Editorial

Sunday, April 27, 2025
అభిప్రాయంవిను తెలంగాణ : ఒక జిందగీ, బందగీ - ఎండి.మునీర్ ముందుమాట

విను తెలంగాణ : ఒక జిందగీ, బందగీ – ఎండి.మునీర్ ముందుమాట

ఏమి ఆశించి ఏమి కోరి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం అసమాన త్యాగాలు చేసి పోరాడారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమి జరిగింది? వంచన, మోసం, అవినీతి కట్టలు తెంచుకొని పారింది. ప్రజల కలలను కల్లలు చేసింది.

ఎండి.మునీర్
సింగరేణి, తెలంగాణ

కందుకూరి రమేష్ బాబు చాలా కాలంగా నాకు మిత్రులు. ఇద్దరం జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతుండడం వలన మా స్నేహం మరింత బలపడింది. ప్రజల పట్ల ఆయన అంకితభావం నన్ను ఆశ్చర్యపరిచేది. ప్రజల బాధలు తన బాధలుగా ప్రజల గొంతు వినిపించడంలో ఆయన తాపత్రయం అంతా ఇంతా కాదు. అయితే వాస్తవాలు మింగుడు పడని నాయకులు అధికార బలంతో జర్నలిస్టులపై చేసే దాడులు, పెట్టే ఇబ్బందులు మనం రోజూ చూస్తున్నాము. అయినా వాటికి భయపడకుండా సత్యం వైపు, ప్రజల వైపు నిలబడడం మామూలు విషయం కాదు. అటువంటి వారిలో మా రమేష్ ఒకరు.

వాస్తవాలను చూడటం, చెప్పడమే కాదు, వాటిని అక్షరాలా రాయడం మామూలు విషయం కాదు. అందుకు ఎంతో గుండె ధైర్యం కావాలి. మొహమాటాలకు తావు ఉండ కూడదు. లేకుంటే సత్యం మరుగున పడిపోతుంది. అబద్దాలు చెల్లుబాటులోకి వస్తాయి. అందుకే రమేష్ బాధ్యత నెరిగి మెలకువతో వ్యవహరించాడు. కాబట్టే ‘విను తెలంగాణ’ అనే ఈ వ్యాస సంపుటి గత పది సంవత్సరాల సామాజిక ఉద్యమ చరిత్రకు భాష్యం చెబుతున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలను, అనంతరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంతవరకు జరిగిన పరిణామాలను ఇందులోని వ్యాసాలు అద్దం పడతున్నాయి.

తెలంగాణ ఉద్యమ కాలంలో కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు పొందిన కళాకారులు, వాగ్గేయకారులు, ప్రజల మన్ననలు పొందిన మేధావులు తదనంతర కాలంలో అధికారానికి అమ్ముడు పోయి వల్లించే పాఠాలను సైతం రమేష్ ఇందులో నిర్మొహమాటంగా ఎత్తిచూపాడు.

స్వయంగా ప్రధానమంత్రే దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం అందిస్తాం అంటాడు. అదే నోట పేదరికం నుండి పాతిక కోట్ల మందిని బయటపడేసాం, దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది, వెలిగిపోతుందని ఊకదంపుడు ఉప న్యాసాలు రోజు మన చెవులను చిల్లులు పడేలా హోరెత్తిస్తుంటాయి. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తేల్చుకోలేని స్థితికి మన మెదళ్లను మొద్దు బారుస్తాయి. ఈ ఊకదంపుడు ఉపన్యాసాల్ని ఒక పాలమూరు వలస కూలి “మాకు ఉచితాలు ఎందుకు? ఉపాధి కావాలి” అన్న ఒక్క మాట చెప్పి వాళ్ళ బండారం బయట పెడతాడు. దేశానికి నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో ఆ పాలమూరు బిడ్డ మాటలే వినిపిస్తున్నాయి. అది సాధించ నంత వరకు ప్రజల ఆందోళనలు ఆగేటివి కావు. రాజకీయ పార్టీలు పోటీపడి ప్రకటించే ఉచిత పథకాలతో రోగం కుదిరేది కాదు. రోగం మరింత కుదురుతుంది తప్ప పరిష్కరింపబడదు.

రమేష్ ఈ నేల మీది మట్టి మనిషి! బాధ్యత నెరిగి మెలకువతో వ్యవహరించాడు. అక్షరాలా ప్రజల పక్షపాతి. కాబట్టే ‘విను తెలంగాణ’ గత పది సంవత్సరాల సామాజిక ఉద్యమ చరిత్రకు భాష్యం చెబుతున్నది.

ఏమి ఆశించి ఏమి కోరి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం అసమాన త్యాగాలు చేసి పోరాడారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమి జరిగింది? వంచన, మోసం, అవినీతి కట్టలు తెంచుకొని పారింది. ప్రజల కలలను కల్లలు చేసింది. ప్రజల హృదయాలలో ఉద్యమ గీతమై కదను తొక్కించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతంను ఎవడో దొర చంపేస్తే చెదిరిపోతుందా! ప్రజల మనసులో నాటుకుపోయిన ఉద్యమ గీతం, కాలం కలిసి రాగానే ఎలా తన్నుకొని వచ్చి ‘జయకేతనం’ ఎగరవేసిందో మనందరికీ తెలుసు.

తెలంగాణ అంటేనే పోరాటం. అన్యాయాలకు వ్యతిరేకంగా దోపిడీ పీడనలకు వ్యతి రేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన, జరుపుతున్న పోరాటాలకు సుదీర్ఘ చరిత్రే ఉంది. నిన్న మొన్నటి నక్సల్ బరి పోరాటం వెలుగులు తెలంగాణలో దాదాపు 50 సంవత్స రాలుగా రైతాంగ ఉద్యమం సాగుతున్నది. ఆ పోరాటంలో ఎంతోమంది ప్రజలు అమరులయ్యారు. ప్రజలు పోరాడి భూస్వాముల భూములను ఆక్రమించుకొని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. కానీ కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర్ రావు ధరణి అనే కలం పోటుతో ప్రజలు రక్తం చిందించి పోరాడి సాధించుకున్న భూములను గుంజుకొని భూస్వాములకు కట్టబెట్టిన వైనాన్ని ‘భూస్వాముల స్వీట్ రివెంజ్- రైతుబంధు’ అన్న వ్యాసంలో రమేష్ తెలియ జేస్తాడు.

మరోవైపు చరిత్రతో కరచాలనం చేస్తూ మానాల, మధ్దిమల్ల, అడవి పదిర, గర్జనపల్లి – ఇలా తెలంగాణ పల్లెల్లో వెలిసిన అమరవీరుల స్తూపాల గురించి తెలియ జేస్తాడు. అమరుల ఆశయాలు నెరవేరలేదు. అమరుల స్తూపాలు వేగుచుక్కలై పోరాటాల దారి చూపుతాయి అన్న ఆశావాదాన్ని తెలియజేస్తాడు. పోరాటానికి విరామం ఉంటుంది. కానీ, పోరాటాలు ఆగేటివి కావు. ప్రజల వివేకము వెనుక తుఫాను ఉన్నది. అది ఏదో ఒక రోజు బద్దలై దోపిడీ రాజ్యాన్ని నేలకూలుస్తుంది. శ్రామిక రాజ్యాలను స్థాపిస్తుంది అన్న కూర రాజన్న మాటలు వినిపించి భరోసా కల్పిస్తాడు.

బొగ్గుబాయిలో యాంత్రికరణ, ప్రైవేటీకరణ పెరిగిపోయి ఉన్న కార్మికులనే ముప్పాతికపైగా ఉద్వాసన పలికిండ్లు. ఇక వలస పోయే పరిస్థితి లేదు. ఉన్నకాడనే నిలబడి బ్రతుకు పోరాటం చేయాలి. అంతకుమించి తెలంగాణ ప్రజలకు వేరే దారి లేదు.

ప్రస్తుత రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద పదునైన వ్యాసాలు ఉన్నాయి. ఈటల రాజేందర్ రెంటికి చెడ్డ విధంగా ఎట్లయిండు. రేవంత్ రెడ్డి రాజకీ యంగా రాణించటానికి ఆయన మాటల్లోని సూటిదనం, స్పష్టత, పోరాట పటిమ, ఎలా దోహదపడిందో తెలియజేస్తాడు. తెలంగాణ ‘జాక్’ రాజకీయంగా ఎదగక పోవటం వైఫల్యమేనంటాడు.

జయశంకర్ సార్, గద్దర్ లేకపోవడం తెలంగాణకు బాధాకరం, మనకు ఉన్నది ఇప్పుడు కోదండరాం సార్ మాత్రమే అంటాడు. నాయకుడికి ప్రజల పట్ల విశ్వాసం లేకుంటే ప్రజల నాడి తెలియకుంటే ఎన్నికల ముందే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని కోదండరాం సార్ ఎలా చెప్పగలిగాడు?

ఒకప్పుడు తెలంగాణలో బతుకుదెరువు కోల్పోయిన జనం బొంబాయికో, దుబాయ్ కో లేదా బొగ్గుబాయికో కూలి కోసం బతక పోయేవాళ్ళు. అలా బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి అన్న పేరు వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ కూడా బతుకుదెరువు లేదు. బొంబాయిలో బట్టల మిల్లులు మూతపడి చాలా ఏళ్లయింది, దుబాయ్ పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ఇక బొగ్గుబాయిలో యాంత్రికరణ, ప్రైవేటీకరణ పెరిగిపోయి ఉన్న కార్మికులనే ముప్పాతికపైగా ఉద్వాసన పలికిండ్లు. ఇక వలస పోయే పరిస్థితి లేదు. ఉన్నకాడనే నిలబడి బ్రతుకు పోరాటం చేయాలి. అంతకుమించి తెలంగాణ ప్రజలకు వేరే దారి లేదు.

గునుగుకూర తిని ఆకలి తీర్చుకునే వలస కూలీల బతుకు చిత్రం, పల్లె ప్రజల శీలతను నెత్తికి ఎత్తుకొని తిరిగే పోగుల గణేశం గారి అవిరామకృషి, మల్లన్న సాగర్ నిర్వాసితుడుగా నిరసన తెలిపే కరుణాకర్ రెడ్డి ఎన్నికల పోరాటం వంటి అనేక విషయాలు ఈ వ్యాసాల్లో కనిపిస్తాయి.

మద్యం వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా మార్చుకున్న గత కేసీఆర్ ప్రభుత్వం శవాల మీద పైసలు ఏరుకున్నదని ఈసడిస్తాడు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగించడంతో అనేకమంది పేదలు అకాల మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలు అనాథలుగా మారిన కన్నీటి కథలు, అనాథలుగా మారిన పిల్లల వ్యధలు తెలియజేస్తాడు. కోటి ఆశలతో చదువుకొని కూడా ఉద్యోగాలు రాక భవిష్యత్తు కానరాక తీవ్ర నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతను గంజాయికి బానిసలను చేసింది ఎవరో కాదు పాలకులే.

సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎదిగిన తర్వాత, దానికి గౌరవ అధ్యక్షురాలుగా కవిత వచ్చిన తర్వాత ఆ సంస్థను ఎలా భ్రష్టు పట్టించిందో, చివరికి గత యూనియన్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ టీఆర్ఎస్ ఒక సీటు కూడా గెలువని దుస్థితికి తీసుకువచ్చిందో జగమెరిగిన సత్యాన్ని తెలియ చెప్పాయి. ‘ఇచ్కపోయిన బతుకమ్మ’ బండారాన్ని బయటపెట్టాయి.

మన సింగరేణి మీద కూడా మూడు వ్యాసాలు ఉన్నాయి. సింగరేణి జాక్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల వీరోచిత పాత్ర, వారు నిర్వ హించిన సకల జనుల సమ్మె పోరాటం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచి తెలంగాణ రాష్ట్రం రావటానికి దోహదపడింది. అటువంటి పోరాటంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పదేళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎదిగిన తర్వాత, దానికి గౌరవ అధ్యక్షురాలుగా కవిత వచ్చిన తర్వాత ఆ సంస్థను ఎలా భ్రష్టు పట్టించిందో, చివరికి గత యూనియన్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ టీఆర్ఎస్ ఒక సీటు కూడా గెలువని దుస్థితికి తీసుకువచ్చిందో జగమెరిగిన సత్యాన్ని తెలియ చెప్పాయి. ‘ఇచ్కపోయిన బతుకమ్మ’ బండారాన్ని బయటపెట్టాయి. ఇక రమేష్ అన్న కెమెరాలో బంధిస్తూ లోకానికి చూపుతున్న ఫొటోలు ఒక సజీవ జీవితానికి అద్దం పడతాయి అంటే అతిశయోక్తి కాదు. అటు అక్షరం, ఇటు ఛాయాచిత్రం. రమేష్ రచనల్లో ఒక జిందగీ, బందగీ ఉట్టి పడుతుంది. ఆయన ఒక నేల మీది మట్టి మనిషి! అందుకే ఆయనను ప్రేమ గల మనిషి అంటాను నేను!

అలసట లేని, సమాజాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న, ఆయన కోరుకునే సమసమాజాన్ని కోరుకుంటూ, అందుకోసం వెతుక్కుంటూ, గమ్యం కోసం కదిలిపోతూ, ఎవరు ఏమన్నా, ఏమి అనుకున్నా, ఎన్ని నోటీసులు ఇచ్చినా, తన పని తాను చేసుకుంటూ వెళుతున్న మిత్రుడు కందుకూరి రమేష్ బాబుకు మనసారా అభినందనలు.

05.03.2024

పుస్తకం వెల నాలుగు వందలు, కొరియర్ చార్జెస్ కలిపి ఐదు వందలు. పుస్తకం కావాలంటే రచయిత మొబైల్ కు – 9948077893 కి గూగుల్ పే లేదా ఫోన్ పే చేయగలరు. పూర్తి చిరునామా, పిన్ కోడ్, మొబైల్ నంబర్ పంపడం మరచిపోవద్దు.   

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article