ఔషధ విలువల మొక్కలు ( 11 ) : చూత పత్రం
చూత పత్రమేది? చూడగ తెలియునా?
మామిడదియె కాద మంగళమ్ము
తోరణమున, చేరు తొలి పూజ దేవుని
ఔషధముగ నాకు లమరియుండు
నాగమంజరి గుమ్మా
శ్రీ గణేశ పూజా పత్రాలలో చూత పత్రం ఒకటి. మంగళకరమైన మామిడి దీని మరో నామము.
లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు నశిస్తాయి.
శరీరం కాలినప్పుడు మామిడి ఆకులను కాల్చి, బూడిద చేసి ఈ భస్మాన్ని కాలిన గాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుంది.
దంతాలు గట్టిగా ఉండాలంటే మామిడి తాజా ఆకులను బాగా నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీనిని ఉమ్మేయండి. ఇలా నిత్యం చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి. అలాగే చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటేకూడా తగ్గుదల కనపడుతుందంటున్నారు వైద్యులు.
ఆయుర్వేద వైద్య నియమాల రీత్యా కడుపులోకి తీసుకునే ఔషధాలను యధాతధంగా అందించకూడదు. ఉపయోగించేవారికి ఒక్కొక్కప్పుడు వికటించవచ్చు. అందుకే విధానం గోప్యంగా ఉంచబడుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.