కందుకూరి రమేష్ బాబు
గత వారం… స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఫొటోగ్రఫీ ఫెస్టివల్ జరుగుతోంది. ఒక పత్రికలో నాతో కలిసి పనిచేసిన ఫొటోగ్రాఫర్ కలిశాడు. “ఎలా ఉన్నావు బ్రదర్” అంటే విచారంగా నవ్వాడు. అతను అప్పటికే ఒక ఫారిన్ ఫోటోగ్రాఫర్ గెస్ట్ లెక్చర్ కవర్ చేయడానికి వచ్చి, ఆ ప్రసంగం ముగిసాక వెళుతున్నాడు. మాటలు కలపడంతో నైరశ్యంతో నవ్వి, “ఏమీ బాలేదన్నా పరిస్థితి. పత్రికలో చేరిన మొదటి రెండు మూడేళ్ళు తప్ప జీతంలో మార్పు లేదు. దాదాపు చేరిన నాటి నుంచి అదే సాలరీ. ఖర్చులు పెరిగాయి. బాధ్యతలూ పెరిగాయి. వయసూ పెరిగింది” అన్నాడు బాధగా.
“పెరిగే వాళ్ళవి పెరుగుతున్నవి. ముందు నుంచీ ఉన్న నాలాంటి వాళ్ళను పట్టించుకునే నాధుడు లేడు. అదే పరిస్థితి” అన్నాడు.
అతడు బాగా వయసు మీరినట్టు కనిపించాడు. మేమంతా యువకులుగా ఉండేవాళ్ళం. కానీ ఈ దశాబ్దంలో అందరి తలలూ నేరిసాయి. వయసు కన్నా పెరిగిన బాధలు కారణం కావొచ్చు. తలతో పాటూ గడ్డమూ నెరిసిన ఆ సోదరుడిని చూస్తే బాధేసింది. “మీకు తెలుసు కదా. ఫొటోగ్రాఫర్ జాబ్ అంటే కత్తి మీద సాము. సరైన ఫొటో కవర్ చేయడానికి ఎంతో జాగ్రత్తగా పని చేయాలి. ఒక్క క్షణం కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. సరైన ‘క్లిక్’ లేకుండా ఆఫెస్ కు వెళ్ళలేం. మిస్ అయ్యామంటే ఇక ఫొటో దొరకదు. వేరేవాళ్ళను అడగాలి. సేం ఉంటే ఎడిటర్ తో తిట్లు. నెట్టుకొస్తున్నాను, కానీ బాగా అలసిపోయాను అన్న” అని చెప్పాడు.
చెబుతూ కాళ్ళవైపు చూశాడు. చూసి చెప్పాడు. “మీకు తెలుసు కదా. పొటోగ్రాఫర్ అంటే నిలబడే పని చేయాలి. నిలబడి ఉంటూనే తోటి ఫొటోగ్రాఫర్లతో కలబడాలి. కూచున్నామా అంటే ఫోటోగ్రాఫర్ జాబ్ కు అన్ ఫిట్ అన్నట్టే. ఇక ఇంటికి వెళ్లి కూచోవలసిందే. అందుకే అప్పట్నుంచీ ఇప్పటిదాకా …నిజానికి చాలా కష్టమే అయినా …అలాగే నిలబడే ఉన్నాను ఉద్యోగంలో.. అదే కాలితో” అన్నాడు.
ఇన్నేళ్ళుగా ఆ ‘రాడ్’ తో నిలబడి పనిచేస్తున్న యాతనను అతడు వివరిస్తుంటే ఒక దశాబ్ది దు:ఖం విషాదపు నీడగా అతడి మోములో ఒక్క క్షణం సంచరించి మాయమైంది.
“అదే కాలితో” అనడం ఎందుకో నాకు తెలుసు. ఉద్యమం అతడి కాలును తీసుకుంది మరి. అవును. తెలంగాణ ఉద్యమంలో కాలు విరగ్గొట్టుకున్న ఫోటోగ్రాఫర్ అతడు. రాడ్ వేసుకున్న కాలితోనే ఇంతకాలం పనిచేస్తున్నాడు. మిలియన్ మార్చ్ మొదలు అన్ని ముఖ్య ఈవెంట్స్ చిత్రించిన ఫొటోగ్రాఫర్లలో అతనొకడు. ఇన్నేళ్ళుగా ఆ ‘రాడ్’ తో నిలబడి పనిచేస్తున్న యాతనను అతడు వివరిస్తుంటే ఒక దశాబ్ది దు:ఖం విషాదపు నీడగా అతడి మోములో ఒక్క క్షణం సంచరించి మాయమైంది.
మేం మాట్లాడుతున్న చోట దారి లేదు. సాంస్కృతిక సారథి నుంచి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మధ్య కొండ వాలులో మాట్లాడుతున్నాం. రేపు పొద్దున్న కొత్త చైర్మన్ వెన్నెల పదవీ స్వీకారం కూడా ఉంది. ఎవరిదో వెనక నుంచి కారు హార్న్ పదే పదే మోగుతోంది. దాంతో “సరే అన్న…ఇక వెళతా” అంటూ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు.
ఇలాంటి వాళ్ళ బాధ రాస్తే పెద్ద పుస్తకం అవుతుంది, స్వరాష్ట్రంలో. పేరుకు పత్రికలు. బతుకు దెరువుకు సరిపడా జీతాలివ్వవు. గత ప్రభుత్వం హైదరాబాద్ జర్నలిస్టులకు స్థలాలివ్వడానికి ఏండ్లకు ఏండ్లు నాన్చింది. ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఇవ్వగానే సుప్రీం కోర్టు ఇవ్వొద్దని తీర్పు ఇచ్చింది. ఆ ఆశ అడియాశ అవుతుందన్న భయం. ఇక హెల్త్ కార్డులు ఉండవు. ఇదిలా ఉంటే, ఉద్యమం నుంచి స్వరాష్ట్రం ఏర్పాటు దాకా చకచకా ఎదిగిన నేతలు అటు ప్రభుత్వంలో ఇటు ప్రతిపక్షంలో సీట్లు మార్చుకుంటూ ఉంటారు. మధ్యలో విగ్రహాల గురించి విమర్శించుకుంటూ ఉంటారు. బతికి ఉండి ఉద్యమాన్ని రిపోర్ట్ చేసిన వారు మటుకు…ఇంకా నిలబడే… మారిన స్థితిగతులను ఫోటోలు తీస్తూ, వార్తలు రాస్తూ, విశ్లేషణలు చేస్తూ తమ బాధ్యతలను యధావిధిగా నిర్వహిస్తూనే ఉంటారు…పంటి బిగువున బాధను అదిమిపట్టి.
నిలబడిన ఆ ఫోటోగ్రాఫర్ ఈ అద్భుత ఘట్టాన్నీ, సన్మానితులను, నూతన తెలంగాణ తల్లి సాక్షిగా మళ్ళీ ఫోటోలు తీశాడు. తప్పదు కదా.
చిత్రం ఏమిటంటే, ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యం దొరకదు. వారందరినీ గుర్తించి, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకైనా ఆదుకోరు. ఉద్యమ కారులకు ప్రాధాన్యం ఇస్తామన్న మరో హామీ ఉంటుంది. ఆ హామీ అమలుకు చర్యలు లేవు. కానీ సర్వస్వం కోల్పోయిన వారట. వారికి ప్రభుత్వం నిన్న మూడు వందల గజాల స్థలం, కోటి రూపాయల నగదు, తామ్ర పత్రం ఇచ్చి ప్రభుత్వం గౌరవిస్తుంది.
నిలబడిన ఆ ఫోటోగ్రాఫర్ ఈ అద్భుత ఘట్టాన్నీ, సన్మానితులను, నూతన తెలంగాణ తల్లి సాక్షిగా మళ్ళీ ఫోటోలు తీశాడు. తప్పదు కదా. మన అన్నదమ్ములే ఐన ఆ ఉద్యమకారుల వార్తకు తగిన ఫోటో పత్రికకు ఇవ్వవలసిందే కదా! ఇచ్చి ఇంటి ముఖం పడుతాడు.
రాత్రి నిద్రరాదు. కాలికి వేసిన రాడ్ నొప్పి కన్నా అతడికి గుండె భారమై కలిగిన నొప్పి ఎక్కువ కావొచ్చు. కానీ ఎవరికీ చెప్పుకుంటాడు!
సర్వం కోల్పోనివాడు.
ఇది తెలంగాణ. విను తెలంగాణ.
ఉద్యమాల్లో నిస్వార్ధంగా పని చేసేవారే ఉంటారు. అధికారం వచ్చన పిదప పెట్టుబడి నడిపిస్తుంది. త్యాగాలు చేసేవారు నాయకుల అవకాశవాదాన్ని కనిపెట్టలేని అమాయకులు.