Editorial

Monday, December 23, 2024
ARTSనిత్య పథికుడి నిరంతర సంభాషణ - జయధీర్ తిరుమలరావు తొవ్వ ముచ్చట్లు : ఎ. కె....

నిత్య పథికుడి నిరంతర సంభాషణ – జయధీర్ తిరుమలరావు తొవ్వ ముచ్చట్లు : ఎ. కె. ప్రభాకర్

‘నిత్య పథికుడు – నిరంతర సంభాషణ’ ముందుమాట. ఇది జయధీర్ తిరుమలరావు ‘తొవ్వ ముచ్చట్లు’ గ్రంధం ఏడవ భాగానికి సవివరమైన ముందు మాట.

ఎ. కె. ప్రభాకర్

సంభాషణ వొక కళ. సంచారం వొక తాత్త్వికత. ఈ రెండిటి మేలిమి మేళవింపే జయధీర్ తిరుమలరావు చెప్పిన తొవ్వ ముచ్చట్లు.

దాదాపు ఏడు సంవత్సరాలపాటు (2011 – 2018) నిరంతరాయంగా ఆంధ్రభూమి దిన పత్రికలో కాలమ్ గా వచ్చిన తొవ్వ ముచ్చట్లు రెండు రాష్ట్రాల్లోని అశేష పాఠకుల ఆదరణ పొందడానికి కారణం కళాత్మకతని జోడించుకున్న జీవన తాత్త్వికత వాటిలో తొణికిసలాడటమే.

తొవ్వ ముచ్చట్లు రూపంలో సారంలో విశిష్టమైనవీ విలక్షణమైనవీ. అవి అందించిన సాంస్కృతిక చేతన సామాజిక అవగాహన రాజకీయ జ్ఞానం అనన్య సామాన్యం. సమాజంలో పాతుకుపోయిన విలువలపై తొవ్వ ముచ్చట్లు పెట్టిన విమర్శ లోతైనది. ప్రజా పునాదిగా నిర్మాణం కావాల్సిన విశాల ప్రజా వుద్యమాలు నడుస్తున్న దారులపై సైద్ధాంతిక ప్రమేయాలపై ప్రసరించిన కాంతి అమేయం. అయితే సమూహాల్లో మనుషుల మధ్య బహుముఖీనంగా వుండాల్సిన సంభాషణలు వొంటరి స్వగతాలుగానూ అనేక మార్గాల్లో నడవాల్సిన సంచారాలు యిరుకు గదుల్లోకి, చీకటి దారుల్లోకి కుదించుకుపోవడం యిటీవలి సామాజిక విషాదం. దీన్ని అధిగమించాల్సిన సందర్భంలోనే తొవ్వ ముచ్చట్లు ఏడో భాగం మన ముందుకు వస్తోంది. సమాజంలో మనుషుల మధ్య సమూహాల మధ్య సౌహార్ద సంభాషణ కొనసాగించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.

ఆకాశహర్మ్యాల్లో కూర్చొని దంత సౌధాల్లో పవ్వళించి రాత కోతలు నెరపే భద్రజీవులకు భిన్నంగా అనేక సంక్షోభాల మధ్య ఆందోళన జీవిగా తిరుమలరావు ప్రజాక్షేత్రంలో వొట్టి మట్టి కాళ్లతో సంచరించారు.

అసమ సమాజంలో కలవాల్సిన తొవ్వలు బహుధా చీలిపోతున్న చోట, మనుషులు సంబంధాల్ని తెంచుకొని అనేకులుగా విడిపోతున్నప్పుడు సంభాషణలకు వుపక్రమించడం కష్టమే. ఉపక్రమించినా కొనసాగించడం మరింత కష్టం. సంభాషణలు కొనసాగాలంటే హృదయద్వారాల్ని తెరచి వుంచుకోవాలి. సానుకూల దృక్పథం పెంచుకోవాలి. లోపలి ఆలోచనలు పంచుకోవాలి. ప్రజాస్వామిక స్థలాల్ని నిర్మించుకోవాలి. పాతుకుపోయిన ఆభిజాత్యాలనీ ఆధిపత్యాలనీ వదులుకోవాలి. ముఖాలకు తొడుక్కున్న అసహజమైన మాస్కుల్ని తొలగించుకోవాలి. ఎదుటివారి అభిప్రాయాల ప్రకటనకు వెసులుబాటు యివ్వాలి. ప్రకటించిన వాటికి విలువ యివ్వాలి. అసహనం గోడల్ని అధిగమించాలి. కృత్రిమ భేషజాలు మానుకోవాలి. అర్ధ సత్యాల్ని అంతం చేయాలి. తెచ్చిపెట్టుకున్న కుహనా సంస్కారాన్ని పాతిపెట్టాలి. వైషమ్యం కంచెల్ని తగలబెట్టాలి. ఒంటెత్తు పోకడని పూనికతో పక్కన పెట్టాలి. భావజాలపరమైన డాగ్మాని విడిచిపెట్టాలి. పిడివాదాలు మానుకొని సరిదిద్దుకోడానికి సిద్ధంగా వుండాలి. ‘స్వకీయత’ కేంద్రాన్ని బద్దలుకొట్టాలి.

ఇదంతా వ్యక్తుల మధ్యే కాదు నిర్మాణాల బయటా లోపలా అనివార్యంగా జరగాల్సిన నిరంతర ప్రక్రియ/ ప్రయోగం అన్న బలమైన నమ్మికలోంచి వెలువడ్డ కాలిక రచనలే జయధీర్ తొవ్వముచ్చట్లు. వీటిని తొలి భాగం నుంచి యీ చివరి యేడోభాగం వరకూ అధ్యయనం చేస్తే యీ విషయం అర్థమౌతుంది.

జానపద క్షేత్ర పర్యటన అనుభవాలను గుది గుచ్చటంగా మొదలైన తొవ్వ ముచ్చట్లు తర్వాతి కాలంలో తమ పరిధిని విస్తరించుకున్నాయి. ప్రజల గుండె చప్పుడుకి యీ కాలమ్ పర్యాయపదమైంది. విస్మృత ప్రజా శ్రేణుల ఆకాంక్షలకు చెరగని చిరునామా అయింది. సమకాలీన రాజకీయాలకు భాష్యంగా రూపొందింది. అకడమిక్ రంగంలో సంచలనం సృష్టించింది. పత్రికలో వొక కాలిక శీర్షిక అన్ని రంగాలకు వ్యాపించటం ఇంతకుముందు జరగలేదు. రాజకీయ క్షేత్రంలోనే కాదు పరిశోధన క్షేత్రాల్లో విద్యారంగంలో ఆకాశహర్మ్యాల్లో కూర్చొని దంత సౌధాల్లో పవ్వళించి రాత కోతలు నెరపే భద్రజీవులకు భిన్నంగా అనేక సంక్షోభాల మధ్య ఆందోళన జీవిగా తిరుమలరావు ప్రజాక్షేత్రంలో వొట్టి మట్టి కాళ్లతో సంచరించారు. ఆ కారణంగా తొవ్వ ముచ్చట్లు తొలినాళ్లలో యెక్కువ భాగం సాంస్కృతికోద్యమం కేంద్రంగా సాగినప్పటికీ రాను రానూ సమకాలీన ఆర్ధిక సామాజిక రాజకీయాంశాలెన్నో వాటిలో వచ్చి చేరాయి. లేదా అవే తమను రాయమని రచయితను డిమాండ్ చేసి వుంటాయి. ఆ విధంగా యీ రచన cultural politics ఆధ్యయనానికి వినూత్న విధానాన్నీ నిర్వచనాన్నీ నిర్దేశించింది, కొత్త దారులు పరచింది.

శత్రువుని గుర్తించడంలోనే మన తడబాటు. మిత్రులతో చేయి కలపడం దగ్గరే సంకోచం. ఐక్య సంఘటన సాకారం కాకముందే కీచులాట. వీటన్నిటికీ కారణం వ్యక్తివాదమే అని తిరుమలరావు అభిప్రాయపడుతున్నారు.

స్థూలంగా తొవ్వ ముచ్చట్లు వొక కల్చరల్ యాక్టీవిస్ట్ డైరీ అని నిర్ధారణ చేయవచ్చు. అందుకే భాషావరణం నుంచి పర్యావరణం వరకు ప్రతి సామాజిక సమస్య జయధీర్ రాతలో వొడవని ముచ్చటగా రూపొందింది. ఈ వైవిధ్యమే ఆరు భాగాల్లోనూ కనిపించినప్పటికీ యేడో భాగంలో అది మరింత విస్తృతమైంది. ఆ క్రమంలోనే ప్రజా సంస్కృతికీ రాజకీయాలకీ మధ్య వుండే సంబంధం బలంగా చర్చకు వచ్చింది. పార్లమెంటరీ రాజకీయాల స్థానంలో ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాల గురించిన ఆలోచనలు యిందులో యెక్కువగా చోటుచేసుకున్నాయి. ఏది ప్రత్యామ్నాయం అన్న దగ్గర మొదలైన ఆ ఆలోచనలు రాజ్యాధికారం కోసం పీడిత ప్రజా శ్రేణుల మధ్య ఐక్యత అవసరం అన్న దగ్గరకు చేరుకున్నాయి.

ప్రత్యామ్యాయ రాజకీయ సాంస్కృతిక అవసరాలు వాటిలోని వైరుధ్యాలు, వుద్యమాల ఆచరణలో ఘర్షణ – ఐక్యత సూత్రాలు వంటి యెన్నో దృగంశాలు ముచ్చట్లకు భూమిక అయ్యాయి. ప్రగతిశీల వుద్యమాల గమనం గమ్యం కార్యాచరణ అన్నీ ప్రజా కేంద్రకంగా వుండాలి అని తిరుమలరావు తొవ్వ పొడవునా చేసిన ప్రయాణంలో ప్రతిపాదిస్తూనే వున్నారు. ప్రత్యామ్నాయం కోసం పోరాడే శక్తులన్నీ వొక గొడుగు కిందకు రావాలి అని ఆయన ఆశ. ఆ ఆశయంతోనే –

‘సాంస్కృతిక ప్రత్యామ్నాయం ఏర్పడకపోతే రాజకీయ ప్రత్యామ్నాయం రూపొందజాలదు. భావసారూప్యత సాంస్కృతిక ఏకీకరణ దిశగా అడుగులు పడాలి. ఐక్యత సాధ్యం కాకపొతే సమాజం యథాతథంగా ఉండిపోతుంది. యథాతథ స్థితిలో బలం ఎప్పుడూ బూర్జువా శక్తులదే.’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.

‘ప్రత్యామ్నాయ శక్తుల అనైక్యత ప్రజలలో చీలికలనే కాదు, వాటిని శత్రు శిబిరానికి తరిమేట్లు చేస్తున్నాయని గ్రహించాల’ని హెచ్చరించారు.

‘మార్క్సిజం సిద్ధాంతపరంగా గొప్పదైనప్పటికీ అది బ్రాహ్మణీయ నేతల చేతుల్లో అభాసుపాలై విప్లవ గుడారాలలో పరాభవింపబడింది’ ఇది జయధీర్ పరిశీలనలో ప్రముఖంగా పదే పదే ప్రస్తావనకు వచ్చిన అంశం.

‘శకలవాదం నుంచి విముక్తి చెందితేనే ప్రత్యామ్నాయ ఏకైక శక్తికి స్థానం లభిస్తుంది.’ అని తీర్మానించారు.

అయితే శత్రువుని గుర్తించడంలోనే మన తడబాటు. మిత్రులతో చేయి కలపడం దగ్గరే సంకోచం. శకలాలను కూడగట్టటం దగ్గరే సంశయం. భావ సారూప్యతని నిర్వచించడంలోనే మీనమేషాల లెక్కింపు. ఐక్య సంఘటన సాకారం కాకముందే కీచులాట. వీటన్నిటికీ కారణం వ్యక్తివాదమే అని తిరుమలరావు అభిప్రాయపడుతున్నారు. దీనికి కొనసాగింపుగా ప్రగతిశీల శిబిరాల్లో, వాటి బయట అస్తిత్వవాద రాజకీయాల్లో చెలామణిలో వున్న భిన్న భావజాలాల గురించి, ఆచరణల గురించి చేసిన నిశితమైన పరిశీలనలు, నిక్కచ్చైన సూత్రీకరణలు, సున్నితమైన ప్రతిపాదనలు ప్రత్యేకంగా గమనించాల్సినవి. బుద్ధిజీవుల మెదడుకి అవి పనిపెడతాయి. గ్రాస్ రూట్స్ లో పనిచేసే కార్యకర్తలకి నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్నిస్తాయి.

‘రాబోయే కాలంలో రాజకీయాలు ‘ఓట్లు మావి సీట్లు మీవా?’ అన్న నినాదం కేంద్రంగా జరగనున్నాయి. అంబేద్కర్ కాన్షీరాం భావజాలం దేశ భవితవ్యానికి కొత్త ప్రణాళిక ఇచ్చింది. కానీ అనతికాలంలోనే ఒడిదుడుకులకు లోనైంది’ అని భావించారు. అందువల్ల –

‘ఓటు ప్రాతిపదికన కాకుండా నూతన మానవుడిని రూపొందించుకునే విముక్తి ఆలోచన ముఖ్యం’ అని ఖండితంగా ప్రకటించారు. అయితే నూతన మానవ ఆవిష్కరణ దిశగా జరిగే ప్రయత్నాల్ని, వాటిలోని వైరుధ్యాల్ని విమర్శనాత్మకంగా పరిశీలించారు.

రాజకీయ పోరాటాలకు ద్వితీయ స్థానం యిచ్చి సాంస్కృతిక పోరాటాల ద్వారా భావజాల రంగంలో సమూలమైన మార్పులు రావాలి. మొత్తం తొవ్వ ముచ్చట్ల అంతస్సారం యిదేనని చెప్పినా తప్పుకాదేమో!

‘మార్క్సిజం సిద్ధాంతపరంగా గొప్పదైనప్పటికీ ఆచరణలో దారుణంగా వెనకబడింది. బ్రాహ్మణీయ నేతల చేతుల్లో అభాసుపాలైంది. విప్లవ గుడారాలలో మార్క్సిజం పరాభవింపబడింది. అగ్ర వర్ణ వర్గ నాయకుల నియంతృత్వం పెత్తందారీ పోకడలు ఎక్కువయ్యాయి.’ ఇది జయధీర్ పరిశీలనలో ప్రముఖంగా పదే పదే ప్రస్తావనకు వచ్చిన అంశం. అయితే అదే సమయంలో ప్రజా శ్రేణుల ఐక్యతకి ఆటంకంగా వున్న అనేక సంక్లిష్టతల్ని ఆయన గమనించారు.

‘ప్రజాశక్తులకి ఐక్యత పెద్ద సమస్య. శత్రుపూరిత వైఖరి హెచ్చింది. ఎన్జీవోయిజం దళిత బహుజనుల మధ్య బహుజన కులాల మధ్య ఐక్యతకు భంగం కలిగించే కుటిల యత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వమే ఎన్జీవోగా మారింది. కుల చైతన్యం విడిపోవడానికి దినుసైంది.’

విడిపోడానికి దినుసైన వర్గ కుల సమస్యని అధిగమించడానికి తిరుమలరావు కొన్ని సూచనలు చేశారు.

ఒక క్రమంలో యీ వ్యాఖ్యల్ని గమనిస్తే రాజకీయ పోరాటాలకు ద్వితీయ స్థానం యిచ్చి సాంస్కృతిక పోరాటాల ద్వారా భావజాల రంగంలో సమూలమైన మార్పులు రావాలని జయధీర్ ఆకాంక్షించినట్టు తెలుస్తుంది. మొత్తం తొవ్వ ముచ్చట్ల అంతస్సారం యిదేనని చెప్పినా తప్పుకాదేమో!

‘దేశంలో జన సమీకరణ రాజ్యాధికారం దిశగా జరగాలి. ఎవరైతే సరైన సైద్ధాంతిక చట్రం నిర్మిస్తారో దానిని కాలానుగుణంగా ఆచరణలో పాటిస్తారో త్యాగాలు చేసి జీవితాలను పణంగా పెడతారో నలుగురిని కలుపుకుని రాబోయే రోజుల్లో శత్రువులకి ప్రలోభాలకి లోనుగాకుండా ఉంటారో ఆ బృందమే నాయకత్వం వహించడానికి అర్హత సాధిస్తుంది. రాజకీయ పోరాటానికి ముందు సాంస్కృతిక పోరాటాలని నిర్మించి సాంస్కృతిక కుల హెచ్చు తగ్గుల్ని నిర్మూలించుకొని ముందుకు పోవాలి. యుగాలుగా బాధితులకు ప్రాధాన్యం యివ్వాలి. వారిలో నాయకుల్ని తయారు చేసుకోడానికి దీర్ఘ కాలిక ఆలోచన ఉండాలి. అదే నిజమైన సామాజిక న్యాయం పునాది. భావజాల నిర్మాణం ప్రజా సంస్కృతి నుంచి రూపొందాలి.’

తొవ్వ ముచ్చట్లని అధ్యయనం చేసేటప్పుడు వాటి చారిత్రికతని ప్రధానంగా గమనంలోకి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం యేర్పాటుకు ముందు – తర్వాత అన్న వొక కాలరేఖ పైన నిలిపి వాటిని చూడాలి. తెలుగు వారి వుమ్మడి సాంస్కృతిక వారసత్వంతో పాటు ప్రాంతాల మధ్య వున్న వైవిధ్యాన్ని సైతం నిశితంగా సూక్ష్మంగా పరిశీలించిన మౌలికమైన ఆలోచనలెన్నో యిటీవలి ముచ్చట్లలో గమనిస్తాం. నిర్దిష్టత సాధారణీకరణల మధ్య చోటుచేసుకునే సంక్లిష్టతనీ ఘర్షణనీ జయధీర్ గతితార్కికంగా అంచనాకట్టారు. అయినప్పటికీ రెండు రాష్ట్రాలు యేర్పడ్డ తర్వాత ఆయన ఆలోచనలు తెలంగాణ వికాసం మీద యెక్కువ కేంద్రీకృతమైనట్లు అనిపిస్తుంది.

సబ్బండ వర్ణాలకు చెందిన ప్రజా సముదాయాల జీవితాలతో ముడివడి వున్న భాషా సంస్కృతులకి సభలో చోటెక్కడ? … యిలా సభల నిర్వాహకులకు జయధీర్ సంధించిన అనేక ప్రశ్నలకు వారి వద్ద జవాబులు లేక తెల్లమొగం వేశారు.

మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో యుద్ధోత్సాహంతో కదం తొక్కిన కళా సాహిత్యాలు ప్రత్యేక రాష్ట్రం యేర్పడ్డాక యెందుకు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి అని ప్రశ్నిస్తూ, వొకనాడు కళారంగం యెంత బలంగా వుందో చెప్పారు. రచయితల సంస్థలు నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు ర్యాలీలు ధర్నాలు ఉద్యమ సాహిత్యానికి మండే గుణం అందించాయనీ, ఆ కాక కవిత్వంలోకే గాక వచనంలోకి కూడా ప్రవహించిందనీ ప్రతి నినాదం వొక సామెతగా రూపొంది గోడల పైకి యెక్కింది అనీ నిరూపించారు. అంత బలంగా కవిత్వం చెప్పిన కవులూ కళాకారులూ ఆటగాళ్ళూ పాటగాళ్లూ పాలకుల ముందు దాసోహం అన్న ప్రస్తుత విషాద సందర్భాన్ని తీవ్రంగా నిరసించారు.

తెలంగాణ రాష్ట్రం యేర్పడ్డాక వొక మహా సంరభంతో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు భాషా విషయికంగా యెన్నో వివాదాంశాలు చర్చకు వచ్చాయి. ఆంధ్రం – తెలుగు యీ రెండూ జాతి పరంగా, భాషా పరంగా వేరా? తెలంగాణకు ప్రత్యేకమైన తెలంగాణ భాష ఉందా? ఉంటే అది యే విధంగా విభిన్నమైనది? పాలకులు రాష్ట్రోద్యమ సమయంలో చేసిన వుద్వేగభరితమైన వుపన్యాసాలు సూత్రీకరణలు ప్రతిపాదనలు యెలా మర్చిపోయారు? మహాసభల సందర్భంగా యే భావజాలానికి, యే ప్రక్రియలకి చెందిన కవి పండితులు గుర్తింపు పొంది వేదికను అలంకరిస్తున్నారు? ప్రజా సమూహాల కలలు ఆకాంక్షలు యేమయ్యాయి? కోట్లాది ప్రజాధనం వెచ్చించి ఆర్భాటంగా జరిపే సభల్లో ప్రజల ప్రమేయం యెంత – వారి స్థానం యేమిటి? సబ్బండ వర్ణాలకు చెందిన ప్రజా సముదాయాల జీవితాలతో ముడివడి వున్న భాషా సంస్కృతులకి సభలో చోటెక్కడ? … యిలా సభల నిర్వాహకులకు జయధీర్ సంధించిన అనేక ప్రశ్నలకు వారి వద్ద జవాబులు లేక తెల్లమొగం వేశారు.

అలాగే ట్రంప్ కూతురు ఇవాంక తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన సందర్భంగా యేర్పాటుచేసిన పారిశ్రామికవేత్తల సమావేశంలో భాగం వహించిన మహిళలు యెవరు – వారు యే వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు – రాష్ట్ర ప్రగతికి వాళ్ళు యెలా తోడ్పడగలరు – ఒక దేశపు పారిశ్రామికవేత్తకు ఆ దేశ అధ్యక్షుని స్థాయిలో అతిథ్యం యెలా యిస్తారు … అని యెన్నో ప్రశ్నలు లేవనెత్తారు. సమాధానాలు యివ్వడానికి నేతలు నీళ్లు నమిలారు.

రామప్ప పై రాసిన ముచ్చట్లు చదువుతుంటే ఆలయ ప్రాంగణంలో వేలాది దీపాల వెలుగులో కవులు రచయితలు కళాకారులు మేధావులు చేతులుగట్టి ధూలా ఆడిన దృశ్యమే కళ్ళముందు కదులుతుంది.

రామప్ప గుడి కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో యిటీవల గుర్తించినప్పుడు ప్రజలు, పాలకులు పండగ చేసుకున్నారు. కానీ ఆ విజయం వెనక జయధీర్ నేతృత్వంలో రామప్ప పరిరక్షణ కమిటీ చేసిన కృషి అనన్యమైనది. ఉమ్మడి రాష్ట్రంలో దేవాదుల ప్రాజెక్టు సొరంగం తవ్వకాల కారణంగా ఆ కట్టడాలకు వాటిల్లిన ముప్పుని నివారించడానికి ఆయన గొప్ప వుద్యమం నిర్మించారు. జనాన్ని కూడగట్టి సభలు సదస్సులు ర్యాలీలు నిర్వహించారు. గుడి ఆవరణలో దీపాలు వెలిగించారు. సొంత రాష్ట్రంలో శైవ వైష్ణవ క్షేత్రాల మధ్య ప్రాధాన్య వివక్షలో యాదాద్రికి దక్కిన వైభవం రామప్పకు దక్కలేదు. కానీ అప్పుడు ఆయన పూనిక వల్లే రామప్ప కట్టడాలు నిలబడ్డాయని పాలంపేట ప్రజలు యిప్పటికీ కృతజ్ఞత ప్రకటిస్తారు. రామప్ప పై రాసిన ముచ్చట్లు చదువుతుంటే ఆలయ ప్రాంగణంలో వేలాది దీపాల వెలుగులో కవులు రచయితలు కళాకారులు మేధావులు చేతులుగట్టి ధూలా ఆడిన దృశ్యమే కళ్ళముందు కదులుతుంది.

గోండి లిపి పరిరక్షణ గురించి యింతకు ముందటి సంపుటుల్లో చాలా సార్లు ప్రస్తావించినప్పటికీ యీ సంపుటిలో గుంజాల లిపిలో గోండి సాహిత్యాన్నీ, సంస్కృతినీ కాపాడుకుంటూ వస్తున్న 90 యేళ్ళ వృద్ధుడు కోట్నక్ జంగు గుండెపై మొలిచిన కణితిని చూసి బెంగటిల్లారు. ఇంటింటికీ నల్లా యిస్తామని పాలకులు చేసిన వాగ్దానాలు నీటి మీది రాతలైన కారణంగా గోండి గూడేలు కిడ్నీ రోగాల బారిన పడుతున్నాయని కలత చెందారు. వారికి వైద్యం అందించడం, ప్రజల అనారోగ్యాలు గోండి నిఘంటువు వాచకాల నిర్మాణానికి ఆటంకంగా పరిణమించడం, మధ్య దేశంలో విశాల భూభాగంలో అతి పురాతనమైన ఆదివాసీ భాషని పరిరక్షించడంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం, స్థానిక భాషల్ని చంపేయడం ద్వారా జాతుల పరాయీకరణని వేగవంతం చేసే అత్యాధునిక సామ్రాజ్యవాదం బలపడటం … మొదలైన అనేక విషయాల్ని కోల్లెజ్ చేస్తూ రాసిన ముచ్చట గద్దె మీద కూర్చున్నవాళ్ళకి కనువిప్పు కలిగిస్తుంది.

అలాగే మేడారం సమ్మక్క సారక్కల చరిత్రను పుక్కిట పట్టిన కోయ డోలీల మౌఖిక కథల్ని, పాటల్ని, పగిడెల ద్వారా తెలిసే చరిత్రని వెలికి తీశారు. కోయల్ని ఆశ్రయించి జీవించే కళాకారులు డోలీల అస్తిత్వం ప్రశ్నార్థకమై ఆ జాతి చరిత్ర సంస్కృతి మరుగున పడి నశించిపోయే ప్రమాదం గురించి హెచ్చరించారు. కాకతీయ సామ్రాజ్య చరిత్రని, కోయ రాజుల చరిత్రని సమాంతరంగా అధ్యయనం చేస్తూ బాధితుల పాలకుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణని కొత్త కోణాల్లోంచి ఆవిష్కరించారు.

బంజారా జాతి తమ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకోడానికి చేపట్టవలసిన చర్యల్ని తిరుమలరావు యెంతో మృదువుగా సహానుభూతితో సూచించారు. ఆ సందర్భంలో సిక్కుల బంజారాల ఐక్యత అవసరాన్ని ప్రస్తావించడం గమనార్హం.

రామ్మోహన్ రాయ్ వీరేశలింగాల కంటే ముందే తెలుగు నేల మీద జన్మించిన బంజారా తొలి దేశీ సంస్కర్త సేవాలాల్. అయితే నేటి బంజారా యువత సేవాలాల్ బోధలకు యెడమై సాంస్కృతికంగా పరాయీకరణకు గురౌతున్నారు. మూలాలకు దూరం అవుతున్నారు. బంజారా జాతి తమ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకోడానికి చేపట్టవలసిన చర్యల్ని తిరుమలరావు యెంతో మృదువుగా సహానుభూతితో సూచించారు. ఆ సందర్భంలో సిక్కుల బంజారాల ఐక్యత అవసరాన్ని ప్రస్తావించడం గమనార్హం.

వట్టికోట గతం కాదు; వర్తమానం – అని ప్రకటించి ఆయన పేరున ప్రభుత్వం పంచే అవార్డుల తాయిలాలకి యెగబడే సాహిత్యకారుల తీరుని తిరుమలరావు యెండగట్టారు. ఆ పుస్తక ఆయుధధారి సాంస్కృతిక పోరాట వారసత్వం కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ రచన ప్రచురణ రంగాలు ఆళ్వారుస్వామి ఆచరణ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాల్ని గుర్తుచేశారు.

నక్క సురేష్ కవిత్వాన్ని పరామర్శించే నెపంతో ప్రజలకు చేరువకాలేని వచన కవిత రూపం గురించి ప్రస్తావించారు. గత దశాబ్దంలో నిప్పులా వెలిగిన కవిత్వం యిప్పుడు పాలకుల అనుగ్రహం కోసం నిరీక్షిస్తోంది – సన్మానాల కోసం సేవల కోసం వెంపర్లాడుతుంది అని బాధపడ్డారు. ఆ సందర్భంలో కవిత్వ/సాహిత్య ప్రయోజనం గురించి సూక్ష్మంగా వివేచన చేశారు. మునాసు వెంకట్ రచనలు ఎన, మొగి, వర్జీ, మెద మొదలైన రచనల్లోని భాష నిఘంటువులకు యెక్కని ఉత్పత్తి కులాల భాష అనీ అది కృతక మాండలికం కాదనీ చెబుతూనే శిష్టభాష కోస్తా భాషల ఆధిపత్యం నుంచి బయటపడటానికి ప్రత్యేక తెలంగాణ రాజకీయ పరిష్కారం కాదన్న వెంకట్ అభిప్రాయాన్ని చర్చకు పెట్టారు. దళిత జీవన వాస్తవికతతో ముడివడి ఉన్న భాషే వెంకట్ కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిందని తీర్మానించారు. శేషాద్రి రమణ కవుల ‘ నైజాం రాష్ట్ర ప్రశంస’, దాసరి శ్రీనివాసులు ‘ఇప్పచెట్టు నీడలో’, డా. బి రాజగోపాలరావు ‘అర్ధాంగి దేవో భవ …’’ కటుకోజ్జ్వల రమేష్ ‘అగ్నిశిఖ’ పుస్తకాల్లోని ప్రత్యేకతల్ని పరిచయం చేస్తూ చెప్పిన ముచ్చట్లు ప్రత్యేకంగా పరిశీలించాలి.

ఒక విషాదాంత జీవితాన్ని ఆధారం చేసుకుని కళకి – రాజ్యానికి – ప్రజలకు మధ్య వుండే సంబంధాన్ని చర్చకు పెట్టారు తిరుమలరావు.

కిన్నెర కళాకారిణి డక్కిలి బాలమ్మ పై చెప్పిన ‘చివరి కిన్నెర’ ముచ్చట ఆద్యంతం విషాదభరితం. తాండూరు చుట్టుపక్కల అంటరాని పల్లెల్లో వొకప్పుడు గుర్రమెక్కి రాణిలా కిన్నెరపై పాడుకుంటూ తిరిగిన సంగీత సామ్రాజ్ఞి జీవితం తర్వాతి కాలంలో యెంత దయనీయంగా మారిందో! ఆమె జీవితమే పెద్ద వీరగాథ. తోటి కళాకారులు పేదరికంలో వున్నప్పుడు వారిని ఆదుకోవడానికి చేతి కంకణం నడుంకు వున్న వడ్డాణం గుర్రం అమ్ముకున్న దయామయి ఆమె. చివరి దశలో పలకరించడానికి వెళ్ళినప్పుడు ‘ఆ పక్క మీ తెలంగాణలో…’ అని సాంస్కృతిక సరిహద్దు గీతల మధ్య నిలబడి చెప్పిన ఆమె మాటలు అట్టడుగు కులాల కళాకారులకు తెలుగు సమాజం యెంత దూరం వుందో తెలుసుకోవటానికి వుపయోగపడతాయి. భారతీయ కళా ప్రపంచం మొత్తం యిటువంటి విభజన రేఖలతో నిండి వుంది. ఒక విషాదాంత జీవితాన్ని ఆధారం చేసుకుని కళకి – రాజ్యానికి – ప్రజలకు మధ్య వుండే సంబంధాన్ని చర్చకు పెట్టారు తిరుమలరావు. అక్కడ ఆగిపోకుండా ఆయన దృష్టి పర్యావరణం వైపు మళ్ళింది. తాండూరు బండల వ్యాపారం కారణంగా దాని చుట్టుపక్కల నెలకొన్న పర్యావరణ విధ్వంసం ఆ ముచ్చటలో ప్రస్తావనకి వచ్చింది.

గాంధీ అంబేద్కర్ ల విగ్రహాలు ఊరూరా ప్రతి నాలుగు రోడ్ల కూడలిలో స్థాపించుకున్నాం. వారి ఆశయాలు భూస్థాపితం చేశాం. ఆలోచనలు వెనుకతట్టు బట్టి కేవలం బొమ్మలు మిగిలిపోవడమే విషాదం. మనుషుల కంటే విగ్రహాలు ముఖ్యమైన చోట వ్యక్తివాదం నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుంది. కొన్నాళ్ళకు బడులు ఆసుపత్రులు వుండవు, వందలాది అడుగుల యెత్తైన విగ్రహాలు వుంటాయి. విగ్రహారాధన అంటురోగం వామపక్షాల ప్రగతిశీల శిబిరాల్లోకి కూడా భీకరంగా పాకింది. మరోవైపు గాంధీ అంబేద్కర్ విగ్రహాల స్థానే శివాజీ సర్దార్ పటేల్ విగ్రహాలు వాడ వాడనా వెలుస్తున్నాయి. దేశభక్తికీ ఐక్యతకీ దృష్టంతాలుగా చెలామణి అవుతున్నాయి. కండలు తిరిగిన హనుమంతుడి భారీ విగ్రహాలు ఫాసిస్టుల క్రౌర్యానికి నిలువెత్తు ప్రతీకలుగా నిలబడి భయంగొల్పుతున్నాయి. గుండెల్లో భావజాలం ప్రతిష్ఠించుకోవాలి; విగ్రహాలను కాదు అనీ విగ్రహాలు జాతి సాంస్కృతిక దుర్బలత్వానికి ప్రతీకలు అనీ జయధీర్ బలంగా ప్రస్తావించారు. సినిమావాళ్ళ భారీ కట్ అవుట్ వ్యాపార సంస్కృతిని తిరస్కరించారు. విగ్రహ ప్రతిష్ఠాపన వున్నచోట విధ్వంసం కూడా వుంటుంది అన్నది చరిత్ర చెప్పిన పాఠం.

‘సాహిత్య చరిత్రలో విస్మృత అంశాలు’ కేవలం ముచ్చట్లుగా మిగిలి పోలేదు. అది వొక నికార్సైన పరిశోధనా వ్యాసంగా రూపొందింది. సమాంతర సాహిత్యం, సాహిత్య చరిత్ర నిర్మాణాలకి సంబంధించిన అనేక విషయాలు అందులో ప్రస్తావనకు వచ్చాయి. ఏది సమాంతరం అన్న చోట మొదలైన ఆ వ్యాసం అనేక ద్వంద్వాల మధ్య వున్న వైరుధ్యాలు, తారతమ్యాలు గుర్తించి వాటి మధ్య ఘర్షణలోనే చరిత్ర పుట్టినట్లు నిరూపించారు. ప్రజామూలాల నుంచి సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఆకారాలు, పరికరాలు వెతకాలని నిర్ధారించారు. ఆ నిర్ధారణల వెలుగులోనే పరిశోధకులు సమగ్రమైన సాహిత్య చరిత్రని పునర్నిర్మించుకోవాలి. ఖాళీలను పూరించుకోవాలి.

సాధారణంగా ‘చచ్చిన వాడి కళ్ళు చారడేసి’ అన్న విధంగా నివాళి వ్యాసాలు తయారవుతున్నాయి. మంచి చెడుల బేరీజుకు చావు సందర్భం కారాదని అప్రకటిత నియమం. కానీ తిరుమలరావు గారికి నివాళి వ్యాసాల పట్ల ప్రత్యేకమైన అభిప్రాయం వుంది. మరణం వ్యక్తిని అంచనా కట్టడానికి సరైన సందర్భమే అని ఆయన భావిస్తారు. యం టి ఖాన్, చేరా, దాశరథి రంగాచార్య, సినారెలు చనిపోయినప్పుడు రాసిన నివాళులు పక్కపక్కన పెట్టి చూసినప్పుడు జయధీర్ వారి సాహిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని, సామాజిక ఆచరణని అంచనా కట్టడంలో యెంత నిక్కచ్చిగా వున్నారో తెలుస్తుంది. అయినప్పటికీ సినారె విషయానికి వచ్చినప్పుడు ఆయనపై అభిమానం స్పష్టంగానే కనిపిస్తోంది. కవి సంస్మరణని రాజకీయ ప్రయోజనంతో ముడిపెట్టే పాలకవర్గ కాపట్యాన్ని సినారె నివాళిలో యెత్తిచూపారు.

రాజమండ్రిలో తిరుమలరావు గారు వున్నప్పుడు అక్కడి సమాజంలో కలిసిపోయారు. అక్కడి సాహిత్యకారులు ఆయనకి రాజమండ్రి పౌరసత్వం యిచ్చి ఆదరించారు. రాజమండ్రికి సంబంధించిన అనేక జ్ఞాపకాల్ని యీ ముచ్చట తవ్విపోసింది.

అలాగే విశ్వనాథ సత్యనారాయణ ఆత్మకథని ఆధారం చేసుకుని ఆయన్ని వొక కొత్త కోణం నుంచి అంచనా వేయడానికి జయధీర్ ప్రయత్నించారు. మౌఖిక సాహిత్యం పట్ల కళారూపాల పట్ల వాటి ప్రదర్శన పట్ల విశ్వనాథ దృక్పథం నుంచి ఆధునికులు చాలా నేర్చుకోవాలని ప్రతిపాదించారు. అయితే రూపం పట్ల విశ్వనాథకున్న అభిప్రాయాలు భావజాలపరంగా వున్న దృక్పథాన్ని మర్చిపోయేలా చేస్తాయా అన్నది ప్రశ్న.

మారుతున్న పాత్రికేయ విలువల గురించి విలువైన వ్యాసం యీ ముచ్చట్లలో చోటు చేసుకుంది. పత్రికలపై పత్రికల వార్తలపై నియంత్రణ విధిస్తున్న అదృశ్య శక్తుల్ని రచయిత అందులో దృశ్యమానం చేశారు. రాజకీయ పార్టీల, పార్టీల అధిపతుల ఆలోచనలకు ఆదేశాలకు అనుగుణంగా పత్రికలు నడుస్తున్నాయనీ భాషలో పత్రికా స్వేచ్ఛ అన్నది వొక నిరర్థక పదబంధమని మరోసారి నిరూపించారు.

‘రాజమండ్రి టు అప్పన్నపాలెం’ మరొక ఆసక్తికరమైన ముచ్చట. రాజమండ్రిలో తిరుమలరావు గారు వున్నప్పుడు అక్కడి సమాజంలో కలిసిపోయారు. అక్కడి సాహిత్యకారులు ఆయనకి రాజమండ్రి పౌరసత్వం యిచ్చి ఆదరించారు. రాజమండ్రికి సంబంధించిన అనేక జ్ఞాపకాల్ని యీ ముచ్చట తవ్విపోసింది. వీరేశలింగం నేదునూరి గంగాధరం మధునాపంతుల సత్యనారాయణ మల్లంపల్లి శరభయ్య పెండ్యాల కామేశ్వరరావు దగ్గర్నుంచి యెందరో సాహితీ వేత్తల సేవల్ని వుగ్గడిస్తూ ఇటీవలి చింతల గోపాలరావు సన్నిధానం శర్మ సూర్యవంశీ వంటి మిత్రుల నుంచి తాను పొందిన స్నేహ సౌరభాన్ని మనకు పంచుతారు. అంతవరకే చెబితే యీ ముచ్చట్లు అసంపూర్ణమే. ఆ సందర్భంలో కాళహస్తి తమ్మారావు కొండపల్లి వీర వెంకయ్య గొల్లపూడి గోదావరి బుక్ డిపో అద్దేపల్లి అండ్ కో … వంటి చిన్నా పెద్ద సంస్థలు ప్రచురించిన అనేక గుజిలీ పుస్తకాల గురించి యెన్నో పరిశోధనాత్మక అంశాల్ని కూడా యిందులో ప్రస్తావిస్తారు. గౌతమీ గ్రంధాలయంతో తనకున్న విడదీయరాని బంధాన్ని స్మరించుకుంటారు.

అప్పన్నపాలెం వెళ్లే దారిలో జగ్గంపేట రచయిత్రి కె వరలక్ష్మి గారి ప్రస్తావన ఆయన మర్చిపోలేదు. గత వర్తమానాలు మేళవిస్తూ, అక్కడి సాహిత్యాన్ని సంఘ సంస్కరణ రాజకీయాలను కలిపి ముడివేస్తూ, వాటన్నిటికీ రాజమండ్రి తీర్థ స్థానంగా యెలా విలసిల్లిందీ చెప్పడంతో ఆ ముచ్చట వొక సాంస్కృతిక డాక్యుమెంట్ లా రూపొందింది.

తొవ్వ ముచ్చట్లు తొలి రచన హోసూరు తెలుగు బడుల దగ్గర మొదలై చివరికి మళ్ళీ అక్కడి భాషా సాహిత్య పరిశోధనల వద్ద ముగియడం యాదృచ్ఛికమే అయినా చాలా సమంజసంగా వుంది.

తొవ్వ ముచ్చట్లులో జయధీర్ చేసిన రాజకీయ సూత్రీకరణలు విస్తృత ప్రజానికానికి కీడు చేసే విధ్వంసక క్షిపణుల ఆపదల్ని పసిగట్టే రాడార్లులా వుపయోగపడతాయి.

మొత్తం ఏడుసంపుటాల్లో 325 ముచ్చట్లలో జయధీర్ తిరుమలరావు ఏం చెప్పారు అని వెనక్కి తిరిగి చూసుకుంటే యెరుకలోకి వచ్చే సారం చాలా విలువైనది. నృశాస్త్ర విజ్ఞాన అధ్యేత, అట్టడుగు సామాజిక వర్గాల చరిత్రకారుడు, పురాతత్త్వ శాస్త్రవేత్త భారతీయ సమాజం మూలాలలోకి వెళ్లి తవ్వి తీసిన సారం అది. ఒక indologist ఒక orientalist ఒక left ideologist కలగలిసినందువల్ల సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వదేశీ మోడల్ ప్రత్యామ్నాయాన్నీ, దేశీ మతవాద రుగ్మతకు విరుగుడుగా లౌకిక భావజాలాన్నీ యేక కాలంలో అందించగలిగారు. అలా చూసినప్పుడు తొవ్వ ముచ్చట్లులో జయధీర్ చేసిన రాజకీయ సూత్రీకరణలు విస్తృత ప్రజానికానికి కీడు చేసే విధ్వంసక క్షిపణుల ఆపదల్ని పసిగట్టే రాడార్లులా వుపయోగపడతాయి. సమాజం చేరాల్సిన సరైన గమ్యాల తీరాన్ని గురించి తెలియజేసే లైట్ హౌస్ లా పని చేస్తాయి. జీవితాల్ని దిద్దుకోడానికి ఇంటింటా దీగూట్లో పెట్టుకున్న దీపాల్లా వెలుగు చూపుతాయి. తన రచనల ద్వారా ఆచరణ ద్వారా పౌరసమాజంలో వొక బాధ్యతాయుతమైన బుద్ధిజీవిగా, ప్రజా పక్షం వహించే పరిశోధకుడిగా, ప్రగతిశీల రచయితగా నిబద్ధతతో ఆయన చేసిన కృషి నాబోటివాళ్ళ అంచనాలకు అందనిది.

పునశ్చరణలా కనిపించవచ్చేమో కానీ యిదంతా మూల్యాంకనం చేసినప్పుడు అనేక వాస్తవాలు ద్యోతకమౌతాయి. జయధీర్ తిరుమలరావు యీ ప్రయాణం అంతటా …

● భారతీయ సమాజంలో పాతుకుపోయిన నిచ్చెనమెట్ల కుల/ఉపకుల వాస్తవికతని గుర్తించి వాటి మూలాల్ని అర్థం చేసుకొనేందుకు అవసరమైన సైద్ధాంతిక జ్ఞానాన్ని అందించారు.
● కుల మత ప్రాంత లింగ ఆధిపత్య భావనల్ని వ్యతిరేకించడం ద్వారా మాత్రమే నూతన మానవ ఆవిష్కరణ సాధ్యమనీ అందుకు ఐక్య పోరాటాలు అవసరమనీ ఉద్బోధించారు.
● సాహిత్యం చరిత్ర సంస్కృతుల అధ్యయనంలో విస్మృతికీ నిరాదరణకీ అలక్ష్యానికీ గురైన వ్యక్తుల్నీ ఘటనలనీ భావనల్నీ గుర్తించి వెలికితీశారు. ఆ రంగాల్లో ఖాళీలను పూరించుకోకుండా సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం అసాధ్యమని హెచ్చరించారు.
● సమాజంలోని భిన్న సమూహాల్లో ఉత్పత్తి సంబంధాల్లో సంభవించే మార్పుల్నీ చలనాన్నీ స్తబ్దతనీ పసిగట్టి వాటిని గతితార్కికంగా విమర్శించారు.
● విప్లవోద్యమాల్లో నిబద్ధత నిమగ్నతల గురించి లోతుగా చర్చిస్తూనే వుద్యమాలు బలహీనపడటానికి కారణమైన అంతర్గత వైరుధ్యాల్ని అన్వేషించారు.
● గత వర్తమానాల మధ్య యెడతెగని ప్రయాణం చేశారు. దేశీయ సాంస్కృతిక మూలాల్లోకి అలుపెరుగని అన్వేషణకు పూనుకున్నారు.
● ఆధిపత్య సమాజం అంచులకు నెట్టివేసిన జాతుల వుపజాతుల గుండె గోసని వినిపించి భిన్న అస్తిత్వోద్యమాలకు అండగా నిలిచారు.
● సాంస్కృతిక విధ్వంసం గురించి ఆగ్రహం వెలిబుచ్చడం దగ్గర ఆగిపోకుండా అందుకు కారణమైన పాలకుల నిర్ణయాల్ని తూర్పారపట్టారు. పార్లమెంటరీ ద్వంద్వనీతి రాజకీయాల లోగుట్టు విప్పిచెప్పారు.
● విశ్వవిద్యాలయాల ఆధిపత్య పీఠాల్ని కూలదోసి పరిశోధన రంగంలో అకడమిక్ మూసల్ని బద్దలుకొట్టారు.
● ప్రగతిశీల శిబిరాల్లో చోటుచేసుకుంటున్న వొంటెత్తుపోకడల రాజకీయాల్ని సైతం విమర్శనాత్మకంగా చూశారు.
● కవులు రచయితలు కళాకారులు ప్రజా పక్షం వహించాల్సిన బాధ్యతని పదే పదే గుర్తుచేశారు.
● తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల మధ్య వైషమ్యాలకూ విద్వేషాలకు తావులేని సాంస్కృతిక సమైక్యతని కోరుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రేమానురానురాగాలు సాహిత్య బాంధవ్యాలు కొనసాగాలనీ సహోదరభావనకి విఘాతం కల్గకూడదనీ ఆకాంక్షించారు. రెండు ప్రాంతాలూ స్వీయ అస్తిత్వాల్ని, వివిధతని కాపాడుకుంటూనే వుమ్మడి సంస్కృతినీ, వుమ్మడి భాషా మూలాల్నీ కాపాడుకోవాలని వుద్బోధించారు.
● నాగరిక ప్రపంచం చొరలేని దారుల్లోకి పయనించి కొత్త పుంతలు తొక్కారు.
● పీడితుల తాడితుల బాధాశప్తుల ఆక్రందనలని సలపరింతలని మూల్గులనీ ప్రతిధ్వనించే నూత్న ప్రజాస్వామిక భావనలకు ఆలోచనలకు అక్షరరూపమిచ్చారు.
● జానపద గిరిజన విజ్ఞాన అధ్యయనానికి కొత్త పరికరాలు అందించారు. అంతేకాదు మన సమాజపు మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేయటానికి శాస్త్రీయమైన సంవిధానాన్ని కూడా నిర్మించారు.
● పాలకుల అభివృద్ధి వ్యూహాలు విధాన నిర్ణయాలు మానవీయంగా వుండాలని భావించారు. పాలక వర్గాల ప్రజావ్యతిరేక కార్యక్రమాల్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. తన ధర్మాగ్రహాన్ని యెప్పుడూ యెక్కడా దాచుకోలేదు.
● విప్రవినోదులు మందెచ్చుల దేవర మలుగులు మిత్తులు అయ్యవార్లు చిందు భాగోతులు డక్కలి పటచిత్ర కథకులు నకాశీ చిత్రకారులు గోత్రాల వారు మాల దాసరులు వంటి జానపద కళాకారులకు తన రచన ఆచరణల ద్వారా జీవిక కల్పించేలా నాగరిక పౌర సమాజంలో గుర్తింపు గౌరవం లభించేలా చేశారు.
● సవర కోయ గుత్తి కోయ గోండి చెంచు బంజారా మొ. ఆదివాసీలు తమ నేలకు దూరమై ఆర్థిక దోపిడికీ సాంస్కృతిక పరాయీకరణకకీ గురౌతున్న పరిస్థితుల్ని, అందుకు కారణమౌతున్న పాలకుల కుట్రల్ని సందర్భానుసారంగా బహిర్గతం చేశారు.
● దొమ్మరి మంగలి మాల మాదిగ చాకలి గొల్ల వంటి సబ్బండ వర్ణాల అస్తిత్వ వేదనని ఆర్తితో జీరబోయిన గొంతుకతో వినిపించారు.

తొవ్వ ముచ్చట్లు సమకాలీనమైన సామాజిక నివేదికలుగానూ గతకాలపు చారిత్రక డాక్యుమెంట్లుగానూ సాంస్కృతిక పరిరక్షణకు కాలనాళికలుగానూ తయారయ్యాయి.

ఏడు సంపుటాల ముచ్చట్ల శైలి విషయంలో కూడా గమనించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. ప్రత్యామ్నాయ సంస్కృతికి living example గా మారిన తిరుమలరావు రూపొందించిన యీ నూత్న ప్రక్రియలో పోనుపోనూ ఆయన వాక్యం పదును తేలింది. కర్త లేని మార్మిక వాక్యాలు ఆయన ప్రత్యేకత. అదొక రచన వ్యూహం కూడానేమో. తర్వాతి కాలంలో కవిత్వంలో లాగా క్రియా రహిత వాక్యాలు యెక్కువ చోటుచేసుకున్నాయి. చివరికి తమదైన వొక విలక్షణమైన శైలిని నిర్మించుకున్నాయి. వాటిలో కొన్ని చక్కటి వార్తాకథనాల్లా గోచరిస్తాయి. మరికొన్ని పదునైన కరపత్రాల్లా కనిపిస్తాయి. మరికొన్ని నికార్సైన రాజకీయ నినాదాలుగా రూపొందాయి. మరికొన్ని అచ్చమైన కవిత్వపు తునకల్లా భాసిస్తాయి. వెరసి తొవ్వ ముచ్చట్లు సమకాలీనమైన సామాజిక నివేదికలుగానూ గతకాలపు చారిత్రక డాక్యుమెంట్లుగానూ సాంస్కృతిక పరిరక్షణకు కాలనాళికలుగానూ తయారయ్యాయి.

మనదైన దేశీయమైన సంస్కృతికి అర్థం చేసుకోవడానికి అవగాహన పత్రాలు యివి. అనేక ఆధిపత్యాలపై యెక్కుపెట్టిన విమర్శకు వొక ప్రత్యేక సంవిధానం, దానికి అవసరమైన పరికరాలు యీ పాఠ్యంద్వారా లభిస్తున్నాయి. విమర్శ వ్యాసం, పరిశోధన వ్యాసం, సమీక్షా వ్యాసం, వార్తా కథనం, యాత్రా రచన, డైరీ, మ్యూజింగ్స్ … యివన్నీ మిళితమైన విశిష్టమైన ప్రక్రియా రూపం వొకటి రూపొందింది. ఇలాంటి రచన యింతకు ముందు రాలేదు అంటే అతిశయోక్తి కాదు.

ఏడు పదుల వయస్సులో ‘ఆదిమ కళ’ కలని సాకారం చేసుకోడానికి కాలికి బలపం కట్టుకుని తిరిగే నిత్య పథికుడి నిరంతర సంభాషణ యిది.

చివరిగా వొక మాట –

ఎన్నో కష్టాలకు వోర్చుకొని తిరుమలరావు దశాబ్దాల పాటు యింత సంచారం చేశారు గానీ తొవ్వలు యిప్పుడు నడిచేలా లేవు. మనుషులు నడిచే రహదారులపై పాలకులే మేకులు దించుతున్నారు. ముళ్ళ కంచెలు పాతుతున్నారు. నిలువెత్తు గోడలు కడుతున్నారు. కందకాలు తవ్వుతున్నారు. నడిచే వాళ్ళకి దారి దీపాలు, తాగు నీళ్లు లేకుండా చేస్తున్నారు. అధికారం నిలుపుకోడానికి వోట్ల కోసం బాటల పొడవునా విద్వేషపు మైలురాళ్ళు పాతుతున్నారు. ప్రజలు నడవాల్సిన దారుల్లో యినప బూట్ల సాయుధ బలగాలు కవాతు చేస్తున్నాయి. అసహనం విషపు గాలులు వీస్తున్నాయి.

నడిచే తొవ్వలపైనే కాదు; చెప్పే ముచ్చట్లపై కూడా నిఘా మేఘం కమ్ముకుంటుంది. వేసే ప్రతి అడుగూ ఆంక్షలకు గురౌతోంది. ఆలోచనల పుట్టుక పైనే నిషేధం అమలౌతుంది. ప్రశ్న పాపమౌతోంది. నిరసన నేరమౌతోంది. ధిక్కారం దేశద్రోహమౌతోంది. ఇటువంటి పరిస్థితుల్లో …

ఏడు పదుల వయస్సులో ‘ఆదిమ కళ’ కలని సాకారం చేసుకోడానికి కాలికి బలపం కట్టుకుని తిరిగే నిత్య పథికుడి నిరంతర సంభాషణ యిది. గొంతు కలుపుదాం. మనసు విప్పుదాం. గుండె పరుద్దాం.

తొవ్వ ముచ్చట్లు ఏడు సంపుటాలు పుస్తకరూపంలోకి రావడానికి సహకరించిన సహగాములకు సలాం.

సెలవ్.

ఎ. కె. ప్రభాకర్ తెలుగు సాహిత్యానికి అందివచ్చిన ఆత్మీయ విమర్శకులు. వారి శైలి ఎంత అత్మీయమో అంత నిర్మోహమాటమూ. మంచువలె తెల్లనా నిప్పువలె ఎర్రన.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article