“నేను మరణించిన ఇరవై ఏళ్ల తర్వాత గానీ నా ఆత్మకథ వెలువడకూడదు” మరోసారి గంభీరంగా చెప్పారాయన.
ఎందుకో చదివేముందు ఒక మాట.
నిన్న 101వ ఏట కాలం చేసిన పద్మశ్రీ జగదీష్ మిట్టల్ గారి ప్రశస్తి గురించి, వారు నెలకొల్పిన మ్యూజియం గురించి తెలుసుకోవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ తరం వారు. అందుకోసం పద్దెనిమిదేళ్ళ క్రితం, 2007లో ‘వార్త’ దిన పత్రికలో “నేనొక కళా పిపాసిని” అని తనను తాను అభివర్ణించుకున్న వారిపై ‘అంతర్ముఖం’ పేరిట రాసిన వ్యాసాన్ని నివాళిగా, ఆత్మీయంగా పంచుకోవడం. ఈ వ్యాసానికి శీర్షిక “నా మ్యూజియం బ్యాంకులో ఉంది”.
కందుకూరి రమేష్ బాబు
“నేను మరణించిన ఇరవై ఏళ్ల తర్వాత గానీ నా ఆత్మకథ వెలువడకూడదు” మరోసారి గంభీరంగా చెప్పారాయన.
అప్పటికి చాలాసేపు గడించింది. పద్మశ్రీ జగదీష్ మిట్టల్ అంతరంగాన్ని పట్టుకోవడానికి వేసిన పలు ప్రశ్నలు వృధా అయ్యాయి కూడా. చివరకు తనను వివరించమన్నప్పుడు ఆయన ఒక ఫైల్ తెరిచి “ఎనభయ్యవ దశకంలో అనుకుంటాను. ఒక విదేశీ మిత్రుడి కోర్కెను మన్నించి నేను నా ఆత్మకథను డిక్టేట్ చేశాను. కానీ, ఒక షరతు మీద. నేను మరణించిన ఇరవై ఏళ్ళకు తర్వాత గానీ అది అచ్చవకూడదు అని. ఇప్పటికీ అదే అంటున్నాను” అన్నారాయన.
ఈ మాట చెబుతున్నప్పుడు ఆయన జీవిత భాగస్వామి కమల గారు పక్కనే ఉన్నారు. అందులోని గూడార్థం ఆమె ఒక్కరికే తెలుసన్నట్టు ఆమె నిశ్శబ్ధం పాటించారు.
మరి ఆయన అలా ఎందుకన్నారంటారు? అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, “మీ జీవిత కాలంలో ఏం సాధించారు?” అన్నపుడు ఆయన తన ఇంటినే చూపించాల్సి వచ్చింది. అదొక సమాధానం. రెండో ప్రశ్నగా, “ఇంకా ఏం సాధించబోతున్నారు?” అన్నప్పుడూ అదే పరిస్థితి. రెండింటికీ ఒకే సమాధానం. తానింకా అదే ఇంట్లో ఉన్నారు మరి” అందుకే వివరంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. దీన్ని అర్థం చేసుకుంటే అయన ఆత్మకథలోని సారాంశాన్ని వారు గతించిన ఇరవై ఏళ్ళు ఆగనవసరం లేకుండానే కొంత పోల్చుకోగలం. అదే ఈ ‘అంతర్ముఖం’లో నేను పట్టుకున్న అంతరార్థం.
వాటి గురించి చెప్పేముందు ఆయన ఇంట్లోనుంచి నేరుగా బ్యాంకులోకి దారి తీశారు. అవును. అదే ఆయన అంతర్ముఖంలోని మరో విషాద పార్శ్వం.
ఇక్కడ ‘ఇల్లు’ అని కొక్కి చెప్పడం ఎందుకంటే, ప్రపంచంలోనే భారతీయ కళకు చిరునామాగా మన భాగ్యనగరంలోని గగన్ మహల్ లో ఉన్న తన ఇంటినే ఓ అపూర్వ మ్యూజియంగా మలిచారాయన. దానికి ఈ దంపతుల పేరే, ‘జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్’ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ మ్యూజియంను ఆయన ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ గా, పన్నెండు మంది ట్రస్టీలతో ఇంట్లోనే నిర్వహిస్తున్నారు.
దురదృష్టకరమైనది ఏమిటంటే, అదెప్పుడో ఒక విశ్వ విద్యాలయంగా లేదా విశ్వ విద్యాలయానికి అనుబంధ విభాగంగా ఏర్పడవలసినది. స్కాలర్స్ మొదలు సామాన్యుల వరకూ చూసి ఆనందించాల్సింది. కానీ నేరవేరలేదు. అందుకు ప్రభుత్వ అలసత్వం ఆనండీ లేదా వైఫల్యం అనండీ, అదెంతగా ఆయన్ని బాధ పెట్టిందో చెప్పదల్చుకోలేదు. ఆత్మకథలో తప్ప ఆయన వాచ్యంగానైనా దాని సంగతి ఎత్తొద్దు అనే అనుకుంటున్నారు.
ఏమైనా, ఆయన ఆత్మకథ అంటే దశాబ్దాలుగా, కాదు కాదు… గడిచిన శతాబ్దాల కళా పరంపర. అందులో క్రీస్తు శకం ఒకటి నుంచి పందొమ్మిదవ శతాబ్దం వరకు ఎన్నో విలువైన కళాఖండాలున్నాయి. వాటి గురించి చెప్పేముందు ఆయన ఇంట్లోనుంచి నేరుగా బ్యాంకులోకి దారి తీశారు. అవును. అదే ఆయన అంతర్ముఖంలోని మరో విషాద పార్శ్వం.
మిట్టల్ సాబ్ వద్ద ఉన్న అపురూప కళాఖండాలు అమూల్యమైనవి. వాటి రక్షణ అతి పెద్ద సమస్యగా మారింది. అందుకే ఆయన వాటిలో అధిక భాగం అయిష్టంగానే అయినా బ్యాంకులో భద్రపరిచవలసి వచ్చింది. “నా మ్యూజియం బ్యాంకులో భద్రంగా ఉంది” అని ఇంటిని తరచి తరఛి చూసుకుంటూ విచారంగా అన్నారాయన.
బ్యాంకులో ఉంచిన వాటిని చూడాలనుకుంటే ముందస్తుగా ఆయన్ని అభ్యర్థించవలసిందే. అలా అభ్యర్ధిస్తేగానీ వీలువెంబడి వాటిని ఇంటికి తెప్పించి, చూపించలేని దిస్థితి. ప్రసిద్ధ చిత్రకారులు పాబ్లో పికాసో భార్య ప్రాంకోయిస్ గిలో మొదలు ప్రెంచి జర్నలిస్ట్ దామ్నిక్ లాపరే వరకూ ముందస్తుగా అభ్యర్ధించి అ అపూర్వ కళాఖండాలు వీక్షించిన వారిలో ఉన్నారు. “ఇదే నా సమస్య. ఎవరికంటే వారికి, ఎప్పుడంటే అప్పుడు చూపించలేను. మరీ ముఖ్యంగా ఇంతవరకూ సామాన్యులకు వాటి ప్రదార్శనా భాగ్యం పట్టనేలేదు. అదే నన్ను నిరంతరం కలత పెడుతూ ఉంటుంది” బాధగా చెప్పారాయన.
ఆయా కళాకృతుల సేకరణకు నన్ను పురికోల్పేది దాని ప్రశస్తి. వెల కానే కాదు” చెప్పసాగారు. “కేవలం సౌందర్యాత్మ. అదే నన్ను బంధిస్తుంది” అన్నారు.
చెబుతుండగా తనకు కళా సేకరణపై గురి కుదిరిన తీరును ప్రస్తావించి ఆశ్చర్య పరిచారాయన. తాను ఐదో తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు ఆరో తరగతి పాఠ్యాంశంలోని ఒక బొమ్మ అతడిని అమితంగా ఆకర్శించిందట. అది ఓ రెండు బాతుల రేఖాచిత్రం. లలిత మనోహరంగా ఉందిట. దాన్ని చూసింది మొదలు, ఎప్పుడెప్పుడు ఆరో తరగతికి చేరుకుంటానా, ఆ బొమ్మను సొంతం చేసుకుంటానా అని ఎదురు చూసేవారట. తీరా ఆరో తరగతికి చేరుకునేసరికి ఆ పాఠ్యగ్రంథం మారిపోయిందట. దాంతో ఎన్నో ఏళ్లుగా తాను దాచుకున్న చిల్లర డబ్బులతో ఒకరోజు పక్క గ్రామం వెళ్లి, ఆ పాఠ్యగ్రంధాన్ని వెతికి ఖరీదు చేశారట. ‘అలా నా కోరిక తీర్చుకున్నాను. ఇప్పుడు ఆ బొమ్మ నా మ్యూజియంలో భద్రంగా ఉంది. అది 16 వ శతాబ్దం మొఘల్ చిత్రం అని తర్వాతి కాలంలో తెలిశాక దాని అందం రెట్టింపయ్యింది“ నవ్వుతూ చెప్పారాయన.
చిత్రమేమిటంటే, ఆయన అంతరాంతరాల్లోని సౌందర్యాభిలాష అతడిని అపూర్వమైన కళాసేకర్తను చేసిందట. “నిజం చెప్పాలంటే, ఆయా కళాకృతుల సేకరణకు నన్ను పురికోల్పేది దాని ప్రశస్తి. వెల కానే కాదు” చెప్పసాగారు. “కేవలం సౌందర్యాత్మ. అదే నన్ను బంధిస్తుంది” అన్నారు. “ఆ కళాఖండం తాలూకు అందానికు ముగ్దుడినయ్యానా, ఇక వాటి వెంటపడతాను. సొంతం చేసుకుని తీరేదాకా అలజడిగానే ఉంటుంది” తనలో తాను అనుకుంటున్నట్టు చెప్పారాయన. “ప్రస్తుతం నా వద్ద రెండువేల కలాఖండాలున్నాయి. అవన్నీ అపూర్వమైన అందానికి మచ్చు తునకలే“ అంటూ ఆయన అకస్మాత్తుగా తన మ్యూజియం విస్తారాన్ని వివరించి చెప్పారు.
“నేను దక్కన్ మినియేచర్ చిత్రాలు సేకరించడానికి ముందు ఎవరూ వాటి ప్రాధాన్యాన్ని గుర్తించలేదు. ఇప్పుడు ఒక స్కూల్ గా ఆ మినియేచర్ చిత్రకళ గుర్తింపునకు వచ్చిందంటే నా సేకరణలో ఉన్న చిత్రాల మహిమే. ఈ మాట చెప్పడానికి నేను గర్విస్తాను” అని మరో అంశాన్ని జత చేశారాయన. మిట్టల్ మ్యూజియంలో ఉన్న జానపద శిల్పాలకు కూడా ఇటువంటి ప్రత్యేకతే ఉంది. ఇవే కాదు, గుజరాతీ, రాజస్థానీ, పహారీ, బెంగాలీ తదితర స్కూల్స్ కు చెందిన వందలాది కళాకృతులు, వైవిధ్యమైన శిల్ప కళాకృతుల సమ్మేళనంగా ఆయన జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియంను మలిచారు. ఇత్తడి, బంగారం మొదలు రాతి, గాజు, కలప ప్రతిమలెన్నో ఇందులో ఉన్నాయి. అయితే అవన్నీ భద్రంగా బ్యాంకులో ఉన్నాయని మరోసారి చెప్పడం పునరుక్తి కాదనే భావించాలి. అదే ఆయన అంతర్ముఖనికి తాళం చెవి.
“హైదరాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియం ఉంది. జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఉంది. ప్రజలు రెండింటికి తేడా ఉందని భావిస్తే చాలు. నాకదే సంతృప్తి”
ఇక, ఆయన వ్యక్తిగతం, అంటే కళాసేకరణకు ఈవలి జీవితం… అందులోకి తొంగి చూస్తే, ఆయన ఎల్లవేళలా మౌని వలే ఉంటారు. మొబైల్ ఫోన్ వాడరు. కంప్యూటర్ ముట్టరు. టెలివిజన్ చూడరు. అవసరం అనుకుంటే వారిని మనం ముఖాముఖి కలవాల్సిందే. ఇంట్లో ఆయనా, కమల గారు, చిన్న కూతురు ఉమాదేవిలు ఉంటారు. మిగతా ముగ్గురు కూతుళ్ళకు వివాహాలయ్యాయి. వారంతా స్థిరపడ్డారు. అన్నట్టు, ఆయనకు కళా సంపదే తప్ప పిల్లలు లేరు. అదే చెబుతూ “వీరంతా నా దత్త పుత్రికలు” అంటూ మల్లీ తనలోకి తానొచ్చారు. “కళ మినహా నాకు వేరే జీవితం లేదు. కళనే నేను శ్వాసిస్తాను. కళను వదిలి ఒక్క క్షణం నేను జీవించి ఉండలేను” చెప్పారాయన. చెబుతూ తన అంతిమ కోర్కెను వెల్లడించారు. “గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్ర్యం అందించారు. నా వరకు నేను మనదేశానికి గర్వకారణమైన కళా సంపదను భవిష్యత్తు తరాల చేతిలో పెట్టాలని కంకణం కట్టుకున్నాను. ఇదే నా గమ్యం. ఎన్నటికైనా సామాన్యుడి చెంతకు మ్యూజియం తేవడమే నా భవిష్యత్తు” పట్టుదలగా అన్నారాయన.
“గతం గత:…ఇప్పుడు నా వయసు ఎంతనుకున్నారు? 82. మహా అయితే ఇంకో 30 ఏళ్ళు బ్రతుకుతాను. ఈ లోగా నేను చేయవలసిన పని పూర్తి చేస్తాను” అన్నారాయన. ఆ మాటకు ఆశ్చర్యపోతే, “అవును మరి. నాది కళా ప్రపంచం. కళ నన్ను నిత్య యవ్వనుడిని చేస్తుంది. వందేళ్ళు కాదు, నూటా ఇరవై ఏళ్ళు బతికినా ఆశ్చర్య పోవద్దు మీరు“ నవ్వుతూ చెప్పారాయన.
వారి సంకల్పానికి, ఆశావాదానికి, నిరంతర కళాసేవకు జోహార్లు చెబుతూ చివరి ప్రశ్నగా “ఇక్కడి ప్రజల్లో మీరెలా గుర్తుండిపోవాలని భావిస్తున్నారు?” అని అడిగితే ఆయన ఒక్క క్షణం అలిచించి ఇలా చెప్పారు. “హైదరాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియం ఉంది. జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఉంది. ప్రజలు రెండింటికి తేడా ఉందని భావిస్తే చాలు. నాకదే సంతృప్తి” అని చెప్పి ముగించారాయన
( వార్త, ఆదివారం 25 మార్చి 2007 దిన పత్రిక )