ప్రతి నూతన సంవత్సరం వారిని గుర్తు చేసుకోవాలి. ప్రతి సంక్రాంతి అయన వెచ్చటి స్మృతిలో మన జీవన రథం ముందుకు సాగాలి.
కందుకూరి రమేష్ బాబు
అదృష్టమో దురదృష్టమో నగర జీవితంలో ఉంటూ ఉండటం వల్ల ఎన్ని చిత్రాలని! కానైతే, ఉంటున్నఈ ‘సిటిలైఫ్’ ని ఎంత చూసినా, మరెంత చదివినా, ఎన్నెన్ని దృశ్యాదృశ్యాలుగా చేసినా ఒకరు మాత్రం రోజూ గుర్తుకు వస్తూనే ఉంటారు.
ప్రతి ఛాయాచిత్రం ముగింపులో ఆయన్ని తల్చుకుంటూనే ఉంటాను.
ఆయనే ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్.
‘మరణం నా చివరి చరణం కాదు’ అన్న కవి కావడం వల్ల కాబోలు, జీవితంలోని ఏ ఘడియను చిత్రించినా, సామాన్యుడి స్థితీ, గతీని ఎలా చిత్రికపట్టినా ఆయన గుర్తుకు వస్తూనే ఉంటాడు.
నిజానికి అతడు ఒకరే. పేరుకు కవీ, చిత్రకారుడూ. ఫొటోగ్రాఫరూ.
కానీ, ఆయన పనంతా ఒకటే. ఒక దృశ్యం పరచడం.
అలిశెట్టిని మించిన దృశ్యకారుడిని తెలుగు నేల ఇంకా కనలేదు. చూడనూ లేదు.
కవిత్వంలోనూ, చిత్రాల్లోనూ, తీసిన ఛాయాచిత్రాల్లోనూ ఒకే ఒక అంశం అంతర్లీనం. అదేమిటీ అంటే కళ్లకు కట్టడం. మంట పెట్టడం. మన లోవెలుపలి నెగడు ఆవరణ అంతా కూడా కాలిపోయేటట్టు అందులోంచి మన ఆత్మలు లేచి శత్రువు మెడను పట్టుకునేటట్లు చేయడం. దృశ్యాన్ని విప్లవీకరించడం. మనలో జీవితాన అదృశ్యంగా ఉన్న విప్లవశక్తిని చేతనలోకి తేవడం. అవును మరి. ఆయన ఒక దృశ్య పాతర.
క్లుప్తంగా చెప్పాలంటే…ఎర్ర పావురాలు. మంటల జెండాలు. చురకలు. రక్తరేఖ, సంక్షొభగీతం, సిటీలైఫ్. మరణం నా చివరి చరణం కాదు – ఇవన్నీ ఆయన కవితా సంపుటులు. చిత్ర లేఖనాలు. ఛాయా చిత్రణలు. ఒక పరంపరగా ఆయన రచనా దృశ్యాలు ఒక శర పరంపర.
సమాజంలో వర్గకసిని ఆయన అంత తీవ్రంగా చెప్పనోడు మరొకడు కనిపించడు. అట్లే, జీవితంలోని ద్వంద స్వభావాన్ని ఆయన అంత నిశితంగా ఎద్దేవా చేసినవాడూ మరొకడు లేడు.
తాను ఒక కవిత రచించినా, చిత్రం గీసినా, ఛాయాచిత్రం చేసినా దాన్ని కొల్లోజ్ చేసి మరొకటి చేసినా ఒకటే చేశేవాడు. ఆ వస్తువు ఇతివృత్తం మార్చేవాడు. దాన్నికొత్త అర్థాలతో విప్లవీకరించేవాడు.
ఉదాహరణకు వేశ్య గురించి ఆయన రాసిన కవితా ఖండిక ఎవరైనా మర్చిపోతారా?
సమాజంలో వర్గకసిని ఆయన అంత తీవ్రంగా చెప్పనోడు మరొకడు కనిపించడు. అట్లే, జీవితంలోని ద్వంద స్వభావాన్ని ఆయన అంత నిశితంగా ఎద్దేవా చేసినవాడూ మరొకడు లేడు.
దేన్నీ చెప్పడానికైనా అయిన ఎంచుకున్నది మాత్రం సామాన్యమైన వస్తువును. మనిషిని. అధోజగత్ సహోదరుల స్థితి గతినీ.
జనవరి 12 న ఆయన జయంతీ, వర్థంతి. ఒకటే రోజు…జననం మరణాలకు అతీతంగా ఎర్రటి రచనై నిలిచిన వాడు.
జోహారు ప్రభాకరా…
ప్రతి నూతన సంవత్సరం వారిని గుర్తు చేసుకోవాలి. ప్రతి సంక్రాంతి అయన వెచ్చటి స్మృతిలో మన జీవన రథం ముందుకు సాగాలి.