Editorial

Saturday, November 23, 2024
Opinion'కొండపొలం'పై నా స్పందన - నర్సిం

‘కొండపొలం’పై నా స్పందన – నర్సిం

ఈ సబ్జెక్ట్ ను తీసుకోని సినిమా చేయడం సాహసమే, అయినా క్రిష్ బాగా డీల్ చేశారు. ఆడవి బ్రహ్మాండాన్ని, ఆడవి విశ్వరూపాన్నిప్రేక్షకుడి అనుభవంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు, అడవి ధైర్యాన్ని, జ్ఞానాన్ని, సమాజం పట్ల బాధ్యతనీ ఇస్తుందని కూడా చెబుతుందీ సినిమా.

నర్సిం

narsim150361@gmail.com

బాగా మూడీ గా, దిక్కు తోచకుండా ఉన్న ఆ సాయంత్రం, మా పిల్లలు అలా బయటకు వెళ్దామంటే ఏఎంబి మాల్ దాకా వెళ్ళాము. అవీ, ఇవీ చూసిన తర్వాత ధియేటర్ లో సినిమా చూసి చాలా కాలమైంది, ఏదైనా సినిమాకి వెళ్దామా? అన్నారు మా పిల్లలు. నేను సరే అన్నాను. అందులో ఒక బాండ్ మూవీ, రెండు,మూడు తెలుగు సినిమాలు, వేరే ఇంగ్లీష్ సినిమాలు నడుస్తున్నాయి. మేము లవ్ స్టోరీ నా, కొండపోలమా? అన్న దగ్గర ఆగాము. లవ్ స్టోరీ లు ఎప్పుడూ చూసేవే కదా, ‘కొండపొలం’ కొంత కొత్త గా, డిఫరెంట్ గా ఉండొచ్చు, దానికి వెళ్దాం అని చెప్పాను, చాలా నమ్మకంగా.

కథలోకి వెళ్తుంటే, ఆ సినిమాలోని గొర్రెలకాపరుల పాత్రలతో పాటు మేం కూడా నడుచుకుంటూ వెళుతున్నామన్న అనుభూతి కలిగింది.

టికెట్లు తీసుకుని థియేటర్లోకెళ్ళాం. అది చాలా పెద్ద స్క్రీన్. సినిమా స్టొర్ట్ అయ్యింది, పిల్లలు వేరే సినిమా అంటే నేను దీనికి తీసుకొచ్చాను. ఎలా ఉంటుందో ఏమో అన్న సంశయం మధ్య – ఓపెనింగ్ సీన్లు చూసి అదిరిపోయాను. ఒక్క సారిగా ‘మెకన్నాస్ గోల్డ్’ సినిమా ప్రారంభంలో కనిపించే ఆ ఎడారిలాంటి, ఎత్తైన గుట్టల వైడ్ షాట్స్ లాగా కొండపొలం ఓపెనింగ్ షాట్స్ ‘వాహ్’ అనిపించాయి. కొండలు-గుట్టలు, అడవుల్ని అద్దంలో చూసినట్టు కాకుండా, వాటి ముందు మనం ఉంటే ఎంత విశాలంగా ఉంటాయో, ఆ అనుభూతిని మన కళ్ళకు కట్టినట్టుగా ఓపెనింగ్ షాట్స్ లో చూపించారు. ఇక పర్వాలేదు అనుకుని నెమ్మదిగా కథలోకి వెళ్తుంటే, ఆ సినిమాలోని గొర్రెలకాపరుల పాత్రలతో పాటు మేం కూడా నడుచుకుంటూ వెళుతున్నామన్న అనుభూతి కలిగింది. నేనైతే ముందస్తుగా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి తానా నవలల పోటీలో బహుమతి పొందిన ఆ ‘కొండపొలం’ నవల చదవాలనుకున్నాను, కానీ అనుకోకుండా అందుబాటులోకి ముందుగా సినిమా వచ్చింది. అంతకు ముందు కేశవ రెడ్డి గారి ‘అతడు అడవిని జయించాడు’, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ ‘వనవాసి’ లాంటి అడవి నేపథ్యం ఉన్న నవలలు చదివి వాటి విస్తృతిని అనుభవించాను, అక్షరాలు గా కాకుండా దృశ్యాలు గా కనువిందు చేసే ఆ శైలీ, ఆ కథనం మనల్ని అమాంతం అడవుల్లోకి తీసుకెళ్తాయి, ప్రకృతి మాత తన ఒళ్ళో చేర్చుకొని సేద తీర్చుతున్నట్లుగా, బాధల్నుంచి కాపాడుతున్న అనుభూతి కలుగుతుంది. ‘కొండపొలం’ అదే దారిన తీసుకువెళ్లే నవలని తెలుసుకొని ఉన్నాను. మరి సినిమా మాటో?

రైతుకు సమాంతరంగా, అంతే కష్టాలు, అంతే బాధలతో జీవాలను కాపాడుకోవడానికి, వాటి ఆకలి దప్పులు తీర్చడానికి నెలల తరబడి ఇల్లు వాకిలి, ఊర్లు వదిలి, గుట్టల వెంట, పుట్టల వెంట “కొండపొలం” చేసే “గొర్రెల కాపరుల” ఉన్నారని మనకి ఎంత మందికి తెలుసు!?

రైతు, రైతు కష్టాలూ మనకు తెలుసు, ‘రైతే రాజు’ అంటూ రైతును బానిసగా, వెట్టిచేసే అనాగరికుడిగా ఇంకా కట్టి పడేయాలనుకుని బిల్లులు తీసుకొచ్చి, చట్టాలు చేసి కార్లతో తొక్కించి చంపేసే ప్రభుత్వాలనూ చూస్తున్నాం. ఈ రైతుకు సమాంతరంగా, అంతే కష్టాలు, అంతే బాధలతో జీవాలను కాపాడుకోవడానికి, వాటి ఆకలి దప్పులు తీర్చడానికి నెలల తరబడి ఇల్లు వాకిలి, ఊర్లు వదిలి, గుట్టల వెంట, పుట్టల వెంట “కొండపొలం” చేసే “గొర్రెల కాపరుల” ఉన్నారని, వారి వెనుక అత్యంత విషాదకరమైన జీవనగమనం ఉందని మనకి ఎంత మందికి తెలుసు!? రైతు బిడ్డ అయిన సన్నపురెడ్డి వెంకటరెడ్డి పదిహేనేళ్లు ఈ అడవుల్లో, ఈ గొర్రెల కాపరులు వెంట తిరిగి రాసుకున్న అద్భుతమైన జీవన చిత్రమే ఈ కొండపొలం.

సినిమా చూస్తున్నంత సేపు ఆ పాత్రల వెంట, ఆ విశాలమైన అడవుల్లో చెట్టు పుట్టల మధ్య తిరుగుతున్న అనుభూతిని ప్రేక్షకుడికి కలిగించిన దర్శకుడు క్రిష్, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ నవల మూలంలోని ఆత్మను పట్టించడంలో కృతకృత్యులయ్యారు. నేను నవల చదవలేదు కానీ సినిమా కట్టిపడేసింది. ఆధ్యంతం ఒక గొప్ప విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది.

రాయలసీమ ప్రాంతం నేపథ్యంగా ఉన్నప్పటికీ రైతులకు, మూగజీవాలకు సంబంధించిన సమస్యలు అన్ని ప్రాంతాల్లో ఒకటే. ముఖ్యంగా రాయలసీమను రాళ్లసీమగా మార్చింది అక్కడి నీటి సమస్య. జీవాల ప్రాణాలు కాపాడుకోవడానికి గొర్రెల కాపరులు పులులు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, కొండచిలువలే కాదు, జీవాల్ని ఎత్తుకెళ్లే దొంగల వలన కూడా తమకు హాని ఉందని తెలిసినా, తమ ప్రాణాలను లెక్కచేయకుండా కొండపొలం చేయడానికి పోయే, నగర జీవులకు తెలియని ఈ నిజాన్ని సినిమాగా మలిచిన తీరు అద్భుతంగా ఉంది. ఉద్యోగాలు లేకపోతే జీవనం సాగించలేని నగర జీవులు, అడవే జీవన వనరుగా ఉన్న పల్లె బతుకులు- రెండింటి మధ్య ఉన్న కాంట్రాస్ట్ ను అడవి అన్నా, ఉద్యోగ ఇంటర్వ్యూ అన్నా హీరోకు కలిగే భయంగా చూపించి, అడవిలో తిరిగాక భయం పోయి, ఉద్యోగ ఇంటర్వూను ధైర్యం గా ఎదుర్కొనే శక్తితో తిరిగి రావడం బాగా సమన్వయం చేశారు.

‘చదువు సంధ్య లేని గొర్రెల కాపరులు నీ తల్లిదండ్రులు, అయినా నువ్వు టాపర్ గా నిలిచావు, ఏ కోచింగ్ సెంటర్ లో చదివావు’ అని అడిగితే ‘అడవి, ఫారెస్ట్ నా కోచింగ్ సెంటర్’ అని చెప్పడం అద్భుతమైన ఆలోచన, లోపభూయిష్టమైన విద్యా విధానం మీద ఒక చెంప పెట్టు. ఒక్క మాటలో అడవి ధైర్యాన్ని, జ్ఞానాన్ని, సమాజం పట్ల బాధ్యతనీ ఇస్తుందని చెబుతుందీ సినిమా.

ఈ సబ్జెక్ట్ ను తీసుకోని సినిమా చేయడం సాహసమే, అయినా క్రిష్ బాగా డీల్ చేశారు. ఆడవి బ్రహ్మాండాన్ని, ఆడవి విశ్వరూపాన్నిప్రేక్షకుడి అనుభవంలోకి తీసుకొచ్చారు.

ఆదివారం నాడు మటన్ కూరగా మాత్రమే తెలిసిన ఈ గొర్రెలు, మేకలు, పొట్టేల్లనే జీవాల వెనక, వాటిని కాసే కాపరుల వెనక ఇంత కథ ఉందని ఇక్కడ ఉండే నగరజీవులకే కాదు, అమెరికాలో ఉండే తెలుగు వారికీ తెలిసింది, సన్నపురెడ్డి గారి కృషి వల్ల. ఈ సబ్జెక్ట్ ను తీసుకోని సినిమా చేయడం సాహసమే, అయినా క్రిష్ బాగా డీల్ చేశారు. ఆడవి బ్రహ్మాండాన్ని, ఆడవి విశ్వరూపాన్నిప్రేక్షకుడి అనుభవంలోకి తీసుకొచ్చారు.

పన్లు చేసుకునే వాళ్లు అలసట మర్చిపోవడానికి పాటను ఆసరా చేసుకుంటారు. అందుకే ఈ గొల్లోళ్లు అడివెంట క్రోసులు, క్రోసులు నడుస్తుంటే నేపథ్యంలో పాటలు నిరంతరం, సినిమా అంతటా వినిపిస్తూనే ఉంటాయి. క్రిష్ కు ఎరిక ఉండడం ఆనందమనిపించింది. సినిమాకు ఇంకాస్త పల్లె సంగీతం అద్దిఉంటే కీరవాణికి వంద మార్కులు పడేవి. అసలైన జీవితాన్ని ఉన్నదున్నట్టు ముతకగా కాకుండా కొంత కథలాగా అల్లుకుని, తెలుగు సినిమాకున్న అలవాటు ప్రకారం ఒక ప్రేమ కథను కూడా చొప్పించి ఓకే అనిపించుకున్నాడు దర్శకుడు. కథకున్న ఆత్మను పాడుచేయకుండా సినిమాను దృశ్యమానం చేసి, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాడు క్రిష్.

సాయిచందయితే అచ్చమైన గొర్లకాపరే అన్నంత సహజంగా ఉన్నారు. ఒక కొత్తవిషయాన్ని కళ్లకు కట్టి బయటకు పంపాడు, క్రిష్.

చివరకు ప్రభుత్వాలు పూనుకోక పోతే, యువతే IFS ఉద్యోగాల్లో చేరి, అడవుల్ని నరికి ప్రకృతికి హాని తలపెట్టే దొంగల, స్మగ్లర్ల ఆటకట్టించి అడవుల్ని కాపాడుకోవాలనే సందేశం ఇస్తూ సినిమా ముగించడం, ఈ గ్లోబల్ వార్మింగ్ సమయంలో ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇక సాంకేతిక విషయాలకొస్తే జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, వైడ్ & టాప్ యాంగిల్స్ తో అద్భుతమే చేశాడు. తెలుగులో గ్రాఫిక్స్ కు చిన్న పీటే, ఈ సినిమాకు గ్రాఫిక్స్ తప్పలేదు కనుక ఫర్వాలేదు. ఇక నటీనటులు.. హీరోగా చేసిన వైష్ణవ్ తేజ్,సాయిచంద్, రవిప్రకాష్ మిగతా నటీనటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాయిచందయితే అచ్చమైన గొర్లకాపరే అన్నంత సహజంగా ఉన్నారు. ఒక కొత్తవిషయాన్ని కళ్లకు కట్టి బయటకు పంపాడు, క్రిష్.

“జననం నుంచి పయనమై వస్తున్న నేను వ్యవసాయ దారుల కాలిబాటలోనే నడుస్తున్నప్పటికీ, అప్పుడప్పుడూ దారిపక్కనే సమాంతరంగా దుమ్ము రేపుకుంటూ వెళ్ళే గొర్ల కాపరుల అడుగుజాడల్ని కూడా తొక్కుతూ వచ్చ్చాను. రాను రాను రెండు దారులూ కలిసిపోయే కరువుబాట ఒకటి ఏర్పడి అది కాస్తా రహదారిగా మారి నగరాల కేసి వెళుతూ ఉండటాన్ని నిస్సహాయంగా చూస్తున్నాను” ఇది రచయిత మాట.

అన్నట్టు, నేను పిల్లలతో కలిసి సినిమా చూశానని చెప్పాను కదా, కొత్తగా పెళ్లయిన మాచిన్నబ్బాయి, కొత్తకోడలు. మా కోడలు తమిళమ్మాయి, తెలుగు ఇంకా రాదు, కాస్త అర్థం అవుతుంది. సినిమా చూస్తూ తనకి అర్థం కాని చోట అడుగుతూ బాగా ఎంజాయ్ చేసింది. చివరికి సినిమా ఎలా ఉందని అడిగితే ‘It is a visual feast, uncle, we saw a very good movie’ అని చెప్పింది. నా షార్ట్ ఫిలిం కు కెమెరా, ఎడిటంగ్ మా అబ్బాయే. వాడికి కూడా సినిమాటోగ్రఫీ గొప్పగా నచ్చింది.

  • సంగీతం పట్ల మంచి అభిరుచి గల నర్సిం గాయకులు కూడా. వారు సీనియర్ కార్టూనిస్ట్. ఇండియా టుడే లో పనిచేశారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ కార్టూనిస్ట్ గా ఉన్నారు. నివాసం హైదరాబాద్.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article