Editorial

Saturday, November 23, 2024
కాల‌మ్‌ఒక రోజా కోసం : ఈ వారం మంచి పుస్తకం

ఒక రోజా కోసం : ఈ వారం మంచి పుస్తకం

‘మంచి పుస్తకం’ఒక సంపద.
కొసరాజు సురేష్ అందిస్తున్న ఆ పరిచయ పరంపరలో అత్యంత పాఠకాదరణ పొందిన ‘ఒక రోజా కోసం’ పదమూడో పుస్తకం.

The Alchemist అనువాదం చెయ్యటం వల్ల నాకు మరొక మంచి పుస్తకం అనువాదం చేసే అవకాశం దొరికింది. Serdar Ozkan అన్న రచయిత పుస్తకం ‘The Missing Rose’ అనువదించటానికి ఆసక్తి ఉందా అంటూ 2009లో ఈ-మేల్ పంపించారు. స్క్రిప్టు తెప్పించుకుని చదవటం, ఒప్పందం కుదుర్చుకుని 2010 మే నెలలో ‘ఒక రోజా కోసం’ అన్న పేరుతో తెలుగు అనువాదం ప్రచురించటం చకాచకా జరిగిపోయాయి.

“తాను దేవతనని ఆర్టెమిస్ అహం, తాను సాధారణమైనదానిని అని మిరియం అణకువ. కుండీలో ఉన్న ఈ రెండు గులాబీల మధ్య సఖ్యత, సయోధ్యలు కుదిరితేనే వాటిని తోటలో పెట్టటానికి వీలవుతుంది”

2009 లో నేను అనువదించే నాటికి ఈ పుస్తకం 26 భాషలలోకి అనువాదం కాగా ఇప్పటికి ఇది 65 దేశాలలో 44 భాషలలోకి అనువాదం అయ్యింది.

‘The Missing Rose’ అనువదించటానికి ఆసక్తి ఉందా అంటూ Serdar Ozkan 2009లో పంపిన ఇ- మెయిల్

పరుసవేదిని, సేంట్ డి ఎక్పుపెరీ రాసిన The Little Prince అన్న పుస్తకాల ప్రస్తావన ఒక రోజా కోసంలో పలుమార్లు వస్తుంది. పోలిక కూడదు, కారణాలు తెలియదు కానీ పరుసవేది పలు ముద్రణలకు వెళితే ‘ఒక రోజా కోసం’ మొదట వేసిన రెండు వేల ప్రతులు ఇప్పటికీ పూర్తిగా అమ్ముడు పోలేదు.

కవర్ పేజీ గురించి. ముందువైపు ఆర్టెమిస్ – మిరియం గులాబీల ఆయిల్ పెయింటింగ్‌ని స్నేహితుడు నార్ల రాజేంద్ర ప్రసాద్ భార్య పద్మ వేసింది. హైదరాబాదులో జర్నలిస్ట్‌గా చేసిన పద్మ, భర్త ఉద్యోగ రీత్యా పూనాలో స్థిరపడి ఎంతో ఇష్టంతో పెయింటింగ్ నేర్చుకున్నారు. కావాలని అడిగి ఆమెతో నేను ఈ బొమ్మ వేయించుకున్నాను. ఫ్రేము కట్టిన ఆ పెయింటింగ్ ఇప్పటికీ మా ఇంట్లో ఉంది.

వెనక పేజీకి వేసిన సముద్రపు అలల పెయింటింగ్ రఘుబాబు వేసినది. అతను విద్యావేత్తే కాకుండా చిత్రకారుడు కూడా. రవీంద్ర భారతి పక్కన ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో తన చిత్రాలతో రఘుబాబు ఒక ప్రదర్శన కూడా నిర్వహించాడు. అప్పుడు కొన్న పెయింటింగ్ ఇది.

ఈ నవలలోని మత్తయ్య ఇంజినీరింగ్ చదువూ, ఉద్యోగం వదిలేసి సముద్రాన్ని చిత్రిస్తూ ఉంటాడు.

కథ విషయానికి వస్తే సంపన్న కుటుంబంలో పుట్టిన డయానా మిత్రుల ఆరాధనలో తనను ఒక దేవతగా భావించుకుంటూ తనకు అనిపించినట్టుగా కాకుండా ఇతరులు ఆశించినట్టు ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది తల్లికి ఇష్టంగా ఉండదు. తల్లి చనిపోయిన తరవాత డయానాకి మేరీ అనే కవల సోదరి ఉందని, భార్యా భర్తలు విడిపోయినందు వల్ల మేరీ తండ్రి దగ్గర పెరిగిందని, ఇప్పుడు మేరీకి డయానా అవసరం ఉందని తెలియ చేసి మేరీ అన్వేషణలో బయలు దేరేలా చేస్తుంది.

గులాబీలతో మాట్లాడటం మేరీకి వచ్చు అని మొదట తెలిసినప్పుడు ఆమెకు కొంత పిచ్చి ఉండి ఉంటుందని డయానా అనుకుంటుంది.

మేరీ అన్వేషణలో డయానాకి ఒక బిచ్చగాడు, ఇస్తాన్‌బుల్‌లోని గులాబీల తోటమాలి జైనెప్ హనీమ్ అన్న ఆమె పరిచయం అవుతారు. గులాబీలతో మాట్లాడటం మేరీకి వచ్చు అని మొదట తెలిసినప్పుడు ఆమెకు కొంత పిచ్చి ఉండి ఉంటుందని డయానా అనుకుంటుంది. గులాబీలతో మాట్లాడటం నేర్పిస్తానని జైనెప్ హనీమ్ అన్నప్పుడు ఒకింత సందేహంతోనే, ఆమె పెట్టిన షరతులన్నింటికీ ఒప్పుకునే సిద్ధమవుతుంది డయానా. ఆ క్రమంలోనే డయానాకు పసుపు పచ్చ గులాబీ, ఒకటిగా పెనవేసుకునిపోయిన ఆర్టెమిస్ – మిరియం అనే ఎర్ర, తెల్ల గులాబీలు, నల్లని రంగులోని సోక్రటీస్ అనే గులాబీ డయానాకి పరిచయం అవుతాయి.

తాను దేవతనని ఆర్టెమిస్ అహం, తాను సాధారణమైనదానిని అని మిరియం అణకువ. కుండీలో ఉన్న ఈ రెండు గులాబీల మధ్య సఖ్యత, సయోధ్యలు కుదిరితేనే వాటిని తోటలో పెట్టటానికి వీలవుతుంది. ఈ రెండు గులాబీల మధ్య సంభాషణ వాటి వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తుంది.

లోకులు కాకుల అన్న సామెత మనకు ఉంది. కుండ మీద మూత పెట్టొచ్చు కానీ లోకుల నోటికి మూతవెయ్య లేం అని కూడా అంటారు. దీనినే తెలియచేస్తూ గాడిదతో ప్రయాణం చేస్తున్న తండ్రీ-కొడుకుల ముల్లా నస్రుద్దీన్ కథ కూడా మనకు తెలిసిందే. ఆ కథను ఈ నవలలో రచయిత మళ్లీ మనకు చెబుతాడు.

పరుసవేదిలో లాగా ఈ నవలలో కూడా మాజిక్ రియలిజం, మార్మికవాదం ఉంటాయి.

పరుసవేదిలో లాగా ఈ నవలలో కూడా మాజిక్ రియలిజం, మార్మికవాదం ఉంటాయి. మొదటిసారి ఈ నవల చదువుతున్నప్పుడు మేరీ అన్వేషణ మలుపులు తిరుగుతూ కొంత ఉత్సుకతతో చదివిస్తుంది. మళ్లీ, మళ్లీ చదవదగిన పుస్తకమే అయినా రెండోసారి చదివినప్పుడు ఆ ఉత్సుకత ఉండదు. అయితే, దానిని పక్కన పెట్టి మరింత లోతులలోకి వెళ్లి చదవగలిగితే కొత్త విషయాలు కనపడతాయి, మనసుకు హత్తుకుంటాయి.

‘నేను ఎవరిని? ఎందుకు పుట్టాను ఈ జీవితంలో నా లక్ష్యం ఏమిటి’ వంటి ప్రశ్నలని ఎక్కువగా ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తారు. నేను ఈ ప్రశ్నలను మానవ ఉనికికి సంబంధించినవిగా చూస్తాను. ఈ ప్రశ్నలు ఇదే రూపంలో ఉండాలని లేదు. చేతనంలోనో, అచేతనంలోనో ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలు వేసుకుని ఎవరి సమాధానాలను వాళ్లు వెదుక్కోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియకుండా, లోకంతో ఒక అంగీకారానికి రాకుండా ఎవరూ ప్రశాంతంగా జీవించలేరు. ఇది పెద్దవాళ్లకే కాదు, చిన్న పిల్లలకి కూడా వర్తిస్తుంది.

అంత మామూలు జీవే చనిపోయే పరిస్థితులలో ఉన్నా కుట్టటమనే తన ధర్మాన్ని వదలటం లేదు. మరి మనిషినైన నేను ఇతరులను కాపాడటమనే నా ధర్మాన్ని ఎలా వదిలిపెడతాను?’

చాలా సంవత్సరాల క్రితం మానుషి పత్రికలో మధు కిష్వర్ ఒక కథని ప్రస్తావించారు. నీటిలో కొట్టుకునిపోతున్న ఒక తేలుని ఒక సాధువు దోసిలితో బయటకు తీస్తాడు. తేలు కుట్టటంతో, చురుక్కుమని దానిని నీళ్లల్లోకి వదిలేస్తాడు. కానీ మళ్లీ దానిని బయటకు తీస్తాడు, అది మళ్లీ కుడుతుంది, నొప్పితో సాధువు దానిని నీళ్లల్లోకి వదిలేస్తాడు. ఇలా మళ్లీ, మళ్లీ జగుగుతుండటం చూసిన ఒక వ్యక్తి సాదువుతో, ‘ఏమయ్యా! తేలు కుడుతున్నా మళ్లీ మళ్లీ బయటకు ఎందుకు తీస్తున్నావు?’ అని అడుగుతాడు. అందుకు సాధువు, ‘అంత మామూలు జీవే చనిపోయే పరిస్థితులలో ఉన్నా కుట్టటమనే తన ధర్మాన్ని వదలటం లేదు. మరి మనిషినైన నేను ఇతరులను కాపాడటమనే నా ధర్మాన్ని ఎలా వదిలిపెడతాను?’ అన్నాడట. ఎవరికి వాళ్లు తన ధర్మం ఏమిటో తెలుసుకుని, అన్ని వేళలా, అన్ని పరిస్థితులలో పాటించగలగాలని నేను అర్థం చేసుకున్నాను (“నీ జీవితాన్ని ఎలా జీవిస్తావు అన్న దానిపై తీర్పు చెప్పటానికి నాకు కానీ, ఇంకెవరికైనా కానీ హక్కు లేదు,” – జైనెప్ హనీమ్.). నేను. ఈ నవల గురించి కాకుండా నాకు అర్థమయ్యింది అనుకున్నదానిని నా మాటలలో రాశాను.

“నాకంటే మెరుగైన వాళ్లు ఎప్పుడూ ఉంటారు. కాని నాలాంటి వాళ్లు మరొకరు ఉండరు,” అన్నప్పుడు, ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు’ అన్న శ్రీశ్రీ పాట గుర్తుకు వస్తుంది.

ఈ నవలలో మత్తయ్య అన్న పాత్ర డయానాని ఇష్టపడతాడు. హార్వార్డ్‌కి వెళ్లాడని చెపితే డయానా అతడిని ఇష్టపడే అవకాశం ఉందని చెబితే, మత్తయ్య “హార్వార్డ్‌కి వెళ్లినందుకు ఇష్టపడేటట్టయితే ఆమె నన్ను ఇష్టపడక పోవటమే మంచిది. నేను నా చదువు కాదు, నా ఉద్యోగం కాదు, నా తెలివి కాదు. ఇవన్నీ కూడినా నేను కాదు,” అని చెపుతాడు. అంతే కాకుండా, “నాకంటే మెరుగైన వాళ్లు ఎప్పుడూ ఉంటారు. కాని నాలాంటి వాళ్లు మరొకరు ఉండరు,” అన్నప్పుడు, ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు’ అన్న శ్రీశ్రీ పాట గుర్తుకు వస్తుంది.

ఈ నవలలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను, సందర్భాలను ఉటంకిస్తాను. “ప్రేమించిన వాళ్లు ప్రతిఫలంగా ఏమైనా కోరితే ప్రేమ ప్రేమ కాకుండా పోతుంది,” అని తల్లి చెబుతూ ఉండటం డయానా గుర్తు చేసుకుంటుంది. తనకి సహాయపడిన బిచ్చగాడికి డయానా ఇచ్చిన బహుమతిని అతను తీసుకోడు. అదేమని అడిగితే, “మంచితనానికి బదులుగా బహుమతా? ఇది వ్యాపారంలాగా అనిపిస్తా ఉండాది…” అని, “మంచితనం అంటే చేస్తాఉండే మంచి పని కూతురికి కూడా తెలియకుండా చేయటం,” అని చెపుతాడు (కుడి చెయ్యి చేసే మంచి పని ఎడమ చెయ్యికి కూడా తెలియకూడదని మనకు చెపుతారు).

ఈ పుస్తకంలోని ప్రత్యేకత మీకూ అందుతుందేమో, చదవి చూడండి.

‘అసాధ్యాలను సుసాధ్యం చేసేది అద్భుతాలు కావు, పట్టు వదలకుండా కొనసాగుతూ ఉండటం. ఈ విధంగానే రాతిని కూడా నీళ్లు కరిగించి వేస్తాయి.’

‘ఇతరుల కోసం మన లోని కొంత భాగాన్ని త్యాగం చేస్తాం.’

ఒకటిని అనంతంతో భాగిస్తే సున్నా వస్తుంది. కానీ, పాయింటు తరవాత అనంతమైన సున్నాల తరవాత ఒకటి ఉంటుందన్న ఆశ దానిని ప్రత్యేక సున్నాగా చేస్తుందని జైనెప్ హనీమ్ చెబుతుంది.

ఈ పుస్తకంలోని ప్రత్యేకత మీకూ అందుతుందేమో, చదవి చూడండి.

అన్నట్టు, 176 పేజీల ఈ పుస్తకం వంద రూపాయలు. కావాల్సిన వారు ఈ లింకు చూసి తెప్పించుకోవచ్చు.

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్‌ ఐదవది. ఆరవది ‘అనార్కో’. ఏడవది ‘జీవన గీతం’ . ఎనిమిదవది ‘యుద్ధోన్మాది అమెరికా’. తొమ్మిదవది ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’. పదవది ‘ప్రకృతి నేర్పిన పాఠాలు’. పదకొండవది పరుసవేది. పన్నెండవది ‘శివమెత్తిన నది’. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు ఆయా పుస్తకాలను ఇలా వారానికి ఒకటి చొప్పున మీకు పరిచయం చేస్తారు. 

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

 

More articles

1 COMMENT

  1. మంచి ఆలోచనలు మంచి కథ. మంచి పుస్తకం. సురేష్ గారికి కందుకూరి గారికి ధన్యవాదాలు…ఈ శీర్షిక చాలా బాగుంది …..వాటిని చదివాక ఈ రోజు కొన్ని పుస్తకాలు తెప్పించుకున్న..చాలా సంతోషం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article