కొలిమిలోనించి వచ్చిన మేలిమి బంగారంలా ఒక ఆశ ముందుకు నడిపించాలి.
రవి ప్రకాష్ మేరెడ్డి
ఫిలడెల్ఫియా
తెలంగాణ సోయి ఎందరో మేధావులను, కవులను, రచయితలను, పాత్రికేయులను, గ్రామ స్థాయిలో నిశ్శబ్దంగా పనిచేసే వారియర్స్ ని కలిపింది. అది వ్యక్తిగతంగా నా అదృష్టంగా భావిస్తాను. జీవితానికి ఈ సత్సంగం ఎంతో తృప్తినిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన మన జీవిత కాలంలో జరుగదేమోనని ఆందోళన పడేది. కానీ ఆ కల సాకార మయ్యింది. ఈ జీవితానికిది చాలు అన్పించింది.
కానీ, ముందుంది అసలు సమస్య అని తర్వాత తెలిసింది, ఇంకా తెలుస్తుంది. ఒక నూతన రాష్ట్రం, అదీ ఒక ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రం, త్యాగాల పునాదితో, చక్కని సంస్కరణలతో ఒక ఉజ్వల భవిష్యత్తుకు ఆలంబనగా రూపుదిద్దుకుంటుందని ఆశిం చాం. కానీ, కొన్ని ఫండమెంటల్స్ మిస్ అయ్యామేమోనని అన్పిస్తుంది. సరే, అన్నీ ప్రభుత్వాలు చేయలేవు. సమాజమే నడిపించాలి అంటే మనమే ఇంకా చేయాల్సిన పని ఎంతో ఉంది అని అర్థం అయింది.
‘విను తెలంగాణ’. పేరులోనే అంతా ఉంది. చదువుకున్న వాళ్లమని, అంత తెలుసని మనకు తెలియకుండానే అహం. అందుకే మనమే అంతా చెబుతుంటాం. వినాలనుకోము. అసలు ఒక ఊర్లో, ఒక సామాన్యుడి దగ్గరకు వెళ్లి ముచ్చట పెట్టే వాళ్లెవరు?
ఆ ప్రయాణంలో కలిసారు కందుకూరి రమేష్. మేధావులు, కవులు, రచయితలు, పాత్రికేయులు, గ్రామ స్థాయిలో నిశ్శబ్దంగా పనిచేసే వారియర్స్ – అన్నీ కలగలసిన వ్యక్తి ఆయన. ఏటికి ఎదురీదడానికి వెనుకంజ వేయని మనిషి. విలువలతో, సోయితో గొప్పగా, తృప్తిగా ఉండే సంస్కారం మరి ఎలా అబ్బిందో!
సామాన్యుడిపై రమేష్ కి ఉన్న ప్రేమ తాను చేసే ప్రతి పనిలో కనబడుతుంది. సామాన్యుడిలోని అసామాన్యుడిని వెతికి పట్టుకుంటారు. సామాన్యుడిని అందలం ఎక్కిస్తారు. ఆకాశమంత గొప్పగా నిలబెడ తారు. తను చెప్పినట్లుగా సామాన్యుడే నిజమైన హీరో. Inflated egos తో బతికేవారిని చూస్తే జాలేస్తుంది.
ఇక ‘విను తెలంగాణ’ గురించి – పేరులోనే అంతా ఉంది. చదువుకున్న వాళ్లమని, అంత తెలుసని మనకు తెలియకుండానే అహం. అందుకే మనమే అంతా చెబుతుంటాం. వినాలనుకోము. అసలు ఒక ఊర్లో, ఒక సామాన్యుడి దగ్గరకు వెళ్లి ముచ్చట పెట్టే వాళ్లెవరు? రాజకీయ నాయకుడు భద్రతా వలయంలో వెళ్లి మాట్లాడటం తప్ప, పల్లెలు చెప్పడానికి, వినడానికి నోచుకోలేదు. వారిని ఆధార్ కి, తెల్ల కార్డుకు, తాము విదిలేసే పైసలకు, ఓట్లు సంఖ్యకు పరిమితం చేసారు.
‘విను తెలంగాణ’లో మాటలు తూటాలై మనసులోకి సూటిగా దూసుకెళ్తాయి. భరించలేని బాధ, నిజమా అనిపించే గగుర్పాటు, నైరాశ్యం, ఫ్రస్ట్రేషన్, కోపం – అన్నీ కలగాపులగంగా మేధోమథనం చేస్తాయి. అందులో కొలిమిలోనించి వచ్చిన మేలిమి బంగారంలా ఒక ఆలోచన, ఒక కర్తవ్యం, ఒక ఆశ మనల్ని ముందుకు నడిపించాలి.
అనాథ తెలంగాణ, గంజాయి తెలంగాణ మొదలుకొని పాలమూరు లేబర్ ‘ఉచితాలు ఎందుకు’, సింగరేణి, గల్ఫ్ బలగం, సిరిసిల్ల సంక్షోభం – ఇలా సమస్త విషయాలపై తూర్పార పట్టింది ఈ “విను తెలంగాణ”. ఇప్పుడైనా వినండి.
రమేష్ రచన, ఫొటోగ్రఫీ చిత్రాలు, ప్రజలతో, సామాన్యుడితో మమేకమై వారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నాలు చిరకాలం నిర్విఘ్నంగా జరగాలని, ముందు తరాలకు దిక్సూచి కావాలని మనసారా కోరుకుంటూ, ఈ స్నేహ పరిమళాన్ని నిండుగా ఆస్వాదిస్తూ…
ఉంటానిక.
పుస్తకం వెల నాలుగు వందలు, కొరియర్ చార్జెస్ కలిపి ఐదు వందలు. పుస్తకం కావాలంటే రచయిత మొబైల్ కు – 9948077893 కి గూగుల్ పే లేదా ఫోన్ పే చేయగలరు. పూర్తి చిరునామా, పిన్ కోడ్, మొబైల్ నంబర్ పంపడం మరచిపోవద్దు.