“జో ఖత్మ్ హో కిసీ జగహ్ యే ఐసా సిల్ సిలా నహీ”
– సాహిర్ లూధియాన్వీ
వాడ్రేవు చినవీరభద్రుడు
నువ్వు లేవు, నీ పాట ఉంది, నువ్వుండనీ, ఉండకపోనీ
నా బతుకంతా నీ సౌరభం నిండిపోయింది.
శిశిరం వస్తూనే వెళ్ళిపోయావు, వెళ్తూ వెళ్తూ నిత్య
వసంతాన్ని ఈ తోటకు వీలునామా రాసిచ్చావు.
ఇకనుంచీ ఆరు ఋతువుల్లోనూ నీ స్వరం కూడా
ఒక రంగు, ఒక వెలుగు, గాల్లో ఎన్నటికీ తొలగని తావి.
సూర్యచంద్ర నక్షత్రాలతో పాటు నీ పాటకూడా
నా ఆకాశమ్మీద అల్లుకునే రాధామనోహరం పూలతీగె.
అలసిపోయాను అనుకున్నప్పుడల్లా నీ పాట తన కురులు
విరజార్చి నా వదనాన్ని కప్పేసే మేఘాల నీడ.
ఎందరో కవులు కన్న కలవి, ఒక జీవితకాలాన్ని
కొన్ని క్షణాలకు కుదించగల ఇంద్రజాలానివి.
నా గోదావరివి, కృష్ణవి, నా చిన్నప్పటి గ్రామానివి,
మాఘఫాల్గుణాల నల్లమలవి, వర్షర్తుదండకారణ్యానివి.
తారలు సగం రాత్రివేళ చెప్పే ముచ్చటవి, వెన్నెల రాత్రుల్లో
ఈ కొసనుంచి ఆ కొసదాకా సాగే పెళ్ళి ఊరేగింపువి.
సన్నాయివి, సుతారమైన సితారువి, గోధూళివేళ
ఆ అడవిలో నా తలుపు తట్టే మోహనమురళీరాగానివి.
పొద్దున్నే వెలిగించిన పూజాదీపానివి, పీటని పల్లకీ చేసి
బొమ్మలపెళ్ళి ఆడుకున్న బాల్యకాల సఖివి.
వానపడకుండానే ఏర్పడే ఇంద్రధనుస్సువి, ఎంత అమృతం కురిపించావు,
అయినా ఎప్పటికీ తీరని దాహానివి.
మళ్ళా కలవకుండా వెళ్ళిపోయిన స్నేహితురాలివి, సరే,
నన్నెప్పటికీ వదిలిపెట్టని వాగ్దానానివి కూడా.
నీ గొంతు వినిపిస్తున్నంత కాలం ఈ శలభం
దీపంతో పనిలేకుండానే దగ్ధమవుతూంటుంది.
నలుగురు కవులు కావ్యగోష్టికి కూచునప్పుడు
నీ తలపు చాలు, వేరే దీపం సెమ్మెతో పనిలేదు.
వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. ప్రభుత్వ ఉన్నతాధికారి.
వారి రచనల నిలయం నా కుటీరం.
లతా గాన మాధుర్యం కోసం ఈ వీడియోలోని కొన్ని పాటలు ఆస్వాదించండి