ‘ప్రతిఫలం’ అన్నట్టు, వారిలో ఒకరు ఎంఎల్ సి అయ్యారు. ఇంకొకాయన ఒక కమీషన్ సభ్యుడయ్యారు.
  • ఎవరినీ ప్రభుత్వం లెక్కచేయలేదు. విద్యా పరిరరక్షణకు సంబంధించిన కార్యక్రమం ఒకటి తెలంగాణ అమర వీరుల స్తూపం దగ్గర ప్రారంభించడానికి చుక్కా రామయ్య గారు వస్తే, పోలీసులు ఆయన్ని ఆపి నెట్టి వేసారు. దాంతో ఆ పెద్ద మనిషి కిందపడ్డ పరిస్థితి.
  • ఒక ఐ.పి.ఎస్ స్థాయి అధికారి కోదండరామ్ సార్ ఇంటి తలుపులను గడ్డ పారతో పగులగొట్టించి, ఆయనను అరెస్టు చేసాడు. మేం వెళ్ళి అప్పటి డిజిపిని కలిస్తే, “మావాళ్ళు కొంచెం ఓవర్ చేసారు” అని తప్పించుకునే సమాధానం. మీకు తెలుసో లేదో. కేసీఆర్ పదేళ్ళ పాలనలో కోదండ రామ్ సార్ కనీసం 45 సార్లు ప్రివెంటివ్ అరెస్ట్ చేయబడ్డాడు.
  • విమలక్క బహుజన బతుకమ్మ కార్యక్రమంలో కవితమ్మను ‘పట్టు చీరల బతుకమ్మ’ అని విమర్శించిందని ‘అరుణోదయ’ కార్యాలయానికి తాళం వేశారు. అప్పుడు హోమ్ మంత్రిని ని కలిస్తే, “నేను విమలక్కతో, తెలంగాణ ఉద్యమంలో ఆడలేదా పాడలేదా! ఆమె పాటలు పాడుకోక ఆ ‘పెద్దక్క’ (కవిత)ను ఎందుకు విమర్శించాలి” అని జవాబు. అంతేకాదు, “విమలక్కపై నేను ఏదో ఒక చర్య తీసుకోకపోతే మా పెద్ద సార్, మంత్రి పదవి గుంజుకొని నన్ను బజార్ల పడేస్తడు” అని అప్పటి మంత్రి గారి నిస్సహాయ సమాధానం.
  • కరీంనగర్ లో ఒక మంత్రి “గుట్టలను మాయం చేస్తున్నాడు” అన్నందుకు ఒక మహిళా ప్రొఫెసర్ పై ఎన్నో కేసులు పెట్టారు. అ విషయమై వార్త రాసిన విలేఖరిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు.
  • ఇంకోచోట వ్యవసాయ మంత్రి  ప్రభుత్వ భూమిని తమ లెక్కలో వేసుకున్నడని వార్త రాస్తే ఆ విలేకరిపై దాడి. అతడిపై కేసు.
  • ఇలా ప్రజలకోసం పనిచేసిన వారిపై వార్తలు రాసినందుకు మరో 12 మంది విలేఖర్లపై తప్పుడు కేసులు.
  • ప్రగతిభవన్ కు ముఖ్యమంత్రికి పిటిషన్లు ఇవ్వడానికి పోతుంటే సుమారు 600 మందిపై కేసులు
  • ఆర్టీసి సమ్మె సందర్భంగా 300 మందిపై కేసులు.
  • ఆరు ఎంఎల్ పార్టీలకు చెందిన 270 మందిపై 500 కేసులు.
  • ఫారెస్టు అధికార్లు ఆదివాసులపై 240 కేసులు పెట్టారు.
  • ఆరు ఎఫ్.ఐ.ఆర్ లలో మొత్తం 350 మందిపై ‘ఊపా’ చట్టం కింద కేసుల సంగతి తెలిసిందే.
  • చివరకు రేవంత్ రెడ్డి పై 79 కేసులు. ఆయన తన కుమార్తె వివాహం చూడాకుండా నిర్బంధం. కోర్డు కల్పించిన ఊరటతో గంటసేపు కూతురి వివాహ కార్యక్రమంలో పాల్గోనవలసి వచ్చింది.
  • ఇక రకరకాల పీఠాలను అదిష్టించిన మేధావుల సంగతి చెప్పకూడదు. వారంతా మన మిత్రులే. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు, ప్రవర్తించిన తీరు, ప్రదర్శించిన అహంకారం కేసీఆర్, కెటిఆర్, కవితమ్మకు తక్కువేమీ కాదని అందరికీ తెలిసిందే. అవన్నీ గుర్తుకు వచ్చాయి ‘విను తెలంగాణ’ చదువుతుంటే.
  • కొందరు భక్తులు అపరమేధావులై కేసీఆర్ ను మహాత్మా గాంధీ, జ్యోతీ రావు పూలే, కార్ల్ మార్స్, అంబేడ్కర్, చేగువేరాతో పోల్చిన వైనం ఎవరైనా అప్పుడే మరచిపోగలరా! వీళ్ళు వదిలేసిన వాళ్ళలో “ఒక్క మావో’ మిగిలిపోయాడు” అని ఒకాయనతో అంటే “మీరు ఎప్పుడు ఇట్లానే మాట్లాడతారు – అట్లనే మిగిలిపోతారు” అని నాకు దీవెనలిచ్చారు.

***

‘విను తెలంగాణ’ పుస్తకం చదువుతుంటే అన్నిరకాల హక్కుల విధ్వంసం నా కళ్ళ ముందు మరోసారి  ప్రత్యక్షమై మనసుఎంతో బాధకు గురైంది. పైన చెప్పిన ఎన్నో విషయాలు గిర్రున కళ్ళముందు తిరిగాయి. ఇతర సమస్యలను చర్చించిన రమేష్ ఈ అంశాలను పుస్తకంలో ఎక్కువగా స్పృశించలేదు. అవి నా లాంటి హక్కుల కార్యకర్తకు వదిలినందుకు ధన్యవాదాలు.

పుస్తకం వెల నాలుగు వందలు, కొరియర్ చార్జెస్ కలిపి ఐదు వందలు. పుస్తకం కావాలంటే రచయిత మొబైల్ కు – 9948077893 కి గూగుల్ పే లేదా ఫోన్ పే చేయగలరు. పూర్తి చిరునామా, పిన్ కోడ్, మొబైల్ నంబర్ పంపడం మరచిపోవద్దు.  

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article