ఔషధ విలువల మొక్కలు ( 51 ) : అశోకము
మరుని బాణముగను ధరజాత నెలవునై
అమిత కీర్తి పొందె నల నశోక
తాడనమున పూచి తరుణుల మన్నించు
తొలి వసంత పూత తురుగలించు
నాగమంజరి గుమ్మా
మన్మథుని పంచ బాణాలలో ఒకటి అశోకము. పురాణ పరంగా చూస్తే రావణుడు అపహరించిన సీతమ్మవారు అశోక వనంలో శింశుపా వృక్షం కింద నివసించినట్లు తెలుస్తోంది.
వసంత కాలంలో ఈ చెట్లు పూయడం మొదలుపెడతాయి. వీటి యొక్క ఆయుర్వేద గుణాలను గూర్చి స్పష్టత లేదు. అలంకరణలలో విరివిగా ఉపయోగిస్తారు. పూవు కనబడదు కానీ తావి చుట్టుపక్కల చాలా వ్యాపిస్తుంది.
ఆమనిలో అశోకలు, వాటి తర్వాత పున్నాగలు పూయకపోతే సరిగ్గా వర్షాలు కురవవని, ఆయేడు పంటలు నష్టమని చెప్తారు.
ఉత్తమ జాతి స్త్రీ పాదం తగల గానే అశోక చెట్లు పుష్పిస్తాయని కూడా చెబుతారు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.