Editorial

Saturday, November 23, 2024
వ్యాసాలుతరలిపోయిన శిశిర గ్రీష్మ వసంత సమ్మేళనం : ఎన్ వేణుగోపాల్ తెలుపు

తరలిపోయిన శిశిర గ్రీష్మ వసంత సమ్మేళనం : ఎన్ వేణుగోపాల్ తెలుపు

రూప చిత్రం : చిత్ర

‘తెలినలి తలుపులు తెరచి మూసుకొని’
తరలిపోయిన శిశిర గ్రీష్మ వసంత సమ్మేళనం

ఎన్ వేణుగోపాల్

గడిచిన సంవత్సరపు అనుభవాలు రాయమని తమ్ముడు రమేష్ అడిగినప్పుడు, వాటిలో అంత పంచుకోవలసినవేమీ లేవనే అనుకున్నాను. సుఖ దుఃఖాలేవేవో వస్తుంటే తలదాలిచి అనుభవించాను గాని, అవి నలుగురితో చెప్పుకోవలసినవేనా అనుకున్నాను. ఒకరి ఆనందమో విషాదమో నలుగురికీ తెలియడం ఎందుకని అరవై ఏళ్ల కింది కేశవరావ్ (ఆ తర్వాత నగ్నముని) కవిత “ఎవడి కన్నీళ్లు వాడి సొంత ఆస్తి, ఎవడి చిరునవ్వులు వాడు సృష్టించుకున్న స్వర్గానికి వేసుకున్న మెట్లు, ఎవడి జీవితం వాడే మీటుకోవలసిన పసిడివీణ” తలచుకున్నాను.

ఇవి నా వయ్యక్తిక, హృదయగత, సన్నిహిత అనుభవాలే అయినప్పటికీ, ఒక సగటు మనిషి జీవిత ప్రయాణంలో కొన్ని స్థలాలనూ కాలాలనూ పట్టి ఇచ్చిన ఒక సంవత్సరపు కథ అవుతాయి.

ఏమో, ఎవరి అనుభవం వాళ్లదే అయితే, ఒకరి అనుభవం నుంచి మరొకరు తెలుసుకునేదేమీ లేకపోతే, ఇంత కళా సాహిత్యమూ చేసే పనేమిటి మరి అని మళ్లీ నేనే సందేహ పడ్డాను. ఇవి నా వయ్యక్తిక, హృదయగత, సన్నిహిత అనుభవాలే అయినప్పటికీ, ఒక సగటు మనిషి జీవిత ప్రయాణంలో కొన్ని స్థలాలనూ కాలాలనూ పట్టి ఇచ్చిన ఒక సంవత్సరపు కథ అవుతాయి గనుక, ఆ స్థలాలతో, కాలాలతో సంబంధం ఉండే మనుషులందరూ అందులో ఎక్కడో ఒకచోట తమను తాము చూసుకుంటారని, లేదా కనీసం తమది కాని విభిన్న అనుభవాన్ని తెలుసుకుంటారని అనిపించింది.

కాలమంటే ఏమిటి? దానికి ఒక అసమర్థ కొలమానమైన సంవత్సరం అంటే ఏమిటి? కొన్ని ఆశలూ కొన్ని ఆశాభంగాలూ, కొన్ని చిరునవ్వులూ కొన్ని కన్నీళ్లూ, కొన్ని ఆహ్లాదాలూ కొన్ని ఆఘాతాలూ, కొన్ని మహోజ్వల ప్రణాళికలూ కొన్ని అసంపూర్ణ అసంతృప్త అపజయాలూ, కొన్ని గాయాలూ నొప్పులూ అశాంతులూ, కొన్ని సాఫల్యాలూ కొన్ని వైఫల్యాలూ, కొన్ని ప్రయాణాలూ కొందరు స్నేహితులూ కొన్ని పుస్తకాలూ కొన్ని కలలూ మరెన్నో పీడకలలూ… జయాపజయాల యుగళగీతం.

ఈ సంవత్సరమంతా నాకు మనసు బొంబాయిలో, శరీరం హైదరాబాదులో లాగ గడిచిందనాలి. పది పదిహేను సార్లు హైదరాబాద్ – ముంబాయి ప్రయాణం చేశాను. హైదరాబాద్ లో ఉన్నా ముంబాయిలోనే ఉన్నట్టున్నాను. ఎక్కడ ఉన్నా అశ్రుబిందువునై జలజల రాలుతున్నాను.

ఈ సంవత్సరమంతా నాకు మనసు బొంబాయిలో, శరీరం హైదరాబాదులో లాగ గడిచిందనాలి. నిజానికి 2018 ఆగస్టులో వివి అరెస్టయిన నాటి నుంచీ నా స్థితి అదే. మొదట కొన్నాళ్లు పూణే యరవాడ జైలులో ఆయన ఈ వయసులో, అనారోగ్యంతో ఎట్లా ఉన్నారోననే దిగులు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత దిగజారిందని తెలిసిన దిగులు. మధ్యలో అప్పుడప్పుడు కోర్టులో చూపులు కలిసిన, ఒకటో రెండో మాటలు కలిసిన ఆనందాలు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో నవీ ముంబాయి తలోజా జైలుకు మార్చినప్పటి నుంచి మరింతగా పెరిగిన ఆందోళన, విచారం. 2020 జూలై నాటికి మామూలు అనారోగ్యానికి తోడు, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ తో సోడియం, పొటాషియం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. మెదడు మీద ప్రభావం పడి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. పరాకు మాటలతో, మనుషులను గుర్తుపట్టలేని, వర్తమానంలో లేని ఆందోళనతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగా కొవిడ్ కూడ సోకింది. అసలు ఆ రాత్రి గడిచి ఆయన ఎప్పుడో పద్దెనిమిదో ఏట రాసినట్టుగా ‘భళ్లున తెల్లవారునింక భయం లేదు’ అనిపిస్తుందా అని అందరికందరమూ కన్నీటి వరద అయిన రోజులు. ఆ స్థితిలోనే ఆస్పత్రి నుంచి మళ్లీ జైలుకు పంపగా, ఆరోగ్యం మరింత దిగజారి జైలులోనే ఆయనను చంపదలిచారా అని అనుమానంతో గగ్గోలు పెట్టిన రోజులు. చిట్టచివరికి ఈ సంవత్సరం మొదలయ్యే సమయానికి మరొకసారి మెరుగైన ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అంది, ఆరు నెలల కిందటి అనారోగ్యాన్నంతా దులిపేసి, ఆయన మాటల్లోనే చెప్పాలంటే “ఇంగ్లిషైతే రోజుకు రెండు వందల పేజీలు, తెలుగైతే నాలుగు వందల పేజీలు” చొప్పున చదివే స్థితికి, మూడున్నర నెలల ఆస్పత్రిలో వంద పుస్తకాల పైన చదివే స్థితికి చేరారు. కవిత్వమూ జ్ఞాపకాలూ రాసే అనువాదాలు చేసే స్థితికి, మళ్లీ జ్ఞాపకశక్తి పూర్వ స్థితికి వచ్చారు.

అంటే ఈ సంవత్సరం పటునిరాశ గర్భంలోనే మొలకెత్తుతున్న ఆశలో చిగురు వేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత బొంబాయి హైకోర్టు ఫిబ్రవరి చివరివారంలో అనారోగ్య కారణాలతో ఆరు నెలల, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విచిత్రమైన, హాస్యాస్పదమైన నిబంధనలకు లోబడి ఆ బెయిల్ ధరావత్తులు తయారు చేయడం, బెయిల్ షరతులకు లోబడి ముంబాయిలో ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవడం, చిట్టచివరికి మార్చ్ రెండోవారానికి విడుదలై ఇల్లు చేరిన తర్వాత, వాళ్లిద్దరినీ ఒంటరిగా వదలలేక తోడు కోసం ఏర్పాట్లు చూడడం, మధ్యలో రెండు వారాలకొకసారి జరిగే కోర్టు పనులు, ఆస్పత్రుల్లో పరీక్షలు, నవంబర్ లో ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఆశ్రయం కోసం వెతుకులాట… 2021 అంటే ఈ అనుక్షణ, అనుదిన ఆందోళన. ఈ ఏడాది పది పదిహేను సార్లు హైదరాబాద్ – ముంబాయి ప్రయాణం చేశాను. హైదరాబాద్ లో ఉన్నా ముంబాయిలోనే ఉన్నట్టున్నాను. ఎక్కడ ఉన్నా అశ్రుబిందువునై జలజల రాలుతున్నాను.

ఈ నిరంతర అనంత ఆందోళనలోనే ఒత్తిడిలోనే వివి కవిత్వానికి ఈ సంవత్సరం దొరికిన ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం గొప్ప ఉపశమనం. హృదయానికి రెక్కలు తొడిగిన ఆనందం.

ఈ నిరంతర అనంత ఆందోళనలోనే ఒత్తిడిలోనే వివి కవిత్వానికి ఈ సంవత్సరం దొరికిన ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం గొప్ప ఉపశమనం. హృదయానికి రెక్కలు తొడిగిన ఆనందం. గత సంవత్సరం జూలై-ఆగస్ట్ అనారోగ్యంతో ప్రారంభించి, ఆయన నిర్బంధాన్ని నిరసిస్తూ అనేక దేశాల, అనేక భాషల కవులూ సృజనకారులూ కార్యకర్తలూ ఆయన కవిత్వాన్ని తమ భాషల్లోకి తర్జుమా చేసుకోవడం ప్రారంభించారు. గత అరవై ఏళ్లలో ఆయన కవిత్వం భారతీయ భాషల్లోకీ, ఇంగ్లిష్ లోకీ మినహా ఇతర భాషల్లోకి వెళ్లలేదు. ఈ సంవత్సరం నాకు తెలిసి ఐరిష్, స్పానిష్, జర్మన్, జపనీస్, చైనీస్, గ్రీక్ వంటి పది పన్నెండు భాషల్లోకి వెళ్లింది. పెన్ ఇంటర్నేషనల్, ఇతర సంస్థలు ఆయన కవిత్వ పఠనపు సెషన్స్ ఏర్పాటు చేశాయి. ఈ సంవత్సరం మధ్యలో పెంగ్విన్ ప్రచురణగా వెలువడవలసి ఉండిన వివి కవిత్వం ఇంగ్లిష్ సంపుటం వాయిదా పడింది గాని ఇంకో ఆరు నెలల లోపు వెలువడవచ్చు. ఆస్ట్రియా పెన్ సంస్థ వివి కవిత్వం జర్మన్ అనువాద సంపుటం ఈ సంవత్సరం వెలువరించడానికి ఏర్పాట్లు చేస్తున్నది.

అలా సంవత్సరం మొత్తం ఆశ నిరాశల ఊగిసలాటలోనే గడిచింది గాని, మరీ ముఖ్యంగా ఏప్రిల్ – మే నెలలు అత్యంత దుఃఖభరితమైనవీ, ఆందోళనామయమైనవీ. కుటుంబమంతా కొవిడ్ బారిన పడి వారాల తరబడి ఇంటి మీద దుఃఖం కమ్ముకుంది. ఆ ఎండాకాలం మా ఇంటిమీద కన్నీటివాన కురిసింది. గత సంవత్సరం కొవిడ్ మొదటి వేవ్ సందర్భంగా వేలాది, బహుశా లక్షలాది వలస కార్మికులకు సహాయ కార్యక్రమాల్లో రోజుకు పదహారు గంటలు పనిచేసి, విపరీతంగా అలసిపోయినా వనజ అప్పటి కొవిడ్ తాకిడిని తప్పించుకుంది. కాని ఈసారి ఏప్రిల్ మొదటి వారంలో మొదలై మే మొదటి వారం దాకా కొవిడ్ బాధితురాలైంది. ఒకదాన్ని మించిన మరొక ఐసియులలో ఇరవై రోజులు చావు బతుకుల సన్నని దారం మీద కసరత్తు చేసింది. మృత్యువును ముట్టుకుని వెనక్కి తిరిగి వచ్చింది. మొదటి పది రోజులైతే అసలు బతుకుతుందో లేదో చెప్పలేమన్నారు వైద్యులు.

ముప్పై సంవత్సరాల పరిచయాన్నీ, ఇరవై ఎనిమిది సంవత్సరాల సాహచర్యాన్నీ, ప్రాణాధిక అనురాగానుబంధాన్నీ, వేనవేల స్వప్నాలనూ ఈ మాయదారి రోగం పుటుక్కున తెంపేస్తుందా అని అనుక్షణ దుఃఖం.

ముప్పై సంవత్సరాల పరిచయాన్నీ, ఇరవై ఎనిమిది సంవత్సరాల సాహచర్యాన్నీ, ప్రాణాధిక అనురాగానుబంధాన్నీ, వేనవేల స్వప్నాలనూ ఈ మాయదారి రోగం పుటుక్కున తెంపేస్తుందా అని అనుక్షణ దుఃఖం. ఆస్పత్రిలో చేర్చడానికి తీసుకుపోతున్న మొదటిరోజు భయానక అనుభవం ఎంతటి పగవాడికి కూడ రాగూడదు. తాను కారులో వెనుకసీట్లో పడుకుని మరణవేదన పడుతుంటే, ఏ క్షణం ఏం జరుగుతుందోనని గగుర్పాటు కలుగుతుండింది. ఆ దుర్భర స్థితిలోనే రెండు మూడు గంటల ప్రయాణాలు, ఒకదాని వెనుక ఒకటి మూడు ఆస్పత్రులకు పరుగు. మెదడు నిర్లిప్తమైపోయి ఆలోచనకూ నిరామయానికీ సరిహద్దులో ఊపిరి తీస్తున్నానో బతికే ఉన్నానో తెలియని స్థితి. ఆ ఉద్రిక్త ఉద్వేగానికి నరాలు చిట్లిపోతాయా, గుండె కొట్టుకోవడం ఆగిపోతుందా….

ఒక ఐదు నక్షత్రాల ఆస్పత్రి ముందు బైట కూచోవడానికి కుర్చీలు కూడ లేని షామియానా కింద నాలుగు గంటలు నిరీక్షింపజేసి, చివరికి చేర్చుకోలేమంది. అక్కడ ఒక క్షణమొక యుగం. గడుస్తుందా ఈ యుగం అని భయం. ఇక మరొక ఆస్పత్రికి పరుగు. విస్తృత కుటుంబ సభ్యులూ, మిత్రులూ తమ సమస్యలతో తాము సతమతమవుతూనే ఏ ఆస్పత్రిలో ఏ డాక్టర్ చేర్చుకోవడానికి అనుమతిస్తారు, ఎక్కడైతే బతికించే వైద్యం అందుతుంది, ఎన్ని లక్షలు ఖర్చవుతుంది, ఏదైనా చేతి సాయం చేయగలమా లాంటి అనేకానేక ప్రయత్నాలు, సంప్రదింపులు, ఊరడింపులు. ఆ మిత్రుల కరుణా కృషీ సంఘీభావమూ ఫలించి చివరికి నిమ్స్ లో చేర్చుకుంటారనే ఆశ్వాసం. మధ్య దారిలో కారు వెనక్కి తిప్పి మరొక పరుగు.

తర్వాత నిమ్స్ లో గడిచిన ఇరవై రోజులు తలచుకోవడానికి భయం వేస్తుంది. తను తిరిగి లేచి బైటికి వస్తుందా, ఉన్న మూడు ఐసియుల్లోనూ అటూ ఇటూ ప్రతి రోజూ ఎన్నో మంచాలు ఖాళీ అయిపోయి, అప్పటిదాకా మాట్లాడిన మూల్గిన సజీవంగా ఉన్న మనుషులు, నల్లని గుడ్డ సంచుల్లో మూటలుగా మారిన బీభత్స అనుభవం మమ్మల్నీ కమ్ముకుంటుందా? తను లేకపోతే నేను ఉండగలనా, తను లేని నేనున్నానా? ఇద్దరమూ లేకపోతే విభాత ఎట్లా? ప్రశ్నలే ప్రశ్నలు ప్రశ్నలు. జవాబులు లేవు. నిలువెత్తు దుఃఖాన్నయి రెండు వారాలు ఆస్పత్రికీ ఇంటీకీ మధ్య ఆసులో కండెలా తిరిగి, తిరిగి, చివరి ఐదారు రోజులు నేనూ కొవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చేరి…. మొత్తానికి 2021 ఒక మహా దారుణమైన అనుభవం. వనజకు ప్రాణం పోసిన, అంటే నాకూ మాకూ ప్రాణం పోసిన డా. గంగాధర్, డా. పరంజ్యోతి, డా పద్మజలకు జీవితాంతం కృతజ్ఞులం.

వివి, వనజ-విభాత నా జీవిత త్రిభుజానికి రెండు పార్శ్వాలైతే, మూడో పార్శ్వం వీక్షణం.

వివి, వనజ-విభాత నా జీవిత త్రిభుజానికి రెండు పార్శ్వాలైతే, మూడో పార్శ్వం వీక్షణం. అనేకానేక అస్తిత్వాల నుంచి రద్దు చేయబడిన, బహిష్కృతుడినైన నాకు మిగిలిన ఏకైక అస్తిత్వం వీక్షణం సంపాదకత్వం. ఈ సంవత్సరం వీక్షణానికి పందొమ్మిదో సంవత్సరం. దినదిన గండంగా నడుస్తున్న ఈ మాసపత్రిక ఎన్నటికైనా గండాలు లేని స్థితిని చేరుకుంటుందా? వచ్చే సంచిక వెలువడుతుందా లేదా, వచ్చే సంచిక ప్రెస్ బిల్లూ సిబ్బంది జీతాలూ పోగేయగలనా, చేసిన అప్పులు ఎలా తీర్చగలను అనే ఎడతెగని వ్యాకులత వల్లనే నా డయబెటిస్ పెరుగుతున్నదని నా అనుమానం. అసంఖ్యాక అభిమానులున్నప్పటికీ, పత్రికకు చాల ప్రాచుర్యం, పత్రిక పట్ల చాల అభిమానం ఉన్నప్పటికీ, అభిమానం ఉన్నవాళ్లు పత్రిక నడవడానికి అవసరమైన స్థాయిలో విరాళాలు ఇవ్వగలవాళ్లు కాదు. మొదటి పది సంవత్సరాల పాటు ప్రతి సంచికకూ అందిన ప్రభుత్వ ప్రకటన (అదేమీ ఔదార్యంతో కాదు, ప్రభుత్వ ప్రకటనల వ్యయంలో తప్పనిసరిగా చిన్న పత్రికలకు వాటా ఉండాలని గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం) వల్ల పడుతూ లేస్తూనైనా పత్రిక నడిచేది. తెలంగాణ ఉద్యమం విస్తరించిన తర్వాత సమాచార పౌరసంబంధాల శాఖ అస్తవ్యస్తమైపోయింది. ప్రతి నెలా ఇచ్చే ప్రకటన మూడు నెలలకు ఒకసారికి దిగిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఆ శాఖకు మంత్రే లేరు. రాజు గారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని చిన్న పత్రికల మీద, ప్రత్యేకించి వీక్షణం మీద దెబ్బ పడింది. ప్రభుత్వ ప్రకటనలు లేవు. ప్రైవేటు ప్రకటనలూ లేవు. కొవిడ్ మరొక దెబ్బ కొట్టింది. ఏ ఒక్క రోజు, ఏ ఒక్క సంచిక తర్వాత అడిగినా మరుసటి సంచిక వస్తుందని నమ్మకంగా చెప్పలేను. అంతటి అనిశ్చితితో, ఇన్ని సమస్యలతో అసలు పత్రిక తేవడం అవసరమా అనే నిరాశ ఎల్లప్పుడూ ఊపిరి పీలుస్తున్నట్టుగా సాగుతూనే ఉంటుంది. 2021 ఆ నిరాశను మరింత పెంచింది. వేలాది మంది వీక్షణం అభిమానుల, పాఠకుల, రచయితల చల్లని చూపులూ మాటలూ సాంత్వనా ఆ నిరాశల మంటల నుంచి నన్ను కాపాడతాయి.

కారుచీకటిలోనైనా ఎంత సన్నటివైనా వెలుగురేఖలు చూడగలిగే ఆశావాదిని నేను. అలా 2021 నాకొక సంతోషకరమైన సంవత్సరం కూడ. ఇది నాకు అరవై సంవత్సరాలు నిండిన సందర్భం.

“అవగాహనల వల్ల నిరాశావాదిని, కాని సంకల్పం వల్ల ఆశావాదిని” అని ఇటాలియన్ మార్క్సిస్టు మేధావి ఆంటోనియో గ్రాంసీ అన్నట్టు, వ్యక్తిగతంగా ఎంత నిరాశ కమ్ముకున్నా సామాజికంగా ఆశావాదం వదులుకోలేను. కారుచీకటిలోనైనా ఎంత సన్నటివైనా వెలుగురేఖలు చూడగలిగే ఆశావాదిని నేను. అలా 2021 నాకొక సంతోషకరమైన సంవత్సరం కూడ. ఇది నాకు అరవై సంవత్సరాలు నిండిన సందర్భం. సీనియర్ సిటిజెన్ అనే పిలుపుకు అర్హుడిని అవునో కాదో తెలియదు. యాబయో పుట్టినరోజునే ‘దిగిపోయే పొద్దు’ అని రాశాను, ఆ పొద్దు మరింత దిగిపోయింది. చేయవలసిన పనులు చాల మిగిలిపోయాయి. ఇక తొందరపడక తప్పదు. ఇంతకాలమూ కాయితాల్తోనే, కన్నీటి కాయితాల్తోనే గడిచిపోయింది అని మోహన్ ప్రసాద్ అన్నట్టు, అరవై ఏళ్లు గడిచిన కన్నీటి కాయితాలే ఇంకా ఉన్నన్ని రోజులూ ఉంటాయి.

ఈ సంవత్సరం మరొకందుకు కూడ గుర్తుండిపోతుంది. ఇరవై ఏళ్ల తర్వాత నా రెండో కవితా సంపుటం ‘రెప్పవాల్చని కాపలా’ వెలువడిన సందర్భమిది.

ఈ సంవత్సరం మరొకందుకు కూడ గుర్తుండిపోతుంది. ఇరవై ఏళ్ల తర్వాత నా రెండో కవితా సంపుటం ‘రెప్పవాల్చని కాపలా’ వెలువడిన సందర్భమిది. అలాగే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువూ రాతా మాటా ఆగని, కొనసాగిన సంవత్సరమిది. చిరకాల మిత్రుడు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ కోరిక మేరకు రాసిన ఆదివారం అనుబంధం ముఖచిత్ర కథనాలు రెండు ఈ సంవత్సరం నాకు సంతృప్తినిచ్చినవి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కార్యకర్తలుగా ఉరిశిక్ష పడి, అంతర్జాతీయ నిరసనల వెల్లువతో ఆ ఉరిశిక్షలు ఆగిపోయిన తెలంగాణ ట్వెల్వ్ మీద కథనం ఒకటీ, సహాయ నిరాకరణోద్యమపు 1921 కి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా అప్పటి సామాజిక, రాజకీయ ఘటనల జ్ఞాపకపు కథనం మరొకటీ. వాటికోసం ఎంతో పరిశోధన చేయవలసి వచ్చింది. ఆ రెండు కథనాలూ అపారమైన పాఠకాదరణనూ పొందాయి.

గడిచిన సంవత్సరం చెంపల మీద జారుతున్న ఒక కన్నీటి ధార. పెదాల మీద వికసిస్తున్న ఒక చిరునవ్వు హేల.

చిట్టచివరిగా, ఈ సంవత్సరం కొందరు కొత్త మిత్రులను పరిచయం చేసింది గాని, అంతకన్న ఎక్కువమంది మిత్రులను తీసుకుపోయింది. సాహిత్య, రాజకీయ, సామాజిక రంగాల్లో అపారమైన కృషి చేసిన, చేస్తున్న నా ఆత్మీయ మిత్రులు కనీసం ముప్పై మందిని, నాకు పరిచితులో అపరిచితులో అయిన వందలాది మంది ఆయా రంగాల ప్రముఖులను 2021 కొల్లగొట్టుకుపోయింది. వెళిపోయినవాళ్ల జ్ఞాపకాలు ఎప్పటికీ చెక్కు చెదరవు.

గడిచిన సంవత్సరం చెంపల మీద జారుతున్న ఒక కన్నీటి ధార. పెదాల మీద వికసిస్తున్న ఒక చిరునవ్వు హేల.

ఎన్. వేణుగోపాల్ కవి, రచయితా విమర్శకులు. వీక్షణం సంపాదకులు. తన తాజా రచనలు చదివేందుకు కడలి తరగ క్లిక్ చేయవచ్చు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article