Editorial

Saturday, November 23, 2024
ARTSఅలనాటి సెలబ్రిటీలు : భాగ్యనగరపు మూన్ మూన్ సిస్టర్స్

అలనాటి సెలబ్రిటీలు : భాగ్యనగరపు మూన్ మూన్ సిస్టర్స్

‘మూన్ మూన్ సిస్టర్స్’ అందించిన నృత్యగాన వినోదాలు హైదరాబాదు చరిత్ర శకలాల్లో మూగగా, ఎవరికీ పట్టకుండా ఉండిపోయాయనే చెప్పవచ్చు.

హెచ్. రమేష్ బాబు 

‘మూన్ మూన్ సిస్టర్స్’గా ప్రఖ్యాతి గాంచిన ఇరువురు ముస్లిం వనితలు హైదరాబాద్ జంట నగరాలలో అందించిన వినోద కార్యక్రమాలు చరిత్రకెక్కక పోయినా నాటి ప్రజల స్మృతిలో ఉండేవని చెబుతారు. అవి గడచిన శతాబ్ధి ఆరంభంలో ప్రముఖంగా పేర్కొనదగినవే. ఒక రకంగా వారు ఆ నాటి సెలబ్రిటీలనే తెలుస్తోంది.

కళాభిమానులు ‘మూన్ మూన్ సిస్టర్స్’ అని పిలిచే ఆ ఇరువురి సోదరీమణుల అసలు పేరు ‘ఖమర్’, ‘బాదర్’. వీరు కవల పిల్లలు. వీళ్ళను ‘సుల్తానా సిస్టర్స్’ అనేవారనీ చెబుతారు. ఆనాటి చాలామంది కళాభిమానులకు మాత్రం వారు ‘మూన్ మూన్ సిస్టర్స్’

వీరు ఇబ్రహీంబాద్ ఏరియాలో అంటే గోల్కొండ కోట కింద ఉన్న కొండపక్కన నివసించే వారని చెబుతారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతం అంతా నిజాం సైనికుల ఆధీనంలో ఉండేదని తెలిసిందే.

ఉర్దూ కవుల గజళ్ళను…

ఆ తరం వాళ్ళు చెప్పేదేమంటే ఈ కవలపిల్లల్లో పుట్టుకతోనే అసామాన్యమైన సంగీత జ్ఞానం ఉండేదని. వీరెవరి వద్దా సంగీతం నేర్చుకోలేదు. ఏ పాటైనా, ఏ రాగమైనా వినికిడి జ్ఞానంతోనే నేర్చుకునేవారని. ఒకసారి ఏ పాటనైనా వింటే అదే స్వర సౌందర్యంతో తిరిగిపాడే సంగీత జ్ఞానం జన్మత: అబ్బిందని.

కాగా, వారు స్థానికంగా ప్రసిద్ది పొందిన జానపద గేయాలను స్వంతంగా నేర్చుకుని పాడేవారట. పుట్టింది ముస్లిం కుటుంబంలో కావడం వల్ల ఆరోజుల్లో పేరున్న ఉర్దూ కవులు రాసిన గజళ్ళను నేర్చుకుని అద్భుతంగా పాడేవారని చెబుతారు. ఆర్మీ క్యాంపస్లలో వీరి కచేరిలు చాలా ప్రసిద్ధమైనవి. చాలా విందు వినోద కార్యక్రమాల్లో వీరిచే పాడించి సొమ్ముతో గౌరవించేవారు.

గ్రామఫోన్ రికార్డుల పాటలకు నృత్యం…

1912 నాటి సంగతి. ఆ రోజుల్లో గండిపేట చెరువు నిర్మాణంలో ఉంది. ఇందుకుగాను చాలామంది కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, వీదేశీయులు ఇక్కడ పనిచేసేవారు. వీరందరికీ తరచూ విందు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఆ రోజుల్లో నాటకాలు, నాట్యం చేసే స్త్రీలు ప్రధాన వినోదంగా సైనిక వర్గాలు భావించేవి. గనుక మూన్ మూన్ సిస్టర్స్ ఈ సైనిక స్థావరాల్లో సాయంత్రాల్లో, సెలవు రోజుల్లో ఏర్పాటుచేసే వినోద కార్యక్రమాల్లో స్థానిక జానపదగీతాలు, గజళ్ళు పాడేవారని, వీరి పాటలు అక్కడి ప్రజలను చాలా ఆకర్షించేవని చెబుతారు.

క్రమంగా వీరి పేరు అందరి నోటా పాకి, ఆదరణ పెరగ నారంభించడం, అది తెలుసుకున్న విదేశీయులు కూడా ఈ కవల చెల్లెళ్ళను పిలిపించుకుని పాడించుకుని గౌరవించడం ప్రారంభించారు. ఇంగ్లీషులో ఉండే గ్రామఫోన్ రికార్డుల పాటలకు వీరు చేసే నృత్యం విదేశీయులను బాగా ఆకట్టుకునేదని కూడా అంటారు.

బ్రిటీష్ వారికీ వ్యతిరేకంగా…

1919 నుండి 1924 వరకు వీరిరువురు నాటి ‘ఖిలాఫత్ మూవ్మెంట్’ లో చురుకుగా పాల్గొన్నారనీ అంటారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ ప్రచారం చేసేవారని, ఈ సమయంలోనే వీరి పేరు ప్రఖ్యాతులు హైదరాబాదులో అందరికి తెలిసిపోయినవి చెబుతారు.అంతేగాదు. చాలామంది నవాబులు వీరిని తమ ఇండ్లలో జరిగే పెళ్ళిళ్ళు. పుట్టిన రోజులు వంటి శుభకార్యాల్లో పాడేందుకు ఆహ్వానించేవారని. దాంతో ఈ మూన్ మూన్ సిస్టర్స్ ఆ కాలంలో పెద్ద సెలబ్రిటీలైపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

సినీ చిత్రాల పాటలు సైతం …

1931లో మూగ సినిమాల రాక ఆగిపోయింది. మాట్లాడి, పాటలు పాడే సినిమాలు వచ్చినవి. ఆ రోజుల్లో హైదరాబాదులో హిందూ, ఉర్దూ, సినిమాలు బాగా ఆడేవి. ఆ చిత్రాల్లో పాపులర్ అయిన పాటలను తమ కచేరీల్లో పాడటం మొదలుపెట్టారీ సిస్టర్స్.

అప్పట్లో సినిమా పాటలు రికార్డులు సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు. ఆ పరిస్థితుల్లో ఈ మూన్`మూన్ సిస్టర్స్ ఆ పాటలు పాడుతూ బహుళ జనాదరణ పొందడం ప్రారంభించారు.

అప్పట్లో సినిమా పాటలు రికార్డులు సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు. సినిమాల్లో తప్ప మళ్ళీ బయట విడిగా వినే అవకాశం ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో ఈ మూన్`మూన్ సిస్టర్స్ ఆ పాటలు పాడుతూ బహుళ జనాదరణ పొందడం ప్రారంభించారు.

‘ఆలం అరా’, ‘షిరీన్ ఫర్హద్’, ‘లైలామజ్ను’ వంటి 1931లో వచ్చిన చాలా చిత్రాల పాటలు వారినోట పాపులర్ అయినవి. ప్రజలకు కూడా మంచి వినోదం అందనారంభించింది. ఇలా ఎలాంటి అవాంతరమూ లేకుండా వారి కళా ప్రదర్శన సాగింది. ఆశ్చర్యమేమిటంటే 1947లో ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని ఆ తరువాత వాళ్ళు కనిపించకుండా పోయారు.

చరిత్రలో మూగ సాక్ష్యులు

అయితే, స్వాతంత్య్రం రాగానే వారు పాకిస్తాన్ వెళ్ళిపోయారని, వారికి విదేశీయులతో సంబంధాలుండటం వల్ల మరిన్ని ఘోరాలు హైదరాబాదులో జరుగుతాయని అప్పట్లో పుకార్లు రేగాయని చెబుతారు.

వీటిలోని నిజాలు ఎవరికీ తెలియవు గానీ ‘మూన్ మూన్ సిస్టర్స్’ అందించిన నృత్యగాన వినోదాలు మటుకు హైదరాబాదు చరిత్ర శకలాల్లో మూగగా, చరిత్రకారులకు పట్టకుండా ఉండిపోయాయనే చెప్పవచ్చు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article