ఈ ఛాయా చిత్రం చాలా మందికి తెలుసు. ప్రసిద్దమైనదే. తెలంగాణ జన జీవనానికి ప్రతీకగా కొందరి ఇండ్లలో కొలువైనది కూడా. సామాన్యుల స్వభావికతను నిదర్శనం. పైపైకి ఎగబాకకుండా ఉన్నదాంట్లో సంతృప్తికరమైన జీవితానికి దర్పణం కూడా. కానీ ఆమె గడప అలంకరణకు మరో పార్శ్వం ఉన్నది. అది ఒక అమ్మ ఎదిరిచూపు.
కందుకూరి రమేష్ బాబు
జీవితం బహు చిత్రమైనది. ఒక కోణం నుంచి చూస్తే మరొక కోణం కనపడదు.
ఈ చిత్రంలో ఉన్న లలితమ్మ పార్సిగుట్టలో ఉంటుంది. ఈ చిత్రం తీసి పదేళ్ళు అయి ఉంటుంది. 2014 లో దీన్ని మొదటిసారి ప్రదర్శించాను. ఆ తర్వాత అనేక ప్రదర్శనల్లో ఆమె చిత్రం ప్రధాన ఆకర్షణగా మారింది కూడా.
ఆ పోటో, ఆమె – చాలా మందికి పరిచితమే. అది సహజ సుందరమైన తెలంగాణ జీవితాన్నే కాదు, ఇక్కడి ఈస్తటిక్స్ ని కూడా ఎంతో గొప్పగా చెబుతుందని ఎందరో అన్నారు. ఆర్థిక పరిస్థితి గొప్పగా లేకపోయినా ఇంటిని, మనసును శుభ్రంగా అందంగా ఉంచుకోగల మనుషులకు అది ప్రతిబింబం అని కూడా మరికొందరు అన్నారు. ఏమైనా ఈ చిత్రం ఒక శుభప్రదంగా మారింది. సామాన్యశాస్త్రం తాత్వికతకు అచ్చమైన ఉదాహరణగా నిలిచింది. ఐతే, ఈ చిత్రం ఒక వేచి చూపుకు నిదర్శనం. అలాగే ఒక ఆహ్వానానికి సూచిక కూడా అన్నది నాకూ ఆమెకే తెలుసు. నేడు మాతృ దినోత్సవం సందర్భంగా ఆ సంగతి మీతో పంచుకోవడం సబబు.
ఒక రోజు ఎప్పట్లాగే షాపుకు బయల్దేరాడట. ‘వెళ్లొస్తానమ్మా…’ అన్నాడట. వెళ్లాడుగానీ మళ్లీ రాలేదట.
లలితమ్మ తలిగారిది బోరబండ. ఆమె పెనిమిటి బొమ్మోజు కృష్ణ, వారిది కౌకూరు. వారికి దాదాపు 55 ఏండ్ల కింద పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. వాళ్లది విశ్వకర్మల కుటుంబం. కానీ భర్త ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడట.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. తొలి కానుపు మలికానుపూ మగబిడ్డలే. కానీ చిన్నవాడు ఐదేళ్ల వయసులోనే మరణించాడు. ‘చెబితే అదో కథ.’ పెద్దవాడిదీ ఇంకో కథ. అతడు బాలాచారి. ముద్దు పేరు రాజు. అతడు నూనూగు మీసాల ప్రాయంలో ఇంట్లోంచి వెళ్లిపోయాడట. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర షాపు పెట్టుకున్నాడట. అవుసుల పనే. కానీ, ఒక రోజు ఎప్పట్లాగే షాపుకు బయల్దేరాడట. ‘వెళ్లొస్తానమ్మా…’ అన్నాడట. వెళ్లాడుగానీ మళ్లీ రాలేదట.
దాన్ని పోగొట్టుకోవడం అంటే వాడిని పూర్తిగా వదులుకోవడం అన్నట్టు దాచుకుందది.
‘ఆ రోజు బుధవారం. దశమి’ క్యాలెండర్ చూపుతూ చెప్పిందామె. ఆ క్యాలెండర్ ని కొడుకు ఇష్టంగా ఇంటికి తెచ్చిండట. దాన్ని పోగొట్టుకోవడం అంటే వాడిని పూర్తిగా వదులుకోవడం అన్నట్టు దాచుకుందది.
‘వాడు వెళ్లింది 2003 పదకొండో నెల 19 వ తారీఖు’ అని కూడా అంది. ‘అమ్మా నేనెళ్లొస్తానమ్మా’ అన్నాడట. ‘సరే నాన్నా..’ అందట. ‘ఇంతవరకూ తిరిగి రాలేదు. అతడు వెళ్లిపోయి దాదాపు పద్దెనిమిది ఎండ్లు ఐంది. ఎక్కడున్నాడో తెలియదు. భర్త చనిపోయాడు మధ్యలో.
తెలిస్తే గానీ ఒక చిత్రం వ్యక్తిగత రచన కాదు. తెలియక పోతే అది సాంఘిక రచన. సాంస్కృతిక ధార కూడా.
ఈ ఫోటోలో ఆమె గడపకు ఎంతో శ్రద్దగా ముగ్గులు పెట్టడంలో మిగిలిన ఒక్క కొడుకైనా ఇంటికి రావాలన్న తాపత్రయం ఉన్నది. అదే అసలు చిత్రానికి మూలం. కానీ తెలిస్తే గానీ ఒక చిత్రం వ్యక్తిగత రచన కాదు. తెలియక పోతే అది సాంఘిక రచన. సాంస్కృతిక ధార కూడా.
ఇంతకీ కొడుకు ఎందుకు పోయింటాడు? అని అడిగాను. అలా అడిగింది కూడా పై పోటో తీశాకే. నిజానికి ఆమె రోజూ గడప వద్ద శ్రద్దగా ముగ్గు పెట్టడం చూసి చూసి ఒక రోజు చిత్రించాను తప్ప ఈ గతం నాకు ఆలస్యంగానే తెలిసింది. తెలిసిన తర్వాత అ ఫోటో రెండు విధాలా విలువైనది ఐంది. వైయుక్తికంగా సామాజికంగా.
‘ఎప్పటికైనా వాడొస్తే చాలు చాలు ‘అని బాలాచారి ఫొటో ఒకటి నా చేతిలో పెట్టింది. అది ఇదే.
కారణం చెప్పిందామె. ‘వాళ్ల నాన్న సరిగా ఉండేటోడు కాదని. కష్టం చేయకపోవునట. వాడిని కూడా సరిగ్గా చేయనివ్వకపోవునట. తనని బాధపెట్టేటోడు. అది చూసి వాడు చాలా బాధపడేటోడట. “ఆ బాధతోనే పోయిండనుకుంటను'” అంది లలితమ్మ.
‘ఎప్పటికైనా వాడొస్తే చాలు చాలు ‘అని బాలాచారి ఫొటో ఒకటి నా చేతిలో పెట్టింది. అది ఇదే.
అప్పుడప్పుడూ చారి అనేవాడట. ‘నేను బాగా సంపాదిస్తానమ్మా’ అని. ‘సంపాదించి నిన్ను బాగా చూసుకుంటానమ్మా” అని! ‘ఒంటరిగా ఫీల్ కావద్ద’ని కూడా చెప్పేవాడట. అందుకే వెళ్లాడా అని తనలో తాను అనుకుంటూ ఉంటుందామె. ఇప్పటికీ.
‘కంటి పొర’ వస్తే ఒకాయన ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్లో చేర్పించి ఆపరేషన్ చేపించాడు. చూపు అవసరం తనకు. ఎందుకో మల్లీ చెప్పనవసరం లేదు కదా.
గుండె దిటవు చేసుకుని బ్రతుకుతున్న లలితమ్మ సదా ఆశాజీవి. ఆ ‘కడప’ను కడిగి అలకరించడంలో ఆమెకు ఒక శాంతి ఉంది. అన్నట్టు, ఆ ఇంటిని ఈ మధ్యే రిపేర్ చేసుకుంది. అంతేకాదు, ‘కంటి పొర’ వస్తే ఒకాయన ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్లో చేర్పించి ఆపరేషన్ చేపించాడు. చూపు అవసరం తనకు. ఎందుకో మల్లీ చెప్పనవసరం లేదు కదా. కొడుకును ఎక్కడున్న పోల్చుకోవడం ఆ తల్లికి అత్యంత ముఖ్యం.
లలితమ్మా. నీ మాతృ హృదయానికి వందనం. అశాంతికి గురి కాకుండా వేచి ఉన్న నీ మనసుకు మొక్కాలి. నీ కొడుకూ ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు
లలితమ్మ చిరునామా : ఇంటి నం. 1-6-174/a/10. మొరం బొంద, బాపూజీ నగర్, ముషీరాబాద్, హైదరాబాద్. తెలంగాణ