సేద్యగాడి దుస్థితి తెలిపు సీసపద్యం
పాతిన మొక్కలా పాదాలు నేలాంచి
పచ్చని నవ్వులు పరిచినోడు
ఎత్తిన గొడుగులా ఎండలో తను మండి
చల్లని నీడిచ్చి సాకినోడు
కాసిన కొమ్మలా గాయాల పాలై
పండించి పండ్లను పంచినోడు
పూసిన రెమ్మల పూలు పూజలకిచ్చి
ఇత్తనాల గింజలు వెతికినోడు
తెగులు పట్టిన సెట్టులా తెగొడిపొయి
పిట్టలోదిలిన గూడులా వట్టి పోయి
బతుకు బతుకంతా నేలకు భక్తుడై
చేరే, తన నెల గూటికి సేద్యగాడు
అపార గౌరవంతో, విచార హృదయంతో శ్రీ గంటేడు గౌరు నాయుడు సేద్యగాడిపై రాసిన ఈ కరుణ రసాత్మక పద్యం ఆత్మగౌరవంతో బతికే రైతు దుస్థితిని, నిస్సహాయతను గొప్పగా తెలుపు. ఈ సిస పద్యం గానం శ్రీ కోట పురుషోత్తం.
కోట పురుషోత్తం. కోట పురుషోత్తం పరిచయం: సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు టివి’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తున్నారు.